
చిక్కమగళూరు : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేయడానికి సమయం ఉంది కానీ.. కర్ణాటకలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి ఆయనకు టైమ్ లేదని ఎద్దేవా చేశారు. చిక్కమగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను అవలంభిస్తోందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలను మీడియా కవర్ చేయకుండా బీజేపీ స్పీకర్ చేత ఆదేశాలు ఇప్పించిందని ఆరోపించారు. ఈ సారి రాష్ట్రాన్ని ఊహించని స్థాయిలో వరద ముంచెత్తిందని.. అయితే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కరువు ఉందని ఆయన తెలిపారు.
60 రోజుల తరువాత కేంద్ర ప్రభుత్వం వరద సాయం కింద రూ. 1200 కోట్ల రూపాయలు కేటాయించిందని.. కానీ కర్ణాటకలో రూ. లక్ష కోట్ల మేర నష్టం వాటిల్లందని ఆయన అన్నారు. బిహార్‌లో వరదలు సంభవిస్తే మోదీ వెంటనే ట్వీట్ చేశారని.. కానీ కర్ణాటకలో వరదల కారణంగా 90 మంది చనిపోతే కనీసం సంతాపం కూడా తెలుపలేదని మండిపడ్డారు. మోదీ తనకు 56 అంగుళాల ఛాతీ ఉందని అంటారని.. కానీ దాని వెనుక దయా హృదయం లేదని అన్నారు. అలాంటి ఛాతీ ఎంత పెద్దగా ఉన్న ప్రయోజనం ఏమిటని వ్యంగ్యస్త్రాలు సంధించారు. పేదలకు, రైతులకు మేలు చేసే హృదయం ఉండటమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. కర్ణాటకకు రావాల్సిన నష్ట పరిహారం సాధించడంలో రాష్ట్రంలోని బీజేపీ ఎంపీ విఫలమయ్యారని మండిపడ్డారు. ఉడిపి చిక్కమగళూరు ఎంపీ శోభా కరండ్లజేకు ఒక్కసారైన తన నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారా అని ప్రశ్నించారు.