న్యూఢిల్లీ: సమాజంలో జరిగే కీలక అంశాలపై విశ్లేషించే రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా నీట్, జేఈఈ పరీక్షలపై ట్విటర్ వేదికగా స్పందించారు. సుబ్రహ్మణ్యస్వామి ఆదివారం ట్విటర్ వేదికగా స్పందిస్తూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో నీట్ ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని కొందరు తనను కలిసారని, కానీ తనను ముందే సంప్రదిస్తే మరో విధంగా ఉండేదని తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని కొందరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేయలేదని, వారు సైతం రద్దుకు మద్దతిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే నీట్, జేఈఈ పరీక్షలను రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, కొందరు సామాజికవేత్తలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రవేశ పరీక్షలు(నీట్, జేఈఈ) నిర్వహించాలని పట్టుదలతో ఉంది.
కాగా ఇది వరకే కోవిడ్ నిబంధనలు పాటించి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని సుప్రీం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రవేశ పరీక్షలను ఆపడం అసాధ్యమని, సుప్రీం తన తీర్పును సమీక్షించే అవకాశం లేదని పేర్కొన్నారు. మరోవైపు నీట్ పరీక్షలను రద్దు చేయాలని ఆగస్ట్ 4న కొందరు రివ్యూ పిటిషన్ వేశారు. కానీ సుప్రీం కోర్టు వాదనలను(రివ్యూ పిటిషన్) వినడానికి నిరాకరించింది. కాగా పరీక్షలు రద్దు చేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వారిలో పశ్చిమ బెంగాల్ న్యాయ శాఖ మంత్రి మొలోయ్ ఘటక్, జార్ఖండ్ ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఒరాన్, రాజస్థాన్ ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ, పంజాబ్ కార్మిక శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్దూ, మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తదితరులు ఉన్నారు. (చదవండి: గాంధీ హత్యకేసుపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment