‘ప్రొఫెషనల్‌’గా బోధన! | AICTE special focus is on conducting computer courses | Sakshi
Sakshi News home page

‘ప్రొఫెషనల్‌’గా బోధన!

Published Mon, Oct 9 2023 4:13 AM | Last Updated on Mon, Oct 9 2023 9:15 AM

AICTE special focus is on conducting computer courses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా చాలా కాలేజీల్లో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల బోధన పక్కాగా సాగేలా చూడటంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి పెట్టింది. కొత్త కోర్సులకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న, సమర్థవంతంగా బోధించగల ఫ్యాకల్టీని కాలేజీలు నియమించుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. నాణ్యత ప్రమాణాల్లేని ఫ్యాకల్టీ ఉన్నట్టు గుర్తిస్తే.. సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని భావిస్తోంది.

ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన నిబంధనలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించింది. కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు దాన్ని పరిశీలించి, సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపారు. ఆ నివేదిక ప్రకారం.. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కీలక కంప్యూటర్‌ కోర్సులను బోధిస్తున్న వారి అర్హతలను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలే కాకుండా ఏఐసీటీఈ కూడా ప్రత్యేకంగా పరిశీలించనుంది.

ఇందుకోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సంస్కరణలను ఈ ఏడాది నుంచే అమల్లోకి తేవాలని భావించినా.. కొన్ని అనుమతుల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి.

కీలక కోర్సుల బోధనలో..
దేశవ్యాప్తంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ వంటి సంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. తెలంగాణలో 1.05 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉంటే.. ఇందులో 58శాతం కంప్యూటర్‌ కోర్సులవే. సంప్రదాయ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు 50 శాతం దాటడం లేదు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వంటి సరికొత్త కోర్సులకు విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ కొత్త కోర్సులు మొదలై రెండేళ్లు గడుస్తున్నా చాలా కాలేజీల్లో బోధన సాధారణ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల మాదిరిగానే ఉంటోందని ఏఐసీటీఈ గుర్తించింది. ఇప్పటికే కంప్యూటర్‌ కోర్సులు చేసిన విద్యార్థుల్లో కేవలం 8 శాతం మందిలో మాత్రమే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి అర్హత గల నైపుణ్యం ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో బోధన విధానంలో గణనీయమైన మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.

ప్రొఫెషనల్స్‌తోనే పాఠాలు
ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రత్యేక నైపుణ్యంతో బోధించాల్సి ఉంటుందని ఏఐసీటీఈ స్పష్టం చేస్తోంది. చాలా కాలేజీల్లో గత రెండేళ్లు జరిపిన అధ్యయనంలో ఆ తరహా బోధన కనిపించలేదని పేర్కొంటోంది. కాలేజీలు ఎంటెక్‌ పూర్తి చేసిన సాధారణ ఫ్యాకల్టీతో కోర్సుల బోధన కొనసాగిస్తున్నాయి. వారు కృత్రిమ మేధ (ఏఐ), ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి కోర్సులను ఆన్‌లైన్‌లో సెర్చ్‌చేసో, అప్పటికప్పుడు నేర్చుకునో బోధిస్తున్నారు. వారికి ప్రాక్టికల్‌ అనుభవం ఉండటం లేదు.

అలాంటి వారు సమర్థవంతంగా బోధించలేరని ఏఐసీటీఈ అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులంతా వృత్తిలో ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ ద్వారా నైపుణ్యం సంపాదించిన వాళ్లే. ఈ క్రమంలోనే వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులను బోధనకు అనుమతిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రతీ కాలేజీలోనూ అలాంటి వారు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన తెచ్చే ఆలోచన చేస్తోంది.

ముఖ్యంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల చేత పాఠాలు చెప్పించాలని భావిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందే కృత్రిమ మేధ, సైబర్‌ సెక్యూరిటీ, డేటాసైన్స్‌ కోర్సులు బోధించే అధ్యాపకుల వివరాలు తెప్పించుకుని.. వారికి అర్హత ఉంటేనే గుర్తింపు ఇవ్వాలనే నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

ప్రొఫెషనల్స్‌ సేవలు ఎంతో అవసరం
వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణులు సంబంధిత కోర్సు చేయకున్నా.. కావాల్సిన అనుభవం ఉంది. కాలేజీల్లో పనిచేసే కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ అధ్యాపకులకు ఎంటెక్‌ సర్టిఫికెట్లు ఉన్నా ఈ కోర్సులను బోధించే అనుభవం తక్కువ. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొత్త కంప్యూటర్‌ కోర్సులను బోధించేందుకు పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నాం.

అమెరికాలో ఓ ఏఐ ప్రొఫెషనల్‌ వారానికి కొన్ని గంటలు ఆన్‌లైన్‌ ద్వారా బోధిస్తున్నారు. స్థానికంగా ఉద్యోగాలు చేసేవారు నేరుగా క్లాసులు చెబుతారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుంది. ఎంటెక్‌ చేసిన ఫ్యాకల్టీకి కూడా ప్రొఫెషనల్స్‌ ద్వారా క్లాసులు చెప్పించాలి. అప్పుడే భవిష్యత్‌లో కొత్త కోర్సులకు అధ్యాపకులు అందుబాటులో ఉంటారు.– ప్రొఫెసర్‌ పి.లక్ష్మీనారాయణ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌

సరైన ఫ్యాకల్టీ లేకుండా అనుమతులు వద్దు
కొన్నేళ్లుగా ఇష్టానుసారం కంప్యూటర్‌ కోర్సులకు అనుమతి ఇస్తు న్నారు. మరి ఆ కోర్సులను బోధించే వా రు ఉన్నారా? లేదా? అనేది యూనివర్సి టీలు పరిశీలించాలి. లేకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. నైపుణ్యం లేకుండా విద్యార్థులకు డిగ్రీలిస్తే, మార్కెట్లో వారు నిలబడటం కష్టం. ఈ విషయాన్ని అనేక సర్వేలు రుజువు చేస్తున్నాయి.– అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement