Shatavahana University
-
సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతున్నారు.. కారణం ఏంటంటే..
సాక్షి, శాతవాహనయూనివర్సిటీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ 6వ సెమిస్టర్ భౌతిక శాస్త్రం క్వశ్చన్ పేపర్ కొందరు విద్యార్థుల సెల్‌ఫోన్‌కు రావడంతో బుక్‌లో అందులోని సమాధానాలు వెతుక్కుంటూ పరీక్షా కేంద్రం బాధ్యులకు పట్టుబడ్డారు. కళాశాల కేంద్రం వారు శాతవాహనకు సమాచారం అందించగా 9 మంది సెల్ఫోన్లు సీజ్ చేసి విచారణకు ఆదేశించారు. ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే విషయంపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. త్వరలోనే బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎస్‌యూ పరీక్షల విభాగం తెలిపింది. ఇలా జరిగింది...? డిగ్రీ 6,4వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 12 నుండి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 6వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఎస్సారార్ కళాశాల కేంద్రం వద్ద ఉదయం 10 గంటలు దాటిన తర్వాత కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రం బయటే ఉండడాన్ని పరిశీలించిన ఎస్సారార్ అధ్యాపకులు వారి వద్దకు వెళ్లి చూడగా సెల్ఫోన్లు చూస్తూ పేపర్లు చింపుతుండడం కనిపించింది. వెంటనే సెల్ఫోన్లు తీసుకొని చూడగా ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. దీంతో అవాక్కయిన ఎస్సారార్ అధ్యాపకులు శాతవాహన యూనివర్సిటీకి సమాచారమందించారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్షల విభాగం నుండి సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని 9 సెల్ఫోన్లు సీజ్ చేసి యూనివర్సిటీకి తీసుకెళ్లి పరీక్షల విభాగం అధికారులకు అప్పగించారు. ప్రశ్నాపత్రం లీక్‌పై విచారణ కమిటీ.. ఈ విషయాన్ని ఎస్‌యూ పరీక్షల నియంత్రణాధికారి శ్రీరంగప్రసాద్ వీసీ ప్రొఫెసర్ ఎస్.మల్లేశ్ దృష్టికి తీసుకెళ్లగా నలుగురితో కూడిన ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. కమిటీ త్వరలోనే నిజానిజాలు తేల్చి సంఘటనకు బాధ్యులైన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. లీక్ చేసిందెవరు...? ప్రశ్నాపత్రం లీక్ చేసింది ఎవరనే సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వ, కళాశాల, ప్రయివేట్ కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపాల్/బాధ్యులకు ఆన్లైన్లో ఏ రోజుకారోజు పరీక్షా సమయానికి అరగంట ముందు మాత్రమే యూనివర్సిటీ నుండి వస్తుంది. దానిని ప్రింట్ తీసి కేంద్రంలో ఉన్న విద్యార్థులకు అందిస్తారు. అరగంట ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఎలా విద్యార్థుల సెల్ఫోన్లకు వెళ్లిందనే విషయాలు తెలియకుండా ఉన్నాయి. దీని వెనక యూనివర్సిటీ సిబ్బంది ఉన్నారా.. లేదా కళాశాలల వారు ఉన్నారా అనే విషయాలు విచారణ చేపడుతున్నారు. ప్రత్యేక కమిటీ వేశాం.. విద్యార్థుల సెల్‌ఫోన్‌కు ప్రశ్నాపత్రం వచ్చిన విషయాన్ని వీసీ దృష్టికి తీసుకెళ్లాం. ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ జరుగుతుంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బా«ధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. – డాక్టర్ శ్రీరంగప్రసాద్, ఎస్‌యూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
బీటెక్ పరీక్షలకు కొత్త రూపు...!
శాతవాహనయూనివర్సిటీ: ఇంజినీరింగ్ పరీక్షలంటే కొన్ని రోజుల నుంచే విద్యార్థుల్లో గుబులు మొదలై పరీక్షల జ్వరం వచ్చేసేది. టెన్షన్‌తో ప్రిపేర్ అవుతూ నానా తంటాలు పడుతూ పరీక్షలు రాసేవారు. మరికొందరు వన్ డే బ్యాటింగ్‌కి జై అంటూ ఒక రోజు ముందు పుస్తకాలు పట్టి పరీక్షలు రాసేవారు కూడా ఉంటారు. ఎగ్జామ్స్ అంటే పాఠ్యాంశాలు రోజుల తరబడి చదవడం, సమాధానాలు గుర్తుపెట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు రాస్తూ ప్రాక్టీస్ చేయగా మరికొందరు చిన్న పిల్లల్లా బట్టి పట్టి గట్టెక్కెస్తుంటారు. ఇక నుంచి బీటెక్ విద్యార్థుల టెన్షన్‌కు తెరతీస్తూ ఓపెన్ బుక్ విధానంతో ఇంజినీరింగ్ పరీక్షలు ఉండబోతున్నాయి. అంటే పుస్తకాలు చూస్తూ ఏంచక్కా పరీక్షలు రాసుకోవచ్చు. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడంతోపాటు విశ్లేషణాత్మక పరిజ్ఞానం పెంచాలని ఈ పద్ధతికి ఏఐసీటీఈ శ్రీకారం చుట్టింది. పరీక్ష„ý తీరుతోపాటు ప్రశ్నాపత్రం, సమయం వంటి అంశాల్లో కీలక మార్పులు జరగనున్నాయని అధికార వర్గాల ద్వారా సమాచారం. ఇదే అమలైతే విద్యార్థులు రోజుల తరబడి పడే టెన్షన్, ఒత్తిడితోపాటు కష్టాలు దూరం అయినట్లేనని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ప్రశ్నాపత్రాలు కూడా నైపుణ్యాలు వెలికితీసేలా ఉండబోతాయని సూచిస్తున్నారు. ఏఐసీటీఈ గ్రీన్ సిగ్నల్.. పుస్తకాల ఆధారంగా (ఓపెన్‌బుక్) పరీక్షలు జరపాలనే సంస్కరణకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా ఆమోదించింది. నైపుణ్యాలను పరీక్షించాలన్నా.. మానసిక ఒత్తిడిని తగ్గించాలన్నా.. ఓపెన్‌బుక్ విధానమే సరైందని భావిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్షల విధానం అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. సమస్యల పరిష్కారంతోపాటు, పరిజ్ఞానాన్ని పరీక్షించడంపై ప్రశ్నలివ్వాలని దేశవ్యాప్తంగా యూనివర్సిటీలకు ఏఐసీటీఈ మార్గనిర్దేశం చేసింది. కేవలం పాఠ్యాంశాలు గుర్తుపెట్టుకునేలా కాకుండా సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించి రాసేలా ప్రశ్నలుండాలని సూచించింది. సాధారణ విధానం కంటే నూతనంగా అమలయ్యే ఈ విధానంలో ఎక్కువ సమయం కేటాయించాలని సూచించింది. కానీ.. ఓపెన్ బుక్ విధానంలో ఇప్పటికే కొన్ని పరీక్షలు జరుగుతున్నాయని నేరుగా ప్రశ్నలు రాకుండా పరోక్ష అంశాలు, విశ్లేషణాత్మకంగా కూడిన ప్రశ్నలతో ప్రశ్నాపత్రం కాస్త కఠినంగానే ఉండబోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అధ్యాపకులకు శిక్షణ.. బీటెక్ పరీక్షల్లో కొత్త పరీక్షా విధానంపై అవగాహన పెంచేందుకు అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు. సిలబస్ బోధన, పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు, విశ్లేషణాత్మక ప్రశ్నలకు జవాబులు రాసే విధానం, నైపుణ్యాలకు పదును పెట్టి వెలికితీసే అంశాలు ఇలా వివిధ విషయాలపై అధ్యాపకులకు ముందుగా శిక్షణ ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నారు. అధ్యాపకులకు శిక్షణ ఇస్తే ఆది నుంచే పరీక్షల విధానాన్ని దృష్టిలో ఉంచుకొని బోధన జరుగుతుందని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన, ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబు చేసే సామర్థ్యాన్ని నింపుతారనే ఉద్దేశంతో శిక్షణ అవసరమని భావిస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే 2019–20 విద్యాసంవత్సరంలోకి అడుగు పెట్టే విద్యార్థులు సరికొత్తగా పరీక్షల రాయనున్నారని తెలుస్తోంది. దీనిపై విద్యార్థులు కూడా సంతృప్తిగా ఉంటే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
పాత సిలబసే..!
రాష్ట్రంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)కు అనుగుణంగా డిగ్రీలో సిలబస్‌ను మార్చాలన్న నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి వాయిదా వేసుకుంది. ఇటీవల మండలి చైర్మన్, ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల సమావేశంలో సిలబస్‌పై ఒక నిర్ణయానికి వచ్చారు. డిగ్రీ సిలబస్, సీబీసీఎస్ క్రెడిట్స్ విధానంలో మార్పులపై చర్చించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వచ్చే విద్యాసంవత్సరం (2019–2020) డిగ్రీ సిలబస్‌ను సమూలంగా మార్చేందుకు కసరత్తు చేస్తుందనే ఉద్దేశంతో పాత సెలబస్‌నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఫలితంగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు కూడా పాతసిలబస్నే అనుçసరించి పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్): డిగ్రీ తరగతులు ప్రారంభమైన మొదట్లో సెలబస్ మారుతుందని మల్లాగుల్లాలు పడిన అధాపకులు.. పాత సిలబస్‌లోని ప్రాథమిక అంశాలను మాత్రమే బోధిస్తూ కొద్ది రోజులు కాలంగడిపా రు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి తాజాగా తీసుకున్న నిర్ణయంతో పాత సిలబస్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. పాఠ్యాంశాల బోధనలో వేగం పెంచారు. డిగ్రీ కోర్సుల్లో చాయిస్ బేస్ట్ క్రెడిట్ సిస్టం అమలులోకి వచ్చాక ఆరునెలల్లో ఒక సెమిస్టర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిగ్రీ తరగతులు జూలైలో ప్రారంభం కాగా జనవరిలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మొదట్లో సెలబస్‌పై స్పష్టత లేక దాదాపు పదిహేను, ఇరవై రోజులు గత సెలబస్లోని ప్రాథమికాంశాలు మెల్లిమెల్లిగా బోధిస్తూ వచ్చారు. కొన్ని కళాశాలల్లో విద్యార్థులు కూడా సిలబస్ ఇదేనో..? కాదో..? అనుకుని తరగతులపై పెద్దగా దృష్టిసారించలేదు. మారుతుందనే ఆలోచనతో ఇటూ అధ్యాపకులూ మనసు పెట్టకుండా సమయం వృథా చేశారు. తీరా ఉన్నత విద్యామండలి పాత సెలబస్‌నే అనుసరించాలనే నిర్ణయానికి రావడంతో సెలబస్, పాఠ్యాంశాలపై స్పష్టత ఏర్పడింది. దీనితో వివిధ కళాశాలల్లో సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో వేగం పెంచినట్లు సమాచారం. నాలుగు నెలల్లోనే బోధన...! డిగ్రీలో సెమిస్టర్ విధానం అమలైన నాటినుండి దాదా పు ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలు అన్ని లెక్కకడితే రెం డు నెలల సమయం పరీక్షలు రాయడానికే కేటాయించాల్సి వస్తుంది. దీంతో నాలుగు నెలల్లోనే అనుకున్న సిలబస్ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళిక రచించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం దాదాపు 20రోజుల పైగానే సిలబస్‌పై స్పష్టత లేకుండానే బోధన సాగింది. అంటే మెజారిటీ సెలబస్ దాదాపుగా 90 నుంచి 100 రోజుల్లోనే పూర్తిచేయాల్సి ఉంటుంది. సిలబస్ మారుతుందనే ఉద్దేశంతో మెల్లిగా బోధిస్తూ వచ్చిన అద్యాపకులు.. ఇప్పుడు మిగిలిన రోజులకు పాఠ్యప్రణాళిక రూపొందించుకుని వేగంగా లక్ష్యాన్ని గడువులోపు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎంత చేసినా కొన్ని కళాశాలల్లో సెమిస్టర్ ఆఖరులో కొన్నిసబ్జెక్టులకు ప్రత్యేకంగా అదనపు తరగతులు, సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతూనే ఉంది. సిలబస్ ప్రకారం కొన్ని కోర్సుల సెలబస్ ఇచ్చిన గడువులో పూర్తవుతుంది కానీ మరికొన్ని సబ్జెక్టులు ఇందులో ముఖ్యంగా ఒకటి, రెండు కంప్యూటర్స్‌కు సంబంధించిన సెలబస్‌కు ఆరు నెలల సమయం సరిపోదని విద్యావేత్తలు భావిస్తున్నారు. ప్రవేశాలిలా... శాతవాహన యూనివర్సిటీలో మొత్తం బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సుల్లో కలుపుకుని 45,471 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈ విద్యాసంవత్సరానికి 20,350 సీట్లు భర్తీ కాగా 44.75 శాతం నమోదైంది. 25,121 సీట్లు ఖాళీగానే మిగిలాయి. ఇందులో ఎక్కువ శాతం విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం వైపు మొగ్గుచూపినట్లు ప్రవేశాల గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.యూనివర్సిటీ పరిధిలో 81 శాతం ఇంగ్లిష్ మీడియం సీట్లుండగా దాదాపుగా 19 శాతం వరకు తెలుగు మీడియంలో సీట్లున్నాయి. కానీ 49 శాతం ఇంగ్లిష్ మీడియం సీట్లు భర్తీకాగా.. కేవలం 27 శాతమే తెలుగు మీడియం సీట్లు భర్తీ అయ్యాయి. ఇంటర్లో ఇంగ్లిష్‌మీడియం చదువుకున్న వారితో పాటు చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు కూడా డిగ్రీలో ఇంగ్లిష్ మీడియంను ఎంచుకున్నారు. కానీ తరగతి గదిలో బోధనను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇంటర్ నుండి డిగ్రీలోనే మీడియం మార్పు చేసుకున్నారు కాబట్టి తరగతి గదిలో తెలుగులో, ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలు బోధించాలని అధ్యాపకులను యాజమాన్యాలు సూచిస్తున్నాయి. కష్టమైనా సరే ఇంగ్లిష్మీడియంలోనే చదువాలని విద్యార్థులు నిర్ణయించుకుంటున్నారని అర్థమవుతోంది. రానున్న రోజుల్లో తెలుగు మీడియం చదివే అభ్యర్థులు కరవువుతారనే భావన విద్యావేత్తల్లో వ్యక్తమవుతోంది. డిగ్రీ సెలబస్ మార్పు అంశంపై వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.కోమల్‌రెడ్డిని సంప్రదించగా.. పాత సెలబస్‌నే అనుసరించాలని సూచించారు. -
పని ఎక్కువ.. జీతం తక్కువ..
శాతవాహనయూనివర్సిటీ: ప్రైవేటు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది. చెప్పుకునేందుకు అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ల హోదా అయినా.. సమయానికి వేతనాలు అందని దుస్థితి. ‘వారికేం.. వేలల్లో సంపాదిస్తారు..’ అనే పేరు తప్ప.. నెల గడిచినా.. జీతం ఎప్పుడొస్తుందోనని ఎదురుచూపులు తప్పడం లేదు. ఫీజు బకాయిల సాకుతో యాజమాన్యాలు నెలల తరబడి వేతనాలు ఇవ్వకపోవడంతో కొందరికి ఇల్లు గడవడమే గగనమవుతోంది. ‘బాగా’నే ఇస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్న యాజమాన్యాలు.. ఇచ్చేది మాత్రం అందులో 25శాతానికి మించడం లేదు. పరీక్షల్లో ఇన్విజిలేషన్ చేసినందుకు అధ్యాపకులకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి పెండింగ్ జిల్లాలో మొత్తం 15 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. ఇందులో 13 ప్రైవేట్‌వే.. డిగ్రీ కళాశాలలు 129 ఉండగా 104 ప్రైవేట్‌వే.. వీటిలో మొత్తం 10వేలకుపైగా ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్నిమాత్రమే క్రమం తప్పకుండా అధ్యాపకులకు వేతనాలు ఇస్తున్నాయి. మిగితా వాటిలో రెండు, మూడునెలలపాటు పెండింగ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. డిగ్రీలో 80 శాతం కళాశాలలు సమయానికి జీతాలివ్వడం లేదనే అపవాదు ఉంది. ఇంక్రిమెంట్ల విషయంలోనూ సరైన సమయానికి ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. రికార్డుల్లో నాలుగురెట్లు వేతనాలు సక్రమంగా చెల్లించని కొన్ని కళాశాలలు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. వేతనాలు తీసుకుంటున్నట్లు ఉద్యోగుల నుంచి సంతకాలు తీసుకుంటున్నాయి. సంతకం పెట్టకపోతే ఉద్యోగం పోతుందనే భయంతో ఎదురుప్రశ్నించలేకపోతున్నారు. రికార్డుల్లో చూపించే వేతనాలు మాత్రం వాస్తవంగా వారికి చెల్లించే వేతనాలతో పొల్చితే మూడు, నాలుగు రెట్లు ఉంటున్నాయి. ఈ మేరకు వేతనాల రిజిస్టర్లు సాధరణరోజుల్లో, అ«ధికారుల తనిఖీలకు సంబంధించి వేరువేరుగా నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్ని మూడు నుంచి ఆర్నెల్లకోమారు మాత్రమే జీతాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకుడిని ఇంక్రిమెంట్లు వస్తాయా..? వేతనాలు నెలనెలా ఇస్తారా..? అని అడిగితే ‘ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు.. వేతనాలు నెలనెలా ఇస్తే అదే మహాభాగ్యం అంటూ నిట్టూర్చాడు. రెమ్యూనరేషన్‌కూ ఎసరు ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించినప్పుడు.. ఇంటర్నల్ ప్రయోగపరీక్షలు నిర్వహించినప్పుడు అధ్యాపకులకు కొంత రెమ్యూనరేషన్ వస్తుంది. ఈ మొత్తాన్నీ ఇవ్వకుండా యాజమాన్యాలే మింగేస్తున్నాయని చర్చ అధ్యాపకుల్లో జరుగుతోంది. మరోవైపు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సంతకాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఏళ్ల తరబడి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న ప్రముఖ కళాశాలలు ఉన్నాయంటే అతిశయోక్తికాదు. తనిఖీ అధికారులు పరీక్షల విభాగం జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ సమయానికి రావడం లేదన్న సాకుతో ఉద్యోగులకు నెలనెలా జీతాలివ్వడం లేదని తెలుస్తోంది. రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు –గోపాల్, లెక్చరర్ జిల్లా వ్యాప్తంగా పలు కళాశాలల్లో జీతాలు సరిగా ఇవ్వకపోవడంతో బతుకు బండి నడపడం చాలా ఇబ్బందిగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా కళాశాల యాజమాన్యాలు జీతాలివ్వాలి. అలాగే ఇంటర్నల్, చివరి పరీక్షలకు సంబంధించిన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలి. -
ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వం
చొప్పదండి: సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటును సైనిక్ స్కూల్ సాధించామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని మాజీ ఎంపీ, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మండలకేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రక్షణ శాఖ అధికారులు నిర్వాహకులుగా ఉండే సైనిక శిక్షణ పాఠశాలకు, రుక్మాపూర్‌లో నెలకొల్పే శిక్షణ కేంద్రానికి తేడా చెప్పకుండా ప్రజలను ఏదో సాధించినట్లు మభ్యపెట్టడం సమంజసం కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విద్యార్థులకు శిక్షణ కోసం ఏర్పాటు చేస్తూ, సైనిక్ స్కూల్ సాధించినట్లు ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం 200ఎకరాల్లో శాతావాహన యూనివర్సిటీని ఏర్పాటు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం వైస్ చాన్స్‌లర్‌ను కూడా నియమించలేదన్నారు. సైనిక్ స్కూల్‌పై దుష్ప్రచారాలు మాని కోచింగ్ సంస్థ అని ప్రకటించాలని సూచించారు. డబుల్ బెడ్రూం కట్టివ్వాలి గత ప్రభుత్వ హయాంలో చొప్పదండిలో భూమి కొనుగోలు చేసి నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో డబల్ బెడ్రూం ఇళ్లు కట్టివ్వకుండా ప్రస్తుత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై పొన్నం మండిపడ్డారు. ఇళ్ల స్థలాల వద్దకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. అధికారం ఉందని ప్రభుత్వం స్థలాలు లాగేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, లబ్ధిదారుల తరఫున పోరాడుతామన్నారు. నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, నాగి శేఖర్, బండ శంకర్, ఆరెళ్లి చంద్రశేఖర్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, పురం రాజేశం పాల్గొన్నారు. -
శాతవాహన వర్సిటీలో అవినీతి: టీపీసీసీ
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు సాక్షి, హైదరాబాద్: కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వ పెద్దల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ ప్రశ్నించారు. ఈ విశ్వవిద్యాలయంలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీలో మూడేళ్ళుగా ఆడిట్ లేదని, మూడేళ్ళలో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, సమాచార హక్కు చట్టం కింద దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించామని మహేశ్ చెప్పారు. ఈ అక్రమ నియామకాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వాటా ఉందని ఆరోపించారు. తాము సేకరించిన ఆధారాల ద్వారా కడియం శ్రీహరి, ఇన్చార్జ్ వీసీ జనార్దన్‌రెడ్డి, వీసీ కోమల్ రెడ్డిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
గుర్తింపులేని ‘శాతవాహన ఫార్మసీ’
శాతవాహన యూనివర్సిటీల ఫార్మసీ కళాశాలకు ఇంతవరకు ఫార్మాసుటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) నుంచి ఆమోదంలేదు. 2009 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ కళాశాలలో ఇప్పటివరకు మూడు బ్యాచ్‌లలో 165మంది బీఫార్మసీ కోర్సు పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. పీసీఐ ఆమోదంలేకపోవడంతో వారి సర్టిఫికెట్ ఎందుకు పనికి రాకుండాపోది. డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మాసిస్ట్తోపాటు మరిన్నీ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు - కమాన్‌చౌరస్తా * కానరాని పీసీఐ గుర్తింపు * విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం * రెగ్యులర్ అధ్యాపకులు కరువు * అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు పీసీఐ అనుమతి కావాలంటే.. శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలకు పీసీఐ గుర్తింపు రాకపోవడానికి సరిపడా అధ్యాపకులు, సిబ్బంది లేకపోవడమే ప్రధానకారణం. పీసీఐ అనుమతి పొందడానికి కనీసంగా ప్రొఫెసర్లు 3, అసోసియేట్ ప్రొఫెసర్లు 4, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 11 మంది, ల్యాబ్ అసిస్టెంట్స్ 8, ల్యాబ్ అటెండర్లు 8మంది ఉండి, కార్యాలయ సిబ్బంది, అన్ని ప్రయోగశాలలతోపాటు ఇతర వసతులు ఉండాలి. ప్రస్తుతం కళాశాలలో ఒక్కరు కూడా రెగ్యులర్ ఉద్యోగులులేరు. ప్రిన్సిపాల్‌తోసహా అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే. 9మంది అకడమిక్ కన్సల్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్స్ 3, ల్యాబ్అటెండర్ ఒక్కరు మాత్రమే ఉన్నారు. నియామకాల ఊసేలేదు... ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ వీసీ లేక నియామకాలకు నోచుకోవడం లేదు. జనవరి 2014లో శాశ్వత ప్రాతిపదికన నియామాకాలకు ప్రకటన చేశారు. 2014 సెప్టెం బర్ 27న రాత పరీక్ష జరిగింది. నవంబర్ 2014లో ప్రక్రియను నిలిపివేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు నియామకాల ఊసెత్తడం లేదు. ఇక శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలకు పీసీఐ అనుమతి లేకపోవడంతో ఏటావిద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. వీసీని నియమిస్తేనే పరిష్కారం.. ప్రస్తుతం ఫార్మసీ విద్యార్థుల కష్టాలు తీరాలంటే శాశ్వత వైస్ చాన్స్‌లర్‌ను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎంతో ఆశతో కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్తే పీసీఐ అనుమతి లేక తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వీసీని, సరిపడా అధ్యాపకులను నియమించి.. పీసీఐ అనుమతి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపాలి శాతవాహన ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేశా. అయినా సర్టిఫికెట్‌కు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలేదు. కనీసం మెడికల్‌షాప్ పెట్టుకుని బతికే అవకాశంలేదు. ప్రభుత్వం చొరవ చూపి కళాశాలకు పీసీఐ అనుమతి తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాడాలి. పూర్తి స్థాయిలో అధ్యాపకులు, సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకోవాలి. -ప్రశాంత్, బీఫార్మసీ విద్యార్థి త్వరలోనే పీసీఐ అనుమతి వస్తుంది యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలకు పీసీఐ అనుమతి లేని విషయం వాస్తవమే. వాటికి కావాల్సిన పనులు పూర్తిచేశాం. పీసీఐ అనుమతి కోసం దరఖాస్తు చేశాం. పీసీఐ అధికారులు ఈ నెల 18 తర్వాత వచ్చే అవకాశముంది. ఫార్మసీ ప్రయోగశాలలకు సంబంధించిన పరికరాలు ఆర్డర్చేశాం. మూడురోజుల్లో కావాల్సిన వస్తువులు మొత్తం వస్తాయి. గతంలో అధ్యాపకుల గురించి నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. -ఎం.కోమల్‌రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్