నీట్‌ రద్దు చేయాలంటూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం | Tamil Nadu Assembly passes resolution against NEET | Sakshi
Sakshi News home page

నీట్‌ రద్దు చేయాలంటూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

Published Fri, Jun 28 2024 4:33 PM | Last Updated on Fri, Jun 28 2024 4:37 PM

Tamil Nadu Assembly passes resolution against NEET

చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమతున్న విష‌యం తెలిసిందే. అటు పార్ల‌మెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్‌ రద్దు  చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

నీట్ ప‌రీక్ష నిర్వ‌హణ‌పై  అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళ‌న‌లు, ప‌రీక్ష‌పై వ్య‌తిరేక‌త‌ను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నీట్‌ను రద్దు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని సముచితంగా సవరించాల‌ని తీర్మానంలో పేర్కొన్నారు.

అయితే సభ ఆమోదించినప్పటికీ, దీనిని నిర‌సిస్తూ బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనూహ్యంగా దాని మిత్రపక్షం పీఎంకే డీఎంకే తీర్మానానికి మద్దతు ఇచ్చింది.

కాగా, నీట్‌-యూజీ 2024 ఎగ్జామ్‌ పేపర్ లీక్, నీట్‌-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ శుక్రవారం నీట్‌ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement