common entrance exam
-
పకడ్బందీగా కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాశ్ సర్కార్ తెలిపారు. సీయూఈటీ తాత్కాలిక ఆన్సర్ కీలో పొందుపర్చిన అనేక సమాధానాలు తప్పులు తడకగా ఉన్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలో 570 జవాబులను సబ్జెక్టు నిపుణులు పరిష్కరించి సవరించారన్నారు. కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మొత్తం 61 సబ్జెక్టులకు సంబంధించి 2,305 ప్రశ్నపత్రాల్లో 1,48,520 ప్రశ్నలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రశ్నలకు సంబంధించి విడుదల చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలలో అభ్యర్థులు 3,886 ఆన్సర్ కీలను చాలెంజ్ చేశారన్నారు. తప్పు జవాబులపై అభ్యర్థులు చేసిన చాలెంజ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిన సబ్జెక్ట్ నిపుణులు పరిష్కరించిన అనంతరం రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే ఫలితాల విడుదల జరుగుతుందని మంత్రి వివరించారు. ఏపీలో 662 రైజింగ్ ఇండియా పాఠశాలలు ఆంధ్రప్రదేశ్‌లో 662 పాఠశాలలను ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం ఎస్హెచ్ఆర్ఐ)లో భాగంగా గుర్తించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. వీటి కోసం 2023–24లో కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.354.85 కోట్లు (212.91కోట్లు+141.94 కోట్లు) ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు అనుమతించినట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 10,834 గ్రామాల్లో డ్రోన్ సర్వే ఆంధ్రప్రదేశ్‌లోని 10,834 గ్రామాల్లో ఇప్పటివరకూ పీఎం స్వమిత్వలో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో గృహ యజమానులు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఈ సర్వే చేస్తున్నట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2031 వరకూ నెల్లూరు హైవేకు రాయితీ జాతీయ రహదారి–16లోని నెల్లూరు–తడ నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, నిర్వహణ, బదిలీ(బీవోటీ) టోల్ పద్ధతిలో నిర్మించారని, దీని రాయితీ కాలం సెపె్టంబర్ 2031 వరకూ ఉంటుందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. టోల్ వసూలు ఏజెన్సీతో ధరల సవరణ ఎంవోయూ ఏదీ పరిశీలనలో లేదన్నారు. -
నిరుద్యోగులకు వరం
నిరుద్యోగ భారతం ఎదుర్కొనే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు. ఫీజుల రూపంలో బోలెడు చెల్లించి కష్టపడి చదివి పట్టా తెచ్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు అతి స్వల్పం. కన్నవాళ్లకు భారంగా మారా మని బాధపడి ఏదో ఒక ప్రైవేటు సంస్థలో కుదురుకున్నా అత్తెసరు జీవితం. దేశంలో రెండున్నర కోట్ల నుంచి 3 కోట్లమంది వరకూ ఉద్యోగార్థులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియామకాల కోసం ఏటా పరీక్షలు రాస్తారని అంచనా. వీరంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేర్వేరు ఉద్యోగాలకు విడిగా దరఖాస్తు చేసుకోవడం, శిక్షణ తీసుకోవడం, దూరప్రాంతాలకు పరీక్ష రాసేందుకు పోవడం తప్పడం లేదు. ప్రతి ఉద్యోగానికీ రుసుము చెల్లించడం మరో సమస్య. దరఖాస్తుకే ఇలా వందలాది రూపాయలు ఖర్చుపెట్టవలసిరావడం నిరుద్యోగులకు ఎంతో ఇబ్బందికరం. దశాబ్దాలుగా కోట్లాది మంది నిరుద్యోగులు నిరంతరం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి పరిష్కారం చూపించింది. నాన్–గెజిటెడ్ పోస్టులు గ్రూప్–బీ, సీ(నాన్ టెక్నికల్) ఉద్యోగాలతోసహా అన్నిటికీ ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్ష నిర్వహణ కోసం జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) సంస్థ ఏర్పాటవుతుంది. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) తదితరాల ప్రతినిధులు ఇందులో వుంటారు. తొలి దశలో ఈ ఏజెన్సీ పరిధిలోకి మూడు నియామక బోర్డులు వస్తాయి. మున్ముందు 20 నియామక సంస్థల వరకూ ఇందులో చేరతాయి. దేశంలో దాదాపు ప్రతి జిల్లాలోనూ ఎన్ఆర్ఏ పరీక్షా కేంద్రాలుంటాయి. అలాగే ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో వచ్చే స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటు కావడం కూడా నిరుద్యోగులపాలిట వరం. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి తమ తమ అవసరాలనుబట్టి కొన్ని సంస్థలు రెండో దఫా పరీక్ష నిర్వహిస్తాయంటున్నారు. సాధ్యమైనంత వరకూ ఈ అవసరం లేకుండా చేయడమే ఉత్తమం. ఎటూ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు వుంటాయి గనుక, ఎన్ఆర్ఏ ఏర్పాటు ఉద్దేశమే బహుళ పరీక్షల అవసరం లేకుండా చేయడం గనుక మళ్లీ రెండోసారి రాయాలనడం సరికాదు. జిల్లాకొక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం మంచి ఆలో చన. ఎక్కడో దూరంగా వుండే ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయడం ఆడపిల్లలకైతే మరింత సమస్య. వారితోపాటు కుటుంబసభ్యులెవరైనా వెళ్లకతప్పదు. అత్యధిక కుటుంబాలకు అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత వుండదు. ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాలుంటే ఆ కుటుంబాలకు కాస్త ఉపశమనం. అయితే అవసరాన్నిబట్టి విస్తృతినిబట్టి కొన్ని జిల్లాలకు కనీసం రెండు కేంద్రాలైనా ఉండేలాచూడటం అవసరం. ఒకప్పుడు ఉపాధి కల్పనా కేంద్రాలకు ప్రాధాన్యం అధికం. పదో తరగతి అయ్యాక అక్కడ పేరు నమోదు చేసుకోవడం, విద్యార్హతలు పెరుగుతున్నకొద్దీ వాటిని అదనంగా చేరుస్తుండటం రివాజు. ఆ తర్వాత కాల్ లెటర్ కోసం ఎదురుచూడటం, తరచుగాపోయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం నిరుద్యోగులకు పెద్ద పని. ఆ ప్రక్రియలో చేతివాటం కూడా ఎక్కువే. డబ్బు ముట్టజెప్పిన వారికి కాల్ లెటర్లు రావడం, చేయనివారికి జీవితంలో ఒక్కసారి కూడా పిలుపు రాకపోవడం చాలామందికి అనుభవమే. అయితే ఉపాధి కల్పన శాఖ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చాకే ప్రభుత్వోద్యో గాలను భర్తీ చేయాలన్న నిబంధనను రెండు దశాబ్దాలక్రితం సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇదంతా మారింది. ఉపాధి కల్పనా కేంద్రాలతో నిరుద్యోగులకు పని లేకుండా పోయింది. చదువు పూర్తిచేసు కున్న వెంటనే అందులో తమ పేర్లు నమోదు చేసుకుంటున్న అమాయకులు ఇప్పటికీ లేకపోలేదు. కానీ అందులో నమోదయ్యేవారితో పోలిస్తే దాని జోలికిపోని నిరుద్యోగుల సంఖ్య వందలరెట్లు ఎక్కువ. చదువుకున్నవారిలో నిరుద్యోగిత 2011–12లో 6.1 శాతం వుంటే 2017–18నాటికి అది 17.8 శాతానికి చేరుకుందని నిరుడు నవంబర్‌లో చేసిన అధ్యయనంలో తేలింది. చదువు పెరిగేకొద్దీ నిరుద్యోగిత కూడా ఎక్కువవుతున్నదని ఆ అధ్యయనం తెలిపింది. అయితే ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు నానాటికీ తగ్గిపోతున్నాయని మరిచిపోకూడదు. రిటైరవుతున్నవారు నిష్క్రమిస్తుండగా, ఆ స్థానాలను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. కాంట్రాక్టు నియామకాలు, ఔట్సోర్సింగ్ నియామకాలు పెరుగుతున్నాయి. చెప్పుకోవడానికి ఘనంగా ఒక ఉద్యోగం ఉంటుంది. కానీ ఇంట్లో ఈగల మోత అన్నట్టు పనిభారం అధికం. ఎప్పుడూ అరకొర జీతం. జీవితంలో స్థిరపడతామన్న ఆశకు తావే వుండదు. మన దేశంలో మరో చిత్రమైన పరిస్థితి. ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణలుంటాయి. నిర్దిష్ట కాలానికి పెరుగుతున్న ధరవరలకనుగుణంగా వేతనాల పెంపుదల వుంటుంది. జాప్యం జరిగితే ప్రశ్నించ డానికి ఉద్యోగ సంఘాలుంటాయి. రిటైరయ్యాక పెన్షన్ సదుపాయం వుంటుంది. ప్రైవేటు ఉద్యో గాల్లో ఇవన్నీ కనబడవు. చట్టాలున్నా ఆచరణలో అమలు కావు. సమాజంలో వేర్వేరు రంగాల్లో పనిచేసేవారి వేతనాల మధ్య ఇలా తీవ్ర వ్యత్యాసం వుండటంతో వారి జీవన స్థితిగతుల్లో కూడా అంతరాలు అధికంగా వుంటున్నాయి. ప్రైవేటు రంగంలో కొనసాగేవారిపై ఆధారపడే కుటుంబాలు అధ్వాన్నస్థితిలో బతుకీడ్చవలసి వస్తోంది. కనుకనే ప్రభుత్వోద్యోగాలవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. అక్కడేమో నియామకాలు నానాటికీ కొడిగడుతున్నాయి. ఎన్ఆర్ఏ ఏర్పాటు చేయ డంతో సరిపెట్టక ప్రభుత్వ విభాగాల్లో నియామకాలను కూడా బాగా పెంచితేనే ప్రస్తుతం చేసిన మార్పులకు సార్థకత వుంటుంది. దేశ జనాభాలో యువతరం దాదాపు 35 శాతం అని ఒక అంచనా. ఈ యువతరాన్ని ఆకట్టుకోవాలంటే వారు మెరుగైన జీవనం సాగించడానికి అనువైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ఆర్ఏ ఆ దిశగా వేసిన తొలి అడుగు కావాలి. -
ఉమ్మడి ప్రవేశ పరీక్షలెలా?
ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలిసెట్ పరీక్షలు నిర్వహణపై గందరగోళం ఈ ఏడాదికి ఇబ్బంది లేకపోయినా తర్వాత సమస్యే సాక్షి, హైదరాబాద్: ఉన్నత కోర్సుల ప్రవేశానికి ఉద్దేశించిన ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల విషయంలోనూ రాష్ట్ర విభజనతో గందరగోళం నెలకొంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మొదటి ఏడాది ఇబ్బంది లేకపోయినా ఆ తరువాత ఎలా అని ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు పదేళ్లకు మించకుండా ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు... ఉన్నత విద్యామండలి, ఇంటర్మీడియెట్ బోర్డు తదితర 42 రాష్ట్ర స్థాయి విద్యా, ఇతర సంస్థలు మాత్రం ఏడాది కాలమే ఉమ్మడి రాష్ట్రాలకు సేవలు అందిస్తాయని పేర్కొనడమే ఈ పరిస్థితికి కారణం. రాష్ట్రస్థాయి సంస్థల సేవల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏడాది కాలంలోనే ఒప్పందానికి రావాలని, లేదంటే కేంద్రమే జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది. దీంతో ఎంసెట్ వంటి కీలకమైన ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణను ఎవరు చేపడతారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేర్వేరు పరీక్షలా? ఉమ్మడి యంత్రాంగమా? ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజన పూర్తయ్యాక పదేళ్ల వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం కొనసాగుతాయని బిల్లులో ఉంది. మరోవైపు వాటిని నిర్వహించే సంస్థలు ఏడాదిలోగా ఓ నిర్ణయానికి రావాలని పేర్కొనడం గందరగోళానికి తావిస్తోంది. రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయా? ఒకవేళ అలా చేస్తే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉత్తీర్ణత శాతం, ర్యాంకుల విధానం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు చేపట్టడం అసాధ్యం. లేకపోతే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ పదేళ్లపాటు ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుంది. వేర్వేరు ఇంటర్ బోర్డులు తప్పవా? ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి పోటీపరీక్ష జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించాలంటే ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధన ఉంది. రెండు బోర్డులు ఉండడం వల్ల టాప్-20 పర్సంటైల్‌తో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అవుతారు కనుక ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుంది. అందువల్ల పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల విధానం కొనసాగినప్పటికీ ఇరు రాష్ట్రాల్లో రెండు ఇంటర్మీడియెట్ బోర్డులు ఏర్పాటు చేయక తప్పదని వాదన నెలకొంది. మరోవైపు ఎంసెట్ రాయాలంటే కచ్చితంగా ఇంటర్మీడియెట్ ఆ రాష్ట్రంలోనే చదివి ఉండాలి. అప్పుడే ఆ అభ్యర్థి లోకల్ అవుతాడు. లేకపోతే నాన్‌లోకల్ కిందే లెక్క. పరిస్థితుల్లో ఇంటర్మీడియెట్ బోర్డులను వేర్వేరు చేస్తే తమ రాష్ట్ర విద్యార్థులకు పేపరు వ్యాల్యుయేషన్‌లో ఎవరైనా ఎక్కువ మార్కులు వస్తే మరో రాష్ట్రంలోని విద్యార్థులు వెయిటేజీ పరంగా ఇంజనీరింగ్ ప్రవేశాల్లో నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.5 లక్షల ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 1.5 లక్షలకు పైగా సీట్లు ఉన్నాయి. మొత్తం 716 కళాశాలలు ఉండగా.. తెలంగాణ ప్రాంతంలో 352 కళాశాలలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను నిర్వహణ ఎలా ఉంటుందనే అంశంపైనే వీటిల్లో భర్తీ ఆధారపడి ఉంటుంది. సమాన అవకాశాలు సాధ్యమేనా? పదేళ్లపాటు ప్రవేశాల్లో యథాతథ స్థితి, స్థానిక (లోకల్) కోటా వర్తిస్తాయని బిల్లులో పేర్కొన్నప్పటికీ ఆచరణలో సాధ్యమయ్యేందుకు చట్టపరమైన మార్పులు తేవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక కోటాలో 85 శాతం, ఓపెన్ కోటాలో 15 శాతం ప్రవేశాలు కల్పిస్తున్నారు. అంటే రాష్ట్రం మొత్తాన్ని ఓయూ, ఎస్వీయూ, ఏయూ ఏరియాలుగా పరిగణిస్తూ ఆయా ఏరియాల్లో ఉన్న విద్యార్థులు స్థానికులుగా, ఇతర ఏరియాల్లో పోటీపడితే నాన్‌లోకల్‌గా ఓపెన్ కోటాలో పోటీపడుతున్నారు. అయితే విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వేర్వేరుగా వర్తింపజేస్తే.. అడ్మిషన్లలో యథాతథ స్థితి కొనసాగేందుకు వీలుకాదు. అందువల్ల రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు రాష్ట్రాలకు ప్రవేశాల ప్రక్రియలో ఒకేలా, నియామకాల్లో వేర్వేరుగా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మరోవైపు 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో (మరో 9 ఏళ్లలోపు) ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్ర ప్రాయోజిత ట్రిపుల్ఐటీ వంటి సంస్థల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు తగిన గుర్తింపు తెచ్చిపెడతాయే తప్ప స్థానిక విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చవు. వీటిల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో పోటీపడాల్సిందే. అందువల్ల సీమాంధ్ర ప్రాంత సగటు విద్యార్థుల అవసరాలను అవి తీర్చలేవు. ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ విద్యాసంస్థలు నెలకొన్నాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న డిమాండ్ మేరకు ఆయా విద్యాసంస్థలు నాణ్యతను పెంచుకోకతప్పలేదు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర విద్యార్థుల తక్షణ అవసరాలు తీర్చగలిగేలా నాణ్యమైన వృత్తివిద్యను అందించేందుకు అటు ప్రభుత్వపరంగా, ఇటు ప్రయివేటు భాగస్వామ్యంతో వృత్తివిద్యాసంస్థలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.