AICTE
-
కావాల్సినన్ని ‘సీట్లు’!
దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లు భారీగా పెరిగాయి. 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్ సీట్ల సంఖ్య 14.90 లక్షలకు చేరింది. 2021–22లో దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి(12.54 లక్షలకు) పడిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు 18.84 శాతం మేర సీట్లు పెరగడం విశేషం. వాస్తవానికి 2014–15లో దాదాపు 17.05 లక్షల సీట్లు ఉండగా.. ఆ తర్వాత ఏటా తగ్గుదల నమోదయ్యింది. మళ్లీ తిరిగి 2022–23లో 2 శాతం, 2023–24లో 5 శాతం, ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 10 శాతం(1.40 లక్షలు) మేర సీట్ల సంఖ్య పెరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం దేశంలో 2,906 అనుమతి పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో 14.90 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. కొత్తగా 1,256 కాలేజీల్లో ఇన్‌టేక్ పెంపునకు ఆమోదం పొందాయి. ఇంజనీరింగ్ సీట్లలో అత్యధికంగా 40 శాతం దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 3,08,686, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532, తెలంగాణలో 1,45,557 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే తమిళనాడులో 32,856, ఏపీలో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి. ఈ గణాంకాలు ఇంజనీరింగ్ విద్యలో దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతిపరిమితి ఎత్తివేతతో పెరిగిన సీట్లు..వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఇంజనీరింగ్–టెక్నాలజీ కోర్సులకు ఆమోదంతో పాటు 2023–24లో బీటెక్‌లో కొత్త సీట్లు ప్రవేశపెట్టడంపై పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేసింది. దీంతో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో సూపర్ న్యూమరీ కోటాలో సుమారు 50 వేల సీట్లు కొత్తగా చేరాయి. 400 నుంచి 500 విద్యా సంస్థలు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులను ప్రారంభించాయి.2014–15 నుంచి 2021–22 వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరికలు చాలా వరకు తగ్గాయి. ఫలితంగా అనేక కాలేజీలు మూతపడ్డాయి. 2016–17 విద్యా సంవత్సరంలో 15.56 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. 51 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అనంతరం మళ్లీ 2021–22లో 71 శాతానికి, 2022–23లో 81 శాతానికి సీట్ల భర్తీ పెరిగింది. దీంతో అడ్మిషన్లు ప్రోత్సాహకరంగా ఉండటంతో సీట్ల గరిష్ట పరిమితిని ఏఐసీటీఈ తొలగించింది.అవసరమైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన అధ్యాపకులు ఉంటే.. వాటిని పరిశీలించి కావాల్సినన్ని సీట్లకు ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ఒక విద్యా సంస్థ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా 420 సీట్ల వరకు పెంచుకునే వెసులుబాటు తీసుకువచి్చంది. -
సత్తా చాటేలా సిలబస్!
ఇంజనీరింగ్ కోర్సుల్లో పాఠ్యాంశాలు వచ్చే 20 ఏళ్ల సాంకేతికతను అందిపుచ్చుకొనేలా ఉండాలని ఏఐసీటీఈ సూచిస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్‌లో ఈ మార్పు అనివార్యమని అంటోంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఏఐసీటీఈ నిపుణుల కమిటీ గతేడాది సరికొత్త సీఎస్సీ బోధనాంశాలను ప్రతిపాదించింది. దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులతో చర్చించిన ఈ కమిటీ... సైబర్ సెక్యూరిటీ, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి బోధనాంశాలను కోర్సుల్లో చేర్చాలని సూచించింది. ప్రస్తుతం మూడేళ్లకోసారి యూనివర్సిటీలు ఇంజనీరింగ్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నప్పటికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత పాఠ్యాంశాలు లేవని ఏఐసీటీఈ అభిప్రాయపడుతోంది. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్విద్యార్థికి గణిత శాస్త్రంపై పట్టు ఉండాలి. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక దీన్ని నాలుగు రెట్లు పెంచేలా బోధనాంశాలుండాలి. కానీ ఇప్పుడున్నసిలబస్లో ఈ నాణ్యతకనిపించట్లేదు. ఇంటర్‌లోని సాధారణ గణితశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలే కోర్సులో ఉంటున్నాయి. » రాష్ట్రవ్యాప్తంగా ఏటా 75 వేల మంది కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సుల్లో చేరుతున్నారు. క్లిష్టమైన గణిత సంబంధ కోడింగ్‌లో 20 వేల మందే ప్రతిభ చూపుతున్నారు. సీఎస్ఈ పూర్తి చేసినా కంపెనీల్లో ఉపయోగించే కోడింగ్‌ను అందుకోవడం వారికి కష్టంగా ఉంటోంది.» మెషీన్ లెరి్నంగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజైన్ థింకింగ్ వంటి సరికొత్త ప్రోగ్రామింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆల్జీబ్రా, అల్గోరిథమ్స్‌పై పట్టు ఉంటే తప్ప ఈ కోర్సుల్లో రాణించడం కష్టం. ఈ తరహా ప్రయత్నాలు ఇంజనీరింగ్ కాలేజీల్లో జరగట్లేదనేది ఏఐసీటీఈ పరిశీలన.» ఇంజనీరింగ్‌లో కనీసం వివిధ రకాల మైక్రో స్పెషలైజేషన్ కోర్సులు అందిస్తే తప్ప కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు పరిణతి చెందరు. ఈ మార్పును ఇంజనీరింగ్ కాలేజీలు అర్థం చేసుకోవట్లేదు. దీంతో డీప్ లెరి్నంగ్, అడ్వాన్స్డ్ లెరి్నంగ్ వంటి వాటిలో వెనకబడుతున్నారు. ఏఐసీటీఈ సూచించిన మార్పులేంటి? » ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో గణిత విభాగాన్నివిస్తృతం చేయాలి. పలు రకాల కంప్యూటర్ కోడింగ్‌కు సంబంధించిన అల్గోరిథమ్స్, ఆల్జీబ్రాతో కూడిన పాఠ్యాంశాలను కొత్తగా జోడించాలి. » కంప్యూటర్స్ రంగంలో వస్తున్న నూతన అంశాలగురించి విద్యార్థులు తెలుసుకొనేలా ప్రాక్టికల్ బోధనాంశాలను తీసుకురావాలి. వాటిపై కాలేజీల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్ నిర్వహించాలి. » ఎథికల్ ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీ, రీసెర్చ్ అండ్‌అండర్‌స్టాండింగ్, హ్యూమన్ వాల్యూస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సబ్జెక్టులను కోర్సుల్లో చేర్చాలి.దీనివల్ల విద్యార్థులకు సామాజిక అవగాహన కూడా అలవడుతుంది. నాణ్యత పెంచాల్సిందే ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత వేగంగా మారుతోంది. ఇంజనీరింగ్ విద్యలో మార్పులు అనివార్యం. భవిష్యత్ తరాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతికతతో బోధన ప్రణాళిక అవసరం. కొన్ని కాలేజీల కోసం ఈ మార్పును ఆపడం ఎలా సాధ్యం? ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఉన్నత విద్యామండలి కార్యదర్శిప్రత్యేక క్లాసులు తీసుకోవాలి కొత్త సిలబస్‌ను స్వాగతించాలి. స్థాయిని అందుకోలేని విద్యార్థులకు అదనపు అవగాహనకు తరగతులు నిర్వహించాలి. కాలేజీలే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన బోధనాంశాలు ఉండాలని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ప్రొఫెసర్ డి.రవీందర్ ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీసమస్యేంటి?రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 78 కాలేజీలు అటానమస్ హోదా పొందాయి. గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీ అందించే సిలబస్‌లో 80 శాతాన్ని ఈ కాలేజీల్లో అమలు చేయాలి. మిగతా 20 శాతం సిలబస్‌ను సొంతంగా తయారు చేసుకోవచ్చు. మారుతున్న సిలబస్‌ను ఈ కాలేజీలు స్వాగతిస్తున్నాయి. కానీ మిగతా కాలేజీలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. తమ కాలేజీల్లో లక్షపైన ర్యాంకు పొందిన విద్యార్థులు చేరుతున్నారని.. వాళ్లు అత్యున్నత బోధనా ప్రణాళిక స్థాయిని ఎలా అందుకుంటారని ప్రశి్నస్తున్నాయి. అయితే నాణ్యతలేని ఇంజనీరింగ్ విద్యను చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితి ఏర్పడుతుందని యూనివర్సిటీలు అంటున్నాయి. -
సీఎస్ఈ సీట్లు పెంచాల్సిందే
సాక్షి, హైదరాబాద్ : కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించిందని, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ (కోర్) బ్రాంచీల్లో సీట్లు తగ్గించైనా, సీఎస్ఈ సహా అనుబంధ కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు ఉన్నా ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలను కలిసిన కొన్ని యాజమాన్యాలు.. అధికారులు ఉద్దేశపూర్వకంగా సీట్లు పెంచేందుకు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ వంటి కోర్సులకు ఏటా డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినట్టు సమాచారం. రాష్ట్రంలోని దాదాపు 125 కాలేజీలు సీట్ల పెంపు ప్రతిపాదన తెచ్చాయి. సీట్లు తగ్గిస్తే అవి కనుమరుగే..కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో సీట్ల పెంపుపై అధికారులు అభ్యంతరం చెప్పకపోయినా.. కోర్ గ్రూప్ కోర్సులకు కోత పెట్టడాన్ని అంగీకరించడం లేదు. దీనివల్ల ఈ కోర్సులు అసలుకే తెరమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఈ కోర్సులకు మళ్లీ డిమాండ్ ఉంటుందని అంటున్నారు. మరోవైపు బోధన ప్రణాళికను మారుస్తున్నారని, కోర్ గ్రూపులో జాయిన్ అయినా, సాఫ్ట్వేర్ వైపు వెళ్ళే వీలుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయని పేర్కొంటున్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. గత ఏడాది తగ్గిన చేరికలుగత ఏడాది 58 శాతం విద్యార్థులు సీఎస్సీ, అనుబంధ కోర్సుల్లోనే చేరారు. సివిల్, మెకానికల్ ఈఈఈ కోర్సుల్లో 12,751 సీట్లు ఉంటే, కేవలం 5,838 మంది మాత్రమే (45.78 శాతం) చేరారు. ఈఈఈలో 5,051 సీట్లు ఉంటే 2,777 సీట్లు, సివిల్‌లో 4,043 సీట్లు ఉంటే 1,761 సీట్లు, మెకానికల్‌లో 3,657 సీట్లు ఉంటే, 1,300 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయని అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. ఆయా కోర్సులను మరింత బలహీనపరిచే ప్రైవేటు కాలేజీల ఆలోచన సరికాదని స్పష్టం చేస్తున్నారు. కాగా ప్రైవేటు కాలేజీల విజ్ఞప్తిని అంగీకరిస్తే ఈ ఏడాది కంప్యూటర్ కోర్సుల్లో దాదాపు 21 వేల సీట్లు పెరిగే వీలుంది. అదే సమయంలో కోర్ గ్రూపుల్లో దాదాపు 5 వేల సీట్లు తగ్గే అవకాశం కన్పిస్తోందని అంటున్నారు.రీయింబర్స్మెంట్ వద్దు..రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో అన్ని బ్రాంచీలకు కలిపి గత ఏడాది లెక్కల ప్రకారం 1.22 లక్షల సీట్లున్నాయి. ఇందులో 82 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. మిగతావి మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తారు. కన్వీనర్ కోటా కింద భర్తీ చేసే సీట్లలో చాలావరకూ ఫీజును ప్రభుత్వం రీయింబర్స్మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సీట్లు పెంచితే ఎక్కువ నిధులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపునకు కొన్నేళ్ళుగా ప్రభుత్వం పెద్దగా అనుమతించడం లేదు. అయితే డిమాండ్ లేని కోర్సుల్లో తగ్గించుకుని, డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ రెండేళ్ల క్రితం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే సంబంధిత యూనివర్సిటీలు కూడా ఇందుకు అనుమతించాల్సి ఉంటుంది. కానీ సీట్లు పెంచడం వల్ల ఫీజు రీయింబర్స్మెంట్ బడ్జెట్ పెరగడంతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చే కోర్సులకు ఫ్యాకల్టీ కొరత ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌కు మరో నాలుగేళ్ళ పాటు సరైన బోధనా సిబ్బంది దొరకడం కష్టమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నాన్ రీయింబర్స్మెంట్ సీట్ల పెంపు చేపట్టాలంటూ కాలేజీల యాజమాన్యాలు కొత్త ప్రతిపాదన తెరపైకి తెస్తున్నాయి. అంటే పెరిగిన సీట్లకు ఫీజుల నియంత్రణ కమిటీ నిర్ణయించిన మేరకు విద్యార్థే ఫీజు చెల్లించాలన్న మాట. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయదు. ప్రస్తుతం కొన్ని కాలేజీల్లో ఈ తరహాలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు నడుస్తున్నాయి. ఈ విధానాన్ని అనుసరిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. -
‘గుర్తింపు’నకు గ్రహణం!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్‌ను సాంకేతిక విద్య విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ మార్పునకు కారణాలేంటనేది అధికారులు వెల్లడించలేదు. కొన్ని కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అను మతి పొందాల్సి ఉందని మాత్రమే చెబుతున్నారు. కానీ వాస్తవానికి రాష్ట్ర యూనివర్సిటీల నుంచి ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాలేదు. ఇది వస్తేనే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుస్తుంది. కౌన్సెలింగ్ వెబ్సైట్లో కాలేజీలు, కోర్సుల వివరాలు ఉంటేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వగలుగుతారు. ఏటా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కానీ ఈ ఏడాది ముందే పూర్తయింది. మే 21తో 10 విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల పదవీకాలం ముగిసింది. అయితే వారు ఆలోగానే కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే సమయంలో తనిఖీలపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో కాలేజీలకు ఇప్పుడే గుర్తింపు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మే 21 తర్వాత వీసీల పదవీకాలం ముగియడంతో ప్రతి వర్సిటీకి ఐఏఎస్ అధికారులను ఇన్చార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించింది. పాత వీసీలు చేపట్టిన తనిఖీలపై వారికి అనుమానాలు రావడంతో ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తోంది. గోల్మాల్ జరిగిందా? రాష్ట్రంలో 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 17 కాలేజీలు ప్రభుత్వ అ«దీనంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నాయి. మిగిలిన 161 కాలేజీలు ప్రైవేటువి. ఇంజనీరింగ్ కాలేజీల్లో బ్రాంచీలు, సెక్షన్లు, సీట్లకు సంబంధించి యాజమాన్యాలు ముందుగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాలి. 33 కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ ఏఐసీటీఈ అనుమతి తీసుకున్నాయి. అంటే 128 కాలేజీలు తమ పరిధిలోని విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అయితే వర్సిటీల అధికారులు తనిఖీల సందర్భంగా ఇష్టానుసారం వ్యవహరించారని, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఫ్యాకల్టి, మౌలికవసతులు లేకున్నా సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వీసీలుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు తనిఖీల్లో అవకతవకలపై విచారణ మొదలుపెట్టారు. దీంతో అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న కాలేజీ యాజమాన్యాలు ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్ల లెక్క ఇలా.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.22 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా వాటిలో 83 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద ఉన్నాయి. అందులోనూ 58 శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా డిమాండ్ లేని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లను, సెక్షన్లను ప్రైవేటు కాలేజీలు తగ్గించుకుంటున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెంచాలని కోరుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో 80 కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. గతేడాది బ్రాంచీ మార్చుకున్నవి, కొత్తగా మంజూరైన కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు ఉన్నాయి. పెరిగిన సీట్లను ఆఖరి కౌన్సెలింగ్‌లోకి తెచ్చారు. ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీల్లో సీట్లు పెరుగుతాయి? ఎందులో తగ్గుతాయి? అనే వివరాలతో ముందే కౌన్సెలింగ్ కేంద్రంలో సాఫ్ట్వేర్ రూపొందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అనుబంధ గుర్తింపే కాలేజీలకు రాకపోవడంతో సీట్లపైనా అధికారులకు స్పష్టత రావడం లేదు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ ఏడాది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కని్పస్తోంది. వచ్చే నెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి గుర్తింపు రాలేదు. అసలు ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సంబంధిత యూనివర్సిటీలు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తాయి. అయితే దీనికన్నా ముందు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ 2024–25 విద్యా సంవత్సరానికి క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 10వ తేదీకల్లా అన్ని కాలేజీలకు అనుమతినివ్వాలి. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకునే కాలేజీలకే అనుమతి లభిస్తుంది. జూన్ 10కల్లా అనుమతి రాని కాలేజీలు.. సౌకర్యాలు కల్పించుకుని మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పింస్తారు. ఈ ప్రక్రియను జూన్ 30 నాటికి ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాలేజీలు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జూన్ 10 నాటికి అనుమతి లభించడం కష్టమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కోర్సుల చేరిక వల్లే ఆలస్యం జాతీయ స్థాయిలో విద్యా విధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు భారత్‌లోనూ క్రెడిట్ విధానం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. టెన్త్ వరకూ కొన్ని క్రెడిట్స్, ఇంటర్ తర్వాత కొన్ని, డిప్లొమా కోర్సులకు, ఇంజనీరింగ్ కోర్సులకు ఇలా.. క్రెడిట్స్ విధానం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రొఫెషనల్ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలో చేరుస్తున్నారు. ఇప్పటివరకూ బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ వంటి కోర్సులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉండేవి. తాజాగా ఏఐసీటీఈ పరిధిలోకి తెస్తూ అన్ని కోర్సులకు కలిపి ఒకే దరఖాస్తు విధానం తీసుకొచ్చారు. అంటే బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఇదే దరఖాస్తు విధానంలోకి వచ్చాయన్న మాట. ఈ మేరకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడానికి కాస్త సమయం పట్టే అవకాశం కని్పస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలేజీలకు గుర్తింపు ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నాయి. జోసా కౌన్సెలింగ్ నాటికి జరిగేనా? ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెలలో కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయింది. త్వరలో జోసా (జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ తేదీలనూ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఆరు దశలుగా ఉంటుంది. జోసా కౌన్సెలింగ్ చివరి తేదీని బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చివరి దశ చేపడతారు. విద్యార్థులు తొలి దశలో రాష్ట్ర కాలేజీల్లో చేరి, చివరి దశలో జాతీయ కాలేజీల్లోకి వెళ్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను చివరి దశలో భర్తీ చేస్తారు. కానీ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇప్పటికీ రాకపోవడంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఈలోగానే అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్ణయించిన తేదీల్లోనే కొనసాగుతుంది. ఈలోగా ఏఐసీటీఈ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించింది. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కాలేజీలను ఏఐసీటీఈ పరిధిలోకి కొత్తగా తేవడం వల్ల కొంత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) -
ఒత్తిడి తగ్గాలి..నైపుణ్యం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ క్లాసులు మొదలయ్యే ముందే విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలు దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విశ్వవిద్యాలయాలకు విడుదల చేసింది. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీలు దీన్ని పాటించాలంది. మారిన బోధనా ప్రణాళికను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఏఐసీటీఈ రెండేళ్లుగా జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలను కూడా కౌన్సిల్ పరిగణనలోనికి తీసుకుంది. జాతీయ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై విద్యార్థులకు తొలి దశలోనే అవగాహన కల్పించకపోవడమే మానసిక ఒత్తిడికి కారణమని భావిస్తోంది. ప్రాక్టికల్ నాలెడ్జ్‌తో కూడిన విధానం అందుబాటులోకి తెచ్చేందుకు అన్ని విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో పాఠ్య ప్రణాళికలో మార్పు చేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఒక్కసారిగా మూస విధానం నుంచి స్వతహాగా ఆలోచించే విద్యావిధానంలో అడుగుపెడుతున్నారు. ఇది కూడా మానసిక ఒత్తిడికి కారణమవుతోందని ఏఐసీటీఈ అధ్యయనంలో తేలింది. బ్యాక్లాగ్స్తోపెరుగుతున్నఒత్తిడి... అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నిబంధనల ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో మానసిక నిపుణులను నియమించాలి. ఇంటర్మీడియట్ విద్య వరకూ విద్యార్థులు బట్టీ పద్ధతిలో చదువుతున్నారు. ఇంజనీరింగ్ విద్య ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం రాబట్టే పద్ధతి ఉండదు. కంప్యూటర్ సైన్స్‌లో గణితం భాష ఒక్కసారిగా మారిపోతోంది. రెండో ఏడాదికి వచ్చేసరికి అనేక కంప్యూటర్ లాంగ్వేజ్‌లను విద్యార్థి నేర్చుకోవడమే కాకుండా, దాని ఆధారంగా ప్రయోగాత్మకంగా ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. సివిల్, మెకానికల్‌లోనూ బేసిక్ ఇంటర్ విద్య స్థానంలో ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థి వ్యక్తిగతంగా స్కిల్ పెంచుకుంటే తప్ప ఈ పరిస్థితుల్లో ముందుకెళ్లడం కష్టం. ఈ కారణంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులకు బ్యాక్‌లాగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే విద్యార్థి మానసిక ఒత్తిడికి కారణమవుతోంది. నిపుణులు విద్యార్థి మానసిక స్థితిని కౌన్సెలింగ్ ద్వారా మెరుగుపరచాలని మండలి సూచిస్తోంది. నైపుణ్య కొరత కూడా కారణమే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త కంప్యూటర్ కోర్సుల్లో విద్యార్థులు ఎక్కువ శాతం ప్రతిభ కనబర్చడం లేదని మండలి భావిస్తోంది. ప్రతి ఏటా మార్కెట్లోకి వస్తున్న విద్యార్థుల్లో కేవలం 8 శాతం మాత్రమే అవసరమైన నైపుణ్యం కలిగిఉంటున్నారని పారిశ్రామిక వర్గాలు అంటున్నాయి. ఈ అంతరాన్ని పూడ్చడానికి రెండో ఏడాది నుంచే సంబంధిత రంగాల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చేలా ప్రాజెక్టులు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇది కూడా నామమాత్రంగా జరగడం వల్ల విద్యార్థులు ఉపాధి పొందే విషయంలో, ఉద్యోగంలో రాణించే విషయంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఆరు నెలలకోసారి విద్యార్థి మానసిక ధోరణిని పరిశీలించాలని ఏఐసీటీఈ సూచించింది. -
కంప్యూటర్ కోర్సుల బోధనకు.. అధ్యాపకులంతా అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కంప్యూటర్ కోర్సులను ఏ బ్రాంచీ అధ్యాపకులైనా బోధించే వెసులుబాటు ఇవ్వాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దేశంలోని అన్ని యూనివర్సిటీలనూ ఆదేశించింది. కొత్తగా వచ్చిన కోర్సుల బోధన కోసం ఇప్పటికే వాటిని పూర్తిచేసిన వారే ఉండాలన్న నిబంధన సరికాదని పేర్కొంది. దీనివల్ల ఎక్కడా ఫ్యాకల్టీ లభించని పరిస్థితి తలెత్తుతుందని, కంప్యూటర్ కోర్సుల బోధనకు సమస్య తలెత్తుతుందని స్పష్టం చేసింది. సంప్రదాయ కోర్సుల స్థానంలో కంప్యూటర్ ఆధారిత బ్రాంచీలకు డిమాండ్ పెరుగుతోందని.. వాటిలో ఫ్యాకల్టీకి సంబంధించి కొన్నేళ్లు ఇలాంటి పరిస్థితే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్‌ను కూడా బోధనకు వినియోగించుకోవాలని సూచించింది. వర్సిటీలు వేధిస్తున్నాయన్న ఫిర్యాదులతో.. కొన్నేళ్లుగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ తగ్గుతూ.. కంప్యూటర్ ఆధారిత టెక్ కోర్సుల్లో చేరేవారు పెరుగుతున్నారు. మన రాష్ట్రంలో ఈసారి 58శాతం విద్యార్థులు కంప్యూటర్ కోర్సుల్లోనే చేరారు. ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు డిమాండ్ బాగా పెరిగింది. అయితే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలు ఈ కోర్సుల బోధనపై పలు షరతులు పెట్టాయి. సదరు సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారినే ఫ్యాకల్టిగా నియమించాలని స్పష్టం చేశాయి. కానీ చాలా కాలేజీలు ఇతర ఇంజనీరింగ్ కోర్సులు (సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్ఈ) బోధిస్తున్న అధ్యాపకులను కొత్త కోర్సులకు ఫ్యాకల్టిగా నియమించాయి. ఈ అధ్యాపకులు కొత్త కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్ కోర్సులు చేసినవారేనని పేర్కొంటున్నాయి. కానీ దీనిని తాము అనుమతించబోమని, పీజీ చేసినవారిని నియమించాల్సిందేనని యూనివర్సిటీలు పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేటు కాలేజీలపై వర్సిటీ అధికారుల వేధింపులు పెరిగాయంటూ కొందరు ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఏఐసీటీఈ.. ఇతర కోర్ గ్రూపులు బోధించే వారినీ కొత్త కంప్యూటర్ కోర్సుల బోధనకు అనుమతించాలంటూ వర్సిటీలకు స్పష్టత ఇచ్చింది. ఆ కోర్సులు తప్పనిసరి ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచీలో బోధిస్తున్న అధ్యాపకుడైనా కొన్ని కోర్సులు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధించాలనుకుంటే మైనర్ డిగ్రీ కోర్సుగా దానిని చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సులను మూక్స్, స్వయం వంటి సంస్థలు ఆన్లైన్ ద్వారా అందిస్తున్నాయి. ఇతర ఇంజనీరింగ్ బ్రాంచీల అధ్యాపకులకు సాంకేతికతలు, బోధనపై అవగాహన ఉంటుందని.. అదనంగా సర్టిఫికెట్ కోర్సులు చేయడాన్ని అర్హతగా పరిగణించాలని ఏఐసీటీఈ పేర్కొంది. ఈ సర్టిఫికెట్ కోర్సులకు 18 నుంచి 20 క్రెడిట్స్ ఉంటాయని, అవి బోధనకు సరిపోతాయని స్పష్టం చేసింది. 20% అనుమతిస్తున్నాం ఇతర బ్రాంచీల వారిని ఇప్పటికే 20శాతం వరకూ కొత్త కోర్సుల ఫ్యాకల్టిగా అనుమతిస్తున్నాం. వంద శాతం అనుమతిస్తే బోధనలో నాణ్యత ఉండదని భావిస్తున్నాం. అయితే సంబంధిత సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారిని అనుమతించాలని ఏఐసీటీఈ తెలిపింది. ఇందులో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తాం. – ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ అందరినీ అనుమతించాలి కొత్త కంప్యూటర్ కోర్సులు బోధించే నైపుణ్యం అలవరచుకున్న అందరినీ బోధనకు అనుమతించాలి. దీనికి వర్సిటీలు అభ్యంతరం చెప్పడం సరికాదు. వర్సిటీల తీరుతో ఫ్యాకల్టీ లభించక బోధన కుంటుపడుతుంది. సర్టిఫికెట్ కోర్సులు చేసిన కోర్ గ్రూప్ వారికీ కంప్యూటర్ అనుబంధ కోర్సులపై పట్టు ఉంటుంది. – వి.బాలకృష్ణారెడ్డి, సాంకేతిక, వృత్తి విద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు మొదటి సంవత్సరంలోనే ఆత్మస్థైర్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) విశ్వవిద్యాలయాలకు సూచించింది. విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం తొలగించి మానసికంగా దృఢంగాఉండేలా చూడాలని పేర్కొంది. తొలిదశలో నిర్వహించే అవగాహన కార్యక్రమం (ఇండక్షన్ ప్రోగ్రామ్) నుంచే ఇది మొదలవ్వాలని తెలిపింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వివిధ అధ్యయనాలపై ఏఐసీటీఈ దృష్టి పెట్టింది. ఇంటర్ వరకూ ఎక్కువగా బట్టీ విధానంలో చదివే విద్యార్థులు ఇంజనీరింగ్‌లోని భిన్నమైన విద్యా విధానం వల్ల సొంత అవగాహన పద్ధతులపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని ఏఐసీటీఈ భావించింది. ఈ సమస్యను అధిగమించడానికి వీలుగా ఇంజనీరింగ్ విద్యకు ముందుగా విద్యార్థులను మానసికంగా సిద్ధం చేయాలని జాతీయ విద్యావిధానం–2020లో సూచనలు చేసింది. ఇప్పటికే ఇంజనీరింగ్ తరగతులు మొదలైనందున వచ్చే ఏడాది నుంచి విశ్వవిద్యాలయాలు దీనిపై దృష్టి పెట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఇవీ సూచనలు.. కేవలం పుస్తకాలకే కాకుండా సామాజికంగా ఎదురయ్యే సవాళ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. తరగతి పాఠాలకే పరిమితం చేయకుండా సామాజిక అంశాలపై చర్చా వేదికలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. ప్రతి యూనివర్సిటీలోనూ దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరాక ఇంటర్ వరకూ ఉన్న వాతావరణం నుంచి ఇంజనీరింగ్ అనే కొత్త ప్రపంచం అర్థమయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ విద్యార్థి ఏ ప్రాంతం నుంచి వచ్చాడు? అతని సామర్థ్యం ఏమిటి? అందరిలో కలుస్తున్నాడా? వంటి అంశాలను అధ్యాపకులు గమనించాలి. తరగతి గదిలో అందరి మధ్య సఖ్యత పెరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొన్న తర్వాతే బోధన చేపట్టాలి. ఇంజనీరింగ్‌లోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థుల మధ్య సమన్వయం నెలకొనేందుకు కాలేజీలు ప్రయత్నించాలి. దీనికోసం సృజనాత్మకత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపకల్పనకు వర్సిటీలు కృషి చేయాలి. అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు అనుభవపూర్వకంగా విద్యను నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక వికాసం పెరుగుతుందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అభిప్రాయపడింది. దీన్ని కాలేజీలు విధిగా అనుసరించాలి -
‘ప్రొఫెషనల్’గా బోధన!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చాలా కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సుల బోధన పక్కాగా సాగేలా చూడటంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టి పెట్టింది. కొత్త కోర్సులకు అనుగుణమైన నైపుణ్యాలు ఉన్న, సమర్థవంతంగా బోధించగల ఫ్యాకల్టీని కాలేజీలు నియమించుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది. నాణ్యత ప్రమాణాల్లేని ఫ్యాకల్టీ ఉన్నట్టు గుర్తిస్తే.. సంబంధిత కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాలేజీ గుర్తింపు రద్దు చేయాలని భావిస్తోంది. ఈ దిశగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన నిబంధనలతో కూడిన సమగ్ర నివేదికను రూపొందించింది. కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు దాన్ని పరిశీలించి, సూత్రప్రాయంగా అంగీకారం కూడా తెలిపారు. ఆ నివేదిక ప్రకారం.. కొత్తగా అందుబాటులోకి వస్తున్న కీలక కంప్యూటర్ కోర్సులను బోధిస్తున్న వారి అర్హతలను గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలే కాకుండా ఏఐసీటీఈ కూడా ప్రత్యేకంగా పరిశీలించనుంది. ఇందుకోసం కొన్ని బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ సంస్కరణలను ఈ ఏడాది నుంచే అమల్లోకి తేవాలని భావించినా.. కొన్ని అనుమతుల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలోనే విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించాయి. కీలక కోర్సుల బోధనలో.. దేశవ్యాప్తంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. తెలంగాణలో 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే.. ఇందులో 58శాతం కంప్యూటర్ కోర్సులవే. సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు 50 శాతం దాటడం లేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సరికొత్త కోర్సులకు విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ కొత్త కోర్సులు మొదలై రెండేళ్లు గడుస్తున్నా చాలా కాలేజీల్లో బోధన సాధారణ కంప్యూటర్ సైన్స్ కోర్సుల మాదిరిగానే ఉంటోందని ఏఐసీటీఈ గుర్తించింది. ఇప్పటికే కంప్యూటర్ కోర్సులు చేసిన విద్యార్థుల్లో కేవలం 8 శాతం మందిలో మాత్రమే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి అర్హత గల నైపుణ్యం ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో బోధన విధానంలో గణనీయమైన మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. ప్రొఫెషనల్స్తోనే పాఠాలు ఇంజనీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ప్రత్యేక నైపుణ్యంతో బోధించాల్సి ఉంటుందని ఏఐసీటీఈ స్పష్టం చేస్తోంది. చాలా కాలేజీల్లో గత రెండేళ్లు జరిపిన అధ్యయనంలో ఆ తరహా బోధన కనిపించలేదని పేర్కొంటోంది. కాలేజీలు ఎంటెక్ పూర్తి చేసిన సాధారణ ఫ్యాకల్టీతో కోర్సుల బోధన కొనసాగిస్తున్నాయి. వారు కృత్రిమ మేధ (ఏఐ), ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులను ఆన్లైన్లో సెర్చ్చేసో, అప్పటికప్పుడు నేర్చుకునో బోధిస్తున్నారు. వారికి ప్రాక్టికల్ అనుభవం ఉండటం లేదు. అలాంటి వారు సమర్థవంతంగా బోధించలేరని ఏఐసీటీఈ అభిప్రాయానికి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులంతా వృత్తిలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ద్వారా నైపుణ్యం సంపాదించిన వాళ్లే. ఈ క్రమంలోనే వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న నిపుణులను బోధనకు అనుమతిస్తూ ఏఐసీటీఈ నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రతీ కాలేజీలోనూ అలాంటి వారు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన తెచ్చే ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల చేత పాఠాలు చెప్పించాలని భావిస్తోంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందే కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ కోర్సులు బోధించే అధ్యాపకుల వివరాలు తెప్పించుకుని.. వారికి అర్హత ఉంటేనే గుర్తింపు ఇవ్వాలనే నిబంధనను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రొఫెషనల్స్ సేవలు ఎంతో అవసరం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు సంబంధిత కోర్సు చేయకున్నా.. కావాల్సిన అనుభవం ఉంది. కాలేజీల్లో పనిచేసే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఎంటెక్ సర్టిఫికెట్లు ఉన్నా ఈ కోర్సులను బోధించే అనుభవం తక్కువ. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కొత్త కంప్యూటర్ కోర్సులను బోధించేందుకు పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నాం. అమెరికాలో ఓ ఏఐ ప్రొఫెషనల్ వారానికి కొన్ని గంటలు ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నారు. స్థానికంగా ఉద్యోగాలు చేసేవారు నేరుగా క్లాసులు చెబుతారు. దీనివల్ల నాణ్యత పెరుగుతుంది. ఎంటెక్ చేసిన ఫ్యాకల్టీకి కూడా ప్రొఫెషనల్స్ ద్వారా క్లాసులు చెప్పించాలి. అప్పుడే భవిష్యత్‌లో కొత్త కోర్సులకు అధ్యాపకులు అందుబాటులో ఉంటారు.– ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ, ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ సరైన ఫ్యాకల్టీ లేకుండా అనుమతులు వద్దు కొన్నేళ్లుగా ఇష్టానుసారం కంప్యూటర్ కోర్సులకు అనుమతి ఇస్తు న్నారు. మరి ఆ కోర్సులను బోధించే వా రు ఉన్నారా? లేదా? అనేది యూనివర్సి టీలు పరిశీలించాలి. లేకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుంది. నైపుణ్యం లేకుండా విద్యార్థులకు డిగ్రీలిస్తే, మార్కెట్లో వారు నిలబడటం కష్టం. ఈ విషయాన్ని అనేక సర్వేలు రుజువు చేస్తున్నాయి.– అయినేని సంతోష్‌కుమార్, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలకం
సాక్షి, అమరావతి: దేశాభివృద్ధిలో సాంకేతిక విద్య కీలక భూమిక పోషిస్తోందని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చైర్మన్ టీజీ సీతారామ్ అన్నారు. ఈ క్రమంలోనే సాంకేతికతతో కూడిన పరిపాలన అందించడం ద్వారా ప్రజల జీవన శైలిలో సమూల మార్పులు తీసుకురావచ్చన్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ కళాశాలల యాజమాన్యాల సంఘం(అపెక్మా) సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతారామ్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతోందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వచ్చే 25 ఏళ్లను అమృత కాలంగా పరిగణించి కీలక సంస్కరణల దిశగా ప్రణాళిక రూపొందించిందన్నారు. 50 కోట్లకు పైగా యువ శక్తితో భారత్ ప్రపంచంలో బలమైన దేశంగా ఉందన్నారు. కళాశాలల యాజమాన్యాలు సాంకేతిక విద్యలో విద్యార్థులకు లెర్నింగ్ ఔట్‌కమ్స్‌ను మెరుగుపర్చాలని కోరారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమీకృత, మల్టీడిసిప్లినరీ కోర్సులను కచ్చితంగా ప్రవేశపెట్టాలని సూచించారు. ఇప్పటికే ఏఐసీటీఈ గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాతృభాషలోనూ సాంకేతిక విద్యను అందిస్తోందని గుర్తు చేశారు. కళాశాలల్లో ఇన్‌టేక్, అక్రెడిటేషన్ల జారీల విషయంలో రాధాకృష్ణన్ కమిటీ సమగ్ర అధ్యయనం చేస్తోందన్నారు. కళాశాలలకు అనుమతుల ప్రక్రియను సైతం సులభతరం చేస్తున్నామని తెలిపారు. ఏటా నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)లో ప్రతి కళాశాల భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏపీలో యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు.. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ గతిశక్తి కార్యక్రమంలో కీలకంగా మారనుందని సీతారామ్ తెలిపారు. ఇక్కడ లాజిస్టిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్ తదితర రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో అత్యధికంగా ఏపీ విద్యార్థులే ఉండటం తెలుగు వారి విద్యా ప్రతిభకు నిదర్శనమన్నారు. కంప్యూటర్ సైన్స్ ఒక్కటే సాంకేతిక విద్య కాదని తెలిపారు. అనేక కోర్ బ్రాంచ్‌లు, ఇతర రంగాల్లోని అవకాశాల గురించి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. త్వరలో 1,500కు పైగా కంపెనీలతో కలిసి ప్లేస్మెంట్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు సైతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత మూడేళ్లలో ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి కంపెనీల్లో సర్టిఫికేషన్లు అందించడం ద్వారా నైపుణ్య సామర్థ్యాలను పెంపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్య డైరెక్టర్ నాగరాణి, అపెక్మా చైర్మన్ చొప్పా గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జేఎన్టీయూ(ఏ) పరిధిలో కొత్తగా 3 కళాశాలలు
అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో నూతనంగా రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. చిత్తూరు, రాయచోటిలో ఒక్కొక్క ఇంజినీరింగ్ కళాశాల, నెల్లూరులో ఒక ఫార్మసీ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యావిధానం–2020ని దృష్టిలో ఉంచుకుని అనుమతుల ప్రక్రియలో వెసులుబాటుతోపాటు కొన్ని మార్పులు చేసింది. ప్రొఫెషనల్ కోర్సులపై ఉన్న మారిటోరియాన్ని ఎత్తేసింది. దీంతో కొత్తగా ఇంజినీరింగ్ కళాశాలలు, సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) పరిధిలో రెండు ఇంజినీరింగ్, ఒక ఫార్మసీ కళాశాల మంజూరయ్యాయి. ఇప్పటికే జేఎన్టీయూ(ఏ) పరిధిలో 98 అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలుండగా.. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది. ఫార్మసీ కళాశాలల సంఖ్య కూడా 34కు చేరింది. ఏఐసీటీఈ తాజా నిర్ణయం మేరకు బీటెక్ కోర్సుల్లో బీఈ, బీటెక్ గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచారు. నూతన నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. తక్కిన 60 సీట్లు.. 30 సీట్లు చొప్పున సివిల్, మెకానికల్ వంటి కోర్ గ్రూప్‌లలో భర్తీ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్సెస్ ప్రోగ్రామ్‌ను సైతం తాజాగా కోర్ గ్రూప్‌గా పరిగణించారు. విద్యార్థుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సులను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. యూసీఎస్ బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ వర్సిటీకి చెల్లించాల్సిన యూనివర్సిటీ కామన్ సర్విసెస్ (యూసీఎస్) ఫీజుల బకాయిలు చెల్లిస్తేనే నో అబ్జెక్షన్ సర్టీఫికెట్ (ఎన్వోసీ) జారీచేస్తామని జేఎన్టీయూ (ఏ) ఉన్నతాధికారులు గతంలో స్పష్టం చేశారు. వర్సిటీ ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్వోసీ జారీచేస్తేనే ఏఐసీటీఈ 2023–24 విద్యా సంవత్సరానికి గుర్తింపు ఇస్తుంది. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) ఎన్వోసీ జారీకి యూసీఎస్ బకాయిలతో ముడిపెట్టింది. వర్సిటీ పరిధిలోని 98 ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే 88 కాలేజీలు యూసీఎస్ బకాయిలు చెల్లించాయి. 10 ఇంజినీరింగ్ కళాశాలలు రూ.1.50 కోట్ల బకాయిలున్నాయి. వీటికి కూడా బకాయిలు చెల్లిస్తేనే ఎన్వోసీ ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు. పోర్టల్‌లో వివరాలు ఏఐసీటీఈ నుంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలు వర్సిటీ అనుబంధ హోదాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. కళాశాలకు సంబంధించిన వివరాలన్నీ పోర్టల్‌లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా వర్సిటీ నిజనిర్ధారణ కమిటీలను నియమిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగానే ఆయా ఇంజినీరింగ్ కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం ఏపీ ఈఏపీసెట్ జరుగుతోంది. పరీక్ష పూర్తయి ర్యాంకులు ప్రకటించి కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేలోపు సీట్ల కేటాయింపు పూర్తికావాల్సి ఉంది. అన్ని వసతులు ఉన్న కళాశాలలకే గుర్తింపు బోధన ప్రమాణాలు, మౌలిక వసతులు, అనుభవజు్ఞలైన ఫ్యాకల్టీ ఉన్న కళాశాలకే అనుబంధ గుర్తింపు జారీచేస్తాం. నిబంధనలకు లోబడి ఇంజినీరింగ్ సీట్లు కేటాయిస్తాం. గత ఐదేళ్ల పురోగతి, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కొలువులు తదితర అంశాలను బేరీజు వేసి కళాశాల స్థితిగతులను అంచనావేస్తాం. అన్ని రకాల సదుపాయాలున్న ఆయా ఇంజినీరింగ్ కళాశాలలనే పరిగణనలోకి తీసుకుంటాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్ధన, వీసీ, జేఎన్టీయూ అనంతపురం -
‘నీట్’లా ఇంజనీరింగ్‌కూ ఒకే ఎంట్రన్స్!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్‌లో ఇక రాష్ట్రాల పరిధిలో ఎంసెట్‌ల నిర్వహణ ఉండే అవకాశం కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ‘నీట్’ను నిర్వహిస్తున్న మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ముసాయిదా ప్రతిని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకూ పంపింది. మెజారిటీ రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలిసింది. దీంతో ఈ అంశంపై అవగాహనకు కేంద్రం సెమినార్లు నిర్వహిస్తోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కూడా కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ప్రయోగం విజయవంతమైంది. దీంతో జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై కేంద్రం దృష్టి పెట్టింది. గత కొన్నేళ్లుగా దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లోని ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చేపడుతోంది. ఇదే మాదిరిగా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలనూ కలుపుకొని ఉమ్మడి ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్ చేపట్టాలని 2016లోనే ఆలోచన చేసింది. కానీ వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కొనసాగుతున్న చర్చలు గత నెల 18న భువనేశ్వర్‌లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూజీసీ, ఐఐటీల డైరెక్టర్లు, గవర్నింగ్ బాడీ చైర్మన్లతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశపరీక్షపై చర్చించారు. అయితే ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలు, పొందుపరచాల్సిన నిబంధనలపై వివిధ వాదనలు వినిపించాయి. దీంతో అన్ని కోణాల్లోనూ పరిశీలించి, మార్పుచేర్పులతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఐఐటీ గవరి్నంగ్ బాడీ చైర్మన్లను కేంద్ర మంత్రి ఆదేశించారు. దీంతో వారు అన్ని రాష్ట్రాలతో భేటీ అవుతూ అభిప్రాయసేకరణ చేపడుతున్నారు. 2025–26 నాటికి ఈ ప్రయోగాన్ని అమల్లోకి తేవాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలో ఉన్న కాలేజీలకు రెండేళ్ల సమయం ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే ఐఐటీల నాణ్యతను ఏమాత్రం తగ్గించకుండా చూడాలని సమావేశంలో పాల్గొన్న విద్యావేత్తలు సూచించారు. నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలతోపాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)లో విలీనం చేసే యోచన ఉందని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్‌కుమార్ కూడా గతంలో అనేక సందర్భాల్లో తెలిపారు. నిబంధనలు పాటిస్తేనే అనుబంధ గుర్తింపు.. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ జాతీయ స్థాయిలోకి వెళ్తే పూర్తిగా వెబ్ ఆధారితంగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. యాజమాన్య కోటా కూడా కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలన్నీ ఏఐసీటీఈ నిబంధనలు విధిగా పాటించాల్సి ఉంటుంది. మౌలిక వసతులు, నాణ్యమైన ఫ్యాకల్టి, కంప్యూటర్ ఆధారిత కోర్సుల్లో బోధన ప్రణాళిక మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. ఫలితంగా కొన్ని ప్రైవేటు కాలేజీలు అనేక మార్పులు చేసుకోక తప్పదని ఓ అధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు యూనివర్సిటీ అధికారులే తనిఖీలు చేసేవాళ్లు. ఇకపై జాతీయ స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి అనుమతిస్తేనే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభిస్తుందని తెలుస్తోంది. ఈ విధానంతో యాజమాన్య కోటా సీట్ల బేరసారాలకు బ్రేక్ పడుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. -
కొత్త కాలేజీలు, కోర్సులపై మారటోరియం ఎత్తివేత
సాక్షి, అమరావతి: దేశంలో ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించి కొత్త కాలేజీలు, కోర్సులపై ఉన్న మారటోరియాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఎత్తివేసింది. ఇంజనీరింగ్ సహా ప్రొఫెషనల్ కోర్సులను బోధించే కాలేజీలకు అనుమతులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2023 – 24 మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో కొత్తగా మరిన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లు అందు బాటులోకి రానున్నాయి. నూతన విద్యావిధానం 2020ని దృష్టిలో పెట్టుకొని అనుమతులకు సంబంధించి కొన్ని సడలింపులతో పాటు కొత్త మార్పులను ప్రకటించారు. మూడేళ్ల తరువాత.. కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీలు, కోర్సులకు అనుమతులపై ఏఐసీటీఈ 2020–21లో మారటోరియాన్ని విధించింది. కాలేజీలు, సీట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడం, నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ప్రొఫెసర్ మోహన్‌రెడ్డి (ఐఐటీ– హైదరాబాద్) కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఏఐసీటీఈ ప్రాంతీయ కార్యాలయాల ద్వారా అనుమతుల మంజూరు ప్రక్రియ కొనసాగగా ఇప్పుడు దాన్ని రద్దుచేసి నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ పోర్టల్ ద్వారా నిర్వహించనున్నారు. ఏఐసీటీఈ అనుమతి ప్రక్రియలో ముఖ్యమైన నిపుణుల కమిటీ సందర్శనను రద్దు చేసింది. కాలేజీలపై ఒత్తిడి తగ్గించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. అవసరమైనప్పుడు, ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడతారు. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో (బీఈ, బీటెక్) గరిష్ట సీట్ల సంఖ్యను 300 నుంచి 360కి పెంచింది. కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్‌లలో ఇన్‌టేక్‌ను 180 నుంచి 300కి పెంచుకునే అవకాశం కల్పించారు. కొత్తగా ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కాలేజీలకు ఆమోదం, అనుమతుల పొడిగింపు ఈ విద్యా సంవత్సరంలో చేపట్టే అవకాశం లేదు. ఇందుకు సంబంధించిన వ్యాజ్యం సుప్రీంకోర్టులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. నూతన మార్గదర్శకాల ప్రకారం అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు మూడు విభాగాలకు మించకుండా డిగ్రీ, డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో కొత్త కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో మొదటి బ్యాచ్ పూర్తయ్యాకే కొత్త ప్రోగ్రాముకు దరఖాస్తుకు అవకాశం ఉంది. ఇప్పుడు బహుళ ప్రోగ్రాములకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మూడు కోర్ బ్రాంచ్ కోర్సులను నిర్వహించి ఉండాలి. ఈ జాబితాలో ఎలక్ట్రానిక్స్, టెలి కమ్యూనికేషన్స్‌తో సహా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. విద్యార్ధుల నమోదు శాతంతో సంబంధం లేకుండా అభివృద్ధి చెందుతున్న విభాగాలలో నూతన కోర్సు లను ప్రారంభించేందుకు అనుమతించనున్నారు. ూగ్లోబల్ ర్యాంకింగ్స్‌లో అగ్రశ్రేణి 1,000 సంస్థలను దేశీయ సంస్థలతో కలసి పని చేయడానికి అనుమతించనున్నారు. కనీసం 650 నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) స్కోర్‌తో ఏఐసీటీఈ ఆమోదించిన లేదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో టాప్ 100లో ఉన్న దేశీయ విద్యా సంస్థలను విదేశీ సంస్థలతో కలిసి పనిచేయడానికి అనుమతించనున్నారు. నేషనల్ అక్రిడిటేషన్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ (న్యాక్)లో 3.1 స్కోర్‌తో ఉన్న దేశీయ విశ్వవిద్యాల యాలు కూడా డ్యూయల్, జాయింట్ లేదా ట్వినింగ్ ప్రోగ్రామ్‌లను అందించడానికి వీలుంటుంది. అలాంటి సంస్థలకు కొత్త నిబంధనల ప్రకారం 60 సీట్లతో అదనపు బ్యాచ్‌ల ఏర్పాటుకు అనుమతిస్తారు. ూవిద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుగా ఏఐసీటీఈ వచ్చే విద్యాసంవత్సరం నుంచి కొత్త మైనర్ డిగ్రీలను ప్రవేశపెడుతోంది. వీఎల్ఎస్ఐ డిజైన్, 5జీ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సహా ఇంజనీరింగ్‌లో మైనర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందించేలా కాలేజీలను అనుమతిస్తారు. విద్యార్థులు, అధ్యాపకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఫోరమ్ లేదా కౌన్సెలర్‌ను నియమించుకోవాలి. మహిళల కోసం 24 గంటల పాటు పనిచేసేలా హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి. విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర మహిళా సిబ్బందికి భద్రతా వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ూ2023లో కొత్త ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించడానికి తరగతి గదుల కనీస అవసరాన్ని కూడా ఏఐసీటీఈ సడలించింది. మొత్తం తరగతి గదుల సంఖ్య కళాశాలలోని డివిజన్ల సంఖ్య కంటే 0.5 రెట్లుంటే చాలు. గతంలో 15 తరగతి గదులు కలిగి ఉండాల్సిన కళాశాల ఈసారి పది గదులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లలో పీఎం కేర్ సూపర్ న్యూమరీ సీట్లను ఇకపై కొనసాగించరాదని నిర్ణయించారు. (చదవండి: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు తేజాలు ) -
వచ్చేస్తోంది.. దేశంలో తొలి డిజిటల్ వర్సిటీ
దేశంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీ (ఎన్డీయూ) అందుబాటులోకి రాబోతోంది. 2023–24 విద్యాసంవత్సరం నుంచే దీని సేవలు ప్రారంభించేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సన్నాహాలు చేస్తోంది. విద్యార్థులు కోరుకున్న కోర్సులను ఆన్లైన్ ద్వారా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రపంచస్థాయి ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాలతో యూజీసీ ఈ యూనివర్సిటీకి శ్రీకారం చుడుతోంది. విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులను అనుసరించి వారి ఇంటివద్దే నచ్చిన కోర్సులను డిజిటల్ విశ్వవిద్యాలయం అందించనుంది. ఉన్నత విద్యాశాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సహా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలను ఇందులో భాగస్వామ్యం చేసి ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు వివిధ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యను అందించడం, పరీక్షలు నిర్వహించడం, సర్టిఫికెట్ల ప్రదానం వంటివన్నీ కేంద్రీకృత వ్యవస్థగా డిజిటల్ వర్సిటీ వ్యవహరిస్తుంది. ప్రస్తుతం వివిధ విద్యాసంస్థల ద్వారా అమలవుతున్న విధానాలకు భిన్నమైన రీతిలో ఈ యూనివర్సిటీ సేవలందించనుంది. హబ్–స్పోక్ మోడల్లో సేవలు స్పోక్ అండ్ హబ్ అంటే ఒక కేంద్రీకృత పంపిణీ వ్యవస్థలా డిజిటల్ వర్సిటీ పనిచేస్తుంది. సైకిల్ చక్రానికి హబ్ మాదిరిగా యూనివర్సిటీ ఉంటుంది. ఊచలు (స్పోక్) కేంద్ర ప్రదేశంలో కలుస్తూ తిరిగి అన్ని వైపులకు తమ సేవలను పంపిణీ చేసేలా వివిధ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇది పని చేయనుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థలన్నీ ఈ డిజిటల్ వర్సిటీ పరిధిలో తమ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నాయి. విద్యార్థులు తమ సంస్థలలో చదువుతూనే డిజిటల్ వర్సిటీ ద్వారా ఇతర సంస్థల కోర్సులను అభ్యసించడానికి వీలు కల్పిస్తుంది. వారు ఆ సంస్థల ద్వారా క్రెడిట్లను అందుకోగలుగుతారు. సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలను ఈ క్రెడిట్ల ఆధారంగా వారు అందుకోగలుగుతారు. సీట్లు లేవనే సమస్య ఉండదు విద్యార్థి తాను కోరుకొనే వర్సిటీలో అభ్యసించాలనుకునే కోర్సులో చేరే వెసులుబాటును డిజిటల్ వర్సిటీ కల్పించనుంది. సీట్లు లేకపోవడం లేదా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించకపోవడం వంటి వాటితో సంబంధం లేకుండా విద్యార్థులు ఆసక్తి ఉన్న కోర్సును అభ్యసించడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీలతో ప్రారంభమయ్యే ఈ వర్సిటీ సేవలు రానున్న కాలంలో పీజీ డిగ్రీలు, డాక్టరేట్లను కూడా అందించేలా యూజీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ డిజిటల్ వర్సిటీ ద్వారా ప్రస్తుత వర్సిటీల్లో అదనపు సీట్ల ఏర్పాటు, అందుకు తగ్గ సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పన వంటి భారాలు తగ్గుతాయి. 50% క్రెడిట్లు సాధిస్తేనే అర్హత విద్యార్థులు ఏ కోర్సులో అయినా 50 శాతం క్రెడిట్లు సాధిస్తేనే డిగ్రీలకు అర్హులవుతారు. ఈ క్రెడిట్లను ఒకేసారి కాకున్నా తమకు నచ్చిన సమయాల్లో సాధించినా డిగ్రీని ప్రదానం చేస్తారు. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ద్వారా విద్యార్థులు తమ క్రెడిట్లను బదలాయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ల్యాబ్‌లు, ప్రాక్టికల్ వర్కులతో సంబంధం లేని కోర్సులు మాత్రమే ప్రస్తుతం డిజిటల్ వర్సిటీ ద్వారా అందిస్తారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇప్పటికే డిజిటల్ యూనివర్సిటీ ద్వారా కోర్సులు అందించేందుకు రంగం సిద్ధం చేశాయి. -
ఆన్లైన్ చదువులయోగం.. ‘స్వయం’ వేదికగా ఆన్లైన్ కోర్సులు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ తదితర కోర్సుల మంజూరు, పర్యవేక్షణ, నియంత్రణ సంస్థ అయిన అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా భారతీయ ప్రాచీన విద్య అయిన యోగాపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో యోగాను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ చర్యలతో యోగాకు అంతర్జాతీయంగా ఇప్పటికే ఎంతో గుర్తింపు వచ్చిన నేపథ్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏఐసీటీఈ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ కోర్సులకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్ వేదికగా ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన ‘స్వయం’ పోర్టల్ ద్వారా ఈ ఆన్లైన్ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సును అభ్యసించే వారికి క్రెడిట్లను కూడా అందించనుంది. వీటి ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో అదనపు ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఈ అంశాల్లోనూ క్రెడిట్ కోర్సులు.. యోగాతోపాటు విద్యార్థులకు ఉపయోగపడేలా మేధో హక్కులు, బేసిక్ రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి అంశాల్లో కూడా క్రెడిట్ కోర్సులను ప్రారంభించింది. కేంద్ర ఆవిష్కరణల విద్యా విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), వివేకానంద యోగా అనుసంధాన సంస్థలు ఈ కోర్సులకు రూపకల్పన చేశాయి. యోగాను ప్రొఫెషనల్‌గా నిర్వహించే వారికి ఈ సర్టిఫికెట్ కోర్సుల వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. రిమోట్ సెన్సింగ్, భూ పరిశీలన సెన్సార్స్, థర్మల్ రిమోట్ సెన్సింగ్, స్పెక్టరల్ సిగ్నేచర్స్, హైపర్ స్పెక్టరల్ రిమోట్ సెన్సింగ్ తదితర అంశాలపై విద్యార్థులకు ఈ కోర్సుల ద్వారా పరిజ్ఞానం అలవడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికెట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన పాఠ్యాంశాలను 12 ప్రాంతీయ భాషల్లోనూ ఏఐసీటీఈ అనువాదం చేయిస్తోంది. అంతేకాకుండా ఆయా మాధ్యమాల్లోనూ ఈ కోర్సులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే తెలుగులో ఇంజనీరింగ్ పుస్తకాలు.. కాగా 12 ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ కోర్సులను అందించేలా ఇప్పటికే ఆయా సంస్థలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేస్తోంది. ఆయా భాషలకు విద్యార్థుల డిమాండ్‌ను అనుసరించి.. ప్రాధాన్యత క్రమంలో వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో 218 సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాల అనువాదాన్ని ఏఐసీటీఈ చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలుగు, కన్నడం, ఒడియా, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లో ఇంజనీరింగ్ పుస్తకాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ మాతృభాషల్లో ఆయా భావనలను అర్థం చేసుకుంటే.. వారు వాటిని బాగా గుర్తుంచుకుని అన్వయించే అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు చాలామంది విద్యార్థులకు సమాధానం తెలిసినప్పటికీ.. ఇంగ్లిష్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల పరీక్షలు రాయలేకపోయేవారని అంటున్నారు. ప్రాంతీయ భాషా పాఠ్యపుస్తకాల వల్ల వారికి ఈ ఇబ్బంది తొలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. -
సివిల్, మెకానికల్ కోర్సులకు రిపేర్
సాక్షి, హైదరాబాద్: నానాటికీ ఆదరణ కోల్పోతున్న ఇంజనీరింగ్‌లోని కొన్ని కోర్సులకు కాయకల్ప చికిత్స చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సిద్ధమైంది. అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ కోర్సుల స్వరూపాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దేందుకు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల అభిప్రాయాలు కోరింది. దీని ఆధారంగా ముసాయిదా ప్రతిని రూపొందించే ప్రయత్నంలో ఉంది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో 12,70,482 సీట్లు ఉంటే, ఏటా సగటున 9.5 లక్షల మంది చేరుతున్నారు. ఇందులో 6.2 లక్షల మంది కంప్యూటర్, ఐటీ కోర్సులనే ఎంచుకుంటున్నారు. సివిల్‌లో 30 శాతం, మెకానికల్‌లో 28 శాతం, ఎలక్ట్రికల్‌లో 32 శాతం మించి సీట్లు భర్తీ కావడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే డిమాండ్ లేని బ్రాంచ్‌లుగా ఇవి మూతపడే ప్రమాదం ఉందని అన్ని రాష్ట్రాలూ భావిస్తున్నాయి. మార్కెట్ స్పీడేది? వాస్తవానికి దేశవ్యాప్తంగా నిర్మాణ, మోటార్, విద్యుత్ రంగాల్లో ఊహించని పురోగతి కన్పిస్తోంది. వీటికి సంబంధించిన నైపుణ్యం గల కోర్సులు మాత్రం డిమాండ్ కోల్పోతున్నాయి. కాలానుగుణంగా వస్తున్న మార్పులు సంబంధిత కోర్సుల్లో జోడించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఏఐసీటీఈ అధ్యయనంలో వెల్లడైంది. ఉదాహరణకు నిర్మాణ రంగంలో అనేక మార్పులొచ్చాయి. ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణంలో సాఫ్ట్‌వేర్‌తో ప్లానింగ్ రూపకల్పన చేస్తున్నారు. రిమోట్ కంట్రోల్ వ్యవస్థతో నడిచే యంత్రాలు రంగప్రవేశం చేశాయి. కానీ చదువు ముగించుకుని ఉపాధి కోసం వచ్చే విద్యార్థులు ఈ వేగాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. సాంకేతికత తోడవ్వని రీతిలోనే ఇంజనీరింగ్ పట్టా తీసుకోవడంతో పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. వాహన రంగాన్ని ఆధునిక టెక్నాలజీ పూర్తిగా ఆక్రమించింది. స్మార్ట్ టెక్నాలజీతోనే వాహనాలను డిజైన్ చేస్తున్నారు. మెకానికల్ ఇంజనీర్లు అనుభవంలో తప్ప ఈ టెక్నాలజీని విద్యార్థి దశలో పొందలేకపోతున్నారు. అదేవిధంగా విద్యుత్ ప్రాజెక్టుల్లోనూ టెక్నాలజీ దూసుకొస్తున్నా, ఇంజనీరింగ్‌లో ఇంకా పాతకాలం బోధనే కొనసాగుతోంది. పారిశ్రామిక సంస్థలతో అనుసంధానం సాధారణ సివిల్, మెకానికల్ కోర్సుల్లో మార్కెట్లో ఉన్న టెక్నాలజీని జోడించే దిశగా కోర్సుల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. రెండో ఏడాది నుంచి కంప్యూటర్ అనుసంధాన కోర్సులు, సాఫ్ట్‌వేర్‌పై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. పారిశ్రామిక సంస్థలతో నేరుగా అనుభవం పొందేలా బోధన ఉండాలని ఏఐసీటీఈ ప్రతిపాదిస్తోంది. మెకానికల్‌లో సాధారణ పాఠ్య ప్రణాళికను బేసిక్ ఇన్ఫర్మేషన్‌గానే ఉంచి, మార్కెట్లో వస్తున్న మార్పులతో కూడిన సాంకేతికతను ప్రధానాంశంగా చేయాలని నిర్ణయించింది. ఇదేవిధంగా ఎలక్ట్రికల్ కోర్సుల్లోనూ మార్పులు ప్రతిపాదిస్తోంది. దీనిపై అన్ని కాలేజీలు మౌలిక వసతులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతీ కాలేజీ కూడా పారిశ్రామిక సంస్థలతో అనుసంధానమై ఉండేలా నిబంధనలు తేవాలని, అప్పుడే కోర్సులు ఆదరణ పొందుతాయని భావిస్తోంది. వాస్తవానికి ఈ దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు కూడా ఆసక్తి చూపుతున్నాయి. ముసాయిదా పూర్తయితే, ఏఐసీటీఈ కార్యాచరణకు ఉపక్రమించే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
మలి విడతలో మరో 9,240 సీట్లు
సాక్షి, హైదరాబాద్: అక్టోబర్ 11 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్ నాటికి మరో 9,240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 6,200 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండే వీలుంది. ఇవన్నీ కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులే. వీటన్నింటికీ ఇటీవల అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించింది. తాజాగా రాష్ట్ర సాంకేతిక విద్య విభాగం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విద్యార్థుల నుంచి డిమాండ్ లేని కోర్సుల స్థానంలో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ అనుమతించింది. ఇందుకు అనుగుణంగా 89 కాలేజీలు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నాయి. దీంతో 6 వేలకుపైగా ఈ సీట్లు తగ్గుతున్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్ నాటికి 71,286 సీట్లు అందుబాటులో ఉండగా, కొత్త సీట్లతో కలిపి ఈ ఏడాది కనీ్వనర్ కోటాలో 77,486 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త సీట్లపై కోటి ఆశలు తొలి దశలో సీట్లు పొందినా... మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ కోసం మరో దఫా కౌన్సె లింగ్‌కు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇందులోనూ ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సు లపైనే దృష్టి పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల్లో సీట్లు లభించని విద్యార్థులు రెండో విడతలో మరోసారి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే అవకాశాలున్నాయి. కొత్తగా 6,200 సీట్లు అందుబాటులోకి వచ్చి న నేపథ్యంలో మరింత మందికి ఈ బ్రాంచీల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్‌పైనే గురి ఎంసెట్ మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కంప్యూటర్ సైన్స్, ఐటీ అనుబంధ బ్రాంచీలకే విద్యార్థులు అత్యధికంగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. కంప్యూటర్ సై¯న్స్, ఐటీ అనుబంధ బ్రాంచీల్లో 99.91 శాతం సీట్లు కేటాయించగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.76 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే డేటాసైన్స్‌లో 99.64 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 99.59 శాతం సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్, అలైడ్ ఇంజనీరింగ్ బ్రాంచీలపై విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఈ కోర్సుల అనుబంధ బ్రాంచీల్లో 36.75 శాతం సీట్లకు కేటాయింపులు జరగ్గా, 50 శాతానికి పైగా సీట్లు ఖాళీగా మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 36.38 శాతం సీట్లు భర్తీ కాగా, మెకానికల్‌లో 31.92 శాతం, ప్లానింగ్‌లో 24.44 శాతం సీట్లు కేటాయించారు. అలాగే మైనింగ్, కెమికల్, ఫుడ్ టెక్నాలజీ, టెక్స్టైల్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ తదితర కోర్సుల్లో 84.45 శాతం సీట్లు కేటాయించారు. -
ఇంజనీరింగ్‌లో 1.42 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు కాలేజీలు, సీట్ల సంఖ్య దాదాపు ఖరారైంది. రాష్ట్రంలో 375 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లోని 1,50,837 సీట్లు కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఈ కాలేజీలను తనిఖీలు చేసి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నాయో, లేదో పరిశీలించాక ఆయా యూనివర్సిటీలు వాటికి అఫ్లియేషన్ ఇవ్వనున్నాయి. ఏపీ ఈఏపీసెట్–2022 తొలి విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 22 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 30 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపునకు గడువు ఉంది. 31 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగనుంది. 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, సెప్టెంబర్ 3న ఆప్షన్లలో మార్పులకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 6న సీట్లు కేటాయించనున్నారు. ఈ ఏడాది మొత్తం 1,94,752 మంది విద్యార్థులు ఏపీఈఏపీ సెట్‌కు హాజరుకాగా 1,73,572 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరు https://sche.ap.gov.in/ APSCHEHome.aspx ద్వారా కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు. ఈ నెల 28 నుంచి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఆలోగా యూనివర్సిటీల అఫ్లియేషన్‌ను పూర్తి చేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 17 వర్సిటీ కాలేజీల్లో 5 వేల ఇంజనీరింగ్ సీట్లు.. కాగా, 2022–23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చిన ప్రకారం.. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 261 కాలేజీల్లో 1,42,877 సీట్లు ఉన్నాయి. వీటిలో 17 యూనివర్సిటీ కాలేజీల్లో 5 వేల సీట్లు ఉండగా.. 244 ప్రైవేటు కాలేజీల్లో 1,37,877 సీట్లున్నాయి. ► ఫార్మసీలో 71 కాలేజీల్లో 6,670 సీట్లున్నాయి. వీటిలో ఆరు యూనివర్సిటీ కాలేజీల్లో 400 సీట్లు, 65 ప్రైవేటు కాలేజీల్లో 6,270 సీట్లు ఉన్నాయి. ► 43 ప్రైవేటు ఫార్మ్‌డీ కాలేజీల్లో 1,290 సీట్లు ఉన్నాయి. ప్రైవేటు వర్సిటీల్లో ఈసారీ 35% కోటా గతేడాది మాదిరిగానే 2022–23 విద్యా సంవత్సరంలో కూడా ప్రైవేటు వర్సిటీల్లో ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాలో ఈఏపీసెట్‌లో మెరిట్ విద్యార్థులకు కేటాయించనున్నారు. ఈ 35 శాతం కోటా కింద గతేడాది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ విట్)లో 1,509 సీట్లు, ఎస్ఆర్ఎం వర్సిటీలో 527 సీట్లు, బెస్ట్ వర్సిటీలో 1,074 సీట్లు, సెంచూరియన్ వర్సిటీలో 504 సీట్లు, క్రియా వర్సిటీలో 146 సీట్లు, సవితా వర్సిటీలో 81 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. ఏపీ ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన దాదాపు 3 వేల మంది ఈ వర్సిటీల్లో చేరారు. వీరికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటుతో చదువుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్థల్లో ఏ భారమూ లేకుండా విద్యార్థులు చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీ కేటగిరీ సీట్ల భర్తీపై వెలువడని తుది నిర్ణయం ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లయిన బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తర్జనభర్జనలు పడుతోంది. గతంలో ఈ సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కేలా గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం జీవో 48ని జారీ చేసింది. గతంలో బీ కేటగిరీ సీట్ల భర్తీని యాజమాన్యాలే చేపట్టేవి. అయితే ఈ జీవోతో మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా కన్వీనర్ ద్వారా ప్రభుత్వమే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) సీట్ల భర్తీతో పాటు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా బీ కేటగిరీ సీట్ల భర్తీ చేపట్టారు. అయితే ఏ కేటగిరీ సీట్ల భర్తీ ముందుగా అయిపోతున్నందున బీ కేటగిరీ సీట్లు భర్తీ కావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. అందువల్ల తామే ఆ సీట్లను భర్తీ చేసుకునేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నాయి. ఈ తరుణంలో బీ కేటగిరీ సీట్ల భర్తీపై అనుసరించాల్సిన విధానం గురించి ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి ఇంకా దీనిపై తుది నిర్ణయం రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు బీ కేటగిరీ సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లనుంది. -
దేశంలో ఏకీకృత క్రెడిట్ విధానం
సాక్షి, అమరావతి : దేశంలోని ప్రొఫెషనల్, ఒకేషనల్ కోర్సులకు ఒకే క్రెడిట్ విధానాన్ని అమలుచేసేలా యూనిఫైడ్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను అఖిల భారత సాంకేతిక విద్యామండలి ప్రవేశపెట్టింది. పదో తరగతి నుంచి పీహెచ్డీ వరకు ఒకేషనల్, ప్రొఫెషనల్ కోర్సులను ఎక్కడ అభ్యసించినా క్రెడిట్లను ఒకే విధానంలో కేటాయించనున్నారు. ఈ మేరకు దేశంలోని అన్ని సాంకేతిక విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, గుర్తింపు పొందిన విద్యాసంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లకు ఏఐసీటీఈ ఆదేశాలిచ్చింది. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్), నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఎస్క్యూఎఫ్)లకు సంబంధించి జాతీయ నూతన విద్యా విధానం–2020లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఏఐసీటీఈ శుక్రవారం విడుదల చేసిన సర్క్యులర్‌లో వివరించింది. ఈ విధానాన్ని అన్ని యూనివర్సిటీలు, విద్యా సంస్థలు అమలు చేయాలని నిర్దేశించింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా.. విద్యార్థులు ఒక తరగతి నుంచి పైతరగతుల్లో ప్రవేశించే సమయంలో ఈ క్రెడిట్ల ఆధారంగా ప్రొఫెషనల్, ఒకేషనల్ స్కిల్ గ్యాప్లుంటే గనుక వారి కోసం ఆయా విద్యాసంస్థలు ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు నిర్వహించాలని సూచించింది. ప్రతి విద్యార్థీ తాను అభ్యసించిన కోర్సును పూర్తి చేసి బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేలా ఆయా కోర్సుల నైపుణ్యాలను మెరుగుపర్చాలని, ఆయా కోర్సుల మొదటి సంవత్సరం నుంచే ఇందుకు అనుగుణంగా కరిక్యులమ్‌ను ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రస్తుతం రూపొందించిన ఏకీకృత క్రెడిట్ విధానానికి అనుగుణంగా ఆయా సంస్థలు తమ నిబంధనలను సవరించుకోవాలని ఏఐసీటీఈ సూచించింది. వివిధ తరగతుల్లో ఏకీకృత క్రెడిట్ విధానం ఇలా అకడమిక్ లెవల్ యూనిఫైడ్ క్రెడిట్లు 10వ తరగతి 3.0 11వ తరగతి 3.5 12వ తరగతి/డిప్లొమా సెకండియర్ 4.0 ఫైనలియర్ డిప్లొమా 4.5 డిగ్రీ(యూజీ) ఫస్టియర్ 4.5 యూజీ సెకండియర్ 5.0 యూజీ థర్డ్ ఇయర్ 5.5 ఫైనలియర్ యూజీ డిగ్రీ 6.0 ఫస్టియర్ పీజీ 6.5 ఫైనలియర్ పీజీ 7.0 పీహెచ్డీ 8.0 -
ఏఐసీటీఈ సర్వే: గణితంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వీక్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో గణితం సబ్జెక్టులో వెనుకబాటు ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఆయా కోర్సుల్లో వారు తగిన నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరఖ్ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో కీలకమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ ‘పరఖ్’ పేరిట ఈ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్ (విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మూల్యాంకనం)ను ఇటీవల నిర్వహించింది. చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు.. ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. సాంకేతిక విద్యలో అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐసీటీఈ పరఖ్ పేరిట ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,003 సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన 1.29 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ అభ్యసన సామర్థ్యాలను ఈ పరఖ్ సర్వే ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకునేలా దీన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నమోదైన ఈ సర్వే గణాంకాలను ఏఐసీటీఈ విశ్లేషించి నివేదికలు విడుదల చేసింది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు పరఖ్ ద్వారా ఏఐసీటీఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు అంశాలతోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహించింది. సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు ఆయా కోర్ సబ్జెక్టు అంశాలను ఆధారం చేసుకొని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంశాల్లో స్వయం సామర్థ్య పరీక్షలను పెట్టింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు కోర్ సబ్జెక్టుల్లోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాలపైనా నిర్వహించింది. మ్యాథ్స్‌లోనే సమస్యలు.. ఏఐసీటీఈ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అన్ని మేజర్ ప్రోగ్రాముల్లోనూ మ్యాథమెటిక్స్లోనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఈ విద్యార్థులకు గణితం సబ్జెక్టులో ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు సరిగా అలవడకపోవడమేనని పేర్కొంది. ప్రాథమిక, మాధ్యమిక, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో గణితం సబ్జెక్టులో వీరికి తగిన సామర్థ్యాలు అలవడలేదని వివరించింది. అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలోని సామర్థ్యలోపాలు ఇప్పుడు సమస్యగా మారాయని పేర్కొంది. 22,725 మంది ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల్లో నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండగా.. గణితంలో మరింత అధ్వానంగా ఉన్నారని తేల్చింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి జనరల్ నాలెడ్జి, తదితర అంశాల్లోనూ చాలా వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. సబ్జెక్టులవారీగా స్కోర్లు ఎంతంటే.. పరఖ్ ద్వారా నిర్వహించిన సర్వే పరీక్షలో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్టుల్లో ఏయే విభాగాల విద్యార్థులు ఎంత స్కోర్ చేశారో పరిశీలిస్తే అన్ని విభాగాల్లోనూ సగం శాతమే స్కోర్ ఉంది. గణితంలో.. ♦గణితంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాధించిన సగటు స్కోరు 37.48 శాతం మాత్రమే. ♦ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విద్యార్థుల సగటు స్కోరు 38.9 శాతం. ♦మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 39.48 శాతం ♦ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.02 శాతం ♦కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.12 శాతం ఫిజిక్స్‌లో.. ♦ఫిజిక్స్ అంశాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. 52.5 శాతం సగటు స్కోర్‌తో మంచి ప్రతిభ చూపారు. ♦వీరి తర్వాత 51 శాతం స్కోర్‌తో కంప్యూటర్ సైన్స్, 50 శాతం స్కోర్‌తో మెకానికల్ విద్యార్థులు వరుస స్థానాల్లో ఉన్నారు. కెమిస్ట్రీలో.. కెమిస్ట్రీ ప్రశ్నలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 53.1% సగటు స్కోర్‌తో అగ్రభాగాన ఉన్నారు. సీఎస్ఈ విద్యార్థులు 53%, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 51.3 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచారు. ఆప్టిట్యూడ్ టెస్టులో.. ఆప్టిట్యూడ్ టెస్టుకు సంబంధించి జనరల్ నాలెడ్జి తదితర అంశాల్లో విద్యార్థుల లోపాలు పరఖ్ సర్వేలో వెల్లడయ్యాయి. జనరల్ నాలెడ్జి, లాజికల్ రీజనింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. సర్వేలో పాల్గొనని అనేక విద్యాసంస్థలు పరఖ్ సర్వేలో ఐఐటీలు సహా అనేక సాంకేతిక విద్యాసంస్థలు పాల్గొనలేదు. తమిళనాడు నుంచి 24,499 మంది పాల్గొనగా.. అత్యల్పంగా గోవా నుంచి ముగ్గురు విద్యార్థులే పాల్గొన్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ల నుంచి 12,387 మంది విద్యార్థులు ఈ పరఖ్ సర్వేలో భాగస్వాములయ్యారు. ఏపీ నుంచి 5,628, తెలంగాణ నుంచి 4,234, కర్ణాటక నుంచి 8,739, కేరళ నుంచి 3,431, మహారాష్ట్ర నుంచి 11,334, యూపీ నుంచి 5,288 మంది పాల్గొన్నారు. -
సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలు
అనంతపురం విద్య: సాంకేతిక విద్యలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఒకే పుస్తకంలో ఒక పేజీలో ఇంగ్లిష్, మరొక పేజీలో తెలుగు కంటెంట్ ఉంటుంది. ఇవి తెలుగు మీడియం విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం సాంకేతిక విద్యా కోర్సులైన ఇంజినీరింగ్, డిప్లొమా పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. ఈ మేరకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిర్దేశించింది. ఇంజినీరింగ్, డిప్లొమా పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించే బాధ్యతను జేఎన్టీయూ(అనంతపురం)కు అప్పగించింది. దీంతో ఇప్పటికే మొదటి సంవత్సరం డిప్లొమా పుస్తకాలు 11, బీటెక్‌లో తొమ్మిది పుస్తకాలు ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి తర్జుమా చేశారు. తెలుగు మీడియం విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి వరకు మిర్రర్ ఇమేజీ పుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇదే తరహాలోనే బీటెక్, డిప్లొమాలోనూ మిర్రర్ ఇమేజీ పుస్తకాలకు రూపకల్పన చేశారు. దీనివల్ల తెలుగు మీడియం విద్యార్థులు విషయాన్ని త్వరగా అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గించేలా.. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి అడుగుపెట్టే విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావం ఎక్కువగా ఉంటోంది. విషయ పరిజ్ఞానంలో ఇంగ్లిష్ మీడియం వారితో పోటీపడలేమని చాలామంది అనుకుంటుంటారు. అలాంటి వారిలో ధైర్యాన్ని నింపేలా మిర్రర్ ఇమేజీ పుస్తకాలు రూపొందించాం. 2022–23 విద్యా సంవత్సరం నుంచి బీటెక్, డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థులకు సైతం తెలుగు భాషలో కంటెంట్ అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ కె.శేషమహేశ్వరమ్మ, ఏఐసీటీఈ టెక్నికల్ బుక్స్ రైటింగ్ కోఆర్డినేటర్ (రీజినల్ లాంగ్వేజెస్) (చదవండి: పల్లె జనం.. పట్టణ జపం) -
ఏఐసీటీఈ పచ్చ జెండా.. భారీగా పెరగనున్న సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక విద్యా కోర్సుల ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక ఉన్నత విద్యా మండలి (ఏఐసీటీఈ) తాజాగా పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి 2015లో శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ)లను ఆదేశించింది. దీనితో విద్యార్థులపై ఫీజుల భారం పెరిగిపోనుంది. ఫీజులు పెంచాలన్న ఏఐసీటీఈ నిర్ణయంపై అంతటా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. రెండింతలకుపైగా..: ఏఐసీటీఈ ఆదేశాల నేపథ్యంలో దాదాపు అన్ని సాంకేతిక, మేనేజ్మెంట్ కోర్సుల ఫీజులు రెండింతలకుపైగా పెరగనున్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కాలేజీల్లో విద్య మరింత భారం కానుంది. ఉదాహరణకు.. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ కోర్సులకు కనిష్ట వార్షిక ఫీజు రూ.35 వేలుగా ఉండగా.. ఏఐసీటీఈ ఆదేశాలు అమలైతే ఏకంగా రూ. 67 వేలకు పెరగనుంది. గరిష్ట ఫీజు రూ.1.35 లక్షల నుంచి ఏకంగా రూ. 1.89 లక్షలకు చేరనుంది. పెంపుపై రాష్ట్ర ఎఫ్ఆర్సీ తర్జనభర్జన రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల పెంపుపై ఎఫ్ఆర్సీ కొద్దినెలలుగా కసరత్తు చేస్తోంది. 2019లో నిర్ధారించిన ఫీజులకు మరో 10 శాతం పెంచి ఆదేశాలు ఇస్తారని ఇప్పటిదాకా అంతా భావించారు. కానీ ఏఐసీటీఈ పిడుగులాంటి ఆదేశాలు జారీ చేయడంతో.. ఏం చేయాలన్న దానిపై ఎఫ్ఆర్సీ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితుల్లో.. ఫీజుల పెంపు సమస్యగా మారుతుందేమోనని భావించిన ఎఫ్ఆర్సీ.. శనివారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేసినట్టు సమాచారం. ఫీజులు పెంచితే ఉద్యమమే.. రెండేళ్లుగా కరోనాతో పేద, మధ్య తరగతి వర్గా లు ఆర్థికంగా చితికిపోయాయి. జీవనమే దుర్భరమైన కుటుంబాలూ ఉన్నా యి. బతకలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఫీజు లు పెంచి పేదలకు ఉరి బిగించాలనే నిర్ణయం దారుణం. ఫీజులు పెంచితే ఉద్యమం తప్పదు. – నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి పెంచాల్సిన అవసరమేంటి? అధ్యాపకులకు ఏడో వేతన ఒప్పందం అమలు చేస్తున్నామని ప్రైవేటు కాలేజీలు ఏఐసీటీఈని నమ్మించాయి. అందుకే శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇది ముమ్మాటికీ అన్యాయమే. అధ్యాపకులకు ఇప్పటికీ ఐదో వేతన ఒప్పందం మేర వేతనాలే అందడం లేదు. కరోనా సమయం నుంచి అధ్యాపకులకు జీతాలు ఇవ్వని కాలేజీలూ ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా ఫీజులు పెంచడం దారుణం. – సంతోష్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక కాలేజీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు -
‘పరఖ్’లో నమోదు తప్పనిసరి
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలన్నీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఆధ్వర్యంలోని ‘పరఖ్’ పోర్టల్‌లో నమోదు కావడం ఇక తప్పనిసరి. ఈమేరకు ఏఐసీటీఈ తాజాగా అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీచేసింది. అన్ని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు parakh.aicteindia.org పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పేర్కొంది. విద్యావేత్తలు, సాంకేతిక, వృత్తిపరమైన నిపుణులు, పరిశ్రమ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో ఏఐసీటీఈ ‘పెర్ఫార్మన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జి ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్’ (పరఖ్) పేరిట ఈ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. విద్యార్థుల అభ్యాస మూల్యాంకనం దీని లక్ష్యం. విద్యార్థులు తమ అభ్యాస ఫలితాలను, నైపుణ్యాలను స్వీయ అంచనా చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇది అసెస్మెంట్ పోర్టల్ అని, పరీక్షకాదని ఏఐసీటీఈ తాజాగా విడుదల చేసిన నోటీసులో స్పష్టం చేసింది. విద్యార్థులు తమ అధ్యయన సమయంలో వారి విద్యాపరమైన లేదా ఇతర అంశాలలో సాధించిన అభివృద్ధిని అంచనా వేయడానికి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 7న కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఈ ఏకీకృత పోర్టల్‌ను ప్రారంభించారు. అయితే సంస్థల నుంచి స్పందన ఆశించిన మేరకు లేకపోవడంతో నమోదును తప్పనిసరి చేస్తూ ఏఐసీటీఈ ఆదేశాలు జారీచేసింది. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ విభాగాల్లోని విద్యార్థులకు వేర్వేరు అసెస్మెంట్లు కేటాయించారు. నిర్దేశిత గడువులోగా అసెస్మెంట్లు పూర్తయ్యేలా చూడాలని సంస్థలను ఏఐసీటీఈ ఆదేశించింది. -
అక్కడ చదివితే.. డిగ్రీలు చెల్లవు, ఉద్యోగాలు ఇవ్వం!
ఉన్నత విద్య కోసం పాకిస్తాన్‌కి వెళితే ఇండియాలో ఉద్యోగాలు, వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందలేరంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు సంయుక్త పత్రికా ప్రకటన విడుదల చేశాయి. భారతీయులు కానీ ఇండియన్ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ కలిగిన వ్యక్తులు ఎటువంటి ఉన్నత విద్య కోసమైనా పాకిస్తాన్ వెళ్లవద్దంటూ సూచించింది. ఒకవేళ ఎవరైనా పాకిస్తాన్‌కి చెందిన యూనివర్సిటీలు, విద్యాసంస్థల్లో కోర్సులను అభ్యసిస్తే వాటిని గుర్తించమని తెలిపింది. ఈ కోర్సులు, సర్టిఫికేట్ల ఆధారంగా ఇండియాలో ఉద్యోగాలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాటకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఎవరైనా భారతీయ వలస కార్మికులు పాకిస్థాన్ విద్యాసంస్థల్లో చదువుకుంటే.. వారికి పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే ఉద్యోగులు, ఇతర అడ్మిషన్లు పొందేందుకు అనుమతి ఇస్తామని పేర్కొంది. UGC & AICTE has advised students not to travel to Pakistan for pursuing higher education. pic.twitter.com/L1vl5XmotQ — ANI (@ANI) April 23, 2022 చదవండి👉🏾 అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు, స్థానిక డ్రైవర్ మృతి -
స్కిల్డు ఫోర్సు పేరిట... లక్ష మందికి నైపుణ్య శిక్షణ
సాక్షి, అమరావతి: దేశంలోని లక్ష మందికి పైగా విద్యార్థులకు వివిధ నైపుణ్యాల్లో శిక్షణ కోసం ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నట్టు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. స్కిల్డు ఫోర్సు పేరిట ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ టెక్నాలజీ సంస్థ అయిన సిస్కో, మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్(ఎంజీఎన్సీఆర్ఈ), ఆరెస్బీ ట్రాన్స్మిషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వంటి సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇప్పించనుంది. ఉన్నత విద్యనభ్యసించే ఆసక్తిగల విద్యార్థులు ఇంటర్న్‌షిప్.ఏఐసీటీఈఇండియా.ఓఆర్జీ’ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏఐసీటీఈ సూచించింది. తరగతి గది పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు సరైన నైపుణ్యావగాహనకు అవకాశం ఉంటుందని ఏఐసీటీఈ అభిప్రాయం. సాంకేతిక విద్యనభ్యసించే వారే కాకుండా ఇతర కోర్సుల వారికీ ఈ ఇంటర్న్‌షిప్ మేలు చేయనుంది. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ దేశంలో లక్ష మందికి ఏఐసీటీఈ నైపుణ్య శిక్షణకు ఏర్పాట్లు చేస్తుండగా.. అంతకు మించి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందిస్తుండటం విశేషం. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా లక్షలాది మందికి ప్రముఖ సంస్థల ద్వారా శిక్షణ కార్యక్రమాలు అమలు చేయిస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ద్వారా ప్రత్యేకంగా పలు ఐటీ ఆధారిత కోర్సులనూ అందిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రముఖ మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా 40కి పైగా ఐటీ కోర్సుల్లో ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తోంది. రాష్ట్రంలోని 1.60 లక్షల మందిని ఇప్పటికే ఈ కోర్సులకు ఎంపిక చేశారు. వాస్తవానికి ఈ ప్రత్యేక కోర్సులు అభ్యసించాలంటే ఒక్కో విద్యార్థికి రూ.10 వేల నుంచి 15 వేల వరకూ ఖర్చవుతుంది. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వమే ఈ కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందిస్తోంది. దీనికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి రూ.37 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ శిక్షణ కోసం ఉన్నత విద్యా మండలి, మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. (చదవండి: వైకల్యంతో పుట్టాడని వదిలేశారు!)