ఏడేళ్లు.. 70 లీకేజీలు | 70 paper leaks in 7 years, 1. 7 crore aspirants affected in India | Sakshi
Sakshi News home page

ఏడేళ్లు.. 70 లీకేజీలు

Published Sat, Jun 22 2024 4:20 AM | Last Updated on Sat, Jun 22 2024 4:20 AM

70 paper leaks in 7 years, 1. 7 crore aspirants affected in India

 ప్రహసనంగా మారిన పరీక్షలు

దేశవ్యాప్తంగా 1.7 కోట్ల బాధితులు 

నీట్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్ష పేపర్‌ లీకేజీ ఉదంతం నానాటికీ పెరిగి పెద్దదవుతోంది. రోజుకోటి చొప్పున సంచలనాత్మక విషయాలు బయట పడుతూ దేశమంతటినీ కుదిపేస్తున్నాయి. మరోవైపు యూజీసీ–నెట్‌ ప్రశ్నపత్రం లీకైనట్టు తేలడంతో ఆ పరీక్షే రద్దయింది. వీటి దెబ్బతో దేశవ్యాప్తంగా ప్రవేశ, పోటీ పరీక్షల సమగ్రత, విశ్వసనీయతపై మరోసారి నీలినీడలు కమ్ముకున్న దుస్థితి! 

నిజానికి ప్రశ్నపత్రాల లీకేజీ మన దేశాన్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న జాఢ్యమే. గత ఏడేళ్లలో 15 రాష్ట్రాల పరిధిలో ఏకంగా పలురకాలైన 70 పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు లీకవడం సమస్య తీవ్రతకు, భారత్‌లో పరీక్షలపై పేపర్‌ లీకేజీ మాఫియాకు ఉన్న తిరుగులేని పట్టుకు అద్దం పడుతోంది. 

ఇవన్నీ అధికారికంగా వెలుగులోకి వచి్చనవి, దర్యాప్తు జరిగిన, జరుగుతున్న కేసులు మాత్రమే. అసలు వెలుగులోకే రాకుండా పకడ్బందీగా జరిగిపోయిన ప్రవేశ, పోటీ పరీక్షల లీకేజీ ఉదంతాలు ఇంకా ఎన్నో రెట్లుంటాయని విద్యా రంగ నిపుణులే అంటున్నారు! వాటి ద్వారా ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు, ప్రభుత్వోద్యోగాలు కొట్టేసిన అనర్హులు వేలు, లక్షల్లో ఉంటారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

     వైద్య విద్యలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ కావడంతో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం అయోమయంలో పడింది. ఇలా గత ఏడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 70 పరీక్షల పేపర్లు లీకయ్యాయి. వాటికి 1.7 కోట్ల మందికి పైగా ఉన్నత విద్యార్థులు, ఉద్యోగార్థుల కలలు కల్లలైపోయాయి. 

రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పశి్చమబెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ వంటి పలు పెద్ద రాష్ట్రాలతో పాటు హరియాణా వంటి చిన్న రాష్ట్రాల్లో కూడా తరచూ పలు ప్రవేశ, పోటీ పరీక్షల పేపర్లు లీకవుతున్నాయి. ఈ లీకేజీ భూతం ఉన్నత విద్యకు, భారీ స్థాయి నియామక పరీక్షలకే పరిమితం కాలేదు.

 పదో తరగతి వంటి స్కూలు పరీక్షలకు కూడా పాకి కలవరపెడుతోంది. బిహార్‌లో పదో తరగతి ప్రశ్నపత్రాలు గత ఏడేళ్లలో ఆరుసార్లు లీకయ్యాయి. పశి్చమబెంగాల్లోనైతే స్టేట్‌ బోర్డు పరీక్ష పత్రాలు గత ఏడేళ్లలో ఏకంగా పదిసార్లు లీకయ్యాయి. తమిళనాడులో 2022లో 10, 12 తరగతుల ప్రశ్నపత్రాలు లీకై కలకలం రేపాయి. 
 
ఆ రాష్ట్రాల్లో అంతే...! 
రాజస్తాన్, గుజరాత్‌ వంటి రాష్ట్రాలు కొన్నేళ్లుగా పరీక్షల లీకేజీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 2015–23 మధ్య రాజస్తాన్‌లో పలు పోటీ పరీక్షలకు సంబంధించి 14కు పైగా పేపర్లు లీకేజీ బారిన పడ్డాయి. 2022 డిసెంబర్లో సీనియర్‌ గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్ల నియామకానికి సంబంధించి జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నపత్రం లీకవడంతో ఆ పరీక్షనే రద్దు చేయాల్సి      వచి్చంది. యూజీసీ నెట్, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ గత రెండేళ్లు వరుసగా లీకయ్యాయి. గుజరాత్‌లోనూ గత ఏడేళ్లలో 14 లీకేజీ ఉదంతాలు నమోదయ్యాయి. 

సీపీఎస్సెస్సీ చీఫ్‌ ఆఫీసర్‌ పరీక్ష (2014), తలతీ పరీక్షలు (2015, 2016), టీచర్స్‌ యాప్టిట్యూడ్‌ టెస్ట్‌ (2018), ముఖ్య సేవిక, నాయబ్‌ చిట్నిస్, డెక్‌ లోక్‌ రక్షక్‌ దళ్, నాన్‌ సచివాలయ క్లర్క్స్, హెడ్‌ క్లర్క్, సీఎస్‌ఎస్సెస్బీ (2021), సబ్‌ ఆడిటర్‌ (2021), ఫారెస్ట్‌ గార్డ్‌ (2022), జూనియర్‌ క్లర్క్‌ (2023), వంటి పలు పరీక్షలు ఈ జాబితాలో ఉన్నాయి. యూపీలో కూడా 2017–24 మధ్య కనీసం 9 లీకేజీ కేసులు వెలుగు చూశాయి. ఇన్‌స్పెక్టర్‌ ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌పరీక్ష (2017), యూపీ టెట్‌ (2021), 12వ తరగతి బోర్డు పరీక్ష వంటివి వీటిలో ముఖ్యమైవి. తాజాగా ఈ ఏడాది జరిగిన కానిస్టేబుల్‌ పేపర్‌ లీకేజీ ఏకంగా 48 లక్షల మంది దరఖాస్తుదారులను ఉసూరు                 మనిపించింది.

అమల్లోకి పేపర్‌ లీక్‌ నిషేధ చట్టం 
నోటిఫై చేసిన కేంద్రం 
న్యూఢిల్లీ: పేపర్‌ లీకేజీల కట్టడికి ఉద్దేశించిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (అనైతిక కార్యకలాపాల నిరోధ) చట్టం, 2024ను అమల్లోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీట్, యూజీసీ–నెట్‌ పేపర్ల లీకేజీ వివాదాలు దేశవ్యాప్తంగా కాక రేపుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. 

పేపర్ల లీకేజీ ఉదంతాల్లో శిక్షలను కఠినతరం చేస్తూ గత ఫిబ్రవరిలో పార్లమెంటు ఈ చట్టం చేయడం తెలిసిందే. దీని ప్రకారం లీకేజీ కేసుల్లో మూడు నుంచి పదేళ్ల జైలు, రూ.కోటి దాకా జరిమానా విధించవచ్చు. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్‌ పరీక్షలతో పాటు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement