నీట్ ఎగ్జామ్‌ను గనుక కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు కనిపించరని ఆందోళన వ్యక్తం చేశారు మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, విద్యావేత్త ఏకే రాజన్. నీట్ పరీక్ష-ప్రజాభిప్రాయసేకరణ కోసం రాజన్ నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తన తుది నివేదికను సమర్పించింది కూడా.
చెన్నై: ‘నీట్ వల్ల పేదలకు ఇబ్బందులే ఎదురవుతాయి. ఉన్నత వర్గాలకు చెందినవాళ్లే ఎక్కువ సీట్లను దక్కించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు స్థానికులకు వైద్య విద్య దక్కదు. బాగా డబ్బున్నవాళ్లు మారుమూల పల్లెల్లో వైద్య సేవలను అందించేందుకు ముందుకొస్తారా? విదేశాలకు వెళ్లడానికి, వాళ్ల గురించి వాళ్లు ఆలోచించుకోవడానికే ఇష్టపడతారు. అప్పుడు పీహెచ్‌సీలు ఖాళీగా ఉంటాయి. వైద్యం అందక పేదల ప్రాణాల మీదకు వస్తుంది’అని మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే రాజన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతానికి తమిళనాడు తప్ప మిగతా రాష్ట్రాలేవీ నీట్‌ను వ్యతిరేకించట్లేదని, కానీ, త్వరలో మిగతా రాష్ట్రాలు కూడా తమిళనాడు బాటలోనే డిమాండ్ వినిపిస్తాయని, ‘హిందీ తప్పనిసరి’ ఆదేశాల విషయంలో జరిగిందే నీట్ విషయంలోనూ జరగొచ్చని రంజన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే 86 వేల మంది నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను పరిశీలనలోకి తీసుకుని.. మరికొందరితో మాట్లాడి, విద్యావేత్తలతో చర్చించాకే ఈ రిపోర్ట్ తయారు చేసినట్లు రాజన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన తప్పనిసరి ఎగ్జామ్ నీట్ వల్ల వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంత పిల్లలకు వైద్య విద్యలో అవకాశాలు దక్కవని, సిలబస్ సమస్యతో పాటు కోచింగ్ లాంటి వాటితో ఆర్థిక భారం పడుతుందని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను సైతం ప్రస్తావిస్తూ రాజన్ కమిటీ తన ప్రాథమిక రిపోర్ట్‌ను తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించింది. అందరికీ సమాన హక్కులు దక్కనప్పుడు.. అడ్డుగా ఉన్న నిబంధనలను(నీట్) మార్చాల్సిన అవసరం ఉంటుందని రాజన్ అంటున్నారు కూడా. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయిన నీట్ వల్ల విద్యార్థులకు సామాజిక న్యాయం దక్కదనే అంశంపై పార్టీలకతీతంగా తమిళనాడు నుంచి పరీక్ష రద్దు డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్‌కు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలుపుతుండడం విశేషం.
అయితే ఇవేం పట్టించుకోని కేంద్రం నీట్ యూజీ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ‘స్కూళ్లు, కాలేజీలు మూసి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షను నిర్వహిస్తే కరోనా వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉంది. అందువల్ల మీ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి’ అని తమిళనాడు సీఎం స్టాలిన్ ఇటీవలె ప్రధాని మోదీని కోరారు. ఇంకోవైపు విద్యార్థులు కూడా అక్టోబర్ వరకు ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ ట్విటర్‌లో ట్రెండ్ కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment