
పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఏఐసీటీఈ ప్రణాళిక
పరిశ్రమ అనుభవాల కోసం సాంకేతిక విద్య ప్రొఫెసర్లకు ఇండస్ట్రీ ఫెలోషిప్
ఎంపిక చేసిన ప్రొఫెసర్లు పరిశ్రమల్లో ఏడాది పని చేసేలా ఏర్పాట్లు
ప్రొఫెసర్లు తమ పరిశ్రమ అనుభవాన్ని బోధనలో చేర్చడం ద్వారా విద్యార్థులకు మేలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు
త్వరలో అధ్యాపకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి... పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి... సాంకేతిక విద్య అధ్యాపకుల్లో బోధన సామర్థ్యాలను మరింత పెంచడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్య ప్రొఫెసర్లను ఫెలోషిప్ పేరుతో ఏడాదిపాటు పరిశ్రమల్లో పని చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది.
తద్వారా ప్రొఫెసర్లు తమ పరిశ్రమ అనుభవాన్ని బోధనలో వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సిద్ధం చేసింది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన ప్రొఫెసర్లకు యథావిధిగా జీతంతోపాటు రూ.లక్ష వరకు స్టైఫండ్ అందించనుంది. ఈ ఫెలోషిప్ ద్వారా విద్యార్థులను పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా ప్రొఫెసర్లు సిద్ధం చేయగలరని ఏఐసీటీఈ భావిస్తోంది.
పైలట్ ప్రాజెక్టుగా 300 ఫెలోషిప్‌లు..
» ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏఐసీటీఈ గుర్తించిన లిస్టెడ్ కంపెనీల్లో సాంకేతిక విద్య ప్రొఫెసర్లు పని చేయాలి.
» తొలుత పైలట్ ప్రాజెక్టుగా 2025–26 విద్యా సంవత్సరానికి 300 ఫెలోషిప్‌లు ఇచ్చేలా త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఇందులో 200 మంది ప్రొఫెసర్లు సంవత్సరంపాటు పరిశ్రమల్లో పని చేసేందుకు అనుమతిస్తుంది. మరో 100 మంది ఆరు నెలలు చొప్పున నియామకాలను ఎంపిక చేసుకోవచ్చు.
» 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఈ ఫెలోషిప్‌నకు అర్హులు. వారు వృత్తి జీవితంలో గరిష్టంగా రెండుసార్లు ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు.
» కంపెనీల విశ్వసనీయతను నిర్ధారించడానికి స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్(జాబితా చేసిన)వాటిలో మాత్రమే ఫెలోషిప్‌లకు ఏఐసీఈటీ అవకాశం కల్పిస్తుంది. కంపెనీ బహుళజాతి సంస్థ అయినప్పటికీ భారతదేశంలోని పోస్టింగ్‌లకు మాత్రమే ఫెలోషిప్ వర్తిస్తుంది.
» అదేవిధంగా ప్రొఫెసర్లను ఇండస్ట్రీ ఫెలోషిప్‌నకు పంపడంపై నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫెలోషిప్ తర్వాత అధ్యాపకులను నిలుపుకోవడం వంటి సవాళ్లు విద్యాసంస్థలకు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ప్రొఫెసర్లు ఏడాదిపాటు కళాశాలలకు దూరంగా ఉండటం వల్ల వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment