శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్ పరీక్షలంటే కొన్ని రోజుల నుంచే విద్యార్థుల్లో గుబులు మొదలై పరీక్షల జ్వరం వచ్చేసేది. టెన్షన్‌తో ప్రిపేర్ అవుతూ నానా తంటాలు పడుతూ పరీక్షలు రాసేవారు. మరికొందరు వన్ డే బ్యాటింగ్‌కి జై అంటూ ఒక రోజు ముందు పుస్తకాలు పట్టి పరీక్షలు రాసేవారు కూడా ఉంటారు. ఎగ్జామ్స్ అంటే పాఠ్యాంశాలు రోజుల తరబడి చదవడం, సమాధానాలు గుర్తుపెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాస్తూ ప్రాక్టీస్ చేయగా మరికొందరు చిన్న పిల్లల్లా బట్టి పట్టి గట్టెక్కెస్తుంటారు. ఇక నుంచి బీటెక్ విద్యార్థుల టెన్షన్‌కు తెరతీస్తూ ఓపెన్ బుక్ విధానంతో ఇంజినీరింగ్ పరీక్షలు ఉండబోతున్నాయి. అంటే పుస్తకాలు చూస్తూ ఏంచక్కా పరీక్షలు రాసుకోవచ్చు.
విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడంతోపాటు విశ్లేషణాత్మక పరిజ్ఞానం పెంచాలని ఈ పద్ధతికి ఏఐసీటీఈ శ్రీకారం చుట్టింది. పరీక్ష„ý తీరుతోపాటు ప్రశ్నాపత్రం, సమయం వంటి అంశాల్లో కీలక మార్పులు జరగనున్నాయని అధికార వర్గాల ద్వారా సమాచారం. ఇదే అమలైతే విద్యార్థులు రోజుల తరబడి పడే టెన్షన్, ఒత్తిడితోపాటు కష్టాలు దూరం అయినట్లేనని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రశ్నాపత్రాలు కూడా నైపుణ్యాలు వెలికితీసేలా ఉండబోతాయని సూచిస్తున్నారు.
ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్..
పుస్తకాల ఆధారంగా (ఓపెన్‌బుక్) పరీక్షలు జరపాలనే సంస్కరణకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా ఆమోదించింది. నైపుణ్యాలను పరీక్షించాలన్నా.. మానసిక ఒత్తిడిని తగ్గించాలన్నా.. ఓపెన్‌బుక్ విధానమే సరైందని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్షల విధానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సమస్యల పరిష్కారంతోపాటు, పరిజ్ఞానాన్ని పరీక్షించడంపై ప్రశ్నలివ్వాలని దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకు ఏఐసీటీఈ మార్గనిర్దేశం చేసింది.
కేవలం పాఠ్యాంశాలు గుర్తుపెట్టుకునేలా కాకుండా సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించి రాసేలా ప్రశ్నలుండాలని సూచించింది. సాధారణ విధానం కంటే నూతనంగా అమలయ్యే ఈ విధానంలో ఎక్కువ సమయం కేటాయించాలని సూచించింది. కానీ.. ఓపెన్ బుక్ విధానంలో ఇప్పటికే కొన్ని పరీక్షలు జరుగుతున్నాయని నేరుగా ప్రశ్నలు రాకుండా పరోక్ష అంశాలు, విశ్లేషణాత్మకంగా కూడిన ప్రశ్నలతో ప్రశ్నాపత్రం కాస్త కఠినంగానే ఉండబోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అధ్యాపకులకు శిక్షణ..
బీటెక్ పరీక్షల్లో కొత్త పరీక్షా విధానంపై అవగాహన పెంచేందుకు అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. సిలబస్ బోధన, పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నలకు జవాబులు రాసే విధానం, నైపుణ్యాలకు పదును పెట్టి వెలికితీసే అంశాలు ఇలా వివిధ విషయాలపై అధ్యాపకులకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అధ్యాపకులకు శిక్షణ ఇస్తే ఆది నుంచే పరీక్షల విధానాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన జరుగుతుందని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన, ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబు చేసే సామర్థ్యాన్ని నింపుతారనే ఉద్దేశంతో శిక్షణ అవసరమని భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2019–20 విద్యాసంవత్సరంలోకి అడుగు పెట్టే విద్యార్థులు సరికొత్తగా పరీక్షల రాయనున్నారని తెలుస్తోంది. దీనిపై విద్యార్థులు కూడా సంతృప్తిగా ఉంటే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment