ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేశాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రాజెక్టుల రీడిజైనింగ్, వాటిలోని అవినీతి, అక్రమాలు, లోపాలు, ప్రత్యామ్నాయాల వంటి వాటిపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమర్థంగా ప్రజలకు వివరించగలిగామని కాంగ్రెస్ పార్టీ సంతృప్తితో ఉంది. టీపీసీసీ లేవనెత్తిన చాలా ప్రశ్నలకు టీఆర్‌ఎస్ నుంచి నిర్ధిష్టమైన సమాధానాలు రావడం లేదంటే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సాంకేతిక అంశాలను, అంకెలు, వాస్తవాలతో పాటు ప్రజల ముందుంచినా ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోతోందని పీసీసీ ముఖ్య నాయకులు అంటున్నారు.
తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఆయకట్టుకు ఉపయోగపడేలా ప్రాజెక్టులను డిజైన్ చేయాలని కోరితే తప్పుగా చిత్రీకరించిన టీఆర్‌ఎస్‌కు సమాధానం చెప్పినట్టుగా కాంగ్రెస్ నేతలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
‘కాకతీయ’ పోటీ.. భారీ టెండర్లలో ఏదీ?
రాష్ట్రంలో చెరువుల మరమ్మతులకు చేపట్టిన మిషన్ కాకతీయకు టెండర్ల సందర్భంగా ప్రభుత్వం అనుసరించిన పారదర్శకత, నిబంధనలు భారీ ప్రాజెక్టుల విషయంలో ఏమైందని టీపీసీసీ ప్రశ్నిస్తోంది. మిషన్ కాకతీయలో అంచనా విలువలో 30 శాతం దాకా లెస్‌లు వచ్చాయని, దీని వల్ల రూ. 2 వేల కోట్ల మిషన్ కాకతీయ పనుల్లో రూ. 600 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయినట్టుగా మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ప్రస్తావించినా సమాధానం చెప్పలేకపోతోందని టీపీసీసీ నేతలు వాదిస్తున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 2 శాతం ఎక్కువకు పనులు ఇవ్వడంలో రహస్యం ఏమిటో ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. రీడిజైనింగ్, భూసేకరణ, టెండర్లలో అవినీతి వంటివాటిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసినా ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని టీపీసీసీ ప్రశ్నిస్తోంది. బహిరంగ సవాల్‌కు వెనుకాడటంలోనే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని స్పష్టమవుతోందని టీపీసీసీ భావిస్తోంది.