సాక్షి, న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాశ్ సర్కార్ తెలిపారు. సీయూఈటీ తాత్కాలిక ఆన్సర్ కీలో పొందుపర్చిన అనేక సమాధానాలు తప్పులు తడకగా ఉన్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు.
ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సంబంధించి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలో 570 జవాబులను సబ్జెక్టు నిపుణులు పరిష్కరించి సవరించారన్నారు. కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మొత్తం 61 సబ్జెక్టులకు సంబంధించి 2,305 ప్రశ్నపత్రాల్లో 1,48,520 ప్రశ్నలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రశ్నలకు సంబంధించి విడుదల చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలలో అభ్యర్థులు 3,886 ఆన్సర్ కీలను చాలెంజ్ చేశారన్నారు.
తప్పు జవాబులపై అభ్యర్థులు చేసిన చాలెంజ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిన సబ్జెక్ట్ నిపుణులు పరిష్కరించిన అనంతరం రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే ఫలితాల విడుదల జరుగుతుందని మంత్రి వివరించారు.
ఏపీలో 662 రైజింగ్ ఇండియా పాఠశాలలు
ఆంధ్రప్రదేశ్‌లో 662 పాఠశాలలను ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం ఎస్హెచ్ఆర్ఐ)లో భాగంగా గుర్తించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. వీటి కోసం 2023–24లో కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.354.85 కోట్లు (212.91కోట్లు+141.94 కోట్లు) ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు అనుమతించినట్టు వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
10,834 గ్రామాల్లో డ్రోన్ సర్వే
ఆంధ్రప్రదేశ్‌లోని 10,834 గ్రామాల్లో ఇప్పటివరకూ పీఎం స్వమిత్వలో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో గృహ యజమానులు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఈ సర్వే చేస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
2031 వరకూ నెల్లూరు హైవేకు రాయితీ
జాతీయ రహదారి–16లోని నెల్లూరు–తడ నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, నిర్వహణ, బదిలీ(బీవోటీ) టోల్ పద్ధతిలో నిర్మించారని, దీని రాయితీ కాలం సెపె్టంబర్ 2031 వరకూ ఉంటుందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. టోల్ వసూలు ఏజెన్సీతో ధరల సవరణ ఎంవోయూ ఏదీ పరిశీలనలో లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment