Central Education Department
-
యూజీసీ–నెట్ రద్దు
న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు చేపట్టిన నీట్ పరీక్షలో బయల్పడిన అవకతవకల నీలినీడలు యూజీసీ–నెట్ పరీక్ష పైనా పడ్డాయి. దీంతో మంగళవారం నిర్వహించిన యూజీసీ–నెట్ పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతానికి భిన్నంగా ఈసారి ఒక్కరోజులోనే ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్(ఓఎంఆర్) విధానంలో దేశవ్యాప్తంగా 317 నగరాలు, పట్టణాల్లోని 1,205 పరీక్షా కేంద్రాల్లో యూజీసీ–నెట్ పరీక్ష మంగళవారం జరిగిన విషయం తెల్సిందే. త్వరలో మళ్లీ నెట్ పరీక్షను నిర్వహిస్తారని, త్వరలోనే సంబంధిత వివరాలు వెల్లడిస్తామని కేంద్ర విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ నెట్ పరీక్ష విధానంలో అత్యంత పారదర్శకత, సమగ్రత, గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకూడదు. పరీక్షలో అక్రమాలు జరిగి ఉండొచ్చన్న విశ్వసనీయ సమాచారం మేరకు ‘యూజీసీ–నెట్ జూన్ 2024’ను రద్దుచేస్తున్నాం’’ అని ఆ అధికారి వివరించారు. ఈ ఏడాది నెట్ పరీక్షకు 11,21,225 మంది దరఖాస్తు చేసుకోగా మంగళవారం పూర్తయిన ఈ పరీక్షను 9,08,580 మంది అభ్యర్థులు రాశారు. నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు కోసం ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీఏ తెలిపింది. నెట్ పరీక్షలో అక్రమాలు జరిగి ఉంటాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)కు ప్రభుత్వ సైబర్ నిఘా సంస్థల సమాచారం అందడంతో ఆ మేరకు పరీక్షకు రద్దుచేస్తున్నట్లు తెలిపింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ) ఈ వివరాలను యూజీసీకి పంపింది. ఐ4సీలోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలైటిక్స్ విభాగం సంబంధిత సమాచారాన్ని క్రోడీకరించి యూజీసీకి అందజేసింది. ఈ విభాగం దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ నేరాల దాడులపై సమాచారం ఇవ్వడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని ముందస్తుగా హెచ్చరిస్తుంది. ఐ4సీ అనేది కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది పరీక్షల సంబంధ వ్యవహారాలను చూస్తుంది. నీట్‌ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీయే ఈ నెట్ పరీక్షనూ చేపట్టింది. యూజీసీ–నెట్ ఎందుకు రాస్తారు? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్– నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్( యూజీసీ–నెట్) పరీక్షలో ఉత్తీర్ణులైతే సైన్స్ సబ్జెక్టుల్లో పరిశోధనకు అవకాశం లభిస్తుంది. పరిశోధన వైపు వెళ్లొచ్చు లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బోధనారంగం వైపూ వెళ్లొచ్చు. దేశంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరొచ్చు. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలో నడిచే ప్రయోగ, పరిశోధనాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరొచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోగా, ఆ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోగా అవకాశం లభిస్తుంది. ఇలా శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. పీహెచ్డీ చేసేందుకు అర్హత లభిస్తుంది. ప్రభుత్వరంగ ఓఎన్జీసీ వంటి సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందొచ్చు. నెట్‌కు క్వాలిఫై అయిన వారికి విదేశాల్లోనూ చక్కటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నెట్ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. 80కిపైగా సబ్జెక్టుల్లో పరీక్ష రాసుకోవచ్చు. -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్‌కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్‌లోని సూరత్‌తోపాటు చండీగఢ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
సంస్కృత భాషాభివృద్ధికి ఎన్ఎస్యూ కృషి అభినందనీయం
తిరుపతి సిటీ/ఏర్పేడు: సంస్కృత భాషాభివృద్ధికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం (ఎన్ఎస్యూ) ఎనలేని కృషి చేస్తోందని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. గురువారం తిరుపతి ఎన్‌ఎస్‌యూలో ఉత్కల పీఠం (ఒడిశా చైర్) ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన రజతోత్సవ కార్యక్రమానికి ఆయన వర్చువల్ విధానంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. శ్రీవారి పాదాల చెంత వెలసిన సంస్కృత వర్సిటీ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసి పరిరక్షించడంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. వర్చువల్ విధానంలో వర్సిటీలో నూతన హాస్టల్ భవనాలను, తరగతి గదులను ప్రారంభించారు. ఉత్కల పీఠం రజతోత్సవ పైలాన్, శిలాఫలకాన్ని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షులు రేవతి రమణదాన ప్రభు ప్రారంభించారు. ఇన్నోవేషన్ హబ్‌గా తిరుపతి ఐఐటీ తిరుపతి కేంద్రంగా ఏర్పేడులో స్థాపించిన ఐఐటీ విద్యాసంస్థ అనతి కాలంలోనే ఇన్నోవేషన్ హబ్‌గా పేరుగాంచడం గర్వంగా ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. గురువారం తిరుపతి ఐఐటీలో జరిగిన నాల్గొవ, ఐదవ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ తిరుపతి ఐఐటీలో అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందించడం శుభపరిణామమన్నారు. మొత్తం 355మంది బీటెక్, 106 మంది ఎంటెక్, ఇద్దరు డ్యూయల్ డిగ్రీ, 74మంది ఎమ్మెస్సీ, 17మంది ఎంఎస్, 21మంది పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. -
Pariksha Pe Charcha 2024: అర నిమిషంలో నిద్రపోతా
న్యూఢిల్లీ: అధిక సమయం స్క్రీన్లకు అతుక్కుపోతే అది మీ నిద్రపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని విద్యార్థులను ప్రధాని మోదీ సున్నితంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడిని పోగొట్టే ప్రయత్నంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ఏడో విడత ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. వర్చువల్‌గా పాల్గొన్న కోట్లాది మంది విద్యార్థులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. మోదీ విద్యార్థులకు చేసిన పలు సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే.. అవసరం మేరకే ఫోన్ వాడతా ‘ జీవనశైలి సక్రమంగా ఉండాలంటే ఏదీ అతిగా ఉండొద్దు. అతి స్క్రీన్ టైమ్, రీల్స్ చూడటం మీ నిద్రాకాలాన్ని మింగేస్తుంది. ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం నిద్ర అనేది అత్యంత కీలకం. అలాంటి నిద్ర తక్కువకాకుండా చూసుకోండి. నేనైతే అవసరమైన మేరకే ఫోన్ వాడతా. నిద్రకు ఉపక్రమించిన కేవలం 30 సెకన్లలోనే గాఢ నిద్రలోకి జారుకుంటా. రోజూ కొద్దిసేపు ఎండలో గడపండి. ఫోన్‌కు చార్జింగ్ లాగే పిల్లలకు పౌష్టికాహారం ముఖ్యం. ఎక్సర్సైజ్ చేసి ఫిట్‌గా ఉండండి. అప్పుడే చక్కగా చదవగలరు’’ అని అన్నారు. అలాంటి వారితో స్నేహం చేయండి ‘‘ చదువుల్లో బాగా కష్టపడుతూ, తెలివితేటలు ఉన్న తోటి విద్యార్థులతో స్నేహం చేయండి. అప్పుడే వారి నుంచి స్ఫూర్తి పొందగలరు. పేరెంట్స్‌కు నాదో సూచన. పిల్లల ప్రోగ్రెస్ కార్డ్ మీకు విజిటింగ్ కార్డ్ కాదు. మీరు వెళ్లినచోట మీ పిల్లల చదువుసంధ్యల గురించి అతిగా మాట్లాడకండి. ఎప్పుడూ ఇతర పిల్లలతో పోల్చి చూపకండి. ఇది మంచి పద్ధతి కాదు. పూజ చేసి కొత్త యూనిఫాం, స్టేషనరీ కొని పరీక్ష రోజును ప్రత్యేకమైన దినంగా మార్చేయకండి’’ అని చెప్పారు. చిన్న లక్ష్యాలతో మొదలెట్టండి ‘‘పిల్లలను మూడు ఒత్తిళ్లు ఇబ్బందిపెడతాయి. ఏకాగ్రత, తల్లిదండ్రుల ఒత్తిడి, ఆత్మవిశ్వాస లేమి. పరీక్షలకు ముందు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధిస్తూ మీ లక్ష్యాలను పెంచుకుంటూ పొండి. పరీక్షలు వచ్చేటప్పటికి సంసిద్ధమౌపోతారు. టీచర్–స్టూడెంట్ బంధం సిలబస్ పాఠాలకు అతీతమైనది. సిలబస్ చెబుతూనే సబ్జెక్ట్ పట్ల వారిలో భయాన్ని పొగొట్టండి. పిల్లలు బెరుకులేకుండా సందేహాలు అడిగేలా సౌమ్యంగా మెలగండి. బోధనను ఒక వృత్తిగా కాకుండా విద్యార్థుల భవతను తీర్చిదిద్దే యజ్ఞంగా భావించండి’’ అని అన్నారు. నాక్కూడా పరీక్ష లాంటిది ‘‘పరీక్ష పే చర్చా నాకూ ఓ పరీక్ష. ఎందుకంటే నేటితరం విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు ఎక్కువయ్యాయి. వినూత్నంగా ప్రధాని ఈసారి ఏం చెప్తారా? అనుకునే విద్యార్థులకు తగ్గట్లు నేనూ ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యే రావాలికదా’’ అన్నారు. ఇంట్లో నో గాడ్జెట్ జోన్ ‘‘ తల్లిదండ్రులకు నాదో సలహా. టెక్నాలజీ నుంచి దూరం జరగలేం. అలాగని అతక్కుపోవడమూ సబబు కాదు. భోజనం చేసేటపుడు గాడ్జెట్ వాడొద్దనే నియమం పెట్టండి. ఏ యాప్ వాడినా స్క్రీన్ టైమ్ పెట్టుకోండి’’ అని సలహా ఇచ్చారు. ఈ ఏడాది 2.26 కోట్ల మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి రిజిస్ట్రర్ చేసుకోవడం విశేషం. -
Delhi: 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు
న్యూఢిల్లీ: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కట్టడి చేసేందుకు, వాటిని చట్టపరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది. 16 ఏళ్లలోపు విద్యార్థులను కోచింగ్ సెంటర్లలో చేర్చుకోవద్దని, ర్యాంకులు, మంచి మార్కులు గ్యారెంటీ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలివ్వరాదని గురువారం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. కోచింగ్ కేంద్రాల్లో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అగ్ని ప్రమాదాలు, అసౌకర్యాలు, విద్యాబోధన విధానాలకు సంబంధించిన పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్న నేపథ్యంలో వీటిని ప్రకటించింది. ‘గ్రాడ్యుయేషన్ కంటే తక్కువ అర్హత కలిగిన వారిని ట్యూటర్లుగా పెట్టుకోరాదు. విద్యార్థులను ఆకర్షించేందుకు మంచి మార్కులు, ర్యాంకు గ్యారెంటీ అంటూ వారి తల్లిదండ్రులకు తప్పుడు హామీలు ఇవ్వకూడదు. 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోరాదు. సెకండరీ స్కూలు పరీక్ష రాసిన వారిని మాత్రమే తీసుకోవాలి’అని తెలిపింది. కోచింగ్ నాణ్యత, వారికి కల్పించే సౌకర్యాలు, సాధించిన ఫలితాల గురించి ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తప్పుదోవ పట్టించే ఎలాంటి ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వరాదని స్పష్టం చేసింది. మానసిక ఒత్తిడికి గురయ్యే వారికి తక్షణమే అవసరమైన సాయం అందించే యంత్రాంగం ఉండాలి. సైకాలజిస్టులు, కౌన్సిలర్ల పేర్లను విద్యార్థులు, తల్లిదండ్రులకు అందజేయాలని కేంద్ర విద్యాశాఖ ఆ మార్గదర్శకాల్లో వివరించింది. -
‘ప్రొఫెషనల్’గా బోధన!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చాలా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల బోధన పక్కాగా సాగేలా చూడటంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి పెట్టింది. కొత్త కోర్సులకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న, సమర్థవంతంగా బోధించగల ఫ్యాకల్టీని కాలేజీలు నియమించుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. నాణ్యత ప్రమాణాల్లేని ఫ్యాకల్టీ ఉన్నట్టు గుర్తిస్తే.. సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన నిబంధనలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించింది. కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు దాన్ని పరిశీలించి, సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపారు. ఆ నివేదిక ప్రకారం.. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కీలక కంప్యూటర్ కోర్సులను బోధిస్తున్న వారి అర్హతలను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలే కాకుండా ఏఐసీటీఈ కూడా ప్రత్యేకంగా పరిశీలించనుంది. ఇందుకోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సంస్కరణలను ఈ ఏడాది నుంచే అమల్లోకి తేవాలని భావించినా.. కొన్ని అనుమతుల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. కీలక కోర్సుల బోధనలో.. దేశవ్యాప్తంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. తెలంగాణలో 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే.. ఇందులో 58శాతం కంప్యూటర్ కోర్సులవే. సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు 50 శాతం దాటడం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సరికొత్త కోర్సులకు విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కొత్త కోర్సులు మొదలై రెండేళ్లు గడుస్తున్నా చాలా కాలేజీల్లో బోధన సాధారణ కంప్యూటర్ సైన్స్ కోర్సుల మాదిరిగానే ఉంటోందని ఏఐసీటీఈ గుర్తించింది. ఇప్పటికే కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థుల్లో కేవలం 8 శాతం మందిలో మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అర్హత గల నైపుణ్యం ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో బోధన విధానంలో గణనీయమైన మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రొఫెషనల్స్తోనే పాఠాలు ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రత్యేక నైపుణ్యంతో బోధించాల్సి ఉంటుందని ఏఐసీటీఈ స్పష్టం చేస్తోంది. చాలా కాలేజీల్లో గత రెండేళ్లు జరిపిన అధ్యయనంలో ఆ తరహా బోధన కనిపించలేదని పేర్కొంటోంది. కాలేజీలు ఎంటెక్ పూర్తి చేసిన సాధారణ ఫ్యాకల్టీతో కోర్సుల బోధన కొనసాగిస్తున్నాయి. వారు కృత్రిమ మేధ (ఏఐ), ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ఆన్లైన్లో సెర్చ్చేసో, అప్పటికప్పుడు నేర్చుకునో బోధిస్తున్నారు. వారికి ప్రాక్టికల్ అనుభవం ఉండటం లేదు. అలాంటి వారు సమర్థవంతంగా బోధించలేరని ఏఐసీటీఈ అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులంతా వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా నైపుణ్యం సంపాదించిన వాళ్లే. ఈ క్రమంలోనే వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులను బోధనకు అనుమతిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రతీ కాలేజీలోనూ అలాంటి వారు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన తెచ్చే ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల చేత పాఠాలు చెప్పించాలని భావిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందే కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సులు బోధించే అధ్యాపకుల వివరాలు తెప్పించుకుని.. వారికి అర్హత ఉంటేనే గుర్తింపు ఇవ్వాలనే నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రొఫెషనల్స్ సేవలు ఎంతో అవసరం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు సంబంధిత కోర్సు చేయకున్నా.. కావాల్సిన అనుభవం ఉంది. కాలేజీల్లో పనిచేసే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఎంటెక్ సర్టిఫికెట్లు ఉన్నా ఈ కోర్సులను బోధించే అనుభవం తక్కువ. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొత్త కంప్యూటర్ కోర్సులను బోధించేందుకు పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నాం. అమెరికాలో ఓ ఏఐ ప్రొఫెషనల్ వారానికి కొన్ని గంటలు ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నారు. స్థానికంగా ఉద్యోగాలు చేసేవారు నేరుగా క్లాసులు చెబుతారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుంది. ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీకి కూడా ప్రొఫెషనల్స్ ద్వారా క్లాసులు చెప్పించాలి. అప్పుడే భవిష్యత్‌లో కొత్త కోర్సులకు అధ్యాపకులు అందుబాటులో ఉంటారు.– ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ సరైన ఫ్యాకల్టీ లేకుండా అనుమతులు వద్దు కొన్నేళ్లుగా ఇష్టానుసారం కంప్యూటర్ కోర్సులకు అనుమతి ఇస్తు న్నారు. మరి ఆ కోర్సులను బోధించే వా రు ఉన్నారా? లేదా? అనేది యూనివర్సి టీలు పరిశీలించాలి. లేకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. నైపుణ్యం లేకుండా విద్యార్థులకు డిగ్రీలిస్తే, మార్కెట్లో వారు నిలబడటం కష్టం. ఈ విషయాన్ని అనేక సర్వేలు రుజువు చేస్తున్నాయి.– అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బడి బ్యాగు బరువు తగ్గించాలి!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో చదివే విద్యార్థులపై పుస్తకాల బరువు తగ్గించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమలయ్యేలా చూడాలని పేర్కొంది. పుస్తకాల బరువు, దాని వల్ల ఎదురయ్యే పరిణామాలపై కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో చేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం.. 70శాతం మంది స్కూల్ విద్యార్థులపై పుస్తకాల భారం అధికంగా ఉంటోంది. దీనితో పిల్లల కండరాలు, మోకాళ్లపై ఒత్తిడి పడుతోంది. 22 శాతం మంది విద్యార్థులు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఇంటికి రాగానే నీరసంగా, భుజాలు వంగిపోయి నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. దీర్ఘకాలం పాటు ఈ ప్రభావం ఉంటోందని.. ఈ ఆరోగ్య సమస్యలు విద్యార్థి చదువుపై శ్రద్ధ కోల్పోయేందుకు కారణం అవుతున్నాయని అధ్యయనం నివేదిక స్పష్టం చేసింది. మితిమీరిన పుస్తకాలు, చదువుతో విద్యార్థులు సరిగా నిద్రపోవడం లేదని.. దీనితో తరగతి గదిలో చురుకుగా ఉండటం లేదని పేర్కొంది. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోందని వివరించింది. ప్రైవేటు స్కూళ్లు బహుళ అంతస్తుల భవనాల్లో ఉండటం, శక్తికి మించిన బరువుతో పిల్లలు మెట్లు ఎక్కడం వల్ల సమస్య పెరుగుతోందని తెలిపింది. ఈ క్రమంలో బడి బ్యాగుల బరువు విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కచ్చితమైన నిబంధనలు ఉండేలా చూడాలని సూచించింది. ఐదేళ్ల నుంచి అడుగుతున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో స్కూల్ విద్యార్థులపై పుస్తకాల బరువు సమస్య తీవ్రంగా ఉందని ఈ అంశంపై అధ్యయనం చేసిన యశ్పాల్ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. చిన్నప్పట్నుంచే విద్యార్థులు అధిక బరువు మోయడం వల్ల కండరాలపై ఒత్తిడి పడి, భవిష్యత్‌లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి. ఈక్రమంలో పుస్తకాల బరువు తగ్గించే చర్యలు చేపట్టాలని కేంద్ర విద్యా శాఖ ఐదేళ్ల క్రితమే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఆ దిశగా కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. పిల్లలు మోసే పుస్తకాల బరువు వారి బరువులో పది శాతానికి మించి ఉండకూడదని పేర్కొంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కొంత కార్యాచరణ చేపట్టాయి. స్కూళ్లలో డిజిటల్ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి. కానీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విద్యకు ప్రాధాన్యం, అవకాశాలు పెరిగాయి. విద్యా సంస్థలు దీనిని సది్వనియోగం చేసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. హోంవర్క్ సహా కొన్ని రాత పనులను డిజిటల్ విధానంలోకి మార్చడం వల్ల బరువు తగ్గించే వీలుందని పేర్కొంది. ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో స్పందించలేదని.. ఇకనైనా ఆ దిశగా అడుగువేయాలని కేంద్ర విద్యాశాఖ తాజాగా అభిప్రాయపడింది. బ్యాగు బరువు ఇలా ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రెండో తరగతి విద్యార్థులకు 1.5 కిలోలు మాత్రమే పుస్తకాల బరువు ఉండాలి. 5 తరగతి వరకూ మూడు కేజీలు, 7వ తరగతి వరకు 4 కేజీలు, 9వ తరగతి వారికి 4.5 కేజీలు, పదో తరగతి వారికి 5 కేజీలకు మించి పుస్తకాల బరువు ఉండకూడదు. తెలంగాణ విద్యాశాఖ క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం.. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల పుస్తకాల బరువు 12 కేజీల వరకు, ఉన్నత పాఠశాల విద్యార్థుల పుస్తకాల బరువు 17 కేజీల వరకు ఉంటున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ఐదో తరగతి చదివే విద్యార్థులు ఏకంగా 40 పుస్తకాలను మోయాల్సి వస్తోంది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్స్, వర్క్ïÙట్స్, నోట్‌బుక్స్ ఇలా అనేకం బ్యాగులో కుక్కేస్తున్నారు. వీటికితోడు లంచ్ బాక్స్, నీళ్ల బాటిల్ కూడా కలసి పిల్లలపై భారం పడుతోంది. ప్రైవేటు స్కూళ్లు పుస్తకాల ముద్రణ సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాల కారణంగా ప్రతిదీ కొనాల్సిందేనని విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. భారంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి పుస్తకాల బరువు తగ్గించే అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇటీవల చర్చించారు. ఈ అంశంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలు, కార్యాచరణను రూపొందించేందుకు అధికారులతో ఓ కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులకు పుస్తకాల బరువు అధికంగా ఉంటోందని.. అలాంటి వాటిని కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని ఆలోచనకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని, అన్ని అంశాలను పరిశీలించి త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తామని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. -
డిగ్రీ చదివినా తక్షణ ఉపాధి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులొస్తున్నాయి. విదేశీ అధ్యయనాల మేరకు బోధన ప్రణాళికలు రూపొందుతున్నాయి. పారిశ్రామిక అవసరాలే గీటురాయిగా డిగ్రీలో నైపుణ్యాన్ని మేళవిస్తున్నారు. మూడేళ్ళ స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు వస్తున్నాయి. డిగ్రీ చేసినా ఉపాధి ఖాయమనే భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనర్స్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ళతో పరిమితంగా ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విధంగా ప్రవేశపెడుతున్న అనేక మార్పుల పురోగతిని కేంద్ర విద్యాశాఖ ఇటీవల సమీక్షించింది. మరోవైపు కాంబినేషన్ కోర్సులు, తక్షణ ఉపాధి అవకాశాలున్న స్కిల్ అనుసంధాన కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఇక మీదట సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో సాంకేతికత తోడైన డిగ్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతాయని తెలిపింది. కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల మేళవింపుతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్ట్స్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్‌తో సామాజిక అవగాహన కోర్సులు కలగలిపి రాబోతున్నాయి. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను యూజీసీ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో క్రెడిట్స్ విధానం అమలులోకి రాబోతోంది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. క్రెడిట్ విధానం బెస్ట్ డిగ్రీ పట్టాలు ఇక క్రెడిట్స్ ఆధారంగా ఉండనున్నాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్ల ను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలా గే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చే స్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకా శం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసు కు న్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నా లుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఆనర్స్ వైపు ఆకర్షణ తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ రూపొందించింది. తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు ఆనర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అక్కౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. ఇక బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్లల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. నైపుణ్యం వెలికితీసేలా మూల్యాంకనం విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే మూల్యాంకన విధానం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. డిగ్రీ కోర్సులు ఇక మీదట పూర్తి నైపుణ్యంతో అందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయోగం మొదలైంది. భవిష్యత్‌లో దీని వేగం పెరుగుతుంది. ఇక మీదట డిగ్రీ కోర్సు చేసినా మంచి ఉపాధి పొందుతారనే విశ్వాసం విద్యార్థుల్లో వస్తుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
గిరిజనుల్లో విద్యా కాంతులు
గిరిజనులు స్వచ్ఛమైన మనసు కలిగిన కల్మషం లేని మనుషులు. తరతరాలుగా వారిని పేదరికం వెంటాడుతోంది. ఇప్పటికీ మిగతా ప్రపంచంతో సమం కాని జీవన ప్రమాణాలు వారివి. వారి జీవితాలను మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో బాహ్య ప్రపంచంతో అడుగులు వేసే విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు, సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వారిని గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశాం. నాలుగేళ్లలో 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.16,805 కోట్ల లబ్ధి చేకూర్చామని చెప్పడానికి గర్వపడుతున్నాను. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన ద్వారా గిరిజనుల జీవితాల్లో గొప్ప మార్పునకు నాంది పలికామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గిరిజనుల్లో విద్యాకాంతులు నింపే ఈ ప్రాజెక్టును రూ.830 కోట్ల ఖర్చుతో మూడేళ్లలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలం చినమేడపల్లిలో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి, ఇతర మౌలిక వసతుల కల్పనకు శుక్రవారం ఆయన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. అందుకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అంతకు ముందు విశాఖపట్నం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ముఖ్యమంత్రి ఘనంగా స్వాగతం పలికి, ఆయనతో కలిసి నేరుగా చినమేడపల్లికి హెలికాప్టర్లో చేరుకున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయం వచ్చిందని, రాష్ట్రంలో రెండవ సెంట్రల్ వర్సిటీ అని చెప్పారు. గిరిపుత్రుల జీవితాల్లో ఉన్నత విద్యాకాంతులు నింపడానికి రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గిరిజన మిత్రుడిగా, గిరిజన పక్షపాతిగా మన గిరిజనులు ప్రపంచంతో పోటీపడేలా గొప్ప అడుగుకు బీజం పడబోతోందని చెప్పారు. తనను నిరంతరం గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి మీ తమ్ముడిగా, అన్నగా, బిడ్డగా రుణపడి ఉంటానన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నాలుగేళ్లుగా గుండెల్లో పెట్టుకున్నాం ► ఈ నాలుగేళ్లలో గిరిజనుల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేశాం. వారిని గుండెల్లో పెట్టుకున్నాం. అన్ని విధాలా అండగా నిలబడ్డాం. వారిని తోటి ప్రపంచంలో నిలబెట్టే సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. ► తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల కోసం ప్రాథమిక విద్య మొదలు ఉన్నత విద్య వరకు అన్ని దశల్లోనూ అండగా నిలుస్తున్నాం. మీడియం నుంచి మౌలిక సదుపాయాల వరకు అన్నింటిలోనూ ఈ నాలుగేళ్లలో విప్లవాత్మక మార్పులతో అడుగులు ముందుకు వేశాం. ► గిరిపుత్రుల అభివృద్ధి పట్ల మనందరి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా, దూరదృష్టితో వ్యవహరిస్తోంది. వారి విద్యా సాధికారత కోసం, తోటి పోటీ ప్రపంచంలో గెలవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ అనే కాన్సెప్ట్ అమలవుతోంది. నాడు–నేడుతో వారు చదువుతున్న స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారాయి. విద్యాకానుకతో బడిపిల్లల రూపాన్ని, బైలింగువల్ విధానంతో వారి టెక్టŠస్ బుక్స్‌నూ మార్చగలిగాం. ► ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేస్తున్నాం. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)లను ఏర్పాటు చేస్తున్నాం. 8వ తరగతి పిల్లలందరికీ ట్యాబ్స్ ఇచ్చే కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే జరుగుతోంది. కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాలను చదువును ప్రోత్సహించేలా తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యలో విద్యా దీవెన, వసతి దీవెన తీసుకొచ్చాం. ► మెరుగైన చదువులు, కరిక్యులమ్‌లో మార్పులతో పిల్లలకు విద్యను అందుబాటులోకి తెచి్చన ఘనత ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే దక్కుతుంది. విదేశీ విద్యా దీవెనలో భాగంగా ప్రపంచంలోని టాప్ 50 వర్సిటీల్లోని 21 ఫ్యాకలీ్టలకు వర్తింపజేస్తున్నాం. మొత్తంగా 350 కాలేజీల్లో సీటు సంపాదించుకుంటే చాలు రూ.1.25 కోట్ల వరకు మన పిల్లలకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. రాజకీయంగానూ పెద్దపీట ► నా ఎస్టీలు.. అనే పదానికి అర్థం చెబుతూ గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంతగా గిరిజనులకు రాజకీయ పదవులిచ్చి నా పక్కనే పెట్టుకున్నాను. ఏ నామినేటెడ్ పదవి, ఏ నామినేటెడ్ కాంట్రాక్టు తీసుకున్నా నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం కేటాయించేలా చట్టం చేసి అమలు చేస్తున్నాం. మొట్టమొదట గిరిజన చెల్లెమ్మకు, తర్వాత గిరిజన అన్నకు కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. గత ప్రభుత్వానికి భిన్నంగా.. రాజ్యాంగబద్ధమైన ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కూడా నియమించాం. ► నా ఎస్టీల కష్టాలు, కన్నీళ్లు తెలిసిన మనిíÙగా వారికి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి హామీని మనసా వాచా కర్మణా త్రికరణశుద్ధితో అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 4.58 లక్షల గిరిజన కుటుంబాల ప్రయోజనం కోసం రూ.410 కోట్లు ఖర్చు చేశాం. ఆరోగ్య పరిరక్షణలోనూ శ్రద్ధ ► గిరిజన ప్రాంతంలో చిన్నపిల్లల దగ్గర నుంచి బాలింతలు, గర్భవతుల వరకు ఆరోగ్య పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాం. సంపూర్ణ పోషణ ప్లస్, చిన్న పిల్లలకు గోరుముద్ద స్కీమ్‌లతో వారు తీసుకునే ఆహారంలో మార్పులు తీసుకురాగలిగాం. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యం అందడం లేదన్న పరిస్థితిని పూర్తిగా మార్చేశాం. ప్రతి గిరిజన గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం అమలు జరుగుతోంది. ప్రతి అడుగూ గిరిజనుల బాగు కోసమే ► గిరిజనుల కోసం ఇంతగా తపించిన ప్రభుత్వం ఏదీ లేదు. 1,53,820 కుటుంబాలకు మేలు చేస్తూ 3,22,538 ఎకరాలను ఆర్వోఎఫ్ఆర్ డీకేటీ పట్టాలు వారి చేతికి అందించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. పెట్టుబడి ఖర్చుల కోసం రైతు భరోసా సొమ్ము కూడా మీ బిడ్డ ప్రభుత్వమే ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన పిల్లలు 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. ఇందులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే ఏకంగా 84 శాతం కనిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని 497 సచివాలయాల్లో పని చేస్తున్న 100 శాతం ఉద్యోగులు నా గిరిజన తమ్ముళ్లూ, చెల్లెమ్మలే. ► నవరత్నాల్లోని ప్రతి పథకాన్నీ నా గిరిజనులకు వర్తింపజేసేలా అడుగులు వేశాం. అవినీతి, వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో అమలు చేస్తున్నాం. మీ బిడ్డ బటన్ నొక్కుతుంటే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. నాలుగేళ్ల పాలనలో 36.12 లక్షల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తూ రూ.11,548 కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చాం. నాన్ డీబీటీ అంటే ట్యాబ్‌లు, ఇళ్ల పట్టాలు, విద్యా కానుక, సంపూర్ణ పోషణ, గోరుముద్ద వంటివి కలుపుకుంటే 22.26 లక్షల కుటుంబాలకు మరో రూ.5,257 కోట్ల మేలు కలిగింది. మొత్తంగా డీబీటీ, నాన్ డీబీటీ కలుపుకుంటే 58.39 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.16,805 కోట్ల లబ్ధి చేకూరింది. ► సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వల్ల గొప్ప మార్పు జరగబోతోంది. దీన్ని మన ప్రాంతానికి మంజూరు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అభినందనలు. -
కౌన్సెలింగ్ తర్వాతే క్లాసులు..
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యాసంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలను కట్టడిచేసేందుకు కేంద్ర విద్యాశాఖ నడుం బిగించింది. జాతీయ ఇంజనీరింగ్, మెడికల్, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. కాలేజీలు మొదలయ్యే ముందే విద్యార్థులకు విద్యా విధానం, ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని అధిగమించడంపై అవగాహన కల్పించాలని భావించింది. ఇందులోభాగంగా కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దేశంలోని అన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేంద్రాలు (ఐఐఎస్ఈఆర్), ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లను ఆదేశించింది. ఈ సంస్థల్లో 2018 నుంచి 2022 వరకు జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు, వాటి కారణాలపై కేంద్రం అధ్యయనం చేసింది. ఐఐటీల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు గత ఐదేళ్లలో ఐఐటీల్లో 32 మంది, ఎన్ఐటీల్లో 21 మంది, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 20 మంది, ఎయిమ్స్ సంస్థల్లో 11 మంది విద్యార్థులు అర్ధంతరంగా తనువు చాలించారు. జాతీయ స్థాయిలో తీవ్ర పోటీని తట్టుకుని సీట్లు తెచ్చుకున్న ఈ విద్యార్థులు మానసిక ఒత్తిడి, అనుకోకుండా డిప్రెషన్లోకి వెళ్లిపోవడం ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. జాతీయ కాలేజీల్లో చేరిన రెండో సంవత్సరం నుంచి వారికి తెలియకుండానే మానసిక ఒత్తిడి మొదలవుతోందని నిపుణులు చెబుతున్నారు. మొదటి ఏడాదిలో మిగిలిపోయే బ్యాక్‌లాగ్స్‌తో ఒక్కసారిగా బెంబేలెత్తిపోతున్నారని, కోర్సు ముగిశాక అనుకున్న రీతిలో జీవితంలో స్థిరపడలేమనే నైరాశ్యం వారిలో గూడుకట్టుకుంటోందని జాతీయ ఇంజనీరింగ్ సంస్థల డైరెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. బట్టీ విధానమే కారణమా? ప్రతీ రాష్ట్రంలోనూ ఇంటర్మీడియెట్ వరకు కాలేజీల్లో బట్టీ విధానంలోనే బోధన సాగుతోందని నిపుణులు అంటున్నారు. జాతీయ పోటీ పరీక్షలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ కోసం కోచింగ్ కేంద్రాలు ఒక తరహా బట్టీ పద్ధతిలోనే బోధన చేస్తున్నాయని చెబుతున్నారు. ఇది అసలైన మేధో విధానం కాకపోవడం, ఇంజనీరింగ్‌లో చేరిన తర్వాత ఇదే పద్ధతి ఉండకపోవడం సమస్యకు మూలంగా పేర్కొంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యాన్ని పరిశీలిస్తే గణితం, ఫిజిక్స్ ప్రామాణికంగా ఉండే సబ్జెక్టుల్లోనే విద్యార్థులు వెనుకబడుతున్నారు. ఐఐటీలు, ఎన్ఐటీలు పూర్తిగా పరిశోధనాత్మకంగా ఉండాలని జాతీయ విద్యావిధానం చెబుతోంది. మేథ్స్‌లో ఏదైనా సమస్యను విశ్లేషణాత్మకంగా పరిష్కరించే విధానం జాతీయ సాంకేతిక విద్యలో ఇప్పుడు కీలకమైంది. బట్టీ విధానంలో వచ్చిన విద్యార్థులు ఇక్కడే గందరగోళానికి గురవుతున్నారని నిపుణులు విశ్లేíÙస్తున్నారు. ఏ మాత్రం ధైర్యం కోల్పోతున్నా... ఉమ్మడి సీట్ల కేటాయింపునకు సంబంధించిన ఆరు దశల ‘జోసా’కౌన్సెలింగ్ పూర్తయింది. మరికొద్ది రోజుల్లో ఎన్ఐటీలు, ఐఐటీల్లో క్లాసులు మొదలవుతాయి. అందువల్ల ముందుగా ప్రతీ బ్రాంచీలోని విద్యార్థులను సమైక్య పర్చాలి. వారిలో ఉత్తేజాన్ని, మనోధైర్యాన్ని కల్పించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలి. సమస్యలకు పరిష్కారం సాధించే మార్గాలను ముందే వివరించాలి. ప్రతీ విద్యార్థి వ్యక్తిగత నేపథ్యం, వారి కుటుంబ వివరాలు తెలుసుకోవాలి. కొన్ని రోజులు విద్యార్థులను దగ్గర్నుంచి పరిశీలించాలి. ఏమాత్రం ధైర్యం కోల్పోతున్నట్టు గుర్తించినా అతన్ని ప్రత్యేక పద్ధతిలో కౌన్సెలింగ్ చేయాలి. ఈ దిశగా అన్ని కాలేజీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. కౌన్సెలింగ్ అవసరం : ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ (నిట్ డైరెక్టర్, వరంగల్) విద్యార్థుల ఆత్మహత్యలను సీరియస్‌గా తీసుకోవాలి. మనోనిబ్బరం కోల్పోయిన వారికి ఒకసారి సాదాసీదా కౌన్సెలింగ్ ఇస్తే సరిపోదు. దశలవారీగా కౌన్సెలింగ్ ఇవ్వాలి. అతనిలో వచ్చే మార్పులను గమనించాలి. అవసరమైతే తల్లిదండ్రులనూ పిలిచి వారితో ధైర్యం చెప్పించాలి. ప్రతీ ఎన్‌ఐటీలోనూ కౌన్సెలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచన మంచిదే. ఒత్తిడికి లోనవుతున్నారు: డాక్టర్ ఎన్వీ రమణారావు (నిట్ డైరెక్టర్, రాయ్‌పూర్) జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటు వచ్చే వరకూ చదవడం వేరు. వచ్చిన తర్వాత చేయాల్సిన కృషి వేరు. ఈ తేడాను గుర్తించలేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి వారిని గమనించేందుకు ప్రతీ పది మంది విద్యార్థులకు ఒక మెంటార్‌ను నియమించాం. -
కేవీల్లో ఎంపీల కోటా పునరుద్ధరణ యోచన లేదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు పార్లమెంట్ సభ్యుల కోటాను పునరుద్ధరించే ప్రతిపాదనేదీ లేదని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో సోమవారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి ఒక ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ విద్యా సంస్థలను ప్రాథమికంగా రక్షణ, పారా మిలటరీ, కేంద్ర అటానమస్ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసినవని వివరించారు. ఎంపీలకు కోటా ఇవ్వడం వల్ల ఒక్కో సెక్షన్లో 40 మంది విద్యార్థుల పరిమితి దాటిపోతోందన్నారు. ఇది బోధనపై ప్రభావం చూపుతోందని వివరించారు. గతంలో ఒక్కో ఎంపీ ఒక కేవీలో 10 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని సిఫారసు చేసేందుకు వీలుండేది. మొత్తం 543 మంది లోక్‌సభ, 245 మంది రాజ్యసభ సభ్యులు కలిపి కేవీల్లో ఏటా తమ కోటా కింద 7,880 మంది విద్యార్థుల ప్రవేశాలకు సిఫారసు చేసేవారు. -
పకడ్బందీగా కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాశ్ సర్కార్ తెలిపారు. సీయూఈటీ తాత్కాలిక ఆన్సర్ కీలో పొందుపర్చిన అనేక సమాధానాలు తప్పులు తడకగా ఉన్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలో 570 జవాబులను సబ్జెక్టు నిపుణులు పరిష్కరించి సవరించారన్నారు. కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మొత్తం 61 సబ్జెక్టులకు సంబంధించి 2,305 ప్రశ్నపత్రాల్లో 1,48,520 ప్రశ్నలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రశ్నలకు సంబంధించి విడుదల చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలలో అభ్యర్థులు 3,886 ఆన్సర్ కీలను చాలెంజ్ చేశారన్నారు. తప్పు జవాబులపై అభ్యర్థులు చేసిన చాలెంజ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిన సబ్జెక్ట్ నిపుణులు పరిష్కరించిన అనంతరం రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే ఫలితాల విడుదల జరుగుతుందని మంత్రి వివరించారు. ఏపీలో 662 రైజింగ్ ఇండియా పాఠశాలలు ఆంధ్రప్రదేశ్‌లో 662 పాఠశాలలను ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం ఎస్హెచ్ఆర్ఐ)లో భాగంగా గుర్తించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. వీటి కోసం 2023–24లో కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.354.85 కోట్లు (212.91కోట్లు+141.94 కోట్లు) ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు అనుమతించినట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 10,834 గ్రామాల్లో డ్రోన్ సర్వే ఆంధ్రప్రదేశ్‌లోని 10,834 గ్రామాల్లో ఇప్పటివరకూ పీఎం స్వమిత్వలో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో గృహ యజమానులు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఈ సర్వే చేస్తున్నట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2031 వరకూ నెల్లూరు హైవేకు రాయితీ జాతీయ రహదారి–16లోని నెల్లూరు–తడ నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, నిర్వహణ, బదిలీ(బీవోటీ) టోల్ పద్ధతిలో నిర్మించారని, దీని రాయితీ కాలం సెపె్టంబర్ 2031 వరకూ ఉంటుందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. టోల్ వసూలు ఏజెన్సీతో ధరల సవరణ ఎంవోయూ ఏదీ పరిశీలనలో లేదన్నారు. -
కేంద్ర విద్యాశాఖ నిర్ణయం.. ఇక నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న బోధన విధానాలకు అనుగుణంగా అధ్యాపకుల శైలిలోనూ మార్పులు తేవాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల స్వరూప స్వభావాన్ని మార్చాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న రెండేళ్ళ కాలపరిమితి స్థానంలో కోర్సును నాలుగేళ్ళకు పెంచబోతున్నారు. ఇప్పటికే బీఈడీ కోర్సుల మార్పులకు సంబంధించిన ముసాయిదా ప్రతిని రూపొందించారు. గత నెల 27న ఢిల్లీలో దీనిపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రాలకు చెందిన ఉన్నత విద్యా మండళ్ళు, కేంద్ర విద్యాశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి బీఈడీలో కొత్త కోర్సుల రూపకల్పన బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. జాతీయ విద్యావిధానం–2020లో తీసుకొచ్చిన మార్పులను అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిలోనూ గుణాత్మక మార్పులతో ముసాయిదా రూపొందించారు. నవీన బోధన విధానం..: కాలానుగుణంగా వస్తున్న మార్పులతో నవీన బోధన విధానంతో కొత్త సబ్జెక్టులను బీఈడీలో చేర్చబోతున్నారు. విద్యార్థి సైకాలజీని అర్థం చేసుకుని, సునిశిత విశ్లేషణతో బోధించే మెళకువలు ఇందులో పొందుపర్చాలని నిర్ణయించారు. బోధన ప్రణాళికలో వర్చువల్, డిజిటల్ పద్ధతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళి విద్యార్థి సముపార్జించే జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా గుర్తించాలనే అంశాలను బీఈడీలో చేర్చబోతున్నారు. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు అనుగుణంగా పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టును విద్యారి్థకి అర్థమయ్యేలా టెక్నాలజీతో అందించే విధానాన్ని బీఈడీలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. -
మాతృభాషలో శాస్త్ర, సాంకేతిక పదాల అర్థాలు
న్యూఢిల్లీ: ఆధునిక శాస్త్రీయ, సాంకేతిక పదాలకు ఇకపై మాతృభాషలో సులభంగా అర్థాలు తెలుసుకోవచ్చు. జాతీయ విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టర్మినాలజీ (సీఎస్టీటీ) దాదాపు 30 లక్షల పదాలు, వారి అర్థాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు ఒక వెబ్సైట్, యాప్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల శాస్త్ర, సాంకేతిక విద్యను మాతృభాషలు, ప్రాంతీయ భాషల్లో బోధించడం సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, రచయితలు, అనువాదకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు. శాస్త్రీయ, సాంకేతిక పదాలు, వాటి అర్థ వివరణలను గూగుల్‌లో మాతృభాషలో తెలుసుకోవచ్చు. shabd.education.gov.nic అనే వెబ్సైట్లో ఈ వివరాలు త్వరలో కనిపించనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ఆరంభం నుంచే వెబ్సైట్, యాప్ ప్రారంభం కానుంది. మెడిసిన్, లింగ్విస్టిక్స్, పబ్లిక్ పాలసీ, ఫైనాన్స్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ తదితర విభాగాల పదాలు, అర్థాలు ఇందులో ఉంటాయి. విద్యను సాధ్యమైనంత మేరకు మాతృ భాషలు, స్థానిక భాషల్లో బోధించాలని జాతీయ విద్యా విధానం నిర్దేశిస్తోంది. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ.. అన్ని స్థాయిల్లో భారతీయ భాషలను ప్రోత్సహించాలని పేర్కొంటోంది. ప్రస్తుతం 22 అధికారిక భాషల్లో పదాల అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, భాషల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సీఎస్టీటీ చైర్పర్సన్ ప్రొఫెసర్ గిరినాథ్ ఝా చెప్పారు. పుస్తకాల ప్రచురణ కోసం సీఎస్టీటీని కేంద్రం 1961లో ఏర్పాటు చేసింది. -
ఏడాదిలో 20 వేలకు పైగా స్కూళ్లు మూసివేత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో 2020–21లో 20 వేలకు పైగా స్కూళ్లు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే టీచర్ల సంఖ్య 1.95% తగ్గిందని తెలిపింది. దేశంలో 44.85% స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్ సదుపాయం ఉందని, 34% పాఠశాలల్లో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) నివేదించింది. ► 2020–21లో 15.09 లక్షల స్కూళ్లు ఉంటే 2021–22లో 14.89లక్షలకి తగ్గిపోయాయి. ► 2020–21లో 97 లక్షలున్న టీచర్ల సంఖ్య 2021–22 నాటికి 95 లక్షలకి తగ్గిపోయింది. ► దివ్యాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేక టాయిలెట్లు 27%స్కూళ్లలోనే ఉన్నాయి. ► 2020–21లో 25.38 కోట్ల మంది ఉండే విద్యార్థుల సంఖ్య 2021–22 వచ్చేసరికి 25.57 కోట్లకి పెరిగింది. ► ప్రి ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల చేరిక11.5 లక్షలు తగ్గింది. కరోనా ప్రభావంతో చిన్న పిల్లల్ని స్కూళ్లలో చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారి సంఖ్య తగ్గింది. -
ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో సూపర్‌న్యూమరీ మహిళా కోటాను ప్రవేశ పెట్టాక విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని కేంద్ర విద్యాశాఖ పరిధిలోని అడ్మిషన్స్ స్టాటస్టిక్స్–2021 తాజా నివేదిక పేర్కొంది. ఈ కోటా కింద 2021–22 ఏడాది బ్యాచ్‌లో 20 శాతం మంది విద్యార్థినులే ఉన్నారని, 2017లో ఐఐటీల్లో విద్యార్థినులు కేవలం 995 మంది ఉండగా, ప్రస్తుతం వీరి సంఖ్య 2,990కి పెరిగిందని తెలిపింది. ప్రతిష్టాత్మక ముంబై ఐఐటీలో 2017లో కేవలం 100 మంది విద్యార్థినులు చేరగా, ప్రస్తుతం 271కి, ఐఐటీ ఢిల్లీలో ఈ సంఖ్య 90 నుంచి 246కి, హైదరాబాద్ ఐఐటీలో 43 నుంచి 94కు పెరిగిందని వెల్లడించింది. 2017–2021 కాలంలో ఐఐటీల్లో ప్రవేశం పొందిన మొత్తం విద్యార్థులు 10,988 నుంచి 16,296కి పెరగ్గా, విద్యార్థినుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందని వివరించింది. ‘ఐఐటీల్లో విద్యార్థినుల సంఖ్య పెరగడం సామాజికంగా, దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వీరిలో చాలా మంది అగ్రశ్రేణి స్థానాల్లో ఉంటారు. అత్యున్నత బ్యాంకర్లలో వీరి సంఖ్య పెరుగుతుంది’అని ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాశీష్ చౌదరి పేర్కొన్నారు. -
ప్రభుత్వ స్కూళ్లకే పట్టం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలలు భారీ సంఖ్యలో మూతపడ్డాయని వెల్లడించింది. ఈ మేరకు గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సోమవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో 46.27 లక్షల మంది.. 2020–21 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో 4.37 లక్షల మంది విద్యార్థులు ప్రవేశం పొందారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి చెప్పారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 46.27 లక్షలకు చేరిందని వెల్లడించారు. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల్లో చేరినవారు కేవలం 2.5 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారు. దీంతో కొత్తగా చేరినవారితో కలిపి ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 35.05 లక్షలకు పడిపోయిందని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 77 దరఖాస్తులు మాత్రమే రాగా 948 ప్రైవేట్ పాఠశాలలు మూతపడ్డాయన్నారు. తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన చేరికలు. 2020–21 విద్యా సంవత్సరంలో తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో 3.20 లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారని కేంద్ర సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. దీంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 39.64 లక్షలకు చేరిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1.54 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశం పొందారని.. దీంతో మొత్తం విద్యార్థుల సంఖ్య 28.96 లక్షలకు చేరిందని తెలిపారు. కాగా తెలంగాణలో 2020–21లో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు తెరిచేందుకు 528 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఒక్క ప్రైవేట్ పాఠశాల కూడా మూతపడలేదని వెల్లడించారు. పాఠశాల విద్యలో ఎన్నో సంస్కరణలు ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పాఠశాల విద్యపై దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా.. వాటిలో సకల వసతులు ఉండేలా.. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడానికి నాడు–నేడు: మనబడి పథకాన్ని ప్రవేశపెట్టారు. అలాగే జగనన్న గోరుముద్ద పథకం కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్నారు. అదేవిధంగా తమ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లికి జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అంతేకాకుండా జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలు, బెల్టు, షూ, యూనిఫామ్, స్కూల్ బ్యాగు తదితరాలను అందిస్తున్నారు. వీటి ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు అమాంతం పెరిగాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యావేత్తలు చెబుతున్నారు. -
బడికెళ్లాలంటే కాలి నడకే శరణ్యం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే పాఠశాలలకు వెళ్తున్నట్లు కేంద్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(ఎన్ఏఎస్)–2021లో తేలింది. 18 శాతం మంది సైకిళ్లపై పాఠశాలలకు చేరుకుంటున్నట్లు వెల్లడయ్యింది. స్కూల్ ట్రాన్స్‌పోర్టు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించకుంటున్నవారు కేవలం 9 శాతం మంది ఉన్నారు. 8 శాతం మంది సొంత వాహనం(టూ వీలర్)పై, 3 శాతం మంది సొంత కార్లలో స్కూలుకు వెళ్తున్నారు. పిల్లల విద్యాభ్యాసం విషయంలో కనీసం 25 శాతం స్కూళ్లకు విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతు లేదని సర్వేలో గుర్తించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 720 జిల్లాల్లో 1.18 లక్షల స్కూళ్లకు చెందిన 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వే పాల్గొన్నారు. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్ 12న 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులను ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో సర్వే చేపట్టారు. చివరిసారిగా 2017లో ఎన్ఏఎస్ సర్వే జరిగింది. -
జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధికి చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా అభివృద్ధి కోసం ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ నేతృత్వంలో జాతీయ స్టీరింగ్ కమిటీని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఏర్పాటు చేసింది. ఆయన గతంలో జాతీయ విద్యా విధానం–2020 డ్రాఫ్టింగ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. కాగా మూడేళ్ళ కాలపరిమితితో నిర్ణయించిన ఈ నూతన కమిటీ జాతీయ విద్యావిధానం 2020 దృక్పథాల ప్రకారం నాలుగు జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను అభివృద్ధి చేస్తుంది. పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా, ప్రారంభ బాల్య సంరక్షణ, విద్య కోసం జాతీయ పాఠ్యాంశాలు, ఉపాధ్యాయ విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక, వయోజన విద్య కోసం జాతీయ పాఠ్యాంశాల ముసాయిదాలను ఈ కమిటీలోని మొత్తం 12మంది సభ్యులు సిద్ధం చేయనున్నారు. ప్రతిపాదనలు.. సలహాలు.. ఎన్ఈపీ–2020 అన్ని సిఫార్సులను పాఠశాల విద్య, ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ (ఈసీసీఈ), టీచర్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్‌కు సం బంధించిన పాఠ్యాంశాల సంస్కరణలను ఈ కమి టీ ప్రతిపాదిస్తుంది. జాతీయ పాఠ్యాంశాల ముసా యిదా కోసం టెక్ ప్లాట్‌ఫారమ్‌లో అందుకున్న రాష్ట్ర పాఠ్యాంశాల ముసాయిదా నుంచి కమిటీ ఇన్పుట్లను తీసుకుంటుంది. అంతేగాక జాతీయ పాఠ్యాంశాల ముసాయిదా తయారీలో వాటాదారులైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అందుకున్న సలహాలతో పాటు ఎన్సీఈఆరీ్టకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ బాడీ, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ సమా వేశాల్లో సూచనలను చేర్చిన తర్వాత కమిటీ జాతీ య పాఠ్యాంశాల ఫ్రేమ్‌వర్క్‌లను ఖరారు చేస్తుంది. పలువురు సభ్యులు.. జాతీయ స్టీరింగ్ కమిటీకి భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త కె.కస్తూరిరంగన్ నేతృత్వం వహిస్తుండగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుత ఛాన్సలర్ మహేష్ చంద్ర పంత్, నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మన్ గోవింద్ ప్రసాద్ శర్మ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ నజ్మా అక్తర్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి వైస్–ఛాన్సలర్ టి వి కత్తిమణి, పద్మశ్రీ మిచెల్ డానినో, జమ్మూ ఐఐఎం చైర్పర్సన్ మిలింద్ కాంబ్లే, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జగ్బీర్ సింగ్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గణిత శాస్త్రవేత్త మంజుల్ భార్గవ, ఎన్ఈపీ–2020 డ్రాఫ్ట్ కమిటీ సభ్యుడు ఎంకె శ్రీధర్, మాజీ ఐఏఎస్ అధికారి ధీర్ జింగ్రాన్, ఏక్ స్టెప్ ఫౌండేషన్ సీఈఓ శంకర్ మరువాడలు సభ్యులుగా వ్యవహరించనున్నారు. -
కేంద్రం తీపికబురు.. సమగ్ర శిక్షా పథకం 2026 వరకు పొడిగింపు..
న్యూఢిల్లీ: సమగ్ర శిక్షా పథకాన్ని 2026 వరకు పొడిగించినట్టు కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యం అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. అదే విధంగా, సమగ్ర శిక్షా పథకానికి గాను.. రూ.1,85,398 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకనుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్లేస్లూల్స్ కూడా ఉండాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, 2023 వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కేంద్ర ప్రాయోజిత పథకాన్ని పొడిగించామని పేర్కొన్నారు. అదే విధంగా.. 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో లైంగిక పరమైన నేరాలలో సత్వర న్యాయం అందించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. కాగా, నిర్భయ నిధి నుంచి నిధులను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
పాఠశాల విద్యలో ఏపీ ప్రగతి
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల విద్య గ్రేడింగ్ గవర్నెన్స్ ప్రాసెస్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించింది. 2018–19 కన్నా 20 శాతం మెరుగుపడింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాఠశాల విద్య పనితీరు గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) 2019–20 నివేదికకు కేంద్ర విద్యాశాఖమంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆమోదం తెలిపారు. కేంద్ర విద్యాశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ ఈ నివేదికను రూపొందించింది. పాఠశాల విద్యలో పరివర్తన తీసుకురావడానికి కేంద్రం 70 అంశాలతో పనితీరు గ్రేడింగ్ సూచీని ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2017–18 సంవత్సరం ఆధారంగా 2018–19లో తొలిసారి పీజీఐ ప్రచురించారు. ఇప్పుడు 2019–20 నివేదికను కేంద్రం ఆమోదించింది. 2018–19తో పోలిస్తే 2019–20లో ఆంధ్రప్రదేశ్ సహా 19 రాష్ట్రాలు కనీసం 20 శాతం (72 పాయింట్లు, అంతకంటే ఎక్కువ) మెరుగుదల చూపించాయి. పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ ఏ++ గ్రేడ్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్ 72 పాయింట్లకుపైగా, తెలంగాణ 15 పాయింట్లు మెరుగుపరచుకున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ 4వ లెవెల్ గ్రేడ్–1 (801–850 పాయింట్లు), తెలంగాణ 5వ లెవెల్ గ్రేడ్–2 (751–800 పాయింట్లు) సాధించాయి. కేటగిరీ–1 డొమైన్–1లో లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 154, తెలంగాణ 142 పాయింట్లు సాధించాయి. రాజస్థాన్ 168 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. కేటగిరీ–1 డొమైన్–2లో యాక్సెస్ విభాగంలో 80 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 65, తెలంగాణ 69 పాయింట్లు సాధించాయి. కేరళ 79 పాయింట్లతో తొలిస్థానంలో నిలిచింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ విభాగంలో 150 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 117, తెలంగాణ 113 పాయింట్లు సాధించాయి. పంజాబ్ 150 పాయింట్లతో తొలిస్థానంలో ఉంది. ఈక్విటీ విభాగంలో 230 పాయింట్లకు ఆంధ్రప్రదేశ్ 204, తెలంగాణ 210 పాయింట్లు సాధించాయి. 228 పాయింట్లతో పంజాబ్ మొదటి స్థానంలో నిలిచింది. గవర్నెన్స్ ప్రాసెస్‌లో 360 పాయింట్లకుగాను ఆంధ్రప్రదేశ్‌కు 271, తెలంగాణకు 238 పాయింట్లు లభించాయి. పంజాబ్ 346 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పీజీఐ ప్రవేశపెట్టిన 2017–18 నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కూడా లెవెల్ 1 (951–1000 పాయింట్లు) సాధించలేదు. -
Teachers Eligibility Test: టెట్ అభ్యర్థులకు కేంద్రం తీపికబురు..
న్యూఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలం పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కీలక ఆదేశాలను జారీచేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రకారం 2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలు పరచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనే వారికోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అభ్యర్థులందరికి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, గతంలో టెట్‌కు 7 సంవత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్‌ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ -
జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన తదుపరి తేదీలను 15 రోజుల ముందుగా విద్యార్థులకు సమాచారం అందజేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పరీక్షకు సంబంధించి రెండు సెషన్లు పూర్తయిన విషయం తెలిసిందే. చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా? -
బడిసంచి ఇక తేలిక
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులపై పెనుభారంగా మారిన స్కూలు బ్యాగు బరువు ఇక తగ్గనుంది. వారికి శారీరక సమస్యలతో పాటు ఒత్తిడికి, అలసటకు కారణమవుతున్న స్కూలు బ్యాగ్‌కు సంబంధించి కీలకమైన విధాన నిర్ణయాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుమేరకు కేంద్ర విద్యాశాఖ.. ఎన్సీఈఆర్టీ, కేవీఎస్, ఎన్వీఎస్, సీబీఎస్ఈ సంస్థల నిపుణుల సూచనల మేరకు ‘స్కూలు బ్యాగ్ పాలసీ–2020’ని వెలువరించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన ప్రక్రియలు సాగే పద్ధతి ద్వారా పిల్లల్లో ఒత్తిడి, స్కూలు బ్యాగ్ బరువు తగ్గుతాయి. అనేక సర్వేల్లో స్కూళ్లలో విద్యార్థి కేంద్ర అభ్యసనం కన్నా పుస్తకాలు, టీచర్ల బోధన కేంద్రంగా మారిపోతుండడమే బ్యాగ్ బరువు పెరగటానికి కారణంగా తేలింది. బ్యాగ్‌ల బరువును తగ్గించడానికి పలు రాష్ట్రాలు సెమిస్టర్ పద్ధతి, పుస్తకాలను స్కూళ్లలోనే ఉంచేలా చేయడం వంటి విధానాలు అవలంభిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. విద్యార్థుల స్కూలు బ్యాగ్‌కు తరగతుల వారీగా పరిమితులు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పులు వెలువరించినా సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. స్కూలు బ్యాగ్ బరువు కారణంగా పిల్లలు వెన్నెముక సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు కారణంగా శారీరక సమస్యలు రావడంతో వారి చదువులపై ప్రభావం చూపుతోంది. దీంతో కేంద్రం స్కూల్ బ్యాగ్ పాలసీని ప్రకటించి అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించింది. అంతర్జాతీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.. పిల్లల శరీర బరువును అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలని పలు శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్నాయి. 2009లో అమెరికన్ ఆక్యుపేషనల్ థెరపీ అసోసియేషన్ (ఏవోటీఏ), అమెరికన్ ఫిజియోథెరపీ అసోసియేషన్ (ఏపీటీఏ)లు విద్యార్థుల శరీర బరువులో 15 శాతం మేర మాత్రమే స్కూలు బ్యాగ్ ఉండాలని సూచించాయి. ద అమెరికన్ చిరోప్రాక్టీస్ అసోసియేషన్ (ఏసీఏ) పిల్లల శరీర బరువులో 5 నుంచి 10 శాతానికి మించి ఉండరాదని పేర్కొంది. మన దేశంలో పరిస్థితి ఇలా.. స్కూల్ బ్యాగ్ బరువుకు సంబంధించి దేశంలోని పరిస్థితిపై కొన్ని సంస్థలు సర్వేలు నిర్వహించి పలు సమస్యలను గుర్తించాయి. 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లల బరువులో పదిశాతానికి సమానంగా 2 నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉండాల్సి ఉన్నా వారి బ్యాగ్‌లు 5 కిలోలకు మించిన బరువుతో ఉంటున్నాయి. 6వ తరగతి విద్యార్థులకు 6 కిలోల బరువు వరకు ఇబ్బంది లేదు. కానీ వీరి బ్యాగ్‌లలోని వస్తువుల బరువు ఇలా ఉంటోంది. పాఠ్యపుస్తకాలు – 1 నుంచి 3.5 కిలోలు నోట్సులు – 1 నుంచి 2.5 కిలోలు లంచ్‌బాక్స్ – 250 గ్రా. నుంచి 1 కిలో వాటర్ బాటిల్ – 200 గ్రా. నుంచి 1 కిలో బ్యాగు బరువు – 150 గ్రా. నుంచి 1 కిలో ఇక పైతరగతులకు వెళ్లేకొద్దీ ఈ బ్యాగ్ బరువు ఇంకా పెరుగుతోంది. దీంతో విద్యార్థులు అలసటకు గురవడమే కాకుండా శారీరక సమస్యలతో చదువులపై శ్రద్ధ చూపలేకపోతున్నారు. మంచినీటి సదుపాయం, మధ్యాహ్న భోజనం అమలయ్యే స్కూళ్లకు వెళ్లేవారికి ఆ రెండింటి బరువు తగ్గుతున్నా చాలా ప్రయివేటు పాఠశాలల్లో ఆ సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కొన్ని స్కూళ్లు పిల్లలతో బడిలోనే హోంవర్కు చేయిస్తూ నోట్సులు, వర్కు పుస్తకాలను స్కూల్లోనే ఉంచుతున్నాయి. ఇంటి దగ్గర హోంవర్కు చేయాల్సి వస్తే ఒకే పుస్తకంలో అన్ని సబ్జెక్టులవి చేయిస్తున్నాయి. కొన్ని స్కూళ్లు రోజు విడిచి రోజు స్కూలు బ్యాగ్ తెచ్చేలా ఏర్పాట్లు చేశాయి. సెకండరీ, హయ్యర్ సెకండరీ తరగతులకు వచ్చేసరికి వివిధ సబ్జెక్టులతో పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కు పుస్తకాలు పెరిగిపోతున్నాయి. కొత్త విధానంలో పలుసూచనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం స్కూలు బ్యాగ్ బరువు తగ్గించేందుకు పలు సూచనలు చేసింది. – బ్యాగ్‌ను రెండు వైపులా భుజాలపై ఉండేలా రూపొందించాలి. – స్కూళ్లలో విద్యార్థులకు లాకర్లు, దివ్యాంగుల కోసం బుక్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలి. – నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ సూచనల ప్రకారం లైఫ్‌స్కిల్స్, కంప్యూటర్, మోరల్ ఎడ్యుకేషన్, జనరల్ నాలెడ్జి వంటి పాఠ్యపుస్తకాలు స్కూళ్లలోనే ఉంచేలా ఏర్పాట్లు చేయాలి. – స్కూలు బ్యాగ్ బరువు తగ్గేందుకు వీలుగా తరగతుల టైమ్‌టేబుల్‌ను మార్చుకోవాలి. – ఒకే సబ్జెక్టు వరుసగా రెండు పీరియడ్లు ఉండేలా చూడడం వంటి విధానలు పాటించాలి. – పాఠ్యపుస్తకాలు, నోట్సులు, వర్కుపుస్తకాల బరువును అనుసరించి నిర్ణీత పరిమితి మేరకు మాత్రమే బ్యాగ్ బరువు ఉండేలా టైమ్‌టేబుల్ రూపొందించాలి. – 1, 2 తరగతులకు ఒకే నోట్ పుస్తకం అమలుచేయాలి. – 3, 4, 5 తరగతులకు రెండు నోట్ పుస్తకాలు పెట్టాలి. ఒకదాన్ని బ్యాగ్‌లో ఉంచి, రెండోది స్కూల్లోనే ఉండేలా చూడాలి. – 6, 7, 8 తరగతుల వారికి లూజ్ పేపర్లలో క్లాస్‌వర్క్ చేసేలా ఫైల్‌ను ఏర్పాటుచేయాలి. 6వ తరగతి నుంచే ఈ వర్కు పేపర్లను ఒక పద్ధతిలో రాసేలా చేయాలి. – పాఠ్యపుస్తకాలకు మించి ఇతర పుస్తకాలను స్కూలులో అనుమతించరాదు. – స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అమలు, మంచినీటి సదుపాయం ఏర్పాటు ద్వారా విద్యార్థులు వాటిని ఇళ్లనుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. తద్వారా ఆ బరువు తగ్గుతుంది. ఈ సూచనలు అమలైతే విద్యార్థులకు మేలు స్కూలుకు వెళ్లే పిల్లల బ్యాగ్ వారు మోసే శక్తికి మించి ఉంటోంది. దీనివల్ల విద్యార్థులు విపరీతమైన శారీరక శ్రమ, అలసటకు గురవుతున్నారు. ఇది వారి చదువుపై వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ప్రయివేటు విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలకు అదనంగా ఇతర పుస్తకాలు ఇవ్వడం వారిని మరింత ఇబ్బంది పెడుతోంది. కేంద్రం ప్రకటించిన స్కూల్ బ్యాగ్ పాలసీ సమగ్రంగా అమలవ్వాలి. విద్యార్థి శక్తిని అనుసరించి స్కూలు బ్యాగ్ బరువు ఉండాలి. వారి శరీర బరువును అనుసరించి ఈ బ్యాగ్ బరువు నిర్ణయించడం మంచి పద్ధతి. ఈ పాలసీలోని ఇతర సూచనలను కూడా అన్ని విద్యా సంస్థలు పాటించాలి. – ప్రొఫెసర్ జీ జానకిరామయ్య, ఎడ్యుకేషన్ విభాగాధిపతి, ఎస్వీ యూనివర్సిటీ ఈ పాలసీ మేరకు ముందుకెళ్లాం విద్యార్థులపై బ్యాగుల బరువు లేకుండా చేయాలన్న చర్చ చాలాకాలంగా ఉంది. పలు సంస్థలు, కమిటీలు అధ్యయనాలు జరిగి అనేక సిఫార్సులు ఇచ్చాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. నో బ్యాగ్‌డేను అమలు చేయడంతో పాటు పాఠ్యపుస్తకాల బరువు తగ్గేందుకు సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తున్నాం. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లి తక్కిన వాటిని స్కూళ్లలోనే ఉంచుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం హోమ్ వర్కుతో పాటు ముఖ్యమైన పుస్తకాలు మాత్రమే ఇళ్లకు తీసుకువెళ్లేలా చర్యలు చేపడుతున్నాం. కేంద్రం ఇచ్చిన విధానపత్రాన్ని అనుసరించి ముందుకు వెళ్తాం. – డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్, రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి -
నీట్, జేఈఈల వాయిదా ఉండదు!
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, వైద్యవిద్యల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షల వాయిదా ఉండదని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహణ ఆలస్యం చేసే కొద్దీ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఈ పరీక్షలు వాయిదా వేయాలంటూ కొందరు విద్యార్థులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే! అయితే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పరీక్షలకు సన్నాహాలు ఆరంభించిన ప్రభుత్వం బుధవారం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. గురువారం ఉదయానికి దాదాపు 16 లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపింది. డౌన్లోడ్స్ భారీగా ఉండడం విద్యార్థులు పరీక్షను కోరుకుంటున్నారనడానికి గుర్తని విద్యాశాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ వ్యాఖ్యానించారు. పరీక్ష నిర్వహించాల్సిందిగా తల్లిదండ్రులు, పలువురు విద్యార్థులు తమకు మెయిల్స్ పంపారని వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7–11 మధ్యకాలంలో జేఈఈ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా కోవిడ్ నేపథ్యంలో ముందుగా జూలై 18 –23కు తాజాగా సెప్టెంబరు 1 –6కు వాయిదా పడింది. వైద్య విద్య ప్రవేశానికి నిర్వహించే నీట్ ఈ ఏడాది మే 3వ తేదీన జరగాల్సి ఉండగా జూలై 26వ తేదీకి తాజాగా సెప్టెంబర్ 13కు వాయిదా పడింది. జేఈఈలో 9.53 లక్షల మంది, నీట్లో 15.97 లక్షల మంది పాల్గొనే అవకాశముంది. వాయిదా అంటే వినాశనమే.. జేఈఈ, నీట్ పరీక్షలను మరింత కాలం వాయిదా వేయడం విద్యార్థుల భవిష్యత్తుతో రాజీపడటమేనని దేశ విదేశాలకు చెందిన సుమారు 150 మంది విద్యావేత్తలు ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. సొంత రాజకీయ ఎజెండాల అమలుకు కొందరు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని లేఖలో ఆరోపించారు. ‘‘యువత, విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు. అయితే కోవిడ్–19 నేపథ్యంలో వారి కెరీర్‌పై నీలినీడలు అలుముకొన్నాయి. కోర్సుల్లో ప్రవేశం మొదలుకొని పలు అంశాలపై ఏర్పడిన అస్పష్టతను వీలైనంత వేగంగా తొలగించాల్సిన అవసరం ఉంది. జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే తేదీలు ప్రకటించింది. ఇంకా జాప్యం చేస్తే విద్యార్థుల విలువైన విద్యాసంవత్సరం వృథా అవుతుంది. యువత, విద్యార్థుల భవిష్యత్తు కలలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ తగదు’’ అని పేర్కొన్నారు. లేఖపై సంతకం చేసిన వారిలో ఢిల్లీ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, లక్నో యూనివర్సిటీ, జేఎన్‌యూ, బీహెచ్‌యూ, ఐఐటీ ఢిల్లీలతోపాటు లండన్, కాలిఫోర్నియా, హీబ్రూ, బెన్ గురియాన్ యూనివర్సిటీల విద్యావేత్తలు ఉన్నారు. పరీక్షలు జాప్యం జరిగితే ఈ విద్యా సంవత్సరం జీరో విద్యా సంవత్సరంగా మారుతుందని, ఇది అనేక విపరిణామాలకు దారితీస్తుందని ఐఐటీ రూర్కీ, ఖరగ్ పూర్, రోపార్, గాంధీనగర్, గువాహటి డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు. వ్యవస్థపై విద్యార్ధులు నమ్మకముంచాలన్నారు. మరోవైపు జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోందని బీజేపీ గురువారం ఆరోపించింది. వాయిదా వల్ల విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని వాదనలు వస్తున్న నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ కాస్త మెత్తపడ్డట్లు కనిపించారు. ఈ విషయమై మాట్లాడుతూ ఆ పరీక్షలను పూర్తిగా నిలిపివేయమనడం లేదని, రెండు మూడు నెలలు వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నానని చెప్పారు. పరీక్షలను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన ఏడు మంది ముఖ్యమంత్రుల్లో అమరీందర్ కూడా ఉన్నారు.