![NEET Aspirant Eliminates Herself Ahead Of Exams Madurai - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/12/rep2_2.gif.webp?itok=PpkA6sAq)
చెన్నై: ‘‘నేను మెడికల్ సీటు సాధించకపోతే .. ఇన్నాళ్లు పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. నన్ను క్షమించండి. నేను అలసిపోయాను. పరీక్ష కోసం బాగానే చదివాను. కానీ నాకు భయంగా ఉంది. నా కోసం ఎవరినీ నిందించవద్దు. సారీ అప్పా, అమ్మా’’ అంటూ ఓ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో ఉత్తీర్ణత సాధించలేననే భయంతో ప్రాణాలు తీసుకుంది. ఈ మేరకు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాయడంతో పాటుగా.. చనిపోవడానికి ముందు ఓ వీడియోను రికార్డు చేసింది. పరీక్షకు ఒకరోజు ముందు కూతురు ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. వివరాలు.. తమిళనాడుకు చెందిన మురుగసుందరం సబ్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుటుంబంతో కలిసి మధురైలో నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తె జ్యోతి శ్రీదుర్గ 2019లో క్లాస్ 12లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. గత కొన్ని రోజులుగా నీట్ పరీక్ష కోసం సన్నద్ధమవుతోంది. (చదవండి: ‘నా తమ్ముడి జీవితం నాశనం చేశారు’)
ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన జ్యోతి శ్రీదుర్గ శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. తన మరణానికి ఎవరూ బాధ్యులు కారని, పాస్ అవుతానో లేదోనన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అరియలూర్ చెందిన విగ్నేష్ అనే విద్యార్థి సైతం నీట్ పరీక్షకు సిద్ధమవుతూ ఒత్తిడి భరించలేక బలవన్మరణానికి పాల్పడిన విషయం విదితమే. ఇక ఈ వరుస ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పళనిస్వామి దయచేసి విద్యార్థులెవరూ ఒత్తిడికి లోనుకావద్దని, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇక మూడేళ్ల క్రితం అనిత అనే మెరిట్ విద్యార్థిని సైతం ఇదే తరహాలో ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో నీట్ పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో.. మహమ్మారి కారణంగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం కోల్పోరాదన్న సుప్రీంకోర్టు.. నిబ్బందనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబరు 13న నిర్వహించే నీట్ పరీక్షలకు మార్గం సుగమమైన విషయం తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి కొనసాగున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment