Fellowship Workshop
-
ప్రొఫెసర్లకు ఇండస్ట్రీ ఫెలోషిప్
సాక్షి, అమరావతి: పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి... పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి... సాంకేతిక విద్య అధ్యాపకుల్లో బోధన సామర్థ్యాలను మరింత పెంచడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సాంకేతిక విద్య ప్రొఫెసర్లను ఫెలోషిప్ పేరుతో ఏడాదిపాటు పరిశ్రమల్లో పని చేసేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. తద్వారా ప్రొఫెసర్లు తమ పరిశ్రమ అనుభవాన్ని బోధనలో వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను సిద్ధం చేసింది. ఈ ఫెలోషిప్‌నకు ఎంపికైన ప్రొఫెసర్లకు యథావిధిగా జీతంతోపాటు రూ.లక్ష వరకు స్టైఫండ్ అందించనుంది. ఈ ఫెలోషిప్ ద్వారా విద్యార్థులను పరిశ్రమలకు సిద్ధంగా ఉండేలా ప్రొఫెసర్లు సిద్ధం చేయగలరని ఏఐసీటీఈ భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 300 ఫెలోషిప్‌లు.. » ఇండస్ట్రీ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏఐసీటీఈ గుర్తించిన లిస్టెడ్ కంపెనీల్లో సాంకేతిక విద్య ప్రొఫెసర్లు పని చేయాలి. » తొలుత పైలట్ ప్రాజెక్టుగా 2025–26 విద్యా సంవత్సరానికి 300 ఫెలోషిప్‌లు ఇచ్చేలా త్వరలోనే దరఖాస్తులను ఆహ్వానించనుంది. ఇందులో 200 మంది ప్రొఫెసర్లు సంవత్సరంపాటు పరిశ్రమల్లో పని చేసేందుకు అనుమతిస్తుంది. మరో 100 మంది ఆరు నెలలు చొప్పున నియామకాలను ఎంపిక చేసుకోవచ్చు. » 45 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగినవారు ఈ ఫెలోషిప్‌నకు అర్హులు. వారు వృత్తి జీవితంలో గరిష్టంగా రెండుసార్లు ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకోవచ్చు. » కంపెనీల విశ్వసనీయతను నిర్ధారించడానికి స్టాక్ మార్కెట్లో లిస్టెడ్(జాబితా చేసిన)వాటిలో మాత్రమే ఫెలోషిప్‌లకు ఏఐసీఈటీ అవకాశం కల్పిస్తుంది. కంపెనీ బహుళజాతి సంస్థ అయినప్పటికీ భారతదేశంలోని పోస్టింగ్‌లకు మాత్రమే ఫెలోషిప్ వర్తిస్తుంది. » అదేవిధంగా ప్రొఫెసర్లను ఇండస్ట్రీ ఫెలోషిప్‌నకు పంపడంపై నిపుణులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫెలోషిప్ తర్వాత అధ్యాపకులను నిలుపుకోవడం వంటి సవాళ్లు విద్యాసంస్థలకు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. ప్రొఫెసర్లు ఏడాదిపాటు కళాశాలలకు దూరంగా ఉండటం వల్ల వారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. -
జీఎస్‌ఎల్‌లో ప్రారంభమైన ఫెలోషిప్ వర్క్‌షాప్
రాజానగరం : ఉదరకోశ, జీర్ణాశయ, పేగులకు సంబంధించిన వ్యాధులకు సర్జరీలు చేసే వైద్యులకు అందజేసే ఫెలోషిప్ వర్క్‌షాప్ స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాలలో శుక్రవారం ప్రారంభమైంది. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎదురయ్యే సంక్లిష్టతలు, నివారణలు, సులువులు, రిస్కులు, సవాళ్లు తదితర 15 అంశాలపై అనుభవజ్ఞులైన వైద్యులు సోదాహరణంగా వివరించారు. ఫెలోషిప్ ఇన్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గాస్ట్రో, ఎండో సర్జన్స్ ఇచ్చే ఈ ఫెలోషిప్ నిర్వహణకు ఏపీలో మొదటిసారిగా జీఎస్ఎల్ వైద్య కళాశాల, జనరల్ ఆస్పత్రులను అసోసియేషన్ ఎంపిక చేసిందని ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ సమీర్ రంజన్ తెలిపారు. సర్జన్ల వృత్తి నైపుణ్యాలను మదింపు చేయడానికి పరిపూర్ణమైన వైద్యవిజ్ఞాన సదుపాయాలు, వసతులు ఉండాలి. అటువంటి సౌకర్యాలు ఉన్నందునే జీఎస్ఎల్ని ఎంపికచేశారన్నారు. అసోసియేషన్, జీఎస్ఎల్ వైద్య కళాశాల సర్జరీ విభాగం, సిములేటర్ లేబొరేటరీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వర్క్‌షాపు మొదటి రోజు నిరంతర వైద్య విద్య(సీఎంఈ) కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ లకు చెందిన సుమారు 90 మంది సర్జన్లు పాల్గొన్నారు. రెండో రోజు ఫెలోషిప్ టెస్ట్ జరగనుందని, అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎగ్జామినర్లుగా వ్యవహరిస్తారన్నారు. మూడో రోజు సీనియర్ వైద్యులు చేసే శస్త్ర చికిత్సలను మిగిలిన సర్జన్లు లైవ్‌లో చూస్తూ అనుమానాలను నివృత్తి చేసుకుంటా వారితో చర్చిస్తారని లేబొరేటరీ ఇన్చార్జ్ డాక్టర్ ఆకృతి తెలిపారు. జిల్లాకు చెందిన వైద ్య విద్య అధ్యాపకులు డాక్టర్ రాఘవేంద్రరావు, డాక్టర్ దిలీప్సోరెన్, డాక్టర్ సుష్మ, డాక్టర్ భాస్కరచౌదరి, హైదరాబాద్‌కి చెందిన డాక్టర్ కోన లక్ష్మి, న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ మీనాక్షిశ ర్మ, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక ్టర్ వైవి శర్మ, సూపరింటెండెంట్ డాక్టర్ టి. సత్యనారాయణ పాల్గొన్నారు.