నిరుద్యోగ భారతం ఎదుర్కొనే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు. ఫీజుల రూపంలో బోలెడు చెల్లించి కష్టపడి చదివి పట్టా తెచ్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు అతి స్వల్పం. కన్నవాళ్లకు భారంగా మారా మని బాధపడి ఏదో ఒక ప్రైవేటు సంస్థలో కుదురుకున్నా అత్తెసరు జీవితం. దేశంలో రెండున్నర కోట్ల నుంచి 3 కోట్లమంది వరకూ ఉద్యోగార్థులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియామకాల కోసం ఏటా పరీక్షలు రాస్తారని అంచనా. వీరంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేర్వేరు ఉద్యోగాలకు విడిగా దరఖాస్తు చేసుకోవడం, శిక్షణ తీసుకోవడం, దూరప్రాంతాలకు పరీక్ష రాసేందుకు పోవడం తప్పడం లేదు. ప్రతి ఉద్యోగానికీ రుసుము చెల్లించడం మరో సమస్య. దరఖాస్తుకే ఇలా వందలాది రూపాయలు ఖర్చుపెట్టవలసిరావడం నిరుద్యోగులకు ఎంతో ఇబ్బందికరం. దశాబ్దాలుగా కోట్లాది మంది నిరుద్యోగులు నిరంతరం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఎన్‌డీఏ ప్రభుత్వం తొలిసారి పరిష్కారం చూపించింది. నాన్–గెజిటెడ్ పోస్టులు గ్రూప్–బీ, సీ(నాన్ టెక్నికల్) ఉద్యోగాలతోసహా అన్నిటికీ ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్ష నిర్వహణ కోసం జాతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఏ) సంస్థ ఏర్పాటవుతుంది.
కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) తదితరాల ప్రతినిధులు ఇందులో వుంటారు. తొలి దశలో ఈ ఏజెన్సీ పరిధిలోకి మూడు నియామక బోర్డులు వస్తాయి. మున్ముందు 20 నియామక సంస్థల వరకూ ఇందులో చేరతాయి. దేశంలో దాదాపు ప్రతి జిల్లాలోనూ ఎన్‌ఆర్‌ఏ పరీక్షా కేంద్రాలుంటాయి. అలాగే ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో వచ్చే స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటు కావడం కూడా నిరుద్యోగులపాలిట వరం. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి తమ తమ అవసరాలనుబట్టి కొన్ని సంస్థలు రెండో దఫా పరీక్ష నిర్వహిస్తాయంటున్నారు. సాధ్యమైనంత వరకూ ఈ అవసరం లేకుండా చేయడమే ఉత్తమం. ఎటూ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు వుంటాయి గనుక, ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు ఉద్దేశమే బహుళ పరీక్షల అవసరం లేకుండా చేయడం గనుక మళ్లీ రెండోసారి రాయాలనడం సరికాదు. జిల్లాకొక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం మంచి ఆలో చన. ఎక్కడో దూరంగా వుండే ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయడం ఆడపిల్లలకైతే మరింత సమస్య. వారితోపాటు కుటుంబసభ్యులెవరైనా వెళ్లకతప్పదు. అత్యధిక కుటుంబాలకు అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత వుండదు. ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాలుంటే ఆ కుటుంబాలకు కాస్త ఉపశమనం. అయితే అవసరాన్నిబట్టి విస్తృతినిబట్టి కొన్ని జిల్లాలకు కనీసం రెండు కేంద్రాలైనా ఉండేలాచూడటం అవసరం.
ఒకప్పుడు ఉపాధి కల్పనా కేంద్రాలకు ప్రాధాన్యం అధికం. పదో తరగతి అయ్యాక అక్కడ పేరు నమోదు చేసుకోవడం, విద్యార్హతలు పెరుగుతున్నకొద్దీ వాటిని అదనంగా చేరుస్తుండటం రివాజు. ఆ తర్వాత కాల్ లెటర్ కోసం ఎదురుచూడటం, తరచుగాపోయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం నిరుద్యోగులకు పెద్ద పని. ఆ ప్రక్రియలో చేతివాటం కూడా ఎక్కువే. డబ్బు ముట్టజెప్పిన వారికి కాల్ లెటర్‌లు రావడం, చేయనివారికి జీవితంలో ఒక్కసారి కూడా పిలుపు రాకపోవడం చాలామందికి అనుభవమే. అయితే ఉపాధి కల్పన శాఖ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చాకే ప్రభుత్వోద్యో గాలను భర్తీ చేయాలన్న నిబంధనను రెండు దశాబ్దాలక్రితం సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇదంతా మారింది. ఉపాధి కల్పనా కేంద్రాలతో నిరుద్యోగులకు పని లేకుండా పోయింది. చదువు పూర్తిచేసు కున్న వెంటనే అందులో తమ పేర్లు నమోదు చేసుకుంటున్న అమాయకులు ఇప్పటికీ లేకపోలేదు. కానీ అందులో నమోదయ్యేవారితో పోలిస్తే దాని జోలికిపోని నిరుద్యోగుల సంఖ్య వందలరెట్లు ఎక్కువ. చదువుకున్నవారిలో నిరుద్యోగిత 2011–12లో 6.1 శాతం వుంటే 2017–18నాటికి అది 17.8 శాతానికి చేరుకుందని నిరుడు నవంబర్‌లో చేసిన అధ్యయనంలో తేలింది. చదువు పెరిగేకొద్దీ నిరుద్యోగిత కూడా ఎక్కువవుతున్నదని ఆ అధ్యయనం తెలిపింది.
అయితే ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు నానాటికీ తగ్గిపోతున్నాయని మరిచిపోకూడదు. రిటైరవుతున్నవారు నిష్క్రమిస్తుండగా, ఆ స్థానాలను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. కాంట్రాక్టు నియామకాలు, ఔట్‌సోర్సింగ్ నియామకాలు పెరుగుతున్నాయి. చెప్పుకోవడానికి ఘనంగా ఒక ఉద్యోగం ఉంటుంది. కానీ ఇంట్లో ఈగల మోత అన్నట్టు పనిభారం అధికం. ఎప్పుడూ అరకొర జీతం. జీవితంలో స్థిరపడతామన్న ఆశకు తావే వుండదు. మన దేశంలో మరో చిత్రమైన పరిస్థితి. ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణలుంటాయి. నిర్దిష్ట కాలానికి పెరుగుతున్న ధరవరలకనుగుణంగా వేతనాల పెంపుదల వుంటుంది. జాప్యం జరిగితే ప్రశ్నించ డానికి ఉద్యోగ సంఘాలుంటాయి. రిటైరయ్యాక పెన్షన్ సదుపాయం వుంటుంది. ప్రైవేటు ఉద్యో గాల్లో ఇవన్నీ కనబడవు. చట్టాలున్నా ఆచరణలో అమలు కావు. సమాజంలో వేర్వేరు రంగాల్లో పనిచేసేవారి వేతనాల మధ్య ఇలా తీవ్ర వ్యత్యాసం వుండటంతో వారి జీవన స్థితిగతుల్లో కూడా అంతరాలు అధికంగా వుంటున్నాయి. ప్రైవేటు రంగంలో కొనసాగేవారిపై ఆధారపడే కుటుంబాలు అధ్వాన్నస్థితిలో బతుకీడ్చవలసి వస్తోంది. కనుకనే ప్రభుత్వోద్యోగాలవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. అక్కడేమో నియామకాలు నానాటికీ కొడిగడుతున్నాయి. ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటు చేయ డంతో సరిపెట్టక ప్రభుత్వ విభాగాల్లో నియామకాలను కూడా బాగా పెంచితేనే ప్రస్తుతం చేసిన మార్పులకు సార్థకత వుంటుంది. దేశ జనాభాలో యువతరం దాదాపు 35 శాతం అని ఒక అంచనా. ఈ యువతరాన్ని ఆకట్టుకోవాలంటే వారు మెరుగైన జీవనం సాగించడానికి అనువైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్‌ఆర్‌ఏ ఆ దిశగా వేసిన తొలి అడుగు కావాలి.
Comments
Please login to add a commentAdd a comment