గుర్తింపులేని ‘శాతవాహన ఫార్మసీ’ | Unrecognized 'Shatavahana pharmacy' | Sakshi
Sakshi News home page

గుర్తింపులేని ‘శాతవాహన ఫార్మసీ’

Published Wed, Feb 3 2016 2:30 AM | Last Updated on Fri, Nov 9 2018 4:14 PM

గుర్తింపులేని ‘శాతవాహన ఫార్మసీ’ - Sakshi

గుర్తింపులేని ‘శాతవాహన ఫార్మసీ’

శాతవాహన యూనివర్సిటీల ఫార్మసీ కళాశాలకు ఇంతవరకు ఫార్మాసుటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) నుంచి ఆమోదంలేదు. 2009 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ కళాశాలలో ఇప్పటివరకు మూడు బ్యాచ్‌లలో 165మంది బీఫార్మసీ కోర్సు పూర్తి చేసుకుని వెళ్లిపోయారు. పీసీఐ ఆమోదంలేకపోవడంతో వారి సర్టిఫికెట్ ఎందుకు పనికి రాకుండాపోది. డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఫార్మాసిస్ట్‌తోపాటు మరిన్నీ ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా మిగిలిపోతున్నారు
- కమాన్‌చౌరస్తా

 
* కానరాని పీసీఐ గుర్తింపు
* విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం
* రెగ్యులర్ అధ్యాపకులు కరువు
* అయోమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు

 
పీసీఐ అనుమతి కావాలంటే..

శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలకు పీసీఐ గుర్తింపు రాకపోవడానికి సరిపడా అధ్యాపకులు, సిబ్బంది లేకపోవడమే ప్రధానకారణం. పీసీఐ అనుమతి పొందడానికి కనీసంగా ప్రొఫెసర్లు 3, అసోసియేట్ ప్రొఫెసర్లు 4, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 11 మంది, ల్యాబ్ అసిస్టెంట్స్ 8, ల్యాబ్ అటెండర్లు 8మంది ఉండి, కార్యాలయ సిబ్బంది, అన్ని ప్రయోగశాలలతోపాటు ఇతర వసతులు ఉండాలి. ప్రస్తుతం కళాశాలలో ఒక్కరు కూడా రెగ్యులర్ ఉద్యోగులులేరు. ప్రిన్సిపాల్‌తోసహా అందరూ కాంట్రాక్టు ఉద్యోగులే. 9మంది అకడమిక్ కన్సల్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్స్ 3, ల్యాబ్‌అటెండర్ ఒక్కరు మాత్రమే ఉన్నారు.
 
నియామకాల ఊసేలేదు...

ప్రస్తుత పరిస్థితుల్లో రెగ్యులర్ వీసీ లేక నియామకాలకు నోచుకోవడం లేదు. జనవరి 2014లో శాశ్వత ప్రాతిపదికన నియామాకాలకు ప్రకటన చేశారు. 2014 సెప్టెం బర్ 27న రాత పరీక్ష జరిగింది. నవంబర్  2014లో ప్రక్రియను నిలిపివేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు నియామకాల ఊసెత్తడం లేదు. ఇక శాతవాహన యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలకు పీసీఐ అనుమతి లేకపోవడంతో ఏటావిద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
 
వీసీని నియమిస్తేనే పరిష్కారం..

ప్రస్తుతం ఫార్మసీ విద్యార్థుల కష్టాలు తీరాలంటే శాశ్వత వైస్ చాన్స్‌లర్‌ను నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఎంతో ఆశతో కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వెళ్తే పీసీఐ అనుమతి లేక తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం వీసీని, సరిపడా అధ్యాపకులను నియమించి.. పీసీఐ అనుమతి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
 
ప్రభుత్వం చొరవ చూపాలి

శాతవాహన ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేశా. అయినా సర్టిఫికెట్‌కు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలేదు. కనీసం మెడికల్‌షాప్ పెట్టుకుని బతికే అవకాశంలేదు. ప్రభుత్వం చొరవ చూపి కళాశాలకు పీసీఐ అనుమతి తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాడాలి. పూర్తి స్థాయిలో అధ్యాపకులు, సిబ్బందిని నియమించేలా చర్యలు తీసుకోవాలి.
 -ప్రశాంత్, బీఫార్మసీ విద్యార్థి
 
త్వరలోనే పీసీఐ అనుమతి వస్తుంది

యూనివర్సిటీ ఫార్మసీ కళాశాలకు పీసీఐ అనుమతి లేని విషయం వాస్తవమే. వాటికి కావాల్సిన పనులు పూర్తిచేశాం. పీసీఐ అనుమతి కోసం దరఖాస్తు చేశాం. పీసీఐ అధికారులు ఈ నెల 18 తర్వాత వచ్చే అవకాశముంది. ఫార్మసీ ప్రయోగశాలలకు సంబంధించిన పరికరాలు ఆర్డర్‌చేశాం. మూడురోజుల్లో కావాల్సిన వస్తువులు మొత్తం వస్తాయి. గతంలో అధ్యాపకుల గురించి నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం.
-ఎం.కోమల్‌రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement