చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.
కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!
తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.
ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్(తాత్కాలిక) ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షాఫిక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment