ఉమ్మడి ప్రవేశ పరీక్షలెలా? | how to conduct common entrance exams for competitive exams ? | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ప్రవేశ పరీక్షలెలా?

Published Sat, Feb 22 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM

ఉమ్మడి ప్రవేశ పరీక్షలెలా?

ఉమ్మడి ప్రవేశ పరీక్షలెలా?

 ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలిసెట్ పరీక్షలు
     నిర్వహణపై గందరగోళం
     ఈ ఏడాదికి ఇబ్బంది లేకపోయినా తర్వాత సమస్యే
 
 సాక్షి, హైదరాబాద్: ఉన్నత కోర్సుల ప్రవేశానికి ఉద్దేశించిన ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల విషయంలోనూ రాష్ట్ర విభజనతో గందరగోళం నెలకొంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మొదటి ఏడాది ఇబ్బంది లేకపోయినా ఆ తరువాత ఎలా అని ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు పదేళ్లకు మించకుండా ఉన్నత విద్యలో ఉమ్మడి ప్రవేశాలు కల్పించాలని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు... ఉన్నత విద్యామండలి, ఇంటర్‌మీడియెట్ బోర్డు తదితర 42 రాష్ట్ర స్థాయి విద్యా, ఇతర సంస్థలు మాత్రం ఏడాది కాలమే ఉమ్మడి రాష్ట్రాలకు సేవలు అందిస్తాయని పేర్కొనడమే ఈ పరిస్థితికి కారణం. రాష్ట్రస్థాయి సంస్థల సేవల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏడాది కాలంలోనే ఒప్పందానికి రావాలని, లేదంటే కేంద్రమే జోక్యం చేసుకొని తగిన చర్యలు చేపడుతుందని స్పష్టం చేసింది. దీంతో ఎంసెట్ వంటి కీలకమైన ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణను ఎవరు చేపడతారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 వేర్వేరు పరీక్షలా? ఉమ్మడి యంత్రాంగమా?
 ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజన పూర్తయ్యాక  పదేళ్ల వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నత, సాంకేతిక, వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రిజర్వేషన్లు ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం కొనసాగుతాయని బిల్లులో ఉంది. మరోవైపు వాటిని నిర్వహించే సంస్థలు ఏడాదిలోగా ఓ నిర్ణయానికి రావాలని పేర్కొనడం గందరగోళానికి తావిస్తోంది. రెండు రాష్ట్రాలు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తాయా? ఒకవేళ అలా చేస్తే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉత్తీర్ణత శాతం, ర్యాంకుల విధానం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు చేపట్టడం అసాధ్యం. లేకపోతే రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తూ పదేళ్లపాటు ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుంది.
 
 వేర్వేరు ఇంటర్ బోర్డులు తప్పవా?
 ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి పోటీపరీక్ష జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించాలంటే ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డులో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలన్న నిబంధన ఉంది. రెండు బోర్డులు ఉండడం వల్ల టాప్-20 పర్సంటైల్‌తో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అవుతారు కనుక ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుంది. అందువల్ల పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల విధానం కొనసాగినప్పటికీ ఇరు రాష్ట్రాల్లో రెండు ఇంటర్మీడియెట్ బోర్డులు ఏర్పాటు చేయక తప్పదని వాదన నెలకొంది. మరోవైపు ఎంసెట్ రాయాలంటే కచ్చితంగా ఇంటర్మీడియెట్ ఆ రాష్ట్రంలోనే చదివి ఉండాలి.
 
 అప్పుడే ఆ అభ్యర్థి లోకల్ అవుతాడు. లేకపోతే నాన్‌లోకల్ కిందే లెక్క.  పరిస్థితుల్లో ఇంటర్మీడియెట్ బోర్డులను వేర్వేరు చేస్తే తమ రాష్ట్ర విద్యార్థులకు పేపరు వ్యాల్యుయేషన్‌లో ఎవరైనా ఎక్కువ మార్కులు వస్తే మరో రాష్ట్రంలోని విద్యార్థులు వెయిటేజీ పరంగా ఇంజనీరింగ్ ప్రవేశాల్లో నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3.5 లక్షల ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. తెలంగాణ ప్రాంతంలోనే దాదాపు 1.5 లక్షలకు పైగా సీట్లు ఉన్నాయి. మొత్తం 716 కళాశాలలు ఉండగా.. తెలంగాణ ప్రాంతంలో 352 కళాశాలలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ను నిర్వహణ ఎలా ఉంటుందనే అంశంపైనే వీటిల్లో భర్తీ ఆధారపడి ఉంటుంది.
 
 సమాన అవకాశాలు సాధ్యమేనా?
 పదేళ్లపాటు ప్రవేశాల్లో యథాతథ స్థితి, స్థానిక (లోకల్) కోటా వర్తిస్తాయని బిల్లులో పేర్కొన్నప్పటికీ ఆచరణలో సాధ్యమయ్యేందుకు చట్టపరమైన మార్పులు తేవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక కోటాలో 85 శాతం, ఓపెన్ కోటాలో 15 శాతం ప్రవేశాలు కల్పిస్తున్నారు. అంటే రాష్ట్రం మొత్తాన్ని ఓయూ, ఎస్వీయూ, ఏయూ ఏరియాలుగా పరిగణిస్తూ ఆయా ఏరియాల్లో ఉన్న విద్యార్థులు స్థానికులుగా, ఇతర ఏరియాల్లో పోటీపడితే నాన్‌లోకల్‌గా ఓపెన్ కోటాలో పోటీపడుతున్నారు. అయితే విభజన అనంతరం రెండు రాష్ట్రాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వేర్వేరుగా వర్తింపజేస్తే.. అడ్మిషన్లలో యథాతథ స్థితి కొనసాగేందుకు వీలుకాదు. అందువల్ల రాష్ట్రపతి ఉత్తర్వులు రెండు రాష్ట్రాలకు ప్రవేశాల ప్రక్రియలో ఒకేలా, నియామకాల్లో వేర్వేరుగా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
 
  మరోవైపు 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో (మరో 9 ఏళ్లలోపు) ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్ర ప్రాయోజిత ట్రిపుల్‌ఐటీ వంటి సంస్థల ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు తగిన గుర్తింపు తెచ్చిపెడతాయే తప్ప స్థానిక విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చవు. వీటిల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో పోటీపడాల్సిందే. అందువల్ల సీమాంధ్ర ప్రాంత సగటు విద్యార్థుల అవసరాలను అవి తీర్చలేవు. ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగా ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ విద్యాసంస్థలు నెలకొన్నాయి. రాజధాని ప్రాంతంలో ఉన్న డిమాండ్ మేరకు ఆయా విద్యాసంస్థలు నాణ్యతను పెంచుకోకతప్పలేదు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర విద్యార్థుల తక్షణ అవసరాలు తీర్చగలిగేలా నాణ్యమైన వృత్తివిద్యను అందించేందుకు అటు ప్రభుత్వపరంగా, ఇటు ప్రయివేటు భాగస్వామ్యంతో వృత్తివిద్యాసంస్థలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement