సాక్షి, బెంగళూరు : ‘నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవిత కాలం లేటు’ అని ఆరుద్ర అన్నట్లుగానే...రైలు ఆలస్యం కారణంగా సుమారు 500మంది విద్యార్థులు ‘నీట్’ పరీక్షకు దూరమయ్యారు. కర్ణాటకలో హంపి ఎక్స్‌ప్రెస్ సుమారు ఆరు గంటల పాటు ఆలస్యంగా రావడంతో విద్యార్థులు భవితవ్యం సందిగ్ధంగా మారింది. షెడ్యూల్ ప్రకారం రావాల్సిన హంపి రైలు ఆదివారం ఆరు గంటలు ఆలస్యంగా నడవటంతో విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోయారు. వీరంతా ఉత్తర కన్నడ నుంచి బెంగళూరుకు హంపి ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరారు.
ఉదయం ఏడింటికి బెంగళూరు చేరుకోవాల్సిన ట్రైన్.. మధ్యాహ్నం రెండున్నరకి వచ్చింది. ఒంటిగంటన్నరలోపు పరీక్ష కేంద్రాలకు రానందుకు అక్కడి అధికారులు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. అంతకు ముందు రైలు ఆలస్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రితో పాటు, రైల్వే మంత్రికి మెసేజ్‌లు పంపించినా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ నిర్వహించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై సిద్దరామయ్య ట్విటర్ ద్వారా ధ్వజమెత్తారు. ఇతరులు సాధించిన దానికి కూడా తన ఖాతాలో వేసుకుని జబ్బలు చరుచుకునే మోదీ... ఇటువంటి వైఫల్యాలకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఘాటుగా విమర్శించారు. రైళ్లు సకాలంలో నడవకపోవడం వల్ల వందలాదిమంది విద‍్యార్థులు పరీక్షకు హాజరు కాలేకపోయారని, వారిని మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సిద్దరామయ్య కోరారు.
ఇక ఈ ఘటనపై సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్వో మాట్లాడుతూ.. హంపి ఎక్స్‌ప్రెస్ ఆలస్యం కారణంగా పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లేఖ రాయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment