శాతవాహన వర్సిటీలో అవినీతి: టీపీసీసీ
నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో జరిగిన అవినీతిపై ప్రభుత్వ పెద్దల మౌనం వెనుక ఆంతర్యం ఏమిటని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ ప్రశ్నించారు. ఈ విశ్వవిద్యాలయంలో యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీలో మూడేళ్ళుగా ఆడిట్ లేదని, మూడేళ్ళలో రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.
అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, సమాచార హక్కు చట్టం కింద దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించామని మహేశ్ చెప్పారు. ఈ అక్రమ నియామకాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి వాటా ఉందని ఆరోపించారు. తాము సేకరించిన ఆధారాల ద్వారా కడియం శ్రీహరి, ఇన్‌చార్జ్ వీసీ జనార్దన్‌రెడ్డి, వీసీ కోమల్ రెడ్డిపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.