Government jobs
-
ఊరంతా ఉద్యోగులే
మరిపెడ రూరల్: ఒకప్పుడు మారుమూల గిరిజన తండా.. ఆపై సౌకర్యాల లేమి. అయితేనేం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇంటికొకరు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారంటే ఆశ్చ ర్యం కలుగక మానదు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అన్ని హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉన్నారు. చిన్న, సన్నకారు రైతులు కష్టపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్ర భుత్వ కొలువుల్లో స్థిరపడేలా చేశారు. మరికొందరు ప్రైవేట్ రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏంటి అనుకుంటున్నారా.. అదే మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండధర్మారం. పట్టణాన్ని తలపించేలా.. మారుమూల తండా అయిన తండధర్మారం.. నేడు పట్టణాన్ని తలపిస్తోంది. అన్నీ డాబాలు, రెండు, మూడు బహుళ అంతస్తుల భవనాలున్నాయి. తాతముత్తాతల నుంచి గ్రామంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా కుటుంబాలు జీవిస్తుండేవి. ఊరి పేరులో తండా అని ఉన్నప్పటికీ అక్కడ అన్ని వర్గాల కుటుంబాలు నివసిస్తున్నారు. గ్రామంలో 267 గృహాలు, 1,160 మంది జనాభా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రభుత్వ కొలువుతో ఆ పల్లె విలసిల్లుతోంది. తామేమీ తక్కువ కాదంటూ ఒకరికంటే ఒకరు పోటీ పడి ఉన్నత చదువులు చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. పూర్వ కాలంలోనే ఈ గ్రామంలో బడి పంతుళ్లు, పోలీస్ పటేల్‌గా కొలువు దీరారు. వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన ఉద్యోగులంతా సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో కలుసుకొని గ్రామంలోని మహిళలు, యువతకు వివిధ పోటీలు నిర్వహిస్తుంటారు. 100 మందికిపైగా ప్రభుత్వోద్యోగులు గ్రామంలో 10, 15 ప్రభుత్వ కొలువులు ఉంటేనే గొప్ప. అలాంటిది తండధర్మారంలో 100 మందికిపైగా ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడ్డారంటే మామూలు విషయం కాదు. గ్రామానికి చెందిన గుగులోతు రవినాయక్ (ఐఏఎస్) తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా కొనసాగారు. అలాగే గుగులోతు వసంత్‌నాయక్ ఆర్ అండ్ బీ ఎస్సీగా విధులు నిర్వహిస్తున్నారు. గుగులోతు సుమలత ఇటీవల ఆర్టీఏ కొలువు సాధించి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు, ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీస్ ఇలా అన్ని శాఖల్లోనూ కొలువై ఉన్నారు. స్వాతంత్య్రం రాకముందే.. స్వాతంత్య్రం రాక ముందే గ్రామంలో పదుల సంఖ్యలో విద్యావంతులున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని గుగులోతు సక్రునాయక్ మొదటి బడిపంతులుగా కొలువుదీరినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే హన్మంతునాయక్, స్వాతంత్య్ర సమరయోధుడు వెంకన్ననాయక్, గుగులోతు భగ్గునాయక్ తర్వాత బడిపంతులుగా నియమితులయ్యారు. గుగులోతు సిరినాయక్ అనే వ్యక్తి పోలీస్ పటేల్‌గా విధులు నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకునే గ్రామంలోని రైతులు, కూలీలు కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. -
రూ.20వేలకే గవర్నమెంట్ జాబ్ .. తెలంగాణ సచివాలయంలో కలకలం
సాక్షి,హైదరాబాద్ : ‘నేను ఐఏఎస్‌ని. మీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే చెప్పండి. మీకున్న అర్హతను బట్టి ఉద్యోగం ఇప్పిస్తా. ముందుగా అడిగినంత డబ్బులు ఇవ్వండి. అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇంటికి పంపిస్తా. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లో జాయినింగ్ తేదీ ఎప్పుడు ఉంటే అప్పుడు సచివాలయానికి రండి’ అంటూ బాధితుల్ని మోసం చేసిన ఘటన తెలంగాణ సచివాలయంలో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన తెలంగాణ సచివాలయానికి నకిలీ ఉద్యోగుల బెడద కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండు వారాల వ్యవధిలో ఇద్దరు నకిలీ ఉద్యోగుల్ని అరెస్ట్ చేయగా, తాజాగా మరో నకిలీ ఐఏఎస్ పట్టుబడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని బాధితుల నుంచి లక్షలు వసూలు చేసిన కేటుగాడికి సచివాలయంలోని రెగ్యులర్ ఉద్యోగులు సహకరించడం గమనార్హం.నిందితుడు నకిలీ ఐఏఎస్ అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఒక్కో బాధితుడి నుంచి ఒక్కో ఉద్యోగానికి 20వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు. అలా ఏడుగురు బాధితులు నిందితుడ్ని నమ్మి డబ్బులు ఇచ్చినట్లు సైఫదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో నిందితుడు నకిలీ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.అంతేకాదు, ఫేక్ అపాయింట్మెంట్ ఇచ్చి బాధితుల్ని డైరెక్ట్‌గా సచివాలయానికి రప్పించడంపై ఎస్పీఎఫ్ అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే, నిందితుడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరి నుంచి భారీ మొత్తంలో డబ్బుల్ని వసూలు చేసినట్లు గుర్తించారు. నకిలీ ఐఏఎస్‌కు సచివాలయంలో పలువురు రెగ్యులర్ ఉద్యోగులు సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఇంట్లో ఆమె.. డ్యూటీలో ఆయన బాస్
గజ్వేల్: స్పౌజ్ ఆప్షన్ వల్ల ఒకే చోట ఉద్యోగాలు చేసే అరుదైన అవకాశాన్ని పలువురు దంపతులు దక్కించుకున్నారు. ఒకే కార్యాలయంలో భర్త బాస్‌గా ఉంటే, భార్య కిందిస్థాయి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోవలోనే ములుగు ఏడీఏ (అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్(Assistant Director of Agriculture)(గా అనిల్ పనిచేస్తుండగా, భార్య ప్రగతి(Pragathi) ఆయన కిందిస్థాయి ఉద్యోగిగా ఏఓ(అగ్రికల్చర్ ఆఫీసర్)గా పనిచేస్తున్నారు. 2005లో ఏఓగా ఉద్యోగం పొందిన అనిల్(anil) ఆ తర్వాతికాలంలో ఏడీఏగా ప్రమోషన్ పొందారు. 2007లో ప్రగతిని పెళ్లి చేసుకున్నారు. ఆమెకు సైతం 2009లో ఏఓగా ఉద్యోగం వచ్చింది. కొండపాక, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో పనిచేసిన అనిల్ 2021లో ములుగుకు ఏడీఏగా వెళ్లారు. సంగారెడ్డి, సిద్దిపేట భూసార కేంద్రాల్లో పనిచేసిన ప్రగతి 2018 నుంచి ములుగులో ఏఓగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో స్పౌజ్ ఆప్షన్లో తన భర్త ఏడీఏ రావడంతో ఆమెకు కలిసి వచి్చంది. ఇంట్లో ఆమె బాస్ అయితే ఉద్యోగంలో మాత్రం భర్త బాస్‌గా వ్యవహరిస్తున్నారు.ఆయన హెచ్ఎం.. ఆమె టీచర్ గజ్వేల్ మండలం కొడకండ్లకు చెందిన శ్రీశైలం, సరిత దంపతులు. 2008లోనే టీచర్లుగా ఉద్యోగం సాధించారు. ఇరువురు వివిధ ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్ ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఒకే చోట పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలో శ్రీశైలం హెచ్ఎంగా వ్యవహరిస్తుండగా, సరిత తన భర్త కిందిస్థాయి ఉద్యోగిగా టీచర్ విధులను నిర్వహిస్తున్నారు. -
మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన జయ
జగిత్యాల రూరల్: వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఓ యువతి పట్టుదలతో చదివి, మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని చెప్యాల గ్రామానికి చెందిన ముదుగంపల్లి భారత–చంద్రయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కూతురు స్రవంతికి వివాహం కాగా, రెండో కూతురు జయ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. పదోతరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని, బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది. అక్కడ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, గేట్లో మంచి ర్యాంక్ ద్వారా హైదరాబాద్ జేఎన్టీయూలో ఎంటెక్ పూర్తి చేసింది. ఇటీవల వెలువడిన పంచాయతీరాజ్ శాఖ ఏఈఈ, మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైంది. ఏఈఈ ఉద్యోగంలో చేరతానని తెలిపింది. -
బంగ్లాదేశ్‌లో చల్లారని ఉద్రిక్తతలు
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ఆందోళనలు తీవ్రంగానే కొనసాగుతున్నాయి. పోలీసులు, అధికార పార్టీ అనుబంధ విద్యార్థి సంఘాలతో ఆందోళనకారులు బాహాబాహీ తలపడుతున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో శుక్రవారం నాటికి 64 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. గాయపడిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుందని పేర్కొంది. అయితే, మరణాలు, క్షతగాత్రుల సంఖ్యపై యంత్రాంగం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. రాజధాని ఢాకా పరిధిలోని నర్సింగ్డి జిల్లాలో ఉన్న జైలుకు శుక్రవారం రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ముందుగా వారు జైలుపై దాడి చేసి, అందులోని వారందరినీ విడిచిపెట్టారు. ‘ఖైదీలంతా పరారయ్యాక ఆందోళనకారులు జైలు భవనానికి నిప్పుపెట్టారు. వెళ్లిపోయిన ఖైదీలు ఎంతమంది అనేది తెలియదు. కానీ, వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది’ అని ఓ పోలీస్ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది. శుక్రవారం ఢాకాలోని ప్రభుత్వ టీవీ కార్యాలయాన్ని సుమారు 1,000 మంది ఆందోళనకారులు ముట్టడించినట్లు ఏఎఫ్‌పీ తెలిపింది. వీరిని చెదరగొట్టేందుకు సరిహద్దు భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు పేర్కొంది. వీధుల్లో పెద్ద సంఖ్యలో బుల్లెట్లతోపాటు రక్తం మరకలు కనిపించాయని తెలిపింది. ఆందోళనకారులు గురువారం టీవీ కార్యాలయంలో కొంతభాగాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న వాహనాలకు నిప్పుపెట్టారు.దేశవ్యాప్త కర్ఫ్యూ ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరుతూ కొద్దిరోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు శృతిమించడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం శుక్రవారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. శాంతిభద్రతలను కాపాడటానికి సైన్యాన్ని రంగంలోకి దింపింది. -
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల జాబ్ కేలండర్‌కు చట్టబద్ధత కల్పించి, అసెంబ్లీలో జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏటా మార్చి 31వ తేదీనాటికి ఖాళీ పోస్టుల వివరాలు తెప్పించుకుంటామని.. జూన్‌లో నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9వ తేదీ నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. పదేళ్లుగా నోటిఫికేషన్లు లేక, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని.. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటే వాయిదా వేయా లంటూ కోచింగ్ సెంటర్ల యజమానులు, రాజకీయ నేతలు అభ్యర్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శనివారం జేఎన్టీయూలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యజమానులతో ‘ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత’ అన్న అంశంపై సీఎం రేవంత్ ముఖాముఖి చర్చించారు. వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయా లని కొందరు అంటున్నారు. పరీక్షలతో ఏమాత్రం సంబంధం లేనివారు దీక్షలు చేయడం వింత. ఇటీవల దీక్ష చేసిన ముగ్గురూ ఏ పరీక్ష కూడా రాయడం లేదు. ఒకరేమో కోచింగ్ సెంటర్ యజమాని. మరొ కరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పదవీ ఇవ్వలేదని ప్రభుత్వాన్ని గిల్లడమే పనిగా పెట్టుకున్నారు. గాందీలో దీక్ష చేసిన వ్యక్తి నాయకుడిగా ఎదగడానికి ఓ రాజకీయ నేత అండతో ఆందోళన చేశారు. గ్రూప్–1లో 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఎవరైనా కోర్టుకు వెళ్తే పరీక్షలు ఆగిపోతాయి. అందుకే నోటిఫికేషన్లో ఉన్న మేరకే పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. నిరుద్యోగుల కర్మాగారాలు కావొద్దు నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా ఇంజనీరింగ్ కాలేజీలు మారకూడదు. ప్రపంచంతోనే పోటీపడేలా ఇంజనీరింగ్ విద్యను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. నైపుణ్యం లేకుండా, కేవలం ఇంజనీరింగ్ పట్టాలిస్తే వారికి ఉద్యోగాలు రావు. తాత్కాలిక ఉద్యోగ, ఉపాధి మార్గాల కోసం కంప్యూటర్ కోర్సులను కాలేజీలు కావాలనుకోవడం సరికాదు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి కోర్సులను కనుమరుగు చేస్తే దేశానికే ప్రమాదం. ‘ఫీజు’ ఎప్పటికప్పుడు ఇస్తాం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాలేజీలు ఏమాత్రం దిగులు పడొద్దు. బకాయిలన్నీ వన్ టైం సెటిల్మెంట్గా ఇచ్చే యోచన చేస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచి్చన ఈ పథకాన్ని మరింత విజయవంతంగా నడిపిస్తాం. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఏ ఏడాదికా ఏడాదిలో ఇచ్చేందుకు ప్రయత్నించాలని నిర్ణయించాం. సంక్షేమంపైనే దృష్టి పెట్టడం వల్ల కొన్నేళ్లుగా రాష్ట్రం ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. లోపాలను గుర్తించాలి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక విద్య ఉండటం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. నైపుణ్యాభివృద్ధికి అవసరమైన కార్యాచరణ చేసే స్వేచ్ఛనిస్తున్నాం. విద్యలో ఉన్న లోపాలను గుర్తించి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాం. ఈ దిశగా ముందుకొచ్చే సంస్థలకు చేయూతనిస్తాం. ఫార్మా రంగంలో పరిశోధనను ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహించబట్టే కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ కేంద్రమైంది. సాఫ్ట్వేర్ రంగంలోనూ ప్రతి పది మందిలో ఒకరు తెలుగు వాళ్లే ఉన్నారు. వచ్చే 20 ఏళ్లలో ఎంతో మంది సీఈవోలు ఉండబోతున్నారు. ఐటీఐల సిలబస్‌లో మార్పు దశాబ్దాల నాటి సిలబస్‌తో నడుస్తున్న ఐటీఐలకు ఉజ్వల భవిష్యత్ తెచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను టాటా సంస్థ తోడ్పాటుతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా మారుస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్టు ఊహించని విధంగా అత్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలున్నా.. తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల నిరుద్యోగం కనిపిస్తోంది. ఆఖరికి నిర్మాణ రంగంలోనూ ఇతర రాష్ట్రాల వాళ్లే ఉంటున్నారు. ఈ పరిస్థితి మారాలి. స్కిల్ పెంపుతోనే ఇది సాధ్యం.ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్‌లో లీడ్ పార్టనర్‌గా తెలంగాణ ఉండాలన్నది మా లక్ష్యం’’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాలేజీలకు సామాజిక కోణం అవసరం: శ్రీధర్‌బాబు ప్రైవేటు కాలేజీలు సామాజిక కోణంలో విద్యా వ్యవస్థ మార్పు కోసం కృషి చేయాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. పరిశ్రమల అవసరాలు, పరిశోధన, అభివృద్ధి దిశగా కొత్త కోర్సులను రూపొందించేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తున్నామని.. తర్వాత 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తామని ప్రకటించారు. 2030 నాటికి ఐటీలో బెంగళూరును అధిగమించడమే తమ లక్ష్యమని చెప్పారు. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్‌కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం (ఫొటోలు)
-
దోశలేస్తూ ఒకేసారి రెండు కొల్వులు
-
పలువురికి ప్రభుత్వ ఉద్యోగాల జాక్‌పాట్
సిరిసిల్ల/ఉస్మానియాయూనివర్సిటీ/జన్నారం/చందుర్తి(వేములవాడ)/కోరుట్ల/మేడిపల్లి/మెట్పల్లి రూరల్: 4..3..2..4..2.. ఏ కార్పొరేట్ కళాశాల విద్యార్థులో సాధించిన ర్యాంకులు కావివి. ఒక్కొక్కరు నాలుగేసి..మూడేసి.. రెండేసి చొప్పున సాధించిన ప్రభుత్వోద్యోగాలు ఇవి. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు మనీషా నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది. ఇప్పటికే గురుకుల పాఠశాల, గురుకుల కళాశాలల్లో టీజీటీ, పీజీటీ అధ్యాపకురాలిగా, ఉపాధ్యాయినిగా ఎంపికైంది. తాజాగా గురువారం వెలువడిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించింది. గురువారం మధ్యాహ్నం వెల్లడైన డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో ఎంఏ సోషల్ విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. అలాగే ఓయూ క్యాంపస్‌లోని ఈఎంఎంఆర్‌సీ నైట్‌వాచ్‌మన్ ప్రవీణ్ మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల ప్రకటించిన గురుకుల విద్యాలయాల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లికి చెందిన అంచ అర్చన అలియాస్ వనజ.. ఇటీవల వెలువడిన ప్రభుత్వ గురుకుల పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంగ్లిష్ టీచర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించింది. గురువారం వెలువడిన ప్రభుత్వ గురుకుల జూనియర్ లెక్చరర్ (ఇంగ్లిష్) ఫలితాల్లోనూ ఎంపికైంది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దేశాయిపేటకు చెందిన నాగుల నరేశ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో నిర్వహించిన ఈఎంఆర్ఎస్ పీజీటీ ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఇటీవల నిర్వహించిన గురుకుల ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రతిభ చూపి టీజీటీ, పీజీటీ ఉద్యోగాలతోపాటు జూనియర్ ఇంగ్లిష్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరోవైపు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం సత్తక్కపల్లికి చెందిన కొడిమ్యాల పావని 17 రోజుల వ్యవధిలోనే రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఫిబ్రవరి 13న పీజీటీ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 41వ ర్యాంకు సాధించింది. జూనియర్ లెక్చరర్ (మ్యాథమెటిక్స్)లో రాష్ట్రస్థాయిలో 139వ ర్యాంకు సాధించి, ఉద్యోగానికి ఎంపికైంది. -
Korutla: మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
కోరుట్ల: నాలుగేళ్లలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది కోరుట్లకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు బెజ్జారపు వేణు–మాధవిల కూతురు మౌనిక. ఆమె 2013లో ఎం.ఫార్మసీలో గోల్డ్‌మెడల్ సాధించింది. మౌనిక వివాహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ శేఖర్‌తో జరిగింది. అనంతరం మళ్లీ చదువుపై దృష్టిపె ట్టి, 2019లో వీఆర్వో ఉద్యోగం సాధించింది. ఆ జాబ్ చేసూ్తనే అదే ఏడాది ఫార్మసిస్ట్ పోస్టుకు ఎంపికైంది. ప్రస్తుతం హై దరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తోంది. 2022 డిసెంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా దరఖాస్తు చేసుకుంది. 6 నెలల కష్టపడి చదివి, పరీక్ష రాయగా శుక్రవారం రాత్రి ఫలితాలు వెలువడ్డాయి. ఆమె రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. తన భర్త శేఖర్ ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఉద్యోగాలు సాధించానని తెలిపింది. -
రెండు లక్షల కొలువులిస్తాం
జవహర్‌నగర్, మేడ్చల్ రూరల్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెసేనని, తమ ప్రభుత్వం ఏర్పాటుకాగానే రెండు లక్షల కొలువులను భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే ఆగమవుతుందని కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని.. బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ఆగమైందని మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ను అభివృద్ధి చేయకపోగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గురువారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్, మేడ్చల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్ధి తోటకూర వజ్రేశ్ (జంగయ్య) యాదవ్‌ను గెలిపించాలంటూ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఆస్తులున్న కోకాపేట వైపు ఐటీ సంస్థలను ఏర్పాటు చేశారు. జవహర్‌నగర్‌ను అభివృద్ధి చేయకపోగా డంపింగ్ యార్డ్‌ను బహుమతిగా ఇచ్చారు. మేడ్చల్, జవహర్‌నగర్‌లలో ఐటీ కంపెనీలు రాకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. మేడ్చల్‌లో ఐటీ పార్క్ తెస్తామని గొప్పలు చెప్పిన కేటీఆర్ పత్తాలేకుండా పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం..’’అని తెలిపారు. మల్లారెడ్డి టికెట్ కోసం ఎన్నికోట్లు ఇచ్చారు? రాష్ట్రంలో కేసీఆర్ వందల కోట్లు దండుకుంటుంటే.. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జాచేస్తూ, కిందిస్ధాయి ప్రజాప్రతినిధులకు సీట్లు అమ్ముకుని వందల కోట్లు వెనకేసుకున్నారు. జవహర్‌నగర్‌లో ప్రభు త్వ స్థలంలో మంత్రి మల్లారెడ్డి ఆస్పత్రి కట్టినా పట్టించుకోవడం లేదుగానీ.. పేదలు 60 గజాల్లో గుడిసెలు వేసుకుంటే కూల్చివేస్తున్నారు. ఇంత అవినీతికి పాల్పడ్డ మల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం కేసీఆర్‌కు ఎన్ని కోట్లు ఇచ్చారో చెప్పాలి..’’అని రేవంత్ డిమాండ్ చేశారు. ఇక్కడ మూడుచింతలపల్లిని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు మూడోసారి గెలిపించాలంటూ వస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అడుగుతున్నారని.. హైదరాబాద్‌లో ఔటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, గోదావరి, కృష్ణా జలాల తరలింపు వంటివి వచ్చిది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాదా? అని ప్రశ్నించారు. దొరల ప్రభుత్వాన్ని కూల్చాలి అసలు తెలంగాణ ఇచ్చింది సోనియాగాందీ, కాంగ్రెస్ పార్టీ అని.. రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్దో. బిర్లామందిర్ మెట్లపైనో బిచ్చమెత్తుకునే వారని రేవంత్ అన్నారు. హరీశ్‌రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయని, కేసీఆర్, కేటీఆర్‌లకు వేల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు ఎక్కడివని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలు దొరల పాలనకు, పేదలకు మధ్య పోరాటమని.. పేదల ప్రభుత్వం రావాలంటే దొరల ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. రైతులను మోసం చేస్తున్న కేసీఆర్ కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా అంటూ రైతులను మోసం చేస్తున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 91వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు నివేదికలే వెల్లడించాయని రేవంత్ చెప్పారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా 30లక్షల మంది నిరుద్యోగులను ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఇల్లు లేని వారికి 250 గజాల స్థలంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తామని.. ఆడపిల్లలకు పెళ్లినాడే రూ.లక్ష ఆర్థిక సా యంతోపాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కార్పొరేటర్లు, జవహర్‌నగర్ ముదిరాజ్ జిల్లా యువజన అధ్యక్షుడు అనిల్, రజక, కురుమ సంఘం సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
భోపాల్: అటవీ శాఖ మినహా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ సివిల్ సరీ్వసెస్(స్పెషల్ ప్రొవిజన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ఉమెన్) రూల్స్–1997కు సవరణ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఇకపై మహిళలకు 35 శాతం కోటా అమలవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పోలీసు శాఖతోపాటు ఇతర ప్రభుత్వ పోస్టుల్లో 35 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు టీచర్ల పోస్టుల భర్తీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. -
ఆ అక్కాచెల్లెళ్లు సరస్వతీ పుత్రికలు..
తెనాలి: ఆ అక్కాచెల్లెళ్లు సరస్వతీ పుత్రికలు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. పెద్దమ్మాయి సచివాలయంలో విమెన్ అండ్ వీకర్ సెక్షన్ సంరక్షణ కార్యదర్శిగా చేస్తుండగా, ఏపీపీఎస్సీ ఇటీవల నిర్వహించిన గ్రూప్–1 పరీక్షల్లో రెండో అమ్మాయి ఏకంగా అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ ఉద్యోగాన్ని సాధించింది. ప్రభుత్వం షెడ్యూలు ప్రకారం పారదర్శకతంగా నిర్వహించిన పరీక్షల కారణంగానే ఓపెన్ కేటగిరీలో తొలి ప్రయత్నంతోనే ఉద్యోగాలు వచ్చాయని ఆ కుటుంబం ఆనందపడుతోంది. తొలి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగం మారంరెడ్డి దశరధరామిరెడ్డి. తెనాలిలోని ఎన్ఆర్కే అండ్ కేఎస్ఆర్ గుప్త డిగ్రీ కాలేజీలో చరిత్ర అధ్యాపకులు. పక్కా కాంగ్రెస్‌వాది. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుండదన్న భావనతో ‘కార్పొరేట్’ అవకాశాలను కాదనుకున్నారు. ఆయన భార్య నాగమణి. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి తిరుమల ప్రశాంతి. రెండో కుమార్తె స్రవంతిరెడ్డి. బీటెక్ చేశాక తిరుమల ప్రశాంతికి వివాహం చేశారు. భర్త బ్యాంకు ఉద్యోగి. తానూ బ్యాంకు పరీక్షలు రాద్దామని అనుకుంటుండగా, 2019లో రాష్ట్ర ప్రభుత్వం వార్డు/గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది. అదృష్టం పరీక్షించుకుందామని రాసిన తిరుమల ప్రశాంతికి మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం లభించింది. స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా.. రెండోకుమార్తె స్రవంతిరెడ్డి. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాశారు. నాలుగు వేల ర్యాంకుతో బీడీఎస్‌లో సీటు లభించింది. వైద్యవృత్తి కన్నా రైతుసేవ మంచిదన్న భావనతో, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ అనుబంధంగా గల బాపట్ల వ్యవసాయ కశాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీలో చేరారు. 2019లో కాలేజీ, విశ్వవిద్యాలయం టాపర్‌గా నిలిచారు. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్, నాటి యూనివర్సిటీ వీసీ చేతులమీదుగా మూడు బంగారు పతకాలను స్వీకరించారు. సివిల్స్ రాద్దామని కోచింగ్‌కు వెళ్లినా కరోనాతో సాధ్యం కాలేదు. తర్వాత సొంతంగా తయారై రెండుసార్లు సివిల్స్ రాసినా, ప్రిలిమ్స్ గట్టెక్కలేదు. గత సెప్టెంబరులో ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన ఈ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే అదీ ఓపెన్ కేటగిరీలో అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ పోస్టు రావటంతో మురిసిపోతోంది స్రవంతిరెడ్డి. ప్రభుత్వ పారదర్శక విధానాల వల్లే.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవటం, అందులోనూ ఎలాంటి అక్రమాలు, అవినీతికి తావులేకుండా పారదర్శకంగా భర్తీ చేయటం గొప్ప విషయమని దశరధరామిరెడ్డి అంటారు. తాను కాంగ్రెస్‌కి వీరవిధేయుడినని చెబుతూ, మధ్యతరగతి కుటుంబీకుడినైన తన బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించటం కష్టమన్న భావన ఉండేదని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మెరిట్‌కు ప్రాధాన్యత ఇస్తూ, సకాలంలో పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల నియామకాలతో ఆ భావన తొలగిపోయిందన్నారు. -
ఒకే ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో, కన్నవాళ్లు పడే తపనను దగ్గరుండి గమనించి అహర్నిశలు కష్టపడి చదివారు. ఫలితంగా ముగ్గురూ విద్యావంతులయ్యారు. ఒకరు డీఎస్పీగా.. మరొకరు ఆర్డీవోగా, మరో సోదరి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత కొలువులు సాధించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపారు. తల్లి పేరుకు తగ్గట్లే ‘సరస్వతీ’ పుత్రికలుగా ఖ్యాతి గడించారు. నందలూరు మండలం టంగుటూరుకు చెందిన సోదరీమణుల విజయగాథే ఈ రోజు ప్రత్యేక కథనం. రాజంపేట: నందలూరు మండలంలోని చెయ్యేటి పరీవాహక గ్రామమైన టంగుటూరు గ్రామంలో కంభాలకుంట సుబ్బరాయుడు, కంభాలకుంట సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి సరస్వతి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. తమ ముగ్గురు బిడ్డలైన లావణ్యలక్ష్మీ, మాధవి, ప్రసన్నకుమారిని బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ దిశగా ముగ్గుర్ని చదివించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముగ్గురు కూడా కష్టపడి చదివారు. లావణ్యలక్ష్మీ, ప్రసన్నకుమారి ఏఐటీఎస్‌లో బీటెక్ విద్యను పూర్తి చేసిన అనంతరం సివిల్స్‌లో రాణించాలనే పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. తొలి అడుగులో భాగంగా గ్రూప్స్‌లో విజేతలుగా నిలిచారు. లావణ్యలక్ష్మీ.....డీఎస్పీగా తొలి పోస్టింగ్ టంగుటూరు జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె పద్మావతి యూని వర్సిటీ పాలి టెక్నిక్ ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశా రు. 2009లో గ్రూప్–1 విజేత గా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టారు. విజయవాడలో సెంట్రల్ ఎసీపీగా పనిచేశారు. మార్కాపురం ఓఎస్డీగా పనిచేశారు. 14 యేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌లో ఛీప్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుపతిలో చేస్తున్నారు. ఈమె భర్త డా.చంద్రశేఖర్ నెల్లూరు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్టినేటర్‌గా పని చేస్తున్నారు. మాధవి.. అక్క లావణ్యలక్ష్మీ బాటలోనే మాధవి కూడా గ్రూప్స్‌లో విజేతగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేటలోని వైష్ణవీ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త కిరణకుమార్ కడపలో వ్యాపారిగా కొనసాగుతున్నారు. అక్క చూపిన బాటలో.. అక్కను ఆదర్శంగా తీసుకున్న ప్రసన్నకుమారి గ్రూప్–1లో విజేతగా నిలిచింది. టంగుటూరు జెడ్పీహెచ్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె , ఇంటర్ తిరుపతిలోని శ్రీ చైతన్యలో, ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశారు. తొలుత టంగుటూరు గ్రామ సమీప ప్రాంతమైన టీవీపురానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ప్రసన్నకుమారి గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యారు. ఆర్సీ రెడ్డి ఐఏ ఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. ఆర్డీఓగా నియమితులయ్యారు. సివిల్స్‌లో విజేత కావడమే తన లక్ష్యమంటున్నారు. ఈమె భర్త చంద్రాజీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నా కలలను బిడ్డలు నిజం చేశారు.. నేడు ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. నా భర్త ఆర్టీసీలో కండక్టరుగా పనిచేశారు. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కలను నా ముగ్గురు బిడ్డలు నిజం చేశారు. వారికి ఏనాడూ ఇంటిలో పనిచెప్పలేదు. చదువుకోవాలని పదేపదే చెబుతూవచ్చాను. కుమార్తెలను ఉన్నతంగా చూడాలనుకున్నారు. అదే జరిగింది. వారిని నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం. –తల్లి సరస్వతి -
స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది!
కోవిడ్ -19, ఆర్ధిక మాంద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా కొత్త టెక్నాలజీ పోకడలతో జాబ్ మార్కెట్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఉద్యోగ అవకాశాల కోసం అన్వేషిస్తున్న అభ్యర్ధులు ఎక్కడ ఏ జాబ్ దొరికినా చేరిపోయిందేందుకు సిద్ధపడుతున్నారు. అందుకు ఉదాహరణే ఈ తాజా ఉదంతం. ప్రారంభ వేతనం రూ.25,500తో ప్రభుత్వ ఉద్యోగానికి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు సుమారు 10 లక్షల మంది అప్లయ్ చేసుకున్నారు. ఇలా జాబ్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకులతో ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల్లో సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీపడుతున్నారు. ఇటీవల కోల్‌కతాలో విప్రో నిర్వహించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఫైల్స్‌తో ఎగబడుతున్న అభ్యర్ధులు అంటూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొన్ని వీడియోలు ప్రస్తుత ఉద్యోగాల పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇటీవల, మహారాష్ట్ర ప్రభుత్వం 4,600 ‘తలాతి’ పోస్టులకు ఎంబీఏలు, ఇంజినీర్లు, పీహెచ్డీ హోల్డర్లు సహా 10లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారని భూ రికార్డుల శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. తలాతి అంటే రెవెన్యూ శాఖ అధికారి. అతని పని భూమి రెవెన్యూ డిమాండ్, సేకరణ, హక్కుల రికార్డులు, ప్రభుత్వం సూచించిన గ్రామ ఫారాలకు సంబంధించిన గ్రామ ఖాతాలను నిర్వహించడం, పంటలు, సరిహద్దు గుర్తులను తనిఖీ చేయడం, వ్యవసాయ గణాంకాలను తయారు చేయడం వంటి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నెల వారి ప్రారంభ వేతనం రూ.25,500-రూ.81,100 మధ్య వరకు ఉంటుంది. క్లాస్ సీ గ్రేడ్ ఉద్యోగులు 4,600 పోస్ట్‌లకు 10లక్షలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు రాష్ట్ర పరీక్షల సమన్వయకర్త, భూరికార్డుల అదనపు సంచాలకులు ఆనంద్ రాయతే తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని వివిధ కేంద్రాల్లో ప్రతిరోజూ మూడు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుందని అన్నారు. ఇక ఈ జాబ్ కోసం అప్లయ్ చేసుకున్న వారిలో ఎంబీఏ, పీహెచ్డీ, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, ఇంజినీరింగ్ అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయని రాయతే వెల్లడించారు. అయితే, జాబ్‌తో సంబందం లేకుండా వేలాది ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలకు లక్షల మంది పోటీపడడంతో ఏఐ టూల్స్ పూర్తి స్థాయి వినియోగంతో భవిష్యత్‌లో అసలు ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదీ చదవండి : రిలయన్స్‌కు 1.67 లక్షల మంది ఉద్యోగుల రాజీనామా.. కారణం అదే -
వీరు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై అనర్హులు..! ప్రభుత్వం కీలక నిర్ణయం..
జైపూర్: దేశంలో మహిళలపై అమానవీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై జరిగిన దారుణం యావత్ దేశాన్ని తలదించుకునేలా చేసింది. అటు.. రాజస్థాన్‌లోని బిల్వారాలో నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని కలచివేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై మహిళలపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉంటే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. మహిళలపై వేధింపులు, అత్యాచార, అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు ఉన్నా, హిస్టరీ షీట్స్ నమోదైనా.. అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి అవకాశం ఉండబోదని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన లిస్ట్ ఇకపై పోలీసు స్టేషన్లలో ఉంటుందని చెప్పారు. ఇలాంటి నిందితుల ప్రవర్తన పత్రాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. ఇటీవల రాజస్థాన్‌లో మహిళలపై దారుణాలు ఎక్కువయ్యాయి. ఆగష్టు 2నే ఓ నాలుగేళ్ల బాలికను ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ అమానవీయ ఘటనపై యావత్ రాష్ట్రం నివ్వెరబోయింది. ఇదే గాక ఇంతకు ముందే జోద్పూర్లోనూ ఇలాంటి ఘటన జరిగింది. ఈ కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఈ దారుణ ఘటనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ఈ మేరకు చట్టాలను తీసుకువచ్చింది. ఇదీ చదవండి: లోక్ సభలో హనుమాన్ చాలీసా పారాయణం చేసిన మహా ఎంపీ.. -
ఇక అన్నీ సీబీ పరీక్షలే! లీక్‌లను అరికట్టేందుకు ఇదే ఉత్తమ మార్గం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర అపవాదును మూటగట్టుకున్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆయా పరీక్షలు రద్దు చేసిన కమిషన్.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ నిర్వహించే అర్హత పరీక్షల్లో 50 వేల లోపు అభ్యర్థులున్న పరీక్షలను మాత్రమే సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకంటే ఎక్కువున్నప్పుడు ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) ఆధారిత పరీక్షలను నిర్వహిస్తోంది. ఓఎంఆర్ ఆధారిత పరీక్షల నిర్వహణకు సుదీర్ఘ కసరత్తు అవసరం. ప్రశ్నపత్రా లను మూడు నెలలకు ముందుగానే ఖరారు చేసి రూపొందించడం, ఆ తర్వాత వాటిని అత్యంత గోప్యంగా ముద్రించడం, వాటిని పరీక్షా కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను కంటికి రెప్పలా కాపాడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓఎంఆర్ పరీక్షల విధానాన్ని క్రమంగా వదిలించుకోవాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. డిపార్ట్మెంటల్ పరీక్షలతో సహా అన్ని రకాల నియామక పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ దిశగా చర్యలు మొదలు పెట్టింది. లీకేజీకి చెక్..! సీబీటీ విధానంలో కఠినం, మధ్యస్థం, సులభతరం అనే మూడు కేటగిరీల్లో ప్రశ్న బ్యాంకులను తయారు చేసి సర్వర్‌లో అందుబాటులో ఉంచుతారు. ఎంతోముందుగా ప్రశ్నపత్రం ఖరారు చేయడం ఉండదు. పరీక్ష సమయంలో నిర్దేశించిన నిష్పత్తుల్లో అప్పటికప్పుడు ప్రశ్నలు అభ్యర్థులకు కంప్యూటర్లో ప్రత్యక్షమవుతాయి. అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఏదీ ఇవ్వరు. కంప్యూటర్ స్క్రీన్‌లో ప్రత్యక్షమైన ప్రశ్నలకు మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రశ్నపత్రాల లీకేజీకి దాదాపు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే సర్వర్ సిస్టంను హ్యాక్ చేయడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. వీటిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని అంటున్నారు. సాధ్యాసాధ్యాల పరిశీలన సీబీటీ పరీక్షల నిర్వహణలో మరో కీలక అంశం మౌలిక వసతులు. సీబీటీ పరీక్షలను నిర్వహించాలంటే తగినన్ని కంప్యూటర్లతో ల్యాబ్‌లు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం అయాన్ డిజిటల్ లాంటి సంస్థలతో పలు సంస్థలు అవగాహన కుదుర్చుకుని సీబీటీ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. అయితే భారీ సంఖ్యలో అభ్యర్థులున్నప్పుడు సీబీటీ పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనా? అనే కోణంలో కమిషన్ పరిశీలన చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్, పీజీ నీట్ తదితర పరీక్షలన్నీ సీబీటీ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు సగటున లక్ష నుంచి రెండు లక్షల వరకు అభ్యర్థులుంటున్నారు. అందువల్ల వీటిని ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తుండడంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లు ఆ మేరకు సర్దుబాటు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలను కూడా పూర్తిగా సీబీటీ పద్ధతిలో నిర్వహిస్తే అవసరమైన వ్యవస్థపై అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్యలక్షల్లో ఉంటే ఏయే వ్యవస్థలను వినియోగించుకోవాలి? పరీక్షలను ఒకేరోజు కాకుండా విడతల వారీగా నిర్వహిస్తే ఏం చేయాలి? మౌలిక వసతుల కల్పన ఎలా? తదితర అంశాలపై దృష్టి సారించారు. ప్రత్యేక ప్రణాళికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు సమాచారం. -
శరవేగంగా.. పారదర్శకంగా
సాక్షి, అమరావతి: అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక్క మెతుకు చాలు! ఉద్యోగాల భర్తీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిబద్ధత గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల ఉద్యోగాల భర్తీతోనే రుజువైంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఒకేదఫాలో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సక్రమంగా భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఉద్యోగాల భర్తీ ఎంత ప్రధానమో పారదర్శకంగా చేపట్టి అర్హులకు న్యాయం చేయడం అంతకంటే ముఖ్యమన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో 48 వేలకుపైగా ఉద్యోగాలను శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను రెండు వారాల్లోనే వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటేనే అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంఘన అని పలు సందర్భాల్లో రుజువు కాగా కోర్టు కేసులు, ఏళ్ల తరబడి సుదీర్ఘ భర్తీ ప్రక్రియతో నిరుద్యోగుల్లో నైరాశ్యం ఆవహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందుకు భిన్నంగా సక్రమం.. సత్వరం.. పూర్తి పారదర్శక విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తోంది. రెండు వారాల్లోనే ప్రిలిమినరీ ఫలితాలు పోలీసు ఉద్యోగార్థుల కలలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఏటా కనీసం 6 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది 6,100 కానిస్టేబుల్, 411 ఎస్సై పోస్టులతో మొత్తం 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీని రాష్ట్ర పోలీసు నియామక మండలి చేపట్టింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షను 997 కేంద్రాల్లో నిర్వహించింది. 6,100 పోస్టులకు 5.03 లక్షల మంది దరఖాస్తు చేయగా ప్రిలిమినరీకి 4,59,182 మంది హాజరయ్యారు. అంత భారీగా అభ్యర్థులు ఉన్నప్పటికీ రాత పరీక్ష ఫలితాలను కేవలం రెండు వారాల్లోనే ప్రకటించడం విశేషం. ప్రాథమిక ‘కీ’ కూడా ప్రకటించి అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. వాటిని పరీశీలించి మూడు ప్రశ్నలకు సమాధానాలను సరి చేసి తుది ‘కీ’ విడుదల చేశారు. ప్రిలిమినరీ పరీక్షలో 95,208 మంది అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించేందుకు కటాఫ్ మార్కును కూడా పోలీసు నియామక మండలి హేతుబద్ధంగా నిర్ణయించింది. మొత్తం 200 మార్కుల పరీక్షలో జనరల్ అభ్యర్థులకు 40 శాతం అంటే 80 మార్కులను కటాఫ్‌గా ఖరారు చేసింది. బీసీ అభ్యర్థులకు 35 శాతం అంటే 70 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికుల కేటగిరీ అభ్యర్థులకు 30 శాతం అంటే 60 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు. ఇక అభ్యర్థుల్లో ఎలాంటి అపోహలు తలెత్తకుండా ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులోకి తేవడం గమనార్హం. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకుని ‘కీ’తో సరిచూసుకునేందుకు మూడు రోజులపాటు అవకాశం కల్పించారు. పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఇంత పారదర్శకంగా, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సకాలంలో నిర్వహిస్తుండటం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెయిన్ పరీక్షకు, అనంతరం దేహదారుఢ్య పరీక్షలకు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నామని చెబుతున్నారు. 411 ఎస్సై పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 19న నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖలో 48 వేల పోస్టుల భర్తీ సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యమిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ మూడున్నరేళ్లలో వైద్య శాఖలోని వివిధ విభాగాల్లో ఇప్పటివరకు ఏకంగా 48 వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. పత్రికల్లో నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తున్నారు. ఏ ఒక్క పోస్టు భర్తీపైనా ఎలాంటి ఆరోపణలుగానీ ఫిర్యాదులుగానీ రాకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. నాడు అంతా అక్రమాలు.. కోర్టు కేసులే టీడీపీ హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంటేనే పెద్ద ప్రహసనం. రాత పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో... ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో అంతుబట్టక అభ్యర్థులు అల్లాడేవారు. నిబంధనలు, అర్హతలు, రిజర్వేషన్ల అమలుకు రోస్టర్ పాయింట్ల ఖరారు... ఇలా అన్ని స్థాయిల్లోనూ అక్రమాలే చోటు చేసుకోవడంతో అభ్యర్థులు తరచూ న్యాయ పోరాటాలకు దిగాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. రాత పరీక్ష ‘కీ’పై అభ్యంతరాలను కనీసం పట్టించుకునేవారే కాదు. ఓఎంఆర్ షీట్లను పరిశీలించేందుకు సులభంగా అనుమతించేవారు కూడా కాదు. రాత పరీక్ష నిర్వహణ, ఫలితాలపై అభ్యర్థుల సందేహాలకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానమే ఉండేది కాదు. అందుకు భిన్నంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విధానానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్దిష్ట ప్రక్రియను సృష్టించిందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి1.35 లక్షల సచివాలయాల పోస్టుల భర్తీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకతకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిదర్శనం. పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకొస్తూ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయడం ద్వారా యువత పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు. అదీ అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే భర్తీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకేసారి ఇంత భారీస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. 1.35 లక్షల ఉద్యోగాలకు ఏకంగా 21 లక్షల మంది దరఖాస్తు చేయగా 2019 సెప్టెంబరు 1–9త తేదీల మధ్య నిర్వహించిన ఎంపిక పరీక్షకు 19.5 లక్షల మంది హాజరయ్యారు. అయినప్పటికీ పరీక్ష ఫలితాలను 11 రోజుల్లోనే వెల్లడించి ఆపై రెండు వారాల్లోనే ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరేలా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల ప్రొబేషన్ పూర్తి అయిన తరువాత నిబంధనల మేరకు ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. అంత భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఎక్కడా ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేకుండా నిర్వహించడం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న మరో 14 వేల పోస్టులను కూడా అదే రీతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
అది అత్యంత ముఖ్యమైనది: తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి
ఇండోర్: ట్రాన్స్ జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ముఖ్యమని తొలి ట్రాన్స్ జెండర్ జడ్జి జోయిత్ మోండల్ నొక్కి చెప్పారు. అంతేగాదు ట్రాన్స్ జెండర్లు పోలీస్ ఫోర్స్, రైల్వే వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల వారిపట్ల సమాజ దృక్పథం కూడా మారుతుందని మోండల్ అన్నారు. ఈమేరకు లిట్ చౌక్ అనే సాంస్కృతి సాహిత్య ఫెస్టివల్లో పాల్గొన్న అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జోయితా మోండల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే తన కమ్యూనిటీ సభ్యులు, వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు చాలా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ట్రాన్స్ జెండర్ల కమ్యునిటీలకు సరైన వసతి లేదని, అందుకోసం ఒక పథకాన్ని ప్రవేశ పెట్టాలని అన్నారు. ఇదిలా ఉండగా జోయితా మోండల్ 2017లో పశ్చిమ బెంగాల్ ఇస్లాంపూర్ లోక్ అదాలత్‌లో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశంలో అలాంటి పదవిని అలంకరించిన తొలి ట్రాన్స్ జెండర్‌గా జోయితా మోండల్ నిలిచారు. ఆమె తర్వాత 2018లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో లోక్ అదాలత్‌లో న్యాయమూర్తిగా విద్యాకాంబ్లే, ఆమె తర్వాత గౌహతి నుంచిస్వాతి బిధాన్ బారుహ్ ఇలాంటి అత్యున్నత పదవిని అలకరించిన ట్రాన్స్ జెండర్లుగా నిలిచారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లు కూడా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఫిబ్రవరి 2023 కల్లా ఫిజికల్ టెస్టులకు ప్రమాణాలు నిర్దేశిస్తామని బొంబే హైకోర్టుకు తెలపడం గమనార్హం. (చదవండి: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయండి ) -
కళ్లెదుటే మార్పు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థతో రాష్ట్రంలోని కుగ్రామాల్లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఏకంగా 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులు, 2.65 లక్షల మంది వలంటీర్లు ఈ వ్యవస్థలో భాగస్వాములై ప్రజల గడప వద్దకే సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మూడేళ్లు పూర్తి చేసుకున్న ఈ వ్యవస్థకు అనుసంధానంగా ఏర్పాటైన విలేజ్ క్లినిక్‌లు ప్రజారోగ్య సంరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇదివరకెన్నడూ లేని విధంగా ఏర్పడ్డ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) విత్తనం మొదలు పంట విక్రయం వరకు అన్నదాతల చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల స్వరూపమే మారిపోయింది. గ్రామ గ్రామాన ఇంగ్లిష్ మీడియం చదువులు పేదల ఇళ్లలో విద్యా వెలుగును నింపుతున్నాయి. డిజిటల్ లైబ్రరీలతో యావత్ ప్రపంచం కుగ్రామాలకు మరింత చేరువైంది. తద్వారా ఎంతో మంది యువతీ యువకులు వర్క్ ఫ్రమ్ హోం ద్వారా సొంత గ్రామం నుంచే పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో పని చేస్తున్నారు. నభూతో అన్న రీతిలో ఏకంగా 37,181 శాశ్వత భవనాల నిర్మాణం ద్వారా ఆస్తుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేవలం మూడంటే మూడేళ్లలోనే మన కళ్లెదుటే ఇలా ఎన్నో అనూహ్య మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రజలకు సేవలందించే విషయంలో దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఏపీ దరిదాపుల్లో లేదనడం అతిశయోక్తి కాదు. ఏకంగా 4.70 కోట్ల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఎంతగా లబ్ధి కలిగించిందనేది అంచనాలకు అందనిది. ఎంతలో ఎంత తేడా! ► అవ్వాతాతలు పింఛను కోసం ఒకప్పటిలా.. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, ఆ ఊళ్లో పెద్దలు.. అధికార పార్టీ రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ► ఒకేసారి రూ.15 – 20 వేలు ప్రభుత్వ లబ్ధి కలిగేటప్పుడు కూడా లక్షల సంఖ్యలో ఉండే లబ్ధిదారుల్లో ఏ ఒక్కరినీ ఎవరూ కూడా ఒక్క రూపాయి లంచం అడిగే పరిస్థితి అసలే లేదు. ► పింఛనే కాదు మరే ప్రభుత్వ సంక్షేమ పథకం కోసమైనా పేదలెవరూ పైరవీ చేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ► నడవలేని స్థితిలో ఉండే అవ్వాతాతలు ఆపసోపాలు పడుతూ ప్రతి నెలా తమ పింఛను డబ్బులు తీసుకోవడానికి ఊళ్లో పంచాయతీ ఆఫీసు దాకా కూడా వెళ్లాల్సిన అవసరమే లేదు. ► ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి చిన్నా.. పెద్దా పని పడినా మారుమూల కుగ్రామాల్లో ఉండే ప్రజలు ఊరు దాటి మండలానికో, పట్టణా నికో వెళ్లాల్సిన పని అంతకంటే లేదు. ► సీఎం వైఎస్ జగన్ మానస పుత్రిక అయిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇలాంటి అనేక స్పష్టమైన మార్పులను తీసుకొచ్చింది. సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే విప్లవాత్మక రీతిలో శ్రీకారం చుట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వ్యవస్థ ద్వారా కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి.. కేవలం నాలుగు నెలల్లోనే అత్యంత పారదర్శకంగా వాటిని భర్తీ చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇప్పుడు ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకొని.. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పే– స్కేళ్లతో కూడిన వేతనాలు అందుకుంటున్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లందుకు.. సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 70–100 ఇళ్లకు ఒకరి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం కూడా అందజేస్తున్నారు. మొత్తంగా.. ఒక్క సచివాలయ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం ద్వారానే ప్రభుత్వం నాలుగు లక్షల కుటుంబాలకు ఉద్యోగావకాశాలను కల్పించింది. 11,354 ప్రభుత్వ భవనాల నిర్మాణం ► సచివాలయ వ్యవస్థ.. కేవలం ఉద్యోగుల నియామకం, ప్రజలకు సేవలు అందించడానికే పరిమితం కాలేదు. ప్రతి గ్రామంలో ఇలాంటి సేవలు అందజేసేందుకు శాశ్వత గ్రామ సచివాలయాల భవనాలతో పాటు రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాలు, డిజిటల్ లైబ్రరీ భవనాలు మొత్తం 37,181 నిర్మాణం కూడా చేపట్టింది. ► అందులో 11,354 భవన నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తవగా, మిగిలిన వాటిలో చాలా వరకు శ్లాబ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రామ సచివాలయ, రైతు భరోసా, హెల్త్ క్లినిక్ భవనాలు పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తున్నారు. ► ఈ వ్యవస్థకు అనుబంధంగా ఏర్పాటైన విలేజ్ క్లినిక్‌లు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు.. ప్రజలు, రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందుతున్న సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పేదల స్థితిగతులను సమూలంగా మార్చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. కుగ్రామాల్లోనూ ప్రతి రోజూ ‘స్పందన’ ► గ్రామాల్లో బడి కాకుండా ఉండే ప్రభుత్వ ఆఫీసు ఒక్క పంచాయతీ కార్యాలయమే. సగానికి పైగా గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు ఏడాదికి ఓ 12 నుంచి 15సార్లు మించి తెరుచుకోని పరిస్థితి ఉండేది. మూడేళ్ల క్రితం వరకు అసలు గ్రామ పంచాయతీ కార్యదర్శి సైతం లేని గ్రామాలు ఎన్నో ఉండేవి. ఉన్నా.. నాలుగైదు గ్రామాలకు ఒకరు ఇన్చార్జిగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఒక్కో గ్రామంలో పదేసి మంది పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. ► రైతులకు వ్యవసాయ సలహాలిచ్చేందుకు ప్రతి చోట ఓ వ్యవసాయ అసిస్టెంట్ పని చేస్తున్నారు. అనారోగ్యం పాలైన పశువులకు వైద్యం చేసేందుకు మరో ఉద్యోగిని నియమించారు. కరెంట్ అంతరాయాలను వెంటనే సరిచేయడానికి ప్రతి గ్రామానికీ ఓ ఎనర్జీ అసిస్టెంట్‌ను కూడా ప్రభుత్వం నియమించింది. ఏ ఊరికి ఆ ఊరిలో అక్కడి ప్రజల వినతులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే ఉద్యోగులందరూ ప్రతి రోజూ సాయంత్రం 3–5 గంటల మధ్య ‘స్పందన’ కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇంటర్నెట్ లేని గ్రామాలు 110 లోపే.. ► మూడేళ్లకు ముందు రాష్ట్రంలో మూడొంతుల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కనీసం కంప్యూటర్లు కూడా లేవు. కంప్యూటరు ఉన్న చాలా గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో ఇంటర్నెట్ వసతి లేక అవి పూర్తిగా నిరుపయోగంగా ఉండేవి. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు సమయంలో ప్రభుత్వం ప్రతి గ్రామ వార్డు సచివాలయానికి కొత్తగా రెండేసి కంప్యూటర్లు, కరెంటు లేని సమయంలో అది పనిచేయడానికి ఓ యూపీఎస్, ఇతరత్రా ఫర్నిచర్‌ను అందజేసింది. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు ప్రతి ఒక్కరి బయోమెట్రిక్ నమోదుకు ఫింగర్ ప్రింట్, ఐరిష్ స్కానర్లను కూడా అందజేశారు. సచివాలయంలోనే లబ్ధిదారులకు పింఛను కార్డు, ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు ప్రతి సచివాలయానికి ప్రింటర్, లామినేషన్ మిషన్లను సరఫరా చేశారు. ► సచివాలయంలో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్ ఎప్పటికప్పుడు ఆ సచివాలయానికి అందే దరఖాస్తులు ఆయా శాఖల వెబ్సైట్లలో నమోదు చేయడానికి ప్రతి సచివాలయానికి ఇంటర్ నెట్ వసతిని కూడా కల్పించారు. రాష్ట్రంలో కుగ్రామంలో ఉండే సచివాలయంలో కూడా ఇప్పుడు డిజిటల్ సేవలే కొనసాగుతున్నాయి. ► రాష్ట్రంలో 11,162 గ్రామ సచివాలయాలు ఉండగా, కొండ ప్రాంతాల్లో ఉండే కేవలం 110 సచివాలయాల్లో మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ఆయా సచివాలయాల్లో మొదట మాన్యువల్‌గా ఆ సేవలు అందజేస్తున్నట్టు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు చెప్పారు. సచివాలయాల ద్వారానే ఐదు కోట్ల ప్రభుత్వ సేవలు ► నగరాల్లో ఉండే వార్డు సచివాలయాలు, కుగ్రామంలో ఉండే సచివాలయం అన్న తేడా లేకుండా 2020 జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 545 రకాల రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ► కొన్ని ఎంపిక చేసిన సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ సేవలు కూడా మొదలయ్యాయి. దశల వారీగా అన్ని సచివాలయాల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తర్వాత దశలో పాస్‌పోర్టు, ఆధార్ సేవలు వంటి దాదాపు 200కు పైగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, కార్పొరేట్ సంస్థల సేవలను కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ► ఇప్పటి దాకా.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 4.70 కోట్ల వినతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో 10.50 లక్షల మంది ఆధార్ సేవలను కూడా వినియోగించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బీమాకు సంబంధించి 8.93 లక్షల మంది అసంఘటిత కార్మికులకు సచివాలయాల ద్వారానే ఈ– శ్రమ్ కార్డులను అందజేశారు. యూనిసెఫ్ గుర్తింపు ► ప్రపంచ వ్యాప్తంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే యూనిసెఫ్ సంస్థ సైతం మన రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ పట్ల ప్రశంసలు తెలిపింది. రాష్ట్రంలో ఆ సంస్థ అందజేసే సేవల్లో గ్రామ, వార్డు సచివాలయాలను, వలంటీర్లను భాగస్వామ్యం చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా యూనిసెఫ్‌కు చెందిన యూఎన్ వలంటీర్ల విభాగం ప్రతినిధుల బృందం కూడా పని చేస్తుండటం విశేషం. ► దీనికి తోడు రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు జాతీయ స్థాయిలోనూ పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు చెందిన ఉన్నతాధికారుల బృందాలు వేర్వేరుగా మన రాష్ట్రంలో పర్యటించి.. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేసి వెళ్లాయి. ► పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు వలంటీర్ల వ్యవస్థ స్థితిగతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం కావాలని తెలుసుకొని, వాటిని తమ రాష్ట్రాల్లోనూ అమలు చేసే విషయమై అధ్యయనం చేస్తున్నాయి. -
యూపీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ సదుపాయం
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఇకపై ప్రతిసారి తమ వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థుల సౌకర్యార్థం వన్‌టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీఆర్) విధానాన్ని యూపీఎస్సీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటీఆర్ వేదికపై ఒకసారి వ్యక్తిగత సమాచారం, ఇతర వివరాలు రిజస్ట్రేషన్ చేసుకుంటే చాలు. వేర్వేరు పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓటీఆర్ నంబర్ తెలియజేస్తే సరిపోతుంది. వారి వివరాలన్నీ దరఖాస్తు పత్రంలో ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల అభ్యర్థులకు సమయం ఆదా కావడంతోపాటు దరఖాస్తుల ప్రక్రియ మరింత సులభతరంగా మారుతుందని, దరఖాస్తుల్లో పొరపాట్లకు అవకాశం ఉండదని యూపీఎస్సీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థుల సమాచారం యూపీఎస్సీ సర్వర్లలో భద్రంగా ఉంటుందని తెలిపాయి. ఆన్లైన్ దరఖాస్తు పత్రంలో ఈ ఓటీఆర్ నంబర్ నమోదు చేస్తే 70 శాతం దరఖాస్తును పూర్తిచేసినట్లే. యూపీఎస్సీ నిర్వహించే అన్నిపరీక్షలకు ఓటీఆర్ ఉపయోగపడుతుంది. upsc.Govt.in లేదా upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఎప్పుడైనా సరే ఓటీఆర్‌లో అభ్యర్థులు వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని యూపీఎస్సీ ఒక ప్రకటనలో సూచించింది. ఇదీ చదవండి: కాంగ్రెస్ యూట్యూబ్ చానల్ తొలగింపు -
అమ్మా ఉద్యోగం వచ్చింది ... నాక్కూడా బాబూ!
కేరళలో తల్లి, కొడుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చాయి. కొడుక్కి ఉద్యోగం వచ్చింది. ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చింది’ అన్నాడు తల్లి దగ్గరకు వెళ్లి. ‘నాక్కూడా బాబూ’ అని జవాబు చెప్పిందా తల్లి. ఇద్దరూ ఒకేసారి గవర్నమెంట్ ఉద్యోగులు అయ్యారు. వారిని ఉత్సాహపరిచిన తండ్రి ఆనందంతో కళ్లు తుడుచుకున్నాడు. ఇంత మంచి కుటుంబ కథా చిత్రం ఈ మధ్య చూళ్లేదు మనం. కొబ్బరిచెట్లు సంతోషంతో తలలు ఊపాయి. వీధి అరుగులు చప్పట్లు కొట్టాయి. ఒక సామాన్యమైన ఇంటిలో హటాత్తుగా రెండు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి ఈ సంబరం మనదే అన్నట్టుగా ఊరు ఉంది. దానికి కారణం మొన్న ఆగస్టు 3న కేరళలో ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్’ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మలప్పురంలో అరిక్కోడ్ అనే ఉళ్లోని తల్లీకొడుకులు న్యూస్‌మేకర్స్‌గా నిలిచారు. తల్లి బిందు ‘లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్’ (ఎల్.జి.ఎస్.) విభాగంలో 92వ ర్యాంక్ సాధిస్తే కొడుకు వివేక్ ‘లోయర్ డివిజినల్ క్లర్క్’ (ఎల్.డి.సి.) విభాగంలో 38వ ర్యాంకు సాధించాడు. తల్లి వయసు 42. కొడుకు వయసు 24. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు 40 ఏళ్లు పరిమితిగా ఉన్నా కొన్ని వర్గాలకు 42 ఏళ్లు మరికొన్ని వర్గాలకు 46 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంది. తన సామాజికవర్గాన్ని బట్టి పరీక్ష రాయడానికి అర్హత ఉన్న బిందు 42 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం సాధించింది. ఈసారి కాకపోతే ఇంకేముంది... జాతీయస్థాయిలో ఇది విశేష వార్తగా మారింది. లాస్ట్ చాన్స్ బిందు చాలా కాలంగా అంగన్వాడి టీచర్‌గా పని చేస్తూ ఉంది. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంతో ఆమెకు సంతృప్తి లేదు. ఎప్పటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అనుకునేది. కొడుకు వివేక్ పదో క్లాసుకు వచ్చినప్పటి నుంచి ఆమె పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్‌కు ప్రిపేర్ అవుతూ ఉంది. అంతే కాదు కొడుకుతో కూడా నువ్వు గవర్మెంట్ ఉద్యోగం సాధించాలిరా అని తరచూ చెప్పేది. చిన్నప్పటి నుంచి అతని చేత పత్రికలు చదివించేది. కొడుకు డిగ్రీ అయ్యాక అతనూ ఉద్యోగానికి ప్రిపేర్ అవడం మొదలెట్టాడు. బిందు పట్టుదల చూసి ఆమె భర్త పూర్తిగా మద్దతు పలికాడు. కోచింగ్ లో చేరండి అని చేర్పించాడు. ఇంతకు మునుపు చేసిన అటెంప్ట్స్ ఫలించలేదు. ఈసారి బిందుకు లాస్ట్ చాన్స్. ఈసారి మిస్సయితే ఇక ఎగ్జామ్ రాసే వయసు ఆమె వర్గానికి సంబంధించి దాటేస్తుంది. ఎలాగైనా సాధించాలి అనుకుందామె. కోచింగ్ చేరి బిందు, వివేక్ ఇద్దరూ ఒకే కోచింగ్ సెంటర్లో చేరారు. కలిసి వెళ్లి కోచింగ్ తీసుకుని వచ్చేవారు. ఆ తర్వాత ఎవరికి వారు ప్రిపేర్ అయ్యేవారు. ‘మేము మా గదుల్లోకి వెళ్లి చదువుకునేవాళ్లం. మధ్యలో మాత్రం డౌట్స్ వస్తే ఒకరినొకరం అడిగేవాళ్లం. నోట్సులు ఎక్స్ఛేంజ్ చేసుకునేవాళ్లం’ అన్నాడు వివేక్. సంకల్పం వృధా కాలేదు. ‘ఉద్యోగం వచ్చిందమ్మా’ అని కొడుకు పరిగెత్తుకుని వెళితే ‘నాక్కూడారా’ అని నవ్విందామె. భలే ఉంది కదా... ఈ కుటుంబ కథా చిత్రం. -
TSSPDCL: జేఎల్‌ఎంల పోస్టులకు పదేళ్ల ‘వయో’ సడలింపు లేదు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) భర్తీ చేయనున్న జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయడం లేదు. విద్యుత్ స్తంభాలను ఎక్కి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహించే జూనియర్ లైన్మెన్కు శారీరక దారుఢ్యం అత్యంత ఆవశ్యకమని, అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. 1,000 జేఎల్ఎం, 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి సంస్థ ఈ నెల 9న సంక్షిప్త ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల కు మాత్రం 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ జిల్లా స్థాయి పోస్టులే కొత్త జోనల్ విధానం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించి భర్తీ చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి. ఐటీఐ (ఎలక్ట్రికల్)తో పాటు అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్ఎం పోస్టులకు అర్హులు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు కానున్నారు. డిస్కం స్థాయి పోస్టులుగా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికే షన్ వెలువడింది. గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను స్వీకరించను న్నారు. జూలై 17న రాత పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీర క వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తించనుంది. ఏఈ పోస్టుల ను కొత్త జోనల్ విధా నం కింద టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని పోస్టులుగా విభ జించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు. ఏఈ పోస్టుల నోటిఫికేషన్‌ను సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. -
మరీ ఇంత రుసుమా.. ఉద్యోగాలకు అప్లై చేయాలా వద్దా?
నిరుద్యోగులకు తీపి కబురంటూ తెలంగాణ ప్రభుత్వం అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడం శుభపరిణామం. కానీ దరఖాస్తు రుసుమును భారీగా పెంచడంతో నిరుద్యోగులపై పిడుగుబడినట్లయింది. ముఖ్యంగా గ్రామీణ యువత ఎక్కువగా దరఖాస్తు చేసుకునే పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు రుసుం పెరిగిపోవడం గ్రామీణ అభ్యర్థులు జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు ఇచ్చిన నోటిఫికేషన్లన్నిటికీ స్పందిస్తూ ఒక బీసీ అభ్యర్థి దరఖాస్తు చేసుకోవాలంటే రూ. 8,800 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒక బీసీ నిరుద్యోగ అభ్యర్థి కానిస్టేబుల్ ఉద్యోగానికి రూ. 800, ఎస్ఐ ఉద్యోగానికి రూ. 1,000 చెల్లించాలి. ప్రస్తుత నోటిఫికేషన్ల ప్రకారం సివిల్ కానిస్టేబుల్, టెక్నికల్ కానిస్టేబుల్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐ, టెక్నికల్ ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసు కోవడానికి ఒక బీసీ నిరుద్యోగ అభ్యర్థికి 8,800 రూపాయలు ఖర్చవు తున్నది. అందులో పీఎంటీ/పీఈటీ రూ. 900 తీసివేస్తే ఒక బీసీ నిరుద్యోగ అభ్యర్థి పోలీస్ కొలువులకు అన్నింటికీ దరఖాస్తు చేసుకోవాలి అంటే 7,900 రూపాయలు అవుతుంది. (క్లిక్: పుస్తకాలు దానం చేయండి!) లక్షలాది నిరుద్యోగ యువత నుంచి ఇలా భారీ మొత్తంలో దరఖాస్తు రుసుం వసూలు చేయడం ఎంత వరకు న్యాయం? కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లకూ లక్షల్లో ఖర్చవుతూనే ఉంది. కరోనాతో... చేయడానికి పనిలేక, ఆర్థికంగా చితికిపోయిన నిరుద్యోగ అభ్యర్థులూ, వారి తల్లిదండ్రులకూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా తలకు మించిన భారమైపోతోంది. దరఖాస్తు రుసుములకు భయపడే... అన్ని ఉద్యోగాలకూ అప్లై చేయాలా వద్దా అని నిరుద్యోగులు మీమాంసలో పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దరఖాస్తు రుసుం రద్దుచేయడం సమంజసం. కాదంటే... వంద, రెండు వందల రూపాయలకు పరిమితం చేసి పోలీస్ ఉద్యోగ అభ్యర్థులను ఆదుకోవాలి. – ముచ్కుర్ సుమన్ గౌడ్, సామాజిక కార్యకర్త -
ఆశగా ఆటగాళ్లు..! తెలంగాణలో ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలు
ఖమ్మం స్పోర్ట్స్: చాన్నాళ్ల తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఈక్రమంలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుచేయడమే కాక, ఎలాంటి నిబంధనలు లేకుండా, ఎప్పుడు సాధించిన సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండడంతో జిల్లా క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా విద్యా, ఉద్యోగ రంగాల్లో స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని క్రీడా రంగ ప్రతినిధులు పోరాటాలు చేశారు. ఈనేపథ్యాన ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీఓను ఈసారి నోటిఫికేషన్లలో అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఉద్యోగాల పోటీ పరీక్షల్లో సత్తా చాటేందుకు నిరుద్యోగులు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. చదవండి👉 తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా.. తొలిసారిగా 2012లో... క్రీడాకారులు, క్రీడాసంఘాల పోరాట ఫలితంగా తొలిసారిగా 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 84 జీఓ విడుదల చేశారు. ఈ జీఓ ఆధారంగా అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీలో రెండు శాతం స్పోర్ట్స్ కోటా అమలుకు అవకాశం దక్కింది. ఇదే జీఓను ఇప్పుడు అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ, అండర్ – 14, 17, 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆడి సర్టిఫికెట్లు పొందిన క్రీడాకారుల ఈ కోటా ద్వారా అవకాశం దక్కనుండడంతో ఉద్యోగం సాధించాలనే తపనతో చదువులో నిమగ్నమయ్యారు. నిబంధనలు లేకుండా... రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతుండగా, స్పోర్ట్స్ కోటా అమలుచేయనున్న ప్రభుత్వం ఈసారి మాత్రం మూడేళ్ల నిబంధన లేకుండా అన్ని సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఏదైనా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్ మూడేళ్ల వరకు అమల్లో ఉంటుందని గతంలో ప్రకటించారు. కానీ ఈసారి పలు ఉద్యోగాలకు వయస్సు నిబంధనలు సడలించినందున స్పోర్ట్స్ కోటా అమలులోనూ ఎప్పటి సర్టిఫికెట్లనైనా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో చాన్నాళ్ల క్రితం సర్టిఫికెట్లు సాధించి, ఇప్పటికీ ఉద్యోగాలు రాని అభ్యర్థులు మేలు చేకూరుతుందని చెబుతున్నారు. అయితే, అత్యధిక సర్టిఫికెట్లు కలిగిన వారికి తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. చదవండి👉🏻 దిమాక్ దొబ్బిందా!.. త్రిబుల్ రైడింగ్.. ఆపై మద్యం కూడా.. ఖేలో ఇండియా ఎలా? నాలుగేళ్ల నుంచి దేశంలో ఖేలో ఇండియా పేరిట ఏటా జాతీయస్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు సాధించిన వారికి కూడా స్పోర్ట్స్ కోటా అమలవుతుందా, లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనికి తోడు ఐదారేళ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన క్రీడల పరిస్థితి ఏమిటన్నది కూడా తెలియరావడం లేదు. కొన్ని క్రీడాంశాల్లో జిల్లా నుంచే నేరుగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశముండడంతో ఆయా క్రీడాకారులకు అవకాశం ఇచ్చేది, లేనిది ఇంకా వెల్లడించలేదు. ఈ అంశంపై ప్రత్యేక కమిటీ నియమించాలని క్రీడావర్గాలు కోరుతున్నాయి. ఇది మంచి పరిణామం ఎన్నో ఏళ్లనుంచి స్పోర్ట్స్ కోటాను అన్ని ఉద్యోగాల్లో అమలు చేయాలని పోరాడుతున్నాం. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటా అమలుకు నిర్ణయించడం మంచి పరిణామం. ఇక నుంచి అన్ని నోటిఫికేషన్లలో అమలుచేస్తే బాగుంటుంది. – పుట్టా శంకరయ్య, ఆర్చరీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి క్రీడాకారులకు ప్రోత్సాహం క్రీడాకారులను ప్రోత్సహించేలా స్పోర్ట్స్ కోటాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలు చేయడం బాగుంది. ఇప్పటి వరకు కొన్ని శాఖల్లో మాత్రమే నేరుగా స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాకాశాలు లభిస్తున్నాయి. ఈసారి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. – కె.ఆదర్శ్‌కుమార్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి యువకులకే అవకాశం ఇవ్వాలి రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా యువ క్రీడాకారులకే ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. రాష్ట్రంలోని యువత క్రీడలపై దృష్టి సారించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మరింత మంది ఉత్తమ క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షలు, మందుల వెంకటేశ్వర్లు ఉద్యోగం సాధిస్తాననే నమ్మకముంది ఉద్యోగాల భర్తీలో రాష్ట్రప్రభుత్వం స్పోర్ట్స్ కోటా అమలుచేయాలని నిర్ణయించడంపై సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ఇప్పటి వరకు జాతీయస్థాయి పోటీల్లో సాధించిన సర్టిఫికెట్లు పనికి రాకుండా పోతాయమోనని ఆవేదన చెందాను. కానీ ప్రభుత్వం నిర్ణయంతో ఈసారి ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది. – ఎం.జైనాద్ బేగ్ -
బీసీ స్టడీ సర్కిళ్లలో బ్రాహ్మణ నిరుద్యోగులకు శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న బ్రాహ్మణ నిరుద్యోగులకు బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ ఇప్పించాలని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిర్ణయించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖతో ఒప్పందం చేసుకుంది. గ్రూప్స్, పోలీస్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో ఆ ఉద్యోగాలు పొందాలనుకుంటున్న బ్రాహ్మణ నిరుద్యోగులు తమకు శిక్షణ కావాలని అభ్యర్థిస్తున్నారు. కానీ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యం లో ఇలాంటి శిక్షణ కేంద్రాలు లేకపోవడం తో, బీసీ సంక్షేమ శాఖను సంప్రదించి ఆ మేరకు అంగీకారం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లతోపాటు కొత్తగా ప్రతిపాదించిన మరో ఐదు సర్కిళ్లలో బ్రాహ్మణ అభ్యర్థులకూ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వివరాలను ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాలు వారి మాటల్లో.. ‘వార్షికాదాయం రూ.5 లక్షలు, అంతకంటే లోపు ఉన్న కుటుంబాల నిరుద్యోగులు ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు మే 1 నుంచి మే 7వ తేదీలోపు www.brahmin parishad.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మే 16 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కో సెంటర్లో గరిష్టంగా 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఈ సంఖ్య పెరిగితే రెండో బ్యాచ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. శిక్షణవేళ అభ్యర్థులకు స్టైపండ్ కూడా వస్తుంది. గ్రూప్–1 అభ్యర్థులకు రూ.5 వేలు, ఇతర పోస్టులకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తారు. అభ్యర్థులు మీ సేవ ద్వారా పొందిన కుల ధ్రువీకరణ పత్రం, రూ.5 లక్షలు, అంత కంటే లోపు ఉందని తెలిపే ఆదాయ ధ్రువపత్రం, 1 నుంచి 7వ తరగతిలకు చెందిన బోనఫైడ్ సర్టిఫికెట్, విద్యార్హత పత్రాలు, ఆధార్ ప్రతి, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, బ్యాం కు పాసు పుస్తకం ప్రతిని జత చేయాల్సి ఉంటుంది. ఏవైనా పత్రాలు అందుబాటులో లేకుంటే, తరగతులు ప్రారంభమయ్యేలోపు సమర్పిస్తామని సెల్ఫ్ డిక్లరేషన్ అందించాలి. బీసీ స్టడీ సర్కిళ్లలో ఓబీసీలకు 5 శాతం సీట్లు ఉండే వెసులుబాటు ఆధారంగా ఈ శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కోచింగ్.. స్టైపెండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రూ.50 కోట్ల వ్యయంతో 16 స్టడీ సర్కిళ్లతోపాటు 103 స్టడీ సెంటర్లలో 1.25 లక్షల మందికి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ అందించే శిక్షణలో బీసీ వర్గాలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీ లకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక 1.25 లక్షల మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రవేశ పరీక్ష కోసం ప్రతిష్టాత్మక ‘అన్ అకాడమీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని గంగుల తెలిపారు. ‘16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25వేల మందికి నేరు గా, మరో 50వేల మందికి హైబ్రిడ్ మోడ్ (ఆన్లైన్/ ఆఫ్‌లైన్ విధానం)లో శిక్షణ ఇస్తాం. అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా 50వేల మందికి శిక్షణ ఇస్తాం. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 16న ఉద యం 11 గంటలకు ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉం టుంది. దీనికోసం బుధవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈనెల 16 ఉదయం 10 గంటల వరకూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుం ది. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో నిర్ణయిస్తారు. అధిక మార్కులు సాధించిన వారిని గ్రూప్–1 శిక్షణకు ఎంపిక చేసి మెటీరియల్‌తోపాటు నెలకు రూ.5వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్ ఇస్తాం. మిగతావారిని మెరిట్ ఆధారంగా గ్రూప్–2, 3, 4, కానిస్టేబుల్, ఎస్సై వంటి ఇతర శిక్షణలకు ఎంపిక చేస్తాం. వీరికి 3 నెలల శిక్షణలో నెలకు రూ.2వేల స్టైపెండ్ ఇస్తాం. అలాగే, కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికి ఉచిత శిక్షణతోపాటు స్టైపెండ్ ఇస్తాం. ఈనెల 20 లేదా 21 నుంచి క్లాసులు ప్రారంభిస్తాం’ అని మంత్రి చెప్పారు. 100 మార్కులకు పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను https://studycircle. cgg.gov.in/, https://mjpabcwreis. cgg. gov.in/, https://unacademy.com/ scholarship/tsgovt&scholarship& test తోపాటు బీసీ సంక్షేమ శాఖ వెబ్సైట్లోనూ చేసుకో వచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 90 నిమిషాలపాటు నిర్వహిం చే ఈ పరీక్షలో 5 విభాగాలు ఉంటాయని, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. నెగె టివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో టాంపరిం గ్‌కు అవకాశం ఉండదన్నారు. మెరిట్ అభ్యర్థులకు తాము సైతం 20వేలు విలువ చేసే స్టడీ మెటీరియ ల్ను ఇస్తామని ‘అన్ అకాడమీ’ ప్రతినిధి చెప్పారు. -
Telangana: కొలువులకు ‘కొత్త’ సంకటం
వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్‌కు చెందిన గోపి రెండో తరగతి వరకు ఇంటి పక్కనున్న పాఠశాలలో చదివాడు. మంచి స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదివించాలని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయీంనగర్‌లోని ప్రైవేటు పాఠశాలలో గోపిని తండ్రి చేర్పించాడు. అతను 10వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడు. ఇప్పుడు పునర్విభజనలో నయీంనగర్ హన్మకొండ జిల్లాలో భాగమవడం, గోపి ఒకటి నుంచి 7వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలు నయీంనగర్‌లో చదువుకోవడంతో అతని స్థానికత హన్మకొండ అయింది. ఎల్బీనగర్కు చెందిన సృజన్ కుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకు ఎల్బీనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో, 4 నుంచి 10వ తరగతి వరకు ఉప్పల్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఇంతకుముందు వరకు సృజన్‌ది రంగారెడ్డి జిల్లా స్థానికత. కానీ జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డిని 3 జిల్లాలు చేశారు. సృజన్ పాఠశాల విద్యను ఎక్కువ సంవత్సరాలు మేడ్చల్ జిల్లాలో చదవడంతో ఆ జిల్లా స్థానికుడయ్యాడు. ఇక అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే మేడ్చల్ జిల్లాలోని పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలి. పుట్టిపెరిగిన రంగారెడ్డి జిల్లాలో 5 శాతం ఓపెన్ కేటగిరీ కోటా కింద దరఖాస్తు చేసుకోవాలి. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో 80,039 ఉద్యోగ ఖాళీలున్నట్లు సీఎం కేసీఆర్ 4 రోజుల క్రితం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో జిల్లా కేడర్‌లోని పోస్టులు 39,829. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం రావడంతో జిల్లా కేడర్ పోస్టుల భర్తీలో స్థానిక, ఓపెన్ కేటగిరీ నిష్పత్తి 95:5గా నిర్ధారించారు. ఈ క్రమంలో జిల్లా కేడర్‌లోకి వచ్చే 39,829 పోస్టుల్లో 95 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేయాలి. కొత్త జోనల్ విధానంతో స్థానిక అభ్యర్థులకు అత్యధిక అవకాశాలు పెరుగుతున్నా ఇప్పుడు స్థానికత తీవ్ర గందరగోళానికి గురి చేస్తోంది. జిల్లాల పునర్విభజనతో అభ్యర్థుల స్థానికత మారింది. కొత్త జిల్లాల సరిహద్దుల్లోని మెజార్టీ అభ్యర్థులకు ఈ సమస్య ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పుట్టి, పెరిగిన జిల్లాలో స్థానిక కోటాలో దరఖాస్తు చేసుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. స్థానికత ఇలా.. అభ్యర్థి స్థానికతను నిర్ణయించడంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ ఏడేళ్లు ఒకేచోట చదవకుంటే ఎక్కువ తరగతులు ఎక్కడ చదివాడో ఆ ప్రాంతం స్థానికతలోకి వస్తాడు. ఈ లెక్కన ఒకటి నుంచి ఏడో తరగతి వరకు గరిష్టంగా నాలుగేళ్లు ఎక్కడ చదువుకుంటే ఆ జిల్లా స్థానికత పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం జిల్లా స్థాయి ఉద్యోగాలన్నీ స్థానికత ప్రకారమే భర్తీ చేస్తారు. దీంతో స్థానికత ధ్రువీకరణకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. పట్టణ ప్రాంతంతో గజిబిజి రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలుగా ప్రభుత్వం విభజించింది. ఇందులో హైదరాబాద్ జిల్లా మినహా మిగతా 9 జిల్లాలు 32 జిల్లాలుగా మార్పు చెందాయి. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో స్థానికతకు ప్రాధాన్యమిస్తూ నియామకాలు చేపట్టే క్రమం తీవ్ర గందరగోళాన్ని కలిగిస్తోంది. చాలా జిల్లాల్లో పట్టణ ప్రాంతాలను విభజించడంతో స్థానికత సందిగ్ధంలో పడింది. ఉమ్మడి జిల్లా కేంద్రాలకు దగ్గర్లోని పట్టణ ప్రాంతాల్లో కొంత భాగం ఓ జిల్లాలో, మరికొంత భాగం మరో జిల్లాలో చేర్చారు. కొన్నిచోట్ల నగర ప్రాంతాన్ని ఓ జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని మరో జిల్లాగా ఏర్పాటు చేశారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాను 3 జిల్లాలుగా విభజించారు. ఇందులో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మెజార్టీ భాగం పట్టణ ప్రాంతం కావడంతో ఈ రెండు జిల్లాల్లో చాలా మంది అభ్యర్థుల స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్–నారాయణపేట, వనపర్తి–గద్వాల, కరీంనగర్–పెద్దపల్లి జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు అనేకం. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా స్కూళ్లు, కాలేజీలు ఉండటం.. దూరం నుంచి వచ్చి పట్టణ çప్రాంతాల్లో చదువుకోవడంతో స్థానికతలో మార్పులు జరుగుతున్నాయి. -
Telangana: కొలువుల భర్తీకి కొత్త రోస్టర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్ పట్టిక ఒకటో నంబర్ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉన్నాయి. జిల్లా, జోన్లు ఆధారంగా నియామకాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం రోస్టర్‌ను ఒకటో నంబర్ నుంచి అమలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో అప్పట్లో ఆ విధానాన్ని ఎంచుకోగా... ఇప్పుడు నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మరోమారు రోస్టర్ పాయింట్లు క్రమసంఖ్య ఒకటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ చేసిన పాయింట్ల ఆధారంగా రోస్టర్‌ను కొనసాగించే వీలు లేకపోవడం, ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం కోటా ఇవ్వాల్సి రావడంతో కొత్తగా రోస్టర్ పాయింట్ల అమలు దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన జోనల్ విధానం ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత రాగా, కొత్త నియామకాల విషయంలో రోస్టర్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మారిన కేడర్... కొత్త రోస్టర్ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇదివరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్ కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. అదీగాక రోస్టర్ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్‌ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు 65వేలు? కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఏమిటీ రోస్టర్? ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్. రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. ఒకటో క్రమసంఖ్య జనరల్ మహిళతో మొదలవుతుంది. జనరల్ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్ మహిళ, డిజేబుల్ జనరల్ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్ పాయింట్లలో ఖరారు చేశారు. ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే... ఏ పాయింట్ దగ్గర నియామకాలు పూర్తవుతాయో... తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. -
కేంద్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ రంగాల్లో ఉద్యోగ ఖాళీలను త్వరితగతిన భర్తీచేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభలో మంగళవారం జీరో అవర్‌లో ఆయన ఉద్యో గ ఖాళీల భర్తీ అంశాన్ని ప్రస్తావించారు. దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని, కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాలు ప్రకటనల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, తద్వారా నియామక ప్రక్రియ పూర్తికావడం బాగా ఆలస్యం అవుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆశతో రిక్రూట్మెంట్ పరీక్షల కో సం ఏళ్ల తరబడి రేయింబవళ్లు కష్టపడే యవతీ యువకులను ఈ పరిణామాలు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తున్నాయని చెప్పారు. నిర్ణీత కాలవ్యవధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తిచేయడంలో కేంద్రం ఉదాసీన వైఖరి వల్ల లక్షలమంది యువతీయువకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇక్కట్లను పరిగణలోకి తీసుకుని ఖాళీల భర్తీకి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. భవిష్యత్తులోను నిర్ణీత కాలవ్యవధిలో అన్ని ఖాళీలను భర్తీచేయడానికి వీలుగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్విమ్స్‌కు రూ.58.31 కోట్లు విడుదల తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్)కు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) తొలిదశలో వైద్య పరికరాల సేకరణకు కేంద్ర వాటాగా రూ.58.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరో గ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల, అనంతపురం ప్రభుత్వ వైద్యకళాశాలల ఆధునికీకరణకు రూ.150 కోట్లు (కేంద్రం వాటా రూ.120 కోట్లు, రాష్ట్ర వాటా రూ.30 కోట్లు) వేర్వేరుగా పీఎంఎస్ఎస్వై–2లో అనుమతించినట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు రూ.10వేల ప్రోత్సాహకం కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకంతో కలిపి ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు రూ.10 వేలు ఇస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. ఎల్ఐసీ మూలధన పెంపునకు అనుమతి చెల్లింపుల మూలధనాన్ని పెంచుకోవడానికి ఎల్ఐసీకి అనుమతించామని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ తెలిపారు. గతనెల 31 నాటికి ఎల్ఐసీ చెల్లింపు మూలధనం రూ.6,324.99 కోట్లు అని వైఎస్సార్సీపీ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రూ.36.1 కోట్లు విడుదల సాగరమాల పథకంలోని కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పిల్లర్స్‌లో భాగంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రూ.72 కో ట్లు మంజూరు చేశామని, దీన్లో రూ.36.1 కోట్లు విడుదల చేశామని కేంద్ర నౌకాయానశాఖ మంత్రి శర్బానంద సోనోవాల్.. వైఎస్సార్సీపీ ఎంపీ మో పిదేవి వెంకటరమణారావు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల కేసుపై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: భారత అత్యున్నత ధర్మాసనం ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేజన్ల కేసుపై శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టులో జస్టిస్ ఎల్. నాగేశ్వర్ రావు నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) మరియు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు) ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పనపై తామేలాంటి ప్రమాణాలను నిర్దేశించలేమని తెలిపింది. ప్రాతినిధ్య ప్రమాణాలను నిర్ణయించడానికి న్యాయస్థానం వద్ద ఎలాంటి కొలమానం లేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వాలే లెక్కలు సేకరించాలని తెలిపింది. మొత్తం సర్వీసు ఆధారంగా కాక, రిజర్వేషన్ల ఆధారంగానే డేటాను సేకరించాలని స్పష్టం చేసింది. అదే విధంగా ప్రమోషన్ల డేటా సమీక్షకు వ్యవధి సహేతుకుంగా ఉండాలని తెలిపింది. రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్రాలు తప్పనిసరిగా సమీక్ష నిర్వహించాలని స్పష్టం చేసింది. దామాషా ప్రాతినిధ్యం, తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం తదితర అంశాలన్నీ రాష్ట్రాలే చూసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. కాగా, ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పనలో ప్రమాణాలను నిర్దేశించడంలో ఎదురవుతున్న అయోమయాన్ని దూరం చేయాలని కోరుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ‘సిద్ధూ డబ్బుల కోసం కన్న తల్లిదండ్రులను అనాథలుగా విడిచిపెట్టాడు’ -
పోస్టింగ్‌లు లేకుండా జీతాలా? తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో విధులు నిర్వహిస్తున్న పదుల సంఖ్యలో ఉద్యోగులకు కొన్ని నెలలుగా పోస్టింగులివ్వకుండా వేధిస్తున్నా రంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 10 నెలలైనా కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని, సీఎస్సే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించింది. మార్చి 14లోగా కౌంటర్ దా ఖలు చేయాలని, లేకపోతే సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏయే విభాగాల్లో ఎంత మంది అధికారులకు పోస్టింగ్ లేకుండా జీతాలిస్తున్నారు? తదితర వివరాలు సమర్పించాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది ప్రజాధన దుర్వినియోగమే.. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ విభాగా ల్లో దాదాపు 40 నుంచి 50 మంది అధికారుల కు నెలల తరబడి పో స్టింగులు ఇవ్వడం లేదని, విధులు నిర్వహించకపోయినా వారికి వేతనాలు ఇస్తున్నారని మాజీ ఉద్యోగి బి. నాగధర్‌సింగ్ వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పోస్టిం గ్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ విభా గం ఉన్నతాధికారి నుంచి ఆ ఉద్యోగికి చెల్లించిన జీతభత్యాలను వసూలు చేయాలి. క్రమశిక్షణా చర్యలు చేపట్టాలి’అని కోరారు. ఆ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషన్‌పై సీఎస్ ఇంకా కౌంటర్ వేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్ దాఖలుకు మరో 4 వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. విధులు నిర్వహించకపోయినా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. కౌంటర్ దాఖలుకు ఇదే చివరి అవకాశమంటూ విచారణను వాయిదా వేసింది. -
నిరుద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఇక ప్రతియేటా జాబ్ క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు టీఆర్ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగాల విషయంలో పారద్శకంగా ఉంటామని, ఇకపై ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. త్వరలోనే 60-70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కూడా పేర్కొన్నారు. పండించిన వరి ధాన్యం కొనేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, రైతులతో కలిసి ధర్నాకు దిగుతామని కేసీఆర్ అన్నారు. వచ్చే శుక్రవారం అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ధర్నాలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ధర్నాలకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.. చదవండి: నా ఫాంహౌజ్ దున్నడానికి బండి సంజయ్ ట్రాక్టర్ డ్రైవరా?: సీఎం కేసీఆర్ తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనాల్సిందేనని, కేంద్రం ధాన్యాన్ని పూర్తిగా కొనే వరకు వదిలి పెట్టమని సీఎం స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ ఎందుకని ఇన్నాళ్లూ సర్ధుకుపోయామన్నారు. కానీ రైతాంగానికి అన్యాయం జరుగుతుంటే సహించమని, రైతులతో కలిసి పోరాడతామన్నారు. బీజేపీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లేనని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం తమతో కలిసి ధర్నాకు కూర్చుంటావా? అని బండి సంజయ్‌ను సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. పోరాటాలకు తాము భయపడమని, ప్రజల పక్షాన నిలబడి బీజేపీని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తామని అన్నారు. చదవండి: తెలంగాణ వడ్లను కేంద్రం కొనాల్సిందే: సీఎం కేసీఆర్ భారతదేశ చరిత్రలో తొలిసారి తెలంగాణలో దళితులకు అన్నింట్లో రిజర్వేషన్లు కల్పించామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకం 100 శాతం అమలవుతుందన్నారు. హుజురాబాద్‌లో ప్రతి ఇంటికీ దళిత బందు ఇస్తామని, కేంద్రానికి మనసుంటే దళిత బంధుకు నిధులివ్వాలని కేసీఆర్ అన్నారు. -
నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్
విజయవాడ స్పోర్ట్స్: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని మోసం చేస్తూ.. ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న ఓ ఘరానా మోసగాడిని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.7 లక్షలు, మూడు సెల్ఫోన్లతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నూజివీడుకు చెందిన గట్టిగుండె విద్యాసాగర్ తాను వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్‌నంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. డీఆర్డీవోకు సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటానని, గ్రూప్–1 ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మిస్తూ కొంత కాలంగా పలువురిని మోసం చేస్తూ వస్తున్నాడు. తాజాగా విజయవాడ నగరానికి చెందిన న్యాయవాది కనకదుర్గకు భారీ స్థాయిలో టోకరా వేశాడు. తన ఇద్దరు పిల్లలకు డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో కనకదుర్గ పలు దఫాలుగా రూ.65 లక్షలను ఆన్లైన్ ద్వారా విద్యాసాగర్ బ్యాంక్ ఖాతాకు పంపింది. నగదు తీసుకున్న తరువాత విద్యాసాగర్ కొన్నాళ్లు పత్తా లేకపోవడంతో అనుమానం వచ్చిన కనకదుర్గ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సైబర్ పోలీసులు విజయవాడలో తిరుగుతున్న విద్యాసాగర్‌ను అరెస్టు చేశారు. బతుకంతా మోసాల మయమే.. మాయమాటలతో ప్రజలను మోసం చేయడమే జీవనాధారంగా చేసుకున్న విద్యాసాగర్ గతంలో పలువురిని ఇదే విధంగా మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2014లో నకిలీ భూమి దస్తావేజులను సృష్టించి నగరంలోని పలువురిని మోసం చేశాడు. దీనిపై ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పట్లో కేసు నమోదయింది. 2019లో ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను మోసం చేసి రూ.17 లక్షలు కాజేశాడు. అదేవిధంగా డీఆర్డీవోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరి నుంచి విద్యాసాగర్ నగదు వసూలు చేసినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది. రైస్ పుల్లింగ్ యంత్రాలను సైతం కొందరికి విక్రయించి దుర్గాప్రసాద్ సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలీసు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించారు. -
ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదు: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల టౌన్: ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని జడ్చర్ల ఎమ్మెల్యే డా.లక్ష్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం జడ్చర్ల మండలం శంకరాయపల్లి సమీపంలో నిర్మించిన పీఆర్టీయూ సంఘ భవనాన్ని ఎమ్మెల్సీ కె.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో లక్ష్మారెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయని, ఏ పథకం పెడితే ఎన్ని ఓట్లు వస్తాయో అని ఆలోచించటం సరైంది కాదన్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో ఆలోచించి దళితబంధు ప్రవేశపెడితే విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పేర్కొన్నారు. -
RS Praveen kumar: సీఎంగా కేసీఆర్ ఏడేళ్లు ఏం చేశారు..?
సాక్షి, ఆదిలాబాద్: బహుజనులు రాజ్యాధికారం సాధించే దిశగా ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రచారం చేపట్టాలని మాజీ ఐపీఎస్ అధికారి, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన శనివారం ఆదిలాబాద్‌కు వచ్చారు. అర్అండ్బీ అతిథి గృహంలో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లాలోని బీఎస్పీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కుమ్మరివాడకు వెళ్లి కుండలు తయారు చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. భుక్తపూర్ కాలనీకి వెళ్లి కావేరి, మహిపాల్ దంపతులతోపాటు పలువురు మేదరులతో మాట్లాడారు. తర్వాత జనార్దన్‌రెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన బీఎస్పీ నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరాం, మహాత్మా జ్యోతిబా ఫులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ పార్టీలను వదిలి బీఎస్పీలో చేరిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల రాజ్యం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బాంచన్ బతుకుల కాలం పోయిందని, గులాబీ తెలంగాణ నీలి తెలంగాణగా మారుతుందని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధి విషయంలో సీఏం కేసీఆర్ ఏడేళ్లు ఎందుకు పథకాలను అందించకుండా నిద్రపోయారని ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి ఇస్తానని కేవలం 10 వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శ్మాశనవాటికలు, రైతు వేదికలు, ఇతర భవనాలను నిర్మించేందుకు అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంతో నిరుద్యోగులు కులవృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ మంద, కోఆర్డినేటర్ గంగాధర్, జిల్లా ఇన్చార్జి మెస్రం జంగుబాపు, తదితరులు పాల్గొన్నారు. చదవండి: పదేళ్ల క్రితం అదృశ్యం: పుట్టింటికి రప్పించిన రాఖీ పండుగ -
మళ్లీ పదేళ్లు పొడిగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని మళ్లీ 10 ఏళ్లు పొడిగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. గరిష్ట వయోపరిమితి పొడిగింపు విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని వయస్సు మీరిన నిరుద్యోగ అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద భర్తీ చేసే పోస్టులకు గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతూ ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో జనరల్, ఇతర కేటగిరీల నిరుద్యోగుల్లో సైతం అంచనాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరింది. మరో రెండు నెలల్లో ఈ నోటిఫికేషన్లు వచ్చే అవకాశముందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆలోగా గరిష్ట వయోపరిమితి పెంపునకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేయనుందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వంటి శారీరక దృఢత్వం అవసరమైన పోలీసు, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, అటవీ శాఖల్లోని పోస్టుల మినహా అన్ని శాఖల్లోని ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి పొడిగింపును ప్రభుత్వం మళ్లీ వర్తింపజేయనుంది. టీఎస్పీఎస్సీతో సహా అన్ని ప్రభుత్వ నియామక సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యోగాల భర్తీలో ఈ పొడిగింపు వర్తించనుంది. గడువు ముగిసి రెండేళ్లు... ప్రత్యక్ష నియామకాల విధానంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు తాత్కాలికంగా ఏడాది కాలం పాటు పొడిగిస్తూ 2015, జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడుగా గరిష్ట వయోపరిమితిపై ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పిస్తున్న ప్రత్యేక సడలింపులు యథాతథంగా అమలవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. తదనంతర కాలంలో ఈ ఉత్తర్వుల అమలు గడువును మరో రెండు పర్యాయాలు ప్రభుత్వం పొడిగించింది. చివరిసారిగా 2019, జూలై 26తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోగా, మళ్లీ ఇప్పటి వరకు ప్రభుత్వం పొడిగించలేదు. ప్రజాప్రతినిధులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని అప్పట్లో ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి గరిష్ట వయోపరిమితి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది. గడువు తీరిన ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక సడలింపులు.. లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో జరిపే ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీల గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు సడలిస్తూ చివరిసారిగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలు గడువు ఈ ఏడాది మేతో ముగిసింది. మళ్లీ ప్రభుత్వం గడువు పొడిగించలేదు. త్వరలో మరో ఐదేళ్ల కాలానికి ఈ మేరకు ప్రత్యేక సడలింపులు కల్పిస్తూ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. -
యువతకు స్వరాష్ట్ర ఫలాలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఫలాలను యువతరానికి అందించేందుకు తమ ప్రభుత్వం ఏడేళ్లుగా పలు ప్రణాళికలు అమలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. గురువారం ‘ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం’సందర్భంగా తెలంగాణ యువతకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దెబ్బతిన్న అన్ని రంగాల మౌలిక వసతులను మెరుగుపరచడంతోపాటు అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాల ద్వారా పునరుజ్జీవనం సాధించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. సాగు, తాగునీరు, వ్యవసాయ రంగాల అభివృద్ధితోపాటు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఐటీ, పారిశ్రామిక రంగాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయని, ప్రభుత్వ రంగంలో 1.30 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చామని, మరో 50 వేల ఉద్యోగాల నియామకాల కోసం కార్యాచరణ ప్రారంభమైందని చెప్పారు. వ్యవసాయ రంగం వైపు యువత ఆసక్తి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యవసాయం మెరుగవడంతో యువత కూడా ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతోందని సీఎం కేసీఆర్ అన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ రంగాలతోపాటు వ్యవసాయం, అనుబంధ రంగాలు కూడా పురోగమిస్తున్నాయని, ఐటీ, సాంకేతిక రంగాలకు సంబంధించి యువతలో నైపుణ్యం పెంచేందుకు ‘టాస్క్’ద్వారా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ఐటీ పాలసీ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై యువతకు అవగాహన కల్పించేందుకు టీసాట్‌తో కార్యక్రమా లు నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. -
మా దందా ఇంతే.. అడ్డొస్తే అంతే!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/కాశీబుగ్గ: ప్రభుత్వ ఉద్యోగాల పేరిట వందలాది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.75 కోట్లు వసూలు చేసి.. నకిలీ అపాయింట్మెంట్ లేఖలిచ్చి మోసగిస్తున్న సుధాకర్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరుతో ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఎవరికీ ఎటువంటి ప్రాజెక్టు ఇవ్వలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. సుధాకర్ మాత్రం దర్జా వెలగబోస్తున్నాడు. అపాయింట్మెంట్ లేఖలు తీసుకున్న వారెవరూ ఆందోళన చెందొద్దని, ఉద్యోగం విషయమై నెలాఖరులోగా స్పష్టత ఇస్తానని డబ్బులు కట్టిన నిరుద్యోగ యువతను జూమ్ సమావేశాల ద్వారా మభ్యపెడుతున్నాడు. ఐదు జిల్లాల్లో సాగుతున్న ఈ నకిలీ బాగోతాన్ని బయటపెట్టిన ‘సాక్షి’ విలేకరులతోపాటు అతడి గుట్టురట్టు చేస్తున్న వారిని చంపుతానంటూ సుధాకర్ బెదిరింపులకు దిగుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడించిన వీడియోలు విడుదల చేయగా.. దీనిపై సోమవారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్‌కు ‘సాక్షి’ విలేకరులు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు నిగ్గు తేల్చాలని కోరారు. కూర్చుంటే జీతమిస్తానంటూ.. సుధాకర్ ప్రతి మండలంలో చిన్న గదిని అద్దెకు తీసుకుని, తనకు డబ్బులిచ్చిన నిరుద్యోగులను అందులో ఉంచుతున్నాడు. వారెవరికీ ఎలాంటి విధులు అప్పగించలేదు. ‘ఆఫీసుకు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోతే చాలు. కొన్నాళ్ల దాటాక బాధ్యతలు అప్పగిస్తాను. అప్పటివరకు మీకు జీతం ఇచ్చేస్తా’ అంటూ నమ్మబలుకుతున్నాడు. ఈ మొత్తం వ్యవహారంపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం అవుతుండటంతో అతడికి డబ్బు చెల్లించిన వారు ‘సాక్షి’ ప్రతినిధికి ఫోన్ చేసి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. సాక్షి కథనాలపై సుధాకర్‌ను ఫోన్లో సంప్రదిస్తుంటే.. ‘కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండండి. నెలాఖరులోగా క్లారిటీ ఇస్తాను. మీరిచ్చిన డబ్బుకు ఢోకా లేదు’ అని చెప్పుకొస్తున్నాడని కొందరు నిరుద్యోగులు ‘సాక్షి’కి చెప్పారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితులూ.. ఫిర్యాదు చేయండి నిరుద్యోగులెవరూ ఎవరికీ డబ్బులు కట్టి మోసపోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి యువతకు హితవు పలికారు. సోమవారం కాశీబుగ్గలో విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగాల పేరిట మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. పోస్టుకు రూ.5 లక్షలు గ్రామీణ ప్రాంతాలోని ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందులో ఎగ్జిక్యూటివ్, క్లస్టర్ అసిస్టెంట్ ఉద్యోగాలిప్పిస్తానంటూ సుధాకర్ తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన సుమారు 1,500 మంది నిరుద్యోగుల నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.75 కోట్లు వసూలు చేశాడు. వారందరికీ స్మార్ట్ విలేజ్, రూర్బన్ పేరిట నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చి మోసగించాడు. నిజానికి రాష్ట్రంలో ఎక్కడా స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరిట అటు కేంద్ర ప్రభుత్వం గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. వాటికింద ఏ సంస్థకూ ఎలాంటి ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు. కానీ.. ఆ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి ఇంకా నకిలీ అపాయింట్మెంట్లు జారీ చేస్తూనే ఉన్నారు. -
‘సచివాలయ’ ఖాళీల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రభుత్వం అప్పగించింది. గతంలో రెండు విడతలుగా సచివాలయ ఉద్యోగాలను పంచాయతీరాజ్‌శాఖ భర్తీచేసింది. ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను భర్తీచేసే బాధ్యతను ఇప్పుడు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంచాయతీరాజ్‌శాఖ నెలరోజుల కిందటే వివిధ శాఖాధిపతులకు తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేసే వీఆర్వో, విలేజి సర్వేయర్ గ్రేడ్–3 పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి పంపాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం రాత్రి శాఖాధిపతులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సీసీఎల్ఏ, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో పనిచేసేందుకు మొత్తం 19 విభాగాల్లో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్‌శాఖ 2019 జూలైలోను, 2020 జనవరిలోను నోటిఫికేషన్లు ఇచ్చి రాతపరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీచేసింది. ఇంకా మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్లు, రాతపరీక్షల వివరాలతో మే నెల 30న ఏపీపీఎస్సీ కేలండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! మే 31న ఉద్యోగ క్యాలెండర్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖలు, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసి, రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన ఉద్యోగాల భర్తీకి శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను తేల్చాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఖాళీల భర్తీకి సంబంధించి సీఎస్ ఇటీవల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలను, అవసరమైన పోస్టుల భర్తీ వివరాలను డైరెక్టరీ ఆఫ్ పోస్ట్స్ అండ్ పర్సనల్ విభాగంలో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి.. అందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తేల్చాలని స్పష్టం చేశారు. ఆ లెక్కలు ఆధారంగా అవసరమైన పోస్టులను దశల వారీగా భర్తీ చేసేందుకు ప్రణాళిక బద్ధంగా క్యాలెండర్ రూపొందించి మే 31న విడుదల చేస్తారని చెప్పారు. ఇందుకోసం గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీల్లో పోస్టుల ఖాళీలను లెక్క తేల్చాలని సూచించారు. అనంతరం సంబంధిత శాఖ కార్యదర్శి ఆమోదంతో ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సీఎస్ ఇంకా ఏం చెప్పారంటే.. లోతుగా పరిశీలించి వివరాలు ఇవ్వాలి గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు బాధ్యతలు, అధికారాలను వాటికి బదిలీ చేయనున్న నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీ ఆవశ్యకత గురించి లోతుగా పరిశీలించాలి. రాష్ట్ర విభజన అనంతరం కొన్ని శాఖలు, విభాగాల్లో క్షేత్ర స్థాయిలో సిబ్బందికి పని తక్కువైన నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఖాళీల వివరాలను హెచ్ఆర్ఎంఎస్లో పొందు పరచాలి. బ్యాక్లాగ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల ఖాళీలను కూడా పొందుపరచాలి. ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత క్రమంలో ఏ ఏ పోస్టులు ఎన్ని భర్తీ చేయాలో సంబంధిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు సూచించాలి. అన్ని శాఖలకు చెందిన పోస్టులు, ఖాళీలు, భర్తీ వివరాలన్నీ కూడా ఒకే చోట తెలిసేలా డైరెక్టర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ పర్సనల్ డాస్‌బోర్డ్‌లో లభ్యమవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయితే పదోన్నతుల రూపంలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను ఆన్లైన్లో నేరుగా చూసే అవకాశం ఉంటుంది. -
నా పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోంది
సాక్షి, అమరావతి: మంగళగిరి ప్రాంతానికి చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తన పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు వాట్సాప్ పోస్టుల ద్వారా తన దృష్టికి వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్‌కు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం బుధవారం ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరారు. ఈ ఆరోపణల మీద సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణలో ఈ వార్తలు తప్పని తేలితే.. వాట్సాప్ మెసేజ్‌లు ఎక్కడ్నుంచి పుట్టుకొచ్చాయో.. వాటికి కారకులెవరో? గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అజేయ కల్లం డీజీపీని కోరారు. -
ఎన్ఆర్ఏపై మధ్యప్రదేశ్ కీలక నిర్ణయం
భోపాల్ : జాతీయ నియామక సంస్థ (ఎన్ఆర్ఏ) నిర్వహించే పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చే తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్ కానుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఎన్ఆర్ఏ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తూ గురువారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని శివరాజ్ చౌహాన్ స్వాగతించారు. యువతకు వారి ఎన్ఆర్ఏ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తూ దేశంలోనే మధ్యప్రదేశ్ అసాధారణ నిర్ణయం తీసుకున్న తొలిరాష్ట్రంగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు సైతం తమ యువతకు ఊరట కల్పిస్తూ ఈ దిశగా సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లో తమ రాష్ట్ర యువతకే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే హక్కు కల్పించాలని తాము నిర్ణయించామని చెప్పారు. పలుమార్లు పరీక్షల నిర్వహణతో ప్రయాణాలు, ఇతరత్రా వ్యయం నుంచి ఎన్ఆర్ఏ ద్వారా ఊరట లభించిందని అన్నారు. ఇక దేశ యువత ఎస్ఎస్బీ, ఆర్ఆర్బీ, ఐబీపీఎస్ వంటి పలు పరీక్షలకు హాజరుకాకుండా కేవలం ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరైతే చాలని అన్నారు. ఇది అభ్యర్ధుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నియామక ప్రక్రియలో పారదర్శకత నెలకొనేందుకు దారితీస్తుందని అన్నారు. చదవండి : అదృష్టం అంటే అతనిదే.. రాత్రికి రాత్రే -
‘ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలన్ని స్థానికులకే’
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుభవార్త తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో వంద శాతం రాష్ట్ర యువతకే అర్హత కల్పిస్తామని మంగళవారం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అయితే 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర యువతకే ప్రభుత్వ ఉద్యోగాలు అనే ప్రకటనను సీఎం చౌహాన్ వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా 10, 12వ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ప్రతిభ గల విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పథకాల అమలులో సింగిల్ డేటా బేస్‌లో(వివిధ పథకాలకు అర్హుల జాబితా) పొందు పరుస్తామని తెలిపారు. ఈ ప్రక్రియతో పథకాల లబ్డిదారులు ఒక సారి డేటా బేస్‌లో తమ పేరును నమోదు చేసుకుంటే అర్హత కలిగిన వివిధ పథకాలను పొందవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. చదవండి: సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు -
ప్రభుత్వ ఉద్యోగాల వైపే చూపు
ముంబై: దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్ ఉందో మనందరికి తెలిసిందే. కానీ సాఫ్ట్వేర్ పరిశ్రమ, ప్రైవేట్ రంగాలలో ఇటీవల కాలంలో కంపెనీలు అత్యధిక వేతనాలు ఆఫర్ చేస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కంపెనీలు నియామకాల ప్రక్రియను చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు 6,500మంది ప్రజలతో అడ్డా 247అనే సంస్థ సర్వే నిర్వహించింది. అడ్డా 247 సంస్థ జేఈఈ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రపేరయ్యే వారికి తమ పోర్టల్ ద్వారా అత్యుత్తమ ఫ్యాకల్టీతో మెరుగైన శిక్షణ అందిస్తుంది. అయితే సర్వేలో మెజారిటీ ప్రజలు ఉద్యోగ బధ్రతకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కాగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే వారు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సర్వేలో పాల్గొన్న కొందరు విద్యార్థులు చెప్పినట్లు అడ్డా 247సీఈఓ అనిల్ నగర్ పేర్కొన్నారు. -
కొలువు పేరుతో లక్షలు కొట్టేశాడు!
సాక్షి, సిటీబ్యూరో : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.26 లక్షలు కాజేసిన మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు శనివారం ఆ వివరాలను వెల్లడించారు. డీసీపీ కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన దోమకొండ వెంకటేష్ అనే వ్యక్తి నగరానికి వలసవచ్చి చిక్కడపల్లిలో స్థిరపడ్డాడు. డిగ్రీ విద్యను మధ్యలోనే ఆపేసి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యాపారులతో అతడికి పరిచయాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ వ్యాపారం సాగకపోవడంతో ఉద్యోగాల పేరుతో మోసాలు చేయాలని పథకం రచించాడు. తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకునేవాడు. వీటి ఆధారంగా వివిధ కేంద్ర, రాష్ట్ర విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికేవాడు. ఈ క్రమంలోనే చిక్కడపల్లి వాసి రాజిరెడ్డి తన కుమారుడితో పాటు పరియస్తులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ విషయం ఆయన ద్వారానే తెలుసుకున్న వెంకటేష్.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. రాజిరెడ్డి కుమారుడికి రెవెన్యూ విభాగంలో డిప్యూటీ తహసీల్దార్, మిగిలిన వారికి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్లో (ఎన్ఐసీ) టెక్నికల్ అసిస్టెంట్, నాబార్డ్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఇప్పిస్తానని ఎర వేశాడు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల చొప్పున ఖర్చవుతుందంటూ రాజిరెడ్డి నుంచి వివిధ దఫాల్లో రూ.26.5 లక్షలు కాజేశాడు. ఆయనకు నమ్మకం కలగడానికి బయోడేటా, విద్యార్హత పత్రాలు, ఫొటోలు, చిరునామా ధ్రువీకరణలు కూడా తీసుకున్నాడు. బాధితుడు ఎప్పుడు ప్రశ్నించినా ఆయా విభాగాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయని, చేరాల్సిన పంథాలోనే వచ్చి చేరతాయని చెప్పేవాడు. ఎంతకీ నిమాయకాలు జరగకపోవడంతో రాజిరెడ్డి తన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ వెంకటేష్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న వెంకటేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బాధితుడు చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు నేతృత్వంలో రంగంలోకి దిగిన బృందం శనివారం నిందితుడిని పట్టుకుంది. విచారణ నేపథ్యంలోనే నిందితుడు నిరుద్యోగుల్ని ఆకర్షించడానికి అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. సిద్దిపేటలో ఎం.శ్రీరాములు, నిజామాబాద్‌లో మోహన్, సిరిసిల్లలో నరేష్, నిజామాబాద్‌లో నవీన్, గిరి ఏజెంట్ల పాత్ర పోషించినట్లు వెల్లడైంది. వెంకటేష్‌ను చిక్కడపల్లి పోలీసులకు అప్పగించిన అధికారులు అయిదుగురి వ్యవహారాలు ఆరా తీస్తున్నారు. వీరు సైతం ఎవరైనా నిరుద్యోగుల్ని మోసం చేయడంలో పాత్రధారులుగా ఉన్నారా? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. వెంకటేష్ నుంచి కారు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. -
పరీక్షల తేదీలు ఖరారు చేసిన ఏపీపీఎస్సీ
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల ప్రక్రియను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. గతంలో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతంలో వాయిదా వేసిన పలు పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం పరీక్షల తేదీల వివరాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 15న ప్రారంభించనుంది. నవంబర్ 13 వరకు పలు తేదీల్లో వివిధ ఉద్యోగ నియామక పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. కొత్తగా ప్రకటించిన నియామక పరీక్షల తేదీలు ► సెప్టెంబర్ 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామక పరీక్షలు ► సెప్టెంబర్ 21, 22, 23, 24 తేదీల్లో గెజిటెడ్ ఉద్యోగాల నియామక పరీక్షలు ► సెప్టెంబర్ 21, 22 అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలు ► సెప్టెంబర్ 22న రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇన్ మైనింగ్ సర్వీస్ ఉద్యోగ నియామక పరీక్ష ► సెప్టెంబర్ 23న సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల నియామక పరీక్ష ► సెప్టెంబర్ 23న పోలీస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల నియామక పరీక్ష ► సెప్టెంబర్ 23, 24 పట్టణ ప్రణాళిక విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి పరీక్షలు -
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులుండగా 2018మార్చి 1 నాటికి అందులో 31,18,956 ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 2019–20 ఏడాదికి గాను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ)లు సుమారు 1.34 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు చేశాయన్నారు. -
ఆ రైతు కుటుంబంలో నలుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు..
ఆ రైతుకు ఐదుగురు పిల్లలు. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. తాను పడుతున్న కష్టం తన బిడ్డలు పడకూడదనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులున్నా అందరినీ ఉన్నత చదువులు చదివించాడు. వారు కూడా అహర్నిశలు శ్రమించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు. సాక్షి, ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన కాకుమాను మంగిరెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె నాగమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించింది. రెండో కుమార్తె జానకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి రెండు ఉద్యోగాలకు ఎంపికైంది. మున్సిపల్ శాఖలో శానిటరీ, హెల్త్ ఇన్స్పెక్టర్ల పోస్టులను సాధించింది. మూడో కుమార్తె శిరీష అమెరికా వెళ్లి ఫార్మ రంగంలో స్థిరపడింది.నాలుగో కుమార్తె మనోజ, కుమారుడు ప్రవీణ్ గోపి రెడ్డి బ్యాంకు ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రులు మంగిరెడ్డి, లక్ష్మి కష్టంతోనే తాము ఉన్నతస్థాయికి ఎదిగామని వారు పేర్కొంటున్నారు. పట్టుదలతో విజయం.. నిరుపేద రైతు కుటుంబంలో జన్మించి ఎంఎస్సీ బీఈడీ చదివాను. డిసెంబర్ 2018లో టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. ఇటీవల ప్రకటించిన హెల్త్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టుకు రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకు వచ్చింది. మహిళా విభాగంలో రెండింట్లోనూ ప్రథమస్థానం. తండ్రి మంగిరెడ్డి, తల్లి లక్ష్మి, భర్త ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరెడ్డి ప్రోత్సహించారు. పట్టుదలతో విజయం సాధించాను. – కాకుమాను జానకి -
ఇకపై ఆ ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఒకే పరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యా విధానం, ఉద్యోగ కల్పనలో మార్పులు రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఇక నుంచి నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు రాబోయే రోజుల్లో ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇందుకు గానూ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) ఈ ఏజెన్సీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పడుతున్న నాన్ గెజిటెడ్ పోస్టుల ఖాళీలను గుర్తిస్తూ.. వాటిని సమన్వయం చేసుకుంటూ అన్నింటికీ ఒకటే పరీక్ష నిర్వహించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ప్రతి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతన విధానం ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు అభ్యర్థులు రకరకాల పరీక్షలు రాయాల్సి వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో అన్ని ఉద్యోగాలకు కలిపి ఒకటే పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. (స్వచ్ఛమైన గాలి కోసం భారీగా కేటాయింపు) -
జమ్మూకశ్మీర్‌లో కొత్త నిబంధనలు!
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో స్థిర నివాసానికి సంబంధించి కొన్ని నిబంధనలు మార్చే ప్రతిపాదనలను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు, భూ యాజమాన్య హక్కులు, వృత్తి విద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి అక్కడ 15 ఏళ్ల స్థిర నివాసం ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత బయటివారు తమ ఉద్యోగాలు, భూములు, విద్యాసంస్థల్లో సీట్లు కొల్లగొడతారని స్థానికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. -
కొలువుల శకం.. యువతోత్సాహం
వైఎస్ జగన్ ప్రభుత్వం పైరవీలకు, అనుమానాలకు తావివ్వకుండా ఇంటర్వూ్య మార్కులు తీసేయడంతో నిరుద్యోగుల్లో మెరిట్ ఉన్న వాళ్లకు ఉద్యోగం వస్తుందన్న నమ్మకం పెరిగింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల శకం మొదలైంది. అదృష్టమో, రికమండేషనో, డబ్బులు పెడితేనో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే రోజులకు కాలం చెల్లింది. కష్టపడిన వారికి, ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ ఉద్యోగం పెద్ద కష్టం కాదనే పరిస్థితి వచ్చింది. గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువత బాగా ఉత్సాహం చూపుతోంది. వెరసి పోటీ పరీక్షలకు పెద్దఎత్తున సన్నద్ధమవుతున్నారు. 90వ దశకంలో ప్రారంభమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాల ఆకర్షణ కొద్ది కాలంగా తగ్గుతూ వస్తోంది. సాఫ్ట్వేర్ కంటే ప్రభుత్వ ఉద్యోగాలే ఉత్తమమని నమ్ముతున్న యువత ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకే జాతీయ స్థాయిలో జరిగే బ్యాంకు పరీక్షలు, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ పరీక్షలతో పాటు రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ పోస్టులకు లక్షలాది మంది పోటీ పడుతున్నారు. మొన్నటి దాకా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూపులు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 తదితర పరీక్షలను ఐదు లక్షల మందికిపైగా రాస్తున్నారు. టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ పరీక్షలకు మూడు లక్షల మంది, కానిస్టేబుల్ తదితర పరీక్షలకు లక్ష మందికిపైగా హాజరవుతున్నారు. ఈ పరీక్షల పట్ల నిరుద్యోగుల్లో ఆసక్తి ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం చాలా నామమాత్రంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం, ఒక షెడ్యూల్ లేకపోవడం, కోర్టు కేసులు వంటి కారణాల వల్ల వాటి భర్తీకి ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సి వస్తుండడంతో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగుల్లో నమ్మకం సడలిపోయింది. ఒకేసారి 1.26 లక్షల ఉద్యోగాలతో పెరిగిన నమ్మకం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నెల రోజుల్లోనే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఒకేసారి లక్షా 26 వేల ఉద్యోగాలను విప్లవాత్మక రీతిలో భర్తీ చేయడంతో నిరుద్యోగ యువత దృక్పథంలో మార్పు కనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగాల కోసం 22 లక్షల మంది దరఖాస్తు చేసుకుని 19.50 లక్షల మంది పరీక్ష రాయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువతలో ఉన్న ఆకర్షణ వ్యక్తమైంది. ఇంత మంది పరీక్ష రాయడం దేశ చరిత్రలో ఒక రికార్డుగా చెబుతున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా ఉంటుందనే నమ్మకం ఏర్పడడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు భారీగా క్యూ కడుతున్నారు. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులు భారీ సంఖ్యలో చేరుతున్నారు. వచ్చే జనవరిలో టీచర్, సచివాలయాలు, ఇతర ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు వెలువడతాయని గట్టి నమ్మకం ఏర్పడడంతో కొత్తగా కోచింగ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. చాలా మంది చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలను వదిలేసి, సెలవుపెట్టి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. సచివాలయ పరీక్షల్లా నిర్వహించాలి సచివాలయ ఉద్యోగాల పరీక్షలు జరిగినట్లు అన్ని పోటీ పరీక్షలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఉద్యోగాలతో యువతలో కొంత నమ్మకం వచ్చింది. నియామక ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా ఉంటే నిరుద్యోగుల్లో మరింత భరోసా ఏర్పడుతుంది. సీఎం వైఎస్ జగన్.. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారనే ధైర్యాన్ని ఇచ్చారు. – కే శ్రీధర్, శ్రీధర్ కాంపిటీటివ్స్ సెంటర్, విజయవాడ – ఎస్ పూర్ణచంద్రరావు, ప్రగతి కోచింగ్ సంస్థ, అవనిగడ్డ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఏపీపీఎస్సీ పనితీరు సక్రమంగా లేదు. దీనివల్ల పేద, గ్రామీణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 1.26 లక్షల గ్రామ సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల్లో విశ్వాసం కలిగింది. గత ప్రభుత్వంలో ఆ విశ్వాసం లేదు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తే ప్రభుత్వంపై ఇంకా నమ్మకం పెరుగుతుంది. – కేఎస్ లక్ష్మణరావు, విద్యావేత్త, ఎమ్మెల్సీ ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా.. గతంలో ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసేదాన్ని. ఈ ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల కోసం నోటిషికేషన్లు ఇస్తామని ప్రకటించడం మాకు ఎంతో ఉత్తేజాన్నిచ్చింది. రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. అదే నమ్మకంతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. – కే రేణుకాదేవి, దంగేరు, కె.గంగవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా -
నేడు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, కర్నూలు(అర్బన్): గ్రామ, వార్డు సచివాలయ రెండవ విడత పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 28వ తేదీన ఐదు రకాల పోస్టుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు. శనివారం ఆయన తన చాంబర్లో గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5, పంచాయితీ కార్యదర్శి గ్రేడ్–6 (డిజిటల్ అసిస్టెంట్) పోస్టులకు మెరిట్, రోస్టర్, రిజర్వేషన్ ప్రకారం అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్ లెటర్లు, మెసేజ్‌లు పంపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు ఐదు రకాల పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు. స్థానిక జిలా పరిషత్‌లోని డీపీఆర్సీ భవనంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ – 5, పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6 పోస్టులకు వెరిఫికేషన్ ఉంటుందన్నారు. అలాగే విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు స్థానిక కలెక్టరేట్లోని సెరికల్చర్ డీడీ కార్యాలయం రూం నెంబర్: 121, 126 గదుల్లో, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు జెడ్పీ ప్రాంçగణంలోని డీపీఆర్సీ భవనంలో, అలాగే మహిళా పోలీసులకు సంబంధించి కొండా రెడ్డి బురుజు సమీపంలోని ఎస్సీ ఆఫీసు వద్ద సర్టిఫికెట్ల పరిశీలన జరుగతాయన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 పోస్టులకు 85 మంది, గ్రేడ్–6కు 127, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టుకు 1, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు 199 మందికి కాల్ లెటర్లు ఆయా శాఖలకు చెందిన అధికారులు పంపించడం జరిగిందన్నారు. కాగా ... రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు 20 శాతం మార్కులను అర్హతగా గుర్తించడం, స్లైడింగ్ సిస్టమ్‌లో కేటగిరీ –1లోని ఈ పోస్టుల్లో ఇప్పటికే విధుల్లో చేరిన వారిలో కొందరికి పోస్టులు, ప్లేసులు మారే అవకాశాలు ఉన్నట్లు డీపీఓ వివరించారు. కొనసాగిన సర్టిఫికెట్ల పరిశీలన స్థానిక జెడ్పీలోని డీపీఆర్సీ భవనంలో శనివారం వార్డు అమెనిటీస్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులకు జరిగిన సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్ లెటర్లు అందిన అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే ఈ నెల 26వ తేదీన జరిగిన ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు గైర్హాజరైన వారి కోసం శనివారం కూడా స్థానిక విశ్వేశ్వరయ్య భవన్లో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. -
పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం
సాక్షి, అమరావతి: ‘సొంత మండలంలో పని చేసే అవకాశం కొద్ది మందికే వస్తుంది. ఈ అవకాశం దక్కించుకున్న అదృష్టవంతులుగా మీరు మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి. మనం అధికారం చెలాయించడం కోసం కాకుండా ప్రజలకు చేరువుగా ఉంటూ వారికి సేవలు అందించేందుకే ఈ ఉద్యోగం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనిని ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంలా తీసుకోవాలి. వివక్ష, అవినీతి లేని, పారదర్శక పాలన కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆ పాలన మీ భుజస్కందాల మీద పెడుతున్నాను. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని కోరుతున్నాను’ అని కొత్తగా గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే తమ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిందని సగర్వంగా ప్రకటించారు. ఇందులో దాదాపు 1.40 లక్షలు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలేనని, ఇది నిజంగా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రికార్డు అని చెప్పారు. ఒకే సమయంలో 1,34,534 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రతాలను అందజేసే కార్యక్రమాన్ని విజయవాడలో సీఎం జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం సహా, నాలుగు నెలలు తిరగక ముందే అక్షరాల 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. అర్హులందరికీ పథకాల లబ్ధి అందించాలి ‘‘గ్రామాల్లో మంచి నీరు, మంచి పాఠశాల, ఆసుపత్రి.. తదితర కనీస సదుపాయాలు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. ఇవేవీ గ్రామాల్లో అందుబాటులో లేని పరిస్థితి. చివరికి బియ్యం కూడా నాసిరకం. అది కూడా సరిగా ఇవ్వని పరిస్థితి నేడు గ్రామాల్లో కనిపిస్తోంది. రేషన్ కార్డు కావాలన్నా లంచం.. పెన్షన్ కావాలన్నా లంచం.. ఇల్లు లేక ఇంటి స్థలం కావాలంటే ఎవరిని అడగాలో తెలియదు. ఎక్కడకు పోవాలో తెలియదు. ఎవరి చుట్టూ తిరగాలో తెలియదు. మండలాఫీసుల చుట్టూ తిరుగుతూ ఎవరికి పడితే వారికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని చూశాం. జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్లు, రేషన్, పనిముట్లు, చివరికి మరుగుదొడ్ల కోసం కూడా లంచం లేనిదే ఎక్కడా పని జరగని పరిస్థితిని చూశాం. గ్రామ వలంటీర్ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యత తీసుకుంటారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారి చేయి పట్టుకుని గ్రామ సెక్రటేరియట్ వద్దకు తీసుకువస్తారు. వారి సమస్యపై స్పందిస్తూ 72 గంటల్లో రేషన్ కార్డు, పెన్షన్, ఇల్లు.. ఏదైనా కావచ్చు.. వాటిని వారికి అందిస్తే.. కనీసం ఎప్పుడు చేస్తామో తెలిపే ధ్రువపత్రం వారి చేతుల్లో పెడితే వారి ముఖంలో ఎటువంటి ఆనందం కనిపిస్తుందో ఆలోచించండి. నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలను కూడా గ్రామ సచివాలయం పక్కనే దుకాణాలు పెట్టి అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరికి తెలిసేలా లబ్ధిదారుల జాబితా అక్టోబర్ 2వ తేదీన కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లో చాలా చోట్ల కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, లామినేషన్ పరికరాల వంటివి ఏర్పాటు చేయడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. వాటి కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. డిసెంబర్ మొదటి వారం నాటికి అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి గ్రామ వలంటీర్‌కు నవంబర్ చివరి వారం నాటికి ఒక స్మార్ట్ ఫోన్ అందజేస్తాం. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచాం. రివర్స్ టెండరింగ్ పద్ధతుల్లో మరో రెండు రోజుల్లో వాటిని ఓపెన్ చేస్తాం. ఇవన్నీ పూర్తి చేసుకుని, డిసెంబర్ మొదటి వారంలో అన్ని సదుపాయాలతో గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత చిన్న చిన్న సమస్యలేవైనా ఉంటే డిసెంబర్ నెలాఖరు నాటికి పరిష్కరిస్తాం. జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఆధ్వర్యంలో 500 సేవలు అందుబాటులోకి వస్తాయి. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు మీ ఆధీనంలోకి వస్తాయి. పూర్తి పారదర్శకంగా వాటిని ఇవ్వాలి. లబ్ధిదారుల జాబితాలు పారదర్శకంగా మీ గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలి. దీంతో ప్రజల మధ్యే సోషల్ ఆడిట్ జరుగుతుంది. సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వారికి మాత్రమే అందాలి. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు కూడా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనకు ఓటు వేయని వారు కూడా మనం చేసిన మంచిని చూసి వచ్చే ఎన్నికల్లో మనకు ఓటు వేసేలా మారాలి. అవినీతికి పాల్పడితే ఉపేక్షించం.. ఎక్కడైనా వివక్ష, అవినీతి జరుగుతుంటే 1902 అనే కాల్ సెంటర్ నంబర్‌కు ఎవరైనా ఫొన్ చేయొచ్చు. అది ఏకంగా సీఎం పేషీకే కనెక్ట్ అవుతుంది. ఎక్కడా అవినీతిని ఉపేక్షించం. మీ పనితీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. పరిపాలన బాగుండాలంటే మన ఉద్యోగులు ప్రజలతో బాగుండాలి. ఈ వ్యవస్థలో మార్పు తేవడం కోసం ఈ ప్రయోగం చేయాలనిపించింది. మీ అందరిపై నమ్మకం ఉంది. అందుకే ఈ బాధ్యతను మోపాను. చిన్న తప్పు కూడా జరక్కుండా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ నిర్వహించిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు ప్రతి కలెక్టర్, ఎస్పీని అభినందిస్తున్నా. వారందరికీ సెల్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఉద్యోగాలు రాని వారు బాధ పడాల్సిన పనిలేదు. ఏటా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి నెలను ఎగ్జామినేషన్ నెలగా భావిస్తాం. త్వరలో జవనరి వస్తుంది. మళ్లీ తర్వాత జనవరి వస్తుంది’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అనంతరం గ్రామ సచివాలయ మ్యానువల్, ఉద్యోగుల జాబ్ చార్ట్ నియామావళి పుస్తకాలను సీఎం జగన్ అవిష్కరించారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయండి ప్రజలకు మేలు చేసేందుకు కొత్త తరహా పాలన కావాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచించి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అన్నారు. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారు సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. వైఎస్ జగన్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రక్షణనిధి, కైలా అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, దూలం నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం ప్రసంగాన్ని తిలకించేందుకు అన్ని జిల్లాలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియకు ఏకంగా 20 లక్షల పైచిలుకు అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవ్వడం.. ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం.. సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రికార్డు. ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నాం. -
సీఎం ఇచ్చిన స్వేచ్ఛతోనే.. పారదర్శకంగా పరీక్షలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. రాజకీయ జోక్యం లేకుంటే ఏ పనిలోనైనా అధికారుల పనితీరు అద్భుతంగా ఉంటుందనేందుకు ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియే నిదర్శనమన్నారు. ఉద్యోగాల రాతపరీక్షల ముగింపు సందర్భంగా రాష్ట్ర స్థాయి పరీక్షల కమిటీ చైర్మన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పరీక్షల కమిటీ కంట్రోలర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్,మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్‌కుమార్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్‌తో కలిసి అజేయ కల్లం సోమవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అజేయ కల్లం రికార్డు సంఖ్యలో ఉద్యోగాలకు ఎటువంటి తప్పులకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా, తక్కువ సమయంలో అంతా హర్షించే విధంగా పరీక్షలను నిర్వహించడం అద్భుతమన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను చేపట్టిన చరిత్ర ఎప్పుడూ లేదని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల లోపే ఎన్నికల హామీ మేరకు రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీని చేపట్టారని తెలిపారు. ఇప్పుడు భర్తీ చేస్తున్నవి ఈ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ఉద్యోగాలని, ఇవేమీ ఖాళీ అయిన ప్రభుత్వ ఉద్యోగాలు కాదన్నారు. ఏ సర్కారైనా సంవత్సరానికి 1,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేసే పరిస్థితుల్లో లేని సమయంలో ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలను కొత్తగా సృష్టించి, నియామకాలు చేపట్టడం ఒక చరిత్రగా అభివర్ణించారు. పరీక్షల నిర్వహణలో గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్, విజయకుమార్, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి సిబ్బంది పనితీరును ఆయన ప్రశంసించారు. ఎంపికయ్యే ఉద్యోగులను వారి సొంత ఊరిలో నియమించాలా.. వద్దా? అన్నదానిపై ఇంకా ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం జరగలేదని, దీనిపై విధాన పరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అజేయ కల్లాం తెలిపారు. 90 శాతం మంది హాజరు: గిరిజా శంకర్ ఉద్యోగ రాతపరీక్షలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, 19.49 లక్షల మంది హాజరయ్యారని, దాదాపు 90 శాతం మంది హాజరవడం విశేషమని పరీక్షల రాష్ట్ర స్థాయి కంట్రోలర్‌గా వ్యవహరించిన గిరిజా శంకర్ చెప్పారు. తొలిరోజు ఉదయం 12 లక్షల మందికి పైగా హాజరు కావాల్సిన పరీక్షకు ఏకంగా 93 శాతం మంది హాజరయ్యారన్నారు. పరీక్ష రాసే వారు ముఖ్యంగా మహిళా అభ్యర్ధులు ఇబ్బంది పడకూడదని వారు నివసించే ప్రాంతానికి 40–50 కిలోమీటర్ల లోపు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎన్నికల తరహాలో ఈ పరీక్షలను కూడా నిర్వహించినట్టు చెప్పారు. ఫలితాల వెల్లడి, నియామక ప్రక్రియలోనూ ఇంతే పారదర్శకంగా పని చేస్తామన్నారు. జవాబు పత్రాల స్కానింగ్ వేగంగా సాగుతుందని, ఈనెల 18, 19వ తేదీల్లో ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రకటించారు. సమర్ధంగా పరీక్షల నిర్వహణలో అభ్యర్ధుల సహకారం మరవలేనిదన్నారు. చరిత్రాత్మక ఘట్టం: ద్వివేది ఇన్ని లక్షల ఉద్యోగాల భర్తీ.. 22 లక్షల మందికి రాతపరీక్షలు.. ఇంత పకడ్బందీగా పరీక్షల నిర్వహణ.. ఇదో ‘హిస్టారిక్ ఈవెంట్’ అని పరీక్షల కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ ద్వివేది పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో చిన్న పొరపాటు దొర్లినట్టు ఎక్కడా చిన్న ఫిర్యాదు కూడా రాలేదన్నారు. డిగ్రీ అభ్యర్ధులు పోటీ పడే స్థాయిలో ప్రశ్నాపత్రం రూపకల్పన ఉందన్నారు. 25 శాతం సులభమైనవి, మరో 25 శాతం కఠినమైనవి, 50 శాతం యావరేజ్ ప్రశ్నలతో ఉందన్నారు. పరీక్ష పూర్తి పారదర్శకంగా జరిగిందనేందుకు అభ్యర్ధులకు ఓఎమ్మార్ షీటు నకలు ఇంటికే ఇచ్చామని, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? ర్యాంకు ఎంత? అన్నది ఫలితాల్లో స్పష్టంగా తెలిసిపోతుందన్నారు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ, ఏపీ ఎస్సీఈఆర్టీ తదితర సంస్థల సహకారం ఉందన్నారు. జిల్లాల వారీగా, పోస్టుల వారీగా, కేటగిరీలవారీగా ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వూ్యలు ఉండవని, ఇప్పటికీ కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని చెప్పారు. యూపీఎస్సీ స్థాయిలో నిర్వహణ: విజయకుమార్ పారదర్శకంగా, స్వేచ్ఛగా పరీక్షలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవంతంగా పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ విజయకుమార్ తెలిపారు. పరీక్షల కంట్రోలర్ గిరిజా శంకర్ సూచనలు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది సహకారంతో యూపీఎస్సీ స్థాయిలో పరీక్షలు నిర్వహించగలిగామన్నారు. యూపీఏస్‌సీలోనూ ఒకే విడతలో 14 లక్షల మందికి మించి దరఖాస్తులు చేసుకోరని, అందులోనూ 7–8 లక్షల మందికి మించి హాజరు ఉండదన్నారు. దాదాపు 22 లక్షల మంది దరఖాస్తుదారుల్లో 90 శాతం మంది పరీక్షలకు హాజరు కావడం రికార్డుగా పేర్కొన్నారు. మార్కులు, మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయని స్పష్టం చేశారు. -
తల్లీ కూతుళ్లకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు
చదువు ఆపేసిన పన్నెండేళ్లకు తిరిగి ప్రారంభించి ఏకంగా లెక్చరర్ ఉద్యోగం సాధించిన ఘనత తల్లిది. చిన్న వయసులో చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం తెచ్చుకున్న ఘనత కూతురిది. ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నతల్లి రౌతు పద్మ, కూతురు అలేఖ్య పటేల్ సక్సెస్ ఇది.. తల్లీ కూతుళ్లు పోటీ పడి చదువుకోవడం ఈ రోజుల్లో పెద్ద వింతేమీ కాకపోవచ్చు. కానీ ఇద్దరూ ఒకే ఏడు పోటీ పరీక్షలు రాసి, ఉత్తీర్ణత సాధించడం ఒక ఎత్తు అయితే .. విజయవంతంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం మరో ఎత్తు. పెద్ద కుటుంబంలో చిన్న కోడలు పెళ్లయిన 12 సంవత్సరాల తరువాత తిరిగి చదువును కొనసాగించాలనుకుంది పద్మ. అలా మొదలు పెట్టి.. రాసిన ప్రతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. డిగ్రీ పాసై అటు పైన పోస్టు గ్రాడ్యుయేషన్, బీఈడి, ఎంఈడీ, నెట్ అర్హతలు సాధించి అంతిమంగా టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల కళాశాలలో పీజీటీగా ఎంపికైంది. ఇపుడు సిరిసిల్ల జిల్లా చిన బోనాలలోని రెసిడెన్షియల్ కాలేజ్‌లో పీజీటీగా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి పద్మ మాట్లాడుతూ – ‘మాది మంథని దగ్గరి రామకృష్ణాపూర్. పదో తరగతి పూర్తయ్యాక వివాహం అయింది. ఎనిమిది మంది సంతానం గల పెద్ద కుటుంబానికి చిన్న కోడలుని. మా అమ్మాయి అలేఖ్య ఆరో తరగతి వచ్చే వరకు ఇంటి పనులు చక్కదిద్దడం, పిల్లల్ని స్కూల్‌కి పంపడం, వంటా వార్పుతోనే సరిపోయేది. పాప తన పనులు తాను చేసుకునే స్థితికి చేరుకుంది. ఈ క్రమంలో చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. చాలా సార్లు చదువు పైన నాకు ఇష్టం ఉందని గ్రహించిన మా వారు తిరిగి చదువుకొమ్మని ప్రోత్సహించారు. అలా అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్ష ద్వారా డిగ్రీ పూర్తి చేశాను. తొలి ప్రయత్నంలోనే పాసవడంతో మరింత ప్రోత్సాహం లభించింది. ఆ తర్వాత రెగ్యులర్‌గా బీఈడి, ఆ పైన ఎంఈడి పూర్తి చేశాను. ఎంఈడిలో నాది రాష్ట్రంలో 9వ ర్యాంకు. జాతీయ పరీక్ష నెట్లో కూడా అర్హత సాధించాను. తొలి ప్రయత్నంలోనే రెసిడెన్షియల్ టీచర్‌గా ఎంపికయ్యాను. టీజీటి, పీజీటి స్థాయి పోస్టుల్లో రెండేసి సబ్జక్టుల్లో తెలుగు, సోషల్‌కు ఎంపికయ్యాను. ఫైనల్‌గా పీజీటి తెలుగులో జాయిన్ అయ్యాను’ అని వివరించింది పద్మ. అమ్మతో పోటీ పడిన కూతురు తనేమీ తక్కువ కాదనుకున్న కూతురు అలేఖ్య మరింత ఎక్కువగా శ్రమ పడి టీఎస్ పీఎస్సీలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించింది. ఇప్పుడు శిశు సంక్షేమ శాఖలో రాజన్న సిరిసిల్ల జిల్లా సీడీపీవో(చైల్డ్ డవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్)గా బాధ్యతలు నిర్వహిస్తోంది. తన విజయం గురించి అలేఖ్య మాట్లాడుతూ –‘చిన్నప్పటి నుంచి చదువులో అమ్మా, నాన్నల ప్రోత్సాహం చాలా గొప్పది. నాన్న బాగా ఎంకరేజ్ చేశారు. çపది, ఇంటర్మీడియోట్ 95 శాతం మెరిట్‌తో పాసయ్యాను. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్మితా సభర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్‌గా ఉండేవారు. పరిపాలనలో మేడమ్ డైనమిజం చూసి చాలా ఆకర్షితురాలినయ్యాను. నేను కూడా కలెక్టర్ కావాలనుకునేంతగా స్ఫూర్తి పొందాను. అందుకే ఐఏఎస్ అకాడమీలో చేరి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేశాను. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగం కోసం టీఎస్పీఎస్సీ పరీక్ష రాసి స్టేట్ ఫస్ట్‌లో మెరిట్ సాధించాను. ఉద్యోగంలో చేరేనాటికి 21 ఏండ్ల 10 నెలల వయసు. చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగంలో చేరిపోయానని ఇంట్లో అందరూ మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని అతి పెద్ద ప్రాజñ క్ట్ను మానిటర్ చేసే హోదాలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంతటితో ఆగిపోకుండా సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. సాధించగలననే నమ్మకం ఉంది’ అని తెలిపింది. ఇంట్లో స్నేహితులం తల్లీ కూతుళ్లుగా బంధం నిర్ణయించినప్పటికీ ఇంట్లో ఇద్దరం మంచి స్నేహితులం. ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటాం. ‘ఇవి పెద్దవాళ్లు మాట్లాడుకునే మాటలు’ అని అమ్మ అనదు, ‘ఇది నాకు మాత్రమే సంబంధించిన విషయం’ అని నేను అనుకోను. చదువు, ప్రిపరేషన్ గురించే కాదు ఇంటి పనుల్లోనూ పక్కా ప్లానింగ్‌తో చేసేవాళ్లం. మా చుట్టుపక్కల వీళ్లు తల్లి కూతుళ్లు అనే కన్నా ఇద్దరినీ మంచి స్నేహితులు అంటుండేవారు. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో రూపొందించుకున్న టైమ్ టేబుల్‌ను అనుసరిస్తూ పరస్పరం ప్రోత్సహించుకుంటాం. అదృష్ట్టవశాత్తు ఇద్దరికీ ఒకే జిల్లాలో పోస్టింగ్ రావడం చాలా సంతోషాన్నిస్తోంది. మా ఇద్దరి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని తెలిస్తే చాలా గర్వంగా ఉంటుంది’ అని తెలిపింది అలేఖ్య. తల్లీ కూతుళ్లుగా తాము సాధించిన విజయాల వెనుక రౌతు రమేశ్ పాత్ర కీలకమైంది. పద్మ భర్త రమేశ్ సింగరేణి కాలనీలో చిరుద్యోగి. పెద్ద కుటుంబంలో చిన్నవాడు. అయితేనేం అర్థాంగి మనస్తత్వాన్ని, ఆమె అంతరంగాన్ని సరిగ్గా అర్థం చేసుకుని చదువుకోవాలని ప్రోత్సహించాడు. ఈ వయసులో చదువెందుకు అని ప్రశ్నించిన వారికి చిరునవ్వుతో సమాధానమిస్తూనే ఉన్నత విద్య విషయంలో రాజీ పడలేదు. అందుకే తాము సాధించిన ఈ విజయాలకు సంబంధించిన క్రెడిట్ మొత్తం రమేశ్‌కే దక్కుతుందని తల్లీ కూతుళ్లిద్దరూ ఆనందంగా చెబుతారు.– గెంట్యాల భూమేశ్, సిరిసిల్ల కల్చరల్ఫొటో: వంకాయల శ్రీకాంత్ -
నిరుద్యోగుల ధైర్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నిరుద్యోగుల్లో ధైర్యం నింపుతోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో మెజార్టీ మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 779 మందికి ఉద్యోగాలు దక్కడం గమనార్హం. ఐదేళ్లలో 6,818 మంది శిక్షణ పొందితే వీరిలో 12శాతం మందిని సర్కారు కొలువులు వరించాయి. ఇతర స్టడీ సర్కిళ్లతో పోలిస్తే ఈ సంఖ్య మెరుగ్గా ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ పేర్కొంటోంది. స్టడీ సర్కిళ్లలో శిక్షణల నిర్వహణ వ్యూహాత్మకంగా, పకడ్బందీగా నిర్వహిస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సివిల్ సర్వీసెస్‌కు ఐదుగురు.. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లున్నాయి. హైదరాబాద్‌లో మెయిన్ సెంటర్ ఉండగా, మిగతావి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. సివిల్స్ తదితర ప్రతిష్టాత్మక పరీక్షలకు సంబంధించిన శిక్షణలు మాత్రం హైదరాబాద్‌లో జరుగుతాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు వివిధ నియామక బోర్డులు నిర్వహించే పరీక్షలకు విద్యార్థుల సంఖ్య, సౌకర్యం తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 779 మందికి సర్కారు కొలువులు దక్కాయి. ఇందులో అత్యధికంగా 454 మంది పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు పొందారు. టీజీటీ/పీజీటీ/టీఆర్టీ కేటగిరీలో 46 మంది కొలువులు సాధించారు. మరో 46 మందికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు సాధించారు. మొత్తంగా 45 రకాల విభాగాల్లో ఉద్యోగాలు సాధించినట్లు స్టడీ సర్కిల్ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలో హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 1,278 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకోగా.. మిగతా 10 స్టడీ సర్కిళ్లలో 5,540 మంది శిక్షణ తీసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయంతో మరింత మేలు.. శిక్షణ తరగతుల నిర్వహణ, అభ్యర్థుల వసతి, స్టడీ మెటీరియల్, భోజన సౌకర్యం వాటికి ఐదేళ్లలో స్టడీ సర్కిళ్లకు చేసిన ఖర్చు రూ.37.71 కోట్లు. తాజాగా ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను మొదలుపెట్టింది. ఫలానా ఉద్యోగాల కోసం కాకుండా జనరల్ అంశాలతో రూపొందించిన శిక్షణ కోసం ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులు దాదాపు ప్రతి ఉద్యోగానికి 50 శాతం సిద్ధంగా ఉంటారని, నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత సబ్జెక్టు పరంగా శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్స్ అభ్యర్థులకు అభినందన సభ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా 779 మందికి ఉద్యోగాలు రావడం గర్వంగా ఉంది. శాఖాధికారులు, ఉద్యోగులు, ఫ్యాకల్టీ కృషి, అభ్యర్థుల పట్టుదలతో ఈ ఉద్యోగాలు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఇప్పటివరకు ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను అనుసరిస్తాం. గత ఐదేళ్లలో ఐదుగురికి సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు దక్కాయి. వచ్చే నెలలో ఆయా అభ్యర్థులకు అభినందన సభ నిర్వహించాలని భావిస్తున్నాం. –పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
సెప్టెంబర్ 1న సచివాలయ ఉద్యోగాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు చేపట్టే ఉద్యోగ నియామకాలకు సెప్టెంబరు 1వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే విడతలో దాదాపు 1,33,494 కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటిని పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలుగా పేర్కొనడంతో పాటు రాతపరీక్ష విధానంలో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పరీక్ష విధానం, విద్యార్హతలు, పరీక్ష విధానంతో పాటు పరీక్ష తేదీతో గురువారం నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో పాటు అవసరమైన 12 శాఖల ఉన్నతాధికారులు రోజూ సమావేశమవుతున్నారు. కాగా ఈ ఉద్యోగాలకు దాదాపు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి దాకా వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే పలువురు కూడా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 2వ తేదీ కూడా) రాత పరీక్షలు నిర్వహించాలని కూడా ప్రభుత్వ అధికారుల మధ్య చర్చ జరుగుతుంది. అయితే ఒకే రోజు పరీక్ష నిర్వహణకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. కాగా రాతపరీక్షను పూర్తిగా మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో నిర్వహిస్తారు. అధికారుల సమాచారం మేరకు 150 మార్కులకు 150 ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఉంటాయి. ఇందులో 75 మార్కులకు జనరల్ నాలెడ్జి ప్రశ్నలు, మిగిలిన 75 మార్కులకు సంబంధిత ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఆధారంగా ప్రశ్నలు ఉంటాయని సమాచారం. -
గ్రామ సచివాలయ ఉద్యోగాలకు 15న నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం చొప్పున ఏర్పాటు ప్రక్రియను అక్టోబరు 2వతేదీ నాటికి పూర్తి చేసేలా వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల ఏర్పాటుపై గురువారం ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. గ్రామ సచివాలయాల్లో పదేసి మంది చొప్పున కొత్తగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకు సంబంధించి జులై 15వతేదీ కల్లా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. పారదర్శకంగా ప్రక్రియ గ్రామ సచివాలయాల ఉద్యోగులను మొదట రెండేళ్ల పాటు ప్రొబేషనరీగా ఉంచి, ఆ తర్వాత వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామన్న విషయాన్ని యువతకు స్పష్టంగా తెలిసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా అదనంగా మరో 10 మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్న విసయం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా రాతపరీక్ష నిర్వహించి అత్యంత పారదర్శక విధానంలో ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికలపైనా చర్చ గ్రామ సచివాలయాలకు సంబంధించి కసరత్తు అక్టోబరు వరకు జరుగుతున్నందున ఆ తర్వాతే గ్రామ పంచాయితీ, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ మొదలుపెడదామని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించి రిజర్వేషన్ల అంశంపై కొత్తగా చట్టం చేయాలని అధికారులు పేర్కొనగా ప్రతిపాదనలు పంపితే క్యాబినెట్లో చర్చించి, అవసరమైతే వెంటనే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పెట్టి చట్టం తెద్దామని సీఎం చెప్పారు. -
కొలువుల పల్లె!
సాక్షి, పెన్‌పహాడ్ (సూర్యాపేట) : అది ఒక మారుమూల పల్లె. వారి జీవనాధారం వ్యవసాయం. అందరూ వ్యవసాయం మీదే ఆధారపడుతూ తమ పిల్లలకు ఉన్నత విద్యాబోధన చేయించారు. వారు ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మండల పరిధిలోని భక్తళాపురం ఆవాసం యర్రంశెట్టివారిగూడెంలో 500 మంది జనాభా. పురుషులు 264, స్త్రీలు 236 మంది ఉన్నారు. గ్రామానికి చెందిన యువకులు వ్యవసాయంపై ఆధారపడకుండా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారు. గ్రామంలో మొత్తం 68మంది వివిధ రంగాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ప్రధానంగా సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంఈఓ, ఉపాధ్యాయులు 21, సబ్ఇన్స్పెక్టర్లు 2, కానిస్టేబుల్స్ 5, వ్యవసాయం అధికారి, వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2, వైద్యాధికారులు 2, స్టాఫ్‌నర్స్ 1, ఆర్టీసీ, ఎలక్ట్రికల్, సాఫ్ట్వేర్ 15 మంది ఇలా పలువురు పలు ఉద్యోగాల్లో ఉన్నారు. అంతేకాకుండా ఇంకొంత మంది విదేశాల్లో స్థిరపడిన వారు ఉన్నారు. గ్రామంలో 1వ తరగతి నుంచి 2వతరగతి వరకు మాత్రమే ఉంది. 3వ తరగతి నుంచి 4వ తరగతి వరకు నేలమర్రి, ఆపై చదువులకు చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఐదు కిలో మీటర్ల దూరం నిత్యం నడుచుకుంటూ వెళ్లే వారు. గ్రామంలో సరైన సౌకర్యాలు లేనప్పటికీ జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలనే ఆకాంక్ష వారిని ఈ స్థాయికి చేర్చింది. ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉన్నతమైన స్థాయిలో నిలిచిన వారు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఉన్నతమైన చదువు చదివి ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఉపాధ్యాయుల నాణ్యమైన విద్యాబోధన ఫలితంగానే ఉన్నత చదువుల్లో రాణించి ఇంటలిజెన్స్ సీఐగా హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నా. – మధుసూదన్, సీఐ, హైదరాబాద్ మా నాన్న స్ఫూర్తితోనే నేను ఈ స్థాయిలో ఉన్నా.. ఉపాధ్యాయులు నేర్పిన పాఠాలతో పాటు మా నాన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాడు. ఆయన స్ఫూర్తితోనే కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. గ్రామంలో పోటీతత్వం వల్ల కూడా ఉన్నతమైన స్థానం సాధించగలిగా. సొంత మండలంలోనే పశువైద్యాధికారిగా విధులు నిర్వహించా. ప్రస్తుతం వరంగల్ పశువైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నా. – యర్రంశెట్టి కిరణ్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వరంగల్ -
లక్ష మంది టెటౌట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్ష మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు అర్హత కోల్పోయారు. ఇప్పటికిప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తే వారు అనర్హులుగానే మిగిలిపోనున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరే ఆగిపోలేదు. ప్రైవేటు పాఠశాలల్లోనూ వీరు అధ్యాపకులుగా పని చేసేందుకు అర్హత కోల్పోనున్నారు. వీరితోపాటు 2017 జూలై తరువాత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) పూర్తి చేసిన మరో 50 వేల మందిదీ ఇదే దుస్థితి. ఇందుకు కారణం లక్ష మంది అభ్యర్థుల ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీ ముగిసిపోవడమే. 2011 జూలై 1వ తేదీన, 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన వారిలో.. దాదాపు లక్ష మంది అర్హత ఈ ఏడాది జనవరి 8వ తేదీతో ముగిసిపోయింది. మరోవైపు కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన ఆ 50 వేల మందికి టెట్ నిర్వహించకపోవడంతో వారంతా సమీప భవిష్యత్తులో ఉండే (ఒకవేళ ప్రభుత్వం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే) ఉపాధ్యాయ పోస్టులకు అనర్హులుగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. 2011 నుంచే అమల్లోకి రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ప్రతి అభ్యర్థి టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) 2010లోనే ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా మన రాష్ట్రంలోనూ ఏటా రెండుసార్లు (నవంబర్/డిసెంబర్, జూన్/జూలై) టెట్ నిర్వహించాలని రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో అర్హ్హత సాధించిన వారే ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఉత్తర్వులు జారీ చేసింది. పైగా టెట్ స్కోర్ వ్యాలిడిటీ ఏడేళ్లేనని స్పష్టం చేసింది. ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే మళ్లీ టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆ నిబంధన ప్రకారం రాష్ట్రంలో మొదటి ఏడాది తప్ప.. ఏ ఒక్క ఏడాదీ రెండుసార్లు టెట్‌ను నిర్వహించలేదు. కొత్తరాష్ట్రంలో రెండేసార్లు.. 2011 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం ఆరుసార్లు టెట్‌ను నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగుసార్లు, తెలంగాణ ఏర్పడ్డాక రెండుసార్లు టెట్ పరీక్ష జరిగింది. ఇందులో 2011 జూలై 1వ తేదీన నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ 2018 జూలై 1వ తేదీతో ముగిసిపోయింది. 2012 జనవరి 8వ తేదీన నిర్వహించిన రెండో టెట్ వ్యాలిడిటీ ఈనెల 8వ తేదీతో ముగిసిపోయింది. దీంతో అప్పటి టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారిలో లక్ష మందికి పైగా అభ్యర్థులు తమ టెట్ స్కోర్‌ను, దాని వ్యాలిడిటీని కోల్పోవడంతో అర్హత పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయారు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ పోస్టుల్లో చేరాలంటే టెట్ అర్హత తప్పనిసరి నిబంధన నేపథ్యంలో వీరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ ఏడాది జూన్ 1వ తేదీ దాటితే 2012 జూన్ 1న నిర్వహించిన మూడో టెట్ స్కోర్ వ్యాలిడిటీ కూడా రద్దు కానుంది. దీని ద్వారా మరో 50 వేల మంది అనర్హులుగా మిగిలిపోనున్నారు. 4,36,998 మంది అర్హులు టెట్ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంది. ప్రభుత్వం ఏటా రెండుసార్లు నిర్వహించే టెట్లలో అర్హత సాధించిన అభ్యర్థులు మళ్లీ మళ్లీ టెట్‌కు హాజరై తమ స్కోర్‌ను పెంచుకోవచ్చు. దీంతో రాష్ట్రంలో నిర్వహించిన మొదటి రెండు టెట్‌లకు 10 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. అందులో 4,36,998 మందికి అర్హత లభించింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 2 లక్షల మంది వరకుఉన్నారు. మరో 2 లక్షల పైచిలుకు తెలంగాణ అభ్యర్థులున్నారు. వీరిలో లక్ష మంది.. 2012 జూన్, 2014 మార్చి, 2016 మే, 2017 జూలై నెలలో నిర్వహించిన టెట్ పరీక్ష రాసి.. మళ్లీ అర్హత సాధించారు. దీంతో వారికి ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. మిగతా లక్ష మంది మాత్రం అప్పట్లో తమకు ఎలాగూ అర్హత ఉంది కదా అన్న ఉద్దేశమో.. లేక ప్రభుత్వం ఏలాగూ ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తుందన్న భరోసాతో తర్వాత మళ్లీ రాయవచ్చులే అనే భావనతోనే గానీ.. టెట్‌ను మళ్లీ రాయలేదు. దీంతో వారి స్కోర్ వ్యాలిడిటీ ప్రస్తుతం ముగిసిపోయింది. గురుకుల నోటిఫికేషన్ వస్తే ఎలా? వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో 119 కొత్త బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నా యి. అందులో 1,071 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులున్నాయి. వాటికి టెట్‌లో అర్హ త సాధించి ఉన్న దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కానీ లక్షన్నర మందికి ఆ అర్హత లేకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త గురుకులాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నందున విద్యాశాఖ వెంటనే స్పందించి టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రావుల రామ్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. అకస్మాత్తుగా ప్రభుత్వం ఆ పోస్టుల భర్తీకి చర్యలు చేపడితే టెట్ అర్హత లేని అభ్యర్థులు ఆ పోస్టులకు అనర్హులుగా మిగిలిపోవాల్సి వస్తుం దని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 50 వేల మంది కొత్త వారికి.. రాష్ట్రంలో రెండేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసిన 50 వేల మంది కొత్త విద్యార్థులకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. 2017 జూలై 23వ తేదీ తరువాత విద్యాశాఖ మళ్లీ రాష్ట్రంలో టెట్ నిర్వహిం చింది. ఏడాదిన్నర కాలంలో టెట్‌ను పట్టిం చుకోలేదు. 2017లో, 2018లో బీఎడ్, డీఎడ్ పూర్తయిన వారు దాదాపు 50 వేల మంది టెట్ పరీక్షకు హాజరు కాలేదు. మరోవైపు వచ్చే మే నాటికి మరో బ్యాచ్ బీఎడ్, డీఎడ్‌ను పూర్తి చేసుకోనుంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే వారికి టెట్‌లో అర్హత లేనందున, వారు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులవుతారు. అంతేకాదు టెట్‌లో అర్హత లేకపోవడంతో వారు కనీసం ప్రైవేటు పాఠ«శాలల్లో టీచర్లుగా చేరేందుకు కూడా అర్హతలేదు. -
సర్కారీ కొలువులకు కోత
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన కేంద్రం ప్రభుత్వం.. ఏటా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మాత్రం పట్టించుకోవడం లేదు. 2014 నుంచి ఏటికేడు సర్కారీ కొలువులు తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇలా 78 వేలకు పైగా ఉద్యోగాల్లో కోత పడగా కొత్తగా ప్రవేశపెట్టిన 10శాతం రిజర్వేషన్ వల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్న యువజనుల మదిని తొలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను వెల్లడిస్తూ.. వచ్చే ఏడాది ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నదీ చెబుతుంది. కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 55 మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఉన్నాయి. రైల్వే ఉద్యోగులను కూడా కేంద్ర సిబ్బందిగానే పరిగణిస్తారు. అయితే, రక్షణ దళాల సిబ్బందిని వీరితో కలపరు. 2018–19 బడ్జెట్ ప్రకారం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 32 లక్షల 52వేలు. 2014 మార్చి 1వ తేదీ నాటికి వీరి సంఖ్య 33 లక్షల 30 వేలు. అంటే, ఈ నాలుగేళ్లలో సుమారు 78 వేల ఉద్యోగాలు తగ్గి పోయాయన్న మాట. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా వచ్చే ఏడాదికి ఉద్యోగాలను 35 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే, కేంద్రం ఈ హామీని ఏ ఒక్క ఏడాది కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇవ్వడమే సర్కారీ కొలువుల కోతకు కారణం. కేంద్రం గత కొన్నేళ్లుగా పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగుల్ని నియమించుకుంటోంది. ముఖ్యంగా ప్యూన్లు, డ్రైవర్లను ఈ పద్ధతిలో నియమిస్తోంది. మరోవైపు పదవీ విరమణ చేసిన ఉద్యోగుల స్థానాలను చాలా ఏళ్లుగా భర్తీ చేయడం లేదు. ఇదికూడా ఉద్యోగాల సంఖ్య తగ్గడానికి కారణమవుతోంది. రైల్వేలో 2010లో ఎంత మంది ఉద్యోగులు ఉన్నారో 2018 నాటికి కూడా అంతమందే ఉన్నారు. 2016 నాటికి రైల్వేలో 13.31 లక్షల మంది ఉండగా, 2017లో 23వేల మందిని తొలగించారు. ఆ లోటు ఇప్పటికీ భర్తీ చేయలేదు. అయితే, పోలీసు శాఖలో ఉద్యోగుల సంఖ్య 10.24 లక్షల నుంచి 11.25 లక్షలకు పెరిగింది. అలాగే, ప్రత్యక్ష పన్నుల విభాగంలో ఉద్యోగులు 45 వేల నుంచి 80 వేలకు పెరిగారు. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాల్లో కూడా 54 వేల నుంచి 93 వేలకు పెరిగారు. కొన్ని విభాగాల్లో పెరిగినా మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో తగ్గుదలే స్పష్టంగా కనబడుతోంది. -
నిరుద్యోగులను నిండా ముంచేసిన రాష్ట్ర సర్కార్
సాక్షి, అమరావతి: గత ఎన్నికలకు ముందు ‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. ఐదేళ్ల పదవీకాలంలో ఆ నినాదాలను పూర్తిగా తుంగలోతొక్కింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పదవీ విరమణ చేసిన వారి సంఖ్య కలుపుకొంటే మొత్తం ఖాళీలు 2.40 లక్షలకు చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు.. కేవలం రెండు వేలు మాత్రమే. ఏటా ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించి 2016 వరకు వాటి ఊసే ఎత్తలేదు. గ్రూప్–1, 2, 3తో పాటు కొన్ని సాంకేతిక పోస్టులు, ఇతర పోస్టులు కలిపి మొత్తం 4,275 ఖాళీల భర్తీకి మాత్రమే 2016లో నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి 15.99 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు. ఇన్ని లక్షల మంది నిరుద్యోగుల్లో కేవలం 2 వేల మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించడాన్ని బట్టి చూస్తే నిరుద్యోగులను చంద్రబాబు ఏవిధంగా వంచించారో అర్థమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో 5.50 లక్షల మందికిపైగా డీఈడీ, బీఈడీ పూర్తిచేసినవారు ఉన్నారు. రాష్ట్రంలో ఏటా డీఎస్సీ అని చెప్పినా.. ఇప్పటివరకు ఒకే ఒక్క డీఎస్సీని మాత్రమే పూర్తయింది. గత కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన పోస్టులు పూర్తి చేశాక.. రాష్ట్రంలో ఇంకా 22 వేలకు పైగా టీచర్ ఖాళీలు భర్తీ చేస్తామని చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. అయితే చివరకు ఆ పోస్టుల సంఖ్యను 7,902కు కుదించేసింది. అవిగో నియామకాలు, ఇవిగో వేలాది పోస్టుల భర్తీలు అంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తోంది కానీ, ఈ ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు కేవలం రెండు వేలు మాత్రమే. ఇది పూర్తిగా తమ ఆశలతో, ఆశయాలతో ఆడుకోవడం లాంటిదేనని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల కుదింపు ప్రభుత్వ శాఖల్లో మంజూరైన మొత్తం పోస్టులు, ఖాళీల సంఖ్యను ప్రభుత్వం కుదించి చూపిస్తూ నిరుద్యోగులకు పంగనామాలు పెడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల సంఖ్య 2.40 లక్షలుంటే ఖాళీల సంఖ్య కేవలం 77,737 మాత్రమేనని, వీటిలో పైస్థాయిలో ఉండే 20 వేల పోస్టులను రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తామని తక్కినవాటిలో అవుట్ సోర్సింగ్‌లో తీసుకుంటామని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకొంది. ప్రభుత్వ శాఖల్లోని పోస్టులే కాకుండా ఉపాధ్యాయుల పోస్టులనూ రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ముందు 22 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి.. చివరకు 7,902కు ఆ సంఖ్యను తగ్గించేసింది. మళ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగులను మభ్యపెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎత్తులు వేసింది. 18,450 పోస్టుల భర్తీ అంటూ ప్రచారం చేసింది. ఈ నోటిఫికేషన్లు ఇంకా పూర్తిగా విడుదల కాలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమను మరోసారి వంచించడానికే ప్రభుత్వం నోటిఫికేషన్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని నిరుద్యోగుల ధ్వజమెత్తుతున్నారు. రూల్–7 ఎత్తివేతతో అన్యాయం గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లలోని పోస్టులకు ఎంపికైనవారు చేరకపోయినా, చేరి రాజీనామా చేసినా ఆ పోస్టులను కమిషన్ నిబంధనావళిలోని రూల్–7 ప్రకారం.. మెరిట్ జాబితాలోని తదుపరి అభ్యర్థికి కేటాయించేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ రూల్ ఎత్తేస్తూ జీవో ఇచ్చారు. రూల్–6ను మాత్రం కొనసాగించారు. రూల్–6.. ప్రకారం మిగిలిపోయిన పోస్టులను మెరిట్ అభ్యర్థులకు ఇవ్వకుండా తదుపరి నోటిఫికేషన్లలోకి మళ్లిస్తారు. ఫలితంగా నిరుద్యోగ అభ్యర్థులను తీరని అన్యాయం జరుగుతోంది. పోస్టులు మిగిలిపోయేలా ప్రభుత్వ నియామక ప్రక్రియ కొనసాగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం హామీని నమ్మి ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు, డీఎస్సీ వస్తాయన్న ఆశతో రాష్ట్రంలోని లక్షలాది మంది యువత గత నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. వీరిలో అనేకమంది లక్షల రూపాయలు అప్పులు చేసి కోచింగ్‌లు కూడా తీసుకున్నారు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులు అరకొరగా ఉండడం, కొత్త నోటిఫికేషన్లు రాకపోవడంతో వీరంతా తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. వయోపరిమితి దాటిపోయి.. అవకాశాలు కోల్పోయి.. నాలుగున్నరేళ్లుగా నియామకాలు లేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటి పోయారు. ఇప్పుడు వారికి ఏ అవకాశం లేక ఏం చేయాలో పాలుపోక ఇబ్బంది పడుతున్నారు. వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచాలన్న అభ్యర్థనను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని లేనిపక్షంలో ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల చొప్పున ప్రతినెలా భృతి ఇస్తామన్న హామీని కూడా ప్రభుత్వ నెరవేర్చలేదు. ఎన్నికలకు ముందు ’యువ నేస్తం’ పేరిట నిరుద్యోగ భృతి హామీలో వెయ్యి కుదించి ఇస్తోంది. అయితే భృతికి అర్హుల సంఖ్యను కుదించేశారు. ఇప్పటికే అనేక నిబంధనలు పెట్టడంతో 5 లక్షల మంది మాత్రమే యువనేస్తానికి దరఖాస్తు చేశారు. తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు, ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 1.5 లక్షల మందిని ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. కుక్‌లు, సహాయకులు 80 వేల మంది, వయోజనవిద్య సమన్వయకర్తలు 20 వేల మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు 25 వేల మంది ఉన్నారు. వీరందరినీ చంద్రబాబు సర్కార్ తొలగించి రోడ్డున పడేసింది. ఆటో తోలుకుంటున్నా –కోయ శ్రీనివాస్, కొల్లిపర, గుంటూరు జిల్లా నేను డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లవుతోంది. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో బాడుగకు ఆటో నడుపుకొంటున్నా. యజమానికి అద్దె పోనూ రోజూ రూ. 100 మాత్రమే మిగులుతున్నాయి. ఈ మొత్తంతో నలుగురు కుటుంబ సభ్యులను పోషించడం కష్టంగా ఉంది. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు ఇవ్వలేదు. ఉల్లిపాయలు అమ్ముకుంటున్నా –వి.రామారావు, విజయవాడ నేను 2016లో ఎంబీఏ పూర్తిచేశా. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తాయని అప్పు చేసి విజయవాడలో కోచింగ్ కూడా తీసుకున్నా. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాను. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసినా రాలేదు. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం ఉల్లిపాయలు అమ్ముకుంటున్నాను. రిజర్వుడ్ అభ్యర్థులకు ‘ఓపెన్’ దెబ్బ! రాష్ట్రంలోని ప్రభుత్వ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు రాజ్యాంగపరంగా దక్కాల్సిన హక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోంది. ప్రత్యేక మినహాయింపులు పొందిన ఆయా కేటగిరీల అభ్యర్థులు వారి రిజర్వుడ్ పోస్టులకే తప్ప ఓపెన్ కేటగిరీ పోస్టులకు ఎంపికచేయకుండా అన్యాయం చేస్తోంది. దీనిపై ఆయా కేటగిరీలకు చెందిన లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తపరుస్తున్నా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కానీ, ప్రభుత్వంలోని పెద్దలు కానీ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు ఎంతమందిని ఎంపిక చేయాలి? రిజర్వేషన్లను ఎలా అమలుచేయాలన్నది ప్రభుత్వం నిర్దేశించాలి. కానీ, ఆ అధికారాన్ని ప్రభుత్వం ఇటీవల ఏపీపీఎస్సీకి అప్పగించింది. గతంలో స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపికచేసేలా ప్రభుత్వం జీఓలు ఇచ్చి ఏపీపీఎస్సీ ద్వారా అమలుచేయించింది. ఇప్పుడీ అధికారాన్ని కమిషన్‌కు అప్పగించడమే కాదు.. ఎంతమందిని ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలో కమిషన్ నిర్ణయానికే వదిలేసింది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ముఖ్యులు ఈ కథను తెరవెనుక నుంచి నడిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ ఇస్తున్న నోటిఫికేషన్లలో ఎక్కడా ఎంపిక విధానం ఎలా ఉంటుందో స్పష్టంచేయకుండా గోప్యత పాటిస్తోంది. మరోవైపు.. నిర్ణీత నిష్పత్తిని ముందుగా ప్రకటించి కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులను పెట్టి అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్టు నుంచి ఎంపికచేయాలని ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నా కమిషన్ పట్టించుకోవడంలేదు. స్క్రీనింగ్ టెస్టు ముగిశాక జనరల్ కటాఫ్‌ను నిర్ణయించి మెయిన్స్‌కు మొత్తం ఎంతమంది అభ్యర్థులు అవసరమో ఆ మేరకు ఎంపికచేస్తామని, వారిలో రిజర్వుడ్ అభ్యర్థులు నిష్పత్తిలో లేకపోతే కటాఫ్ తగ్గించి తక్కిన వారిని ఎంపికచేస్తామని చెబుతోంది. ఇలా చెబుతూనే.. ఎంపికైన వారు కేవలం వారి రిజర్వుడ్ పోస్టులకు మాత్రమే పరిమితమవుతారని షరతు విధించింది. దీంతో ఇప్పటికే పలు సంఘాలు సీఎం చంద్రబాబునాయుడిని కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించినా ఫలితంలేదు. కమిషన్ తీరుపై అనుమానాలు కమిషన్ ఇలా చేయడం వెనుక తమకు కావలసిన అభ్యర్థులందరినీ స్క్రీనింగ్ టెస్టు నుంచి మెయిన్స్‌కు వచ్చేలా చేయడం, ఆ తరువాత వారికి ఇంటర్వ్యూల్లో అత్యధిక మార్కులు వేయడం ద్వారా గ్రూప్–1 సహా ఇతర ముఖ్యమైన పోస్టులను కట్టబెట్టాలన్న వ్యూహం ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పెద్దలే తమ వారి కోసం ఇలా చేయిస్తున్నారని, పూర్తి అధికారాలను కమిషన్‌కు అప్పగించి దాని ద్వారా తమ పనికానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వర్సిటీ పోస్టుల్లోనూ ఇదే తంతు ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లోని 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీలోనూ రిజర్వుడ్ అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ టెస్టు నిర్వహించారు. ఇందులో ఆయా కేటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ఆయా వర్సిటీలకు సమర్పించింది. ఈ జాబితా ఆధారంగా ఆయా వర్సిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇక్కడ కూడా ప్రభుత్వ పెద్దలు ఏపీపీఎస్సీ తరహాలోనే రిజర్వుడ్ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీకి అవకాశంలేకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి కేటగిరీల వారీగా నిర్ణయించిన అర్హత మార్కులను అనుసరించి ఎంపికైన వారందరినీ ఓపెన్ కేటగిరీ పోస్టుల ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉన్నా కేవలం తమ వారికి మాత్రమే ఆయా వర్సిటీల ద్వారా ఇంటర్వ్యూ లేఖలను పంపిస్తున్నారు. ఈ విషయం చాలా రహస్యంగా తెరవెనుక జరిగిపోతోందని, అనేక వేలమంది రిజర్వుడ్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలూ బేఖాతర్ 2016 నోటిఫికేషన్ల సమయంలోనే ఏపీపీఎస్సీ ఈ విధంగానే రిజర్వుడ్ అభ్యర్థులను వారి కేటగిరీకి పరిమితం చేస్తూ అన్యాయం చేసిందని అభ్యర్థులు గుర్తుచేస్తున్నారు. కొత్తగా విడుదలయ్యే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు ఇంతకుముందు పెంచిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వారికి నిర్దేశించిన పరిమితికి అదనంగా ఈ పెంపు కూడా వర్తించింది. కొన్ని నోటిఫికేషన్ల సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ తదితర అభ్యర్థులు మెరిట్ సాధించి ఇతరులకన్నా అగ్రస్థానంలో ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హత సాధించినా ఏపీపీఎస్సీ వారిని ఆ పోస్టులకు అనుమతించలేదు. దీనిపై కొందరు అభ్యర్థులు కమిషన్ ఎదుట తమ అభ్యంతరం చెప్పినా ఫలితం లేకుండాపోయింది. చివరకు వారు హైకోర్టును ఆశ్రయించారు. వారిని ఇతరులతో పాటే ఓపెన్ కేటగిరీ పోస్టులకు అనుమతించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా కమిషన్ ఆ తీర్పును ఖాతరు చేయకుండా ప్రభుత్వ పెద్దల సూచనలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇటీవల సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి.. కమిషన్‌కు లేఖ రాసినా కమిషన్ చైర్మన్ దాన్ని బేఖాతరు చేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు. పైగా, హైకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరంలేదని ఏపీపీఎస్సీ పేర్కొంటుండడం విశేషం. -
కోటా.. కొత్త కోణాలు
రిజర్వేషన్ కేటగిరీలోకి రాని కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ నిర్ణయం అమలు ఆచరణ సాధ్యం కాదని కొందరంటుంటే, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులకు ఇది దారితీస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది మొదటి నుంచీ అన్ని విపక్షాలూ ఆరోపిస్తున్నదే. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) సహా పలు రాజకీయ పార్టీలు, నాయకులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, కేంద్రం నిర్ణయం సమర్థనీయమా కాదా అన్నది చర్చనీయాంశమైంది. – న్యూఢిల్లీ ఓ కోణంలో సమర్థనీయమే.. సామాజికంగా ఉన్నతస్థానంలో ఉన్నవారి(అగ్రవర్ణాలు)లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలూ కల్పించరాదని ఎవరూ అనరు. కాబట్టి ఆ కోణంలో చూస్తే కేంద్రం నిర్ణయం సమర్థనీయ మేనని ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన సహాయ అధ్యాపకుడు అభినవ్ ప్రకాశ్‌సింగ్ అన్నారు. కేంద్రం కోటా ప్రకటిస్తే సరిపోదని, దాని ఫలితాలు లభించాలంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను కూడా భర్తీ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వాటాపై వివిధ కులాల మధ్య జరిగే ఘర్షణను ఈ నిర్ణయం ఎంతవరకు పరిష్కరించ గలదన్నది కూడా ఆలోచించా లన్నారు. అగ్రవర్ణంలో పుట్టినప్పటికీ ఆర్థికంగా వెనకబడిన వ్యక్తి అన్ని విషయాల్లో ఇతర బలహీన వర్గాల వ్యక్తుల్లాగే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అయితే, దళితులు, ఇతర వెనకబడిన వర్గాల్లోని పేదలు అగ్రవర్ణ పేదలతో పోలిస్తే మరింత ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. దానికి కారణం వారు సామాజికంగా, సాంస్కృతికంగా కూడా వెనకబడి ఉండటం, వివక్షకు గురికావడం. కాబట్టి ఈ కోణంలో చూస్తే అగ్రవర్ణ పేదలను, ఓబీసీ పేదలను ఒకే గాటన కట్టడం ఎంత వరకు సమర్థనీయమని రాజ్యాంగ నిపుణులు వేస్తున్న ప్రశ్న. అన్నింటికీ క్రీమీలేయర్ వర్తింప చేయాలి.. తాజా కోటాకు సంబంధించిన కుటుంబ ఆదాయం, సాగుభూమి ఆధారంగా ఆర్థిక వెనక బాటును నిర్ణయించనున్నట్టు పేదల బిల్లు ప్రతి పాదించింది. అయితే, ఈ ప్రాతిపదిక అగ్ర వర్ణాలకేనా లేక అన్ని వర్ణాలకీ వర్తిస్తుందా అన్నది బిల్లులో స్పష్టం చేయలేదు. కుల, మతాలకతీ తంగా ఆర్థికంగా వెనుక బడినవారికి రిజ ర్వేషన్ కల్పిస్తు న్నట్టు మాత్రమే పేర్కొంది. దీనివల్ల అగ్రవర్ణ పేదలు కూడా దీని పరిధిలోకి వస్తారు. అదే జరిగితే రిజర్వేషన్లు మూడు రకాలుగా తయారవుతాయి. కేవలం గుర్తింపు ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు అంటే ఎస్సీ, ఎస్టీలు ఒక రకం. కులం, ఆర్థిక స్తోమత ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లు రెండో రకం. ఓబీసీ/ఈబీసీలు ఈ కోవలోకి వస్తారు. మూడోది కులంతో సంబంధం లేకుండా కేవలం ఆర్థిక ప్రాతిపదికపైనే ఇచ్చే రిజర్వేషన్లు. ఈ మూడు రకాల రిజర్వేషన్లకు సంబంధించి వివా దాలు తలెత్తే అవకాశం ఉంది. ఓబీసీ రిజర్వేషన్లలో కుల ప్రాతిపదికన తొలగించాలని, ఆర్థిక స్తోమతనే ప్రాతిపదికగా తీసుకోవాలని ఇప్పటికే పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ దీనిని అమలు చేస్తే, ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన అన్ని కులాలకూ ఒకే కోటా ఉంటుంది. ప్రస్తుత ఓబీసీ, ప్రతిపాదిత ఈబీసీ కోటాను కలిపేసి ఎస్సీ, ఎస్టీలు మినహా మిగిలిన అన్ని కులాలకూ క్రీమీలేయర్ వర్తింపజేసి, పేదలకు ఈ కొత్త కోటాలోనే రిజర్వేషన్ కల్పించాలనేది వారి డిమాండ్. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రీమీలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టి, అసలైన పేదలకే రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రస్తుతానికయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల కోపాన్ని కొంతమేర తగ్గించవచ్చు. రిజర్వేషన్లపై వారి అభిప్రాయాన్ని మార్చుకునేందుకు వీలు కల్పిస్తుంది. కేంద్రం తాజా నిర్ణయంపై వారిలో వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం, ఇది మెరిట్‌ను చంపేస్తుందంటూ రోడ్డెక్కకపోవడమే దీనికి నిదర్శనం. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో తమ వాటాపై వివిధ కులాల మధ్య తలెత్తుతున్న ఘర్షణలను ఈ పేదల కోటా ఏ మేరకు పరిష్కరి స్తుందన్నది వారి అనుమానం. దశాబ్దాల తరబడి ఖాళీగా ఉంటున్న ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వం ఈ ఘర్షణను నివారించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి పోతుండటం, నియామక ప్రక్రియ నిలిచిపోవ డం వల్ల యువజనుల్లో తలెత్తిన అసంతృప్తిని ఉద్యోగాల భర్తీ ద్వారా తొలగించడమన్నది ఈ ఎన్నికల సంవత్స రంలో ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యం కావాలని ప్రొఫెసర్ అభినవ్ ప్రకాశ్‌సింగ్ సూచిస్తున్నారు. -
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జాడలేక ఆందోళన
-
నిరుద్యోగులకు ‘వయో’ గండం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగులకు దినదినగండంలా ఉంది. ఒక్కోరోజు గడుస్తుంటే వేలాది మంది ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారి ఆశలు అర్ధంతరంగా ఆవిరైపోతున్నాయి. ఇందుకు కారణం ప్రభుత్వం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల చేయించకపోవడమే. ఏటా ఉద్యోగ నియామకాలంటూ చెప్పి ఈ నాలుగున్నరేళ్లలో 2016లో మాత్రమే 4,275 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆ తర్వాత నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా అవి వెలువడడం లేదు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ ఈ ఏడాది సెప్టెంబర్ 19న 18,450 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్లు మాత్రం విడుదల చేయలేదు. దీంతో ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి దాటిపోతున్న నిరుద్యోగులు ఆందోళనతో ఉన్నారు. గరిష్ట వయోపరిమితిని ప్రభుత్వం 34 ఏళ్లనుంచి 42 ఏళ్లకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పటివరకూ నోటిఫికేషన్లు లేకపోవడంతో ఆ వయో పరిమితిని మించిపోయిన వేలాది మంది ఇప్పుడు నోటిఫికేషన్లు వచ్చినా కనీసం దరఖాస్తు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. దీంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకున్న నిరుద్యోగుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పుట్టిన తేదీ, గరిష్ట వయోపరిమితిపై లెక్కలు వేసుకుంటూ రోజులు లెక్కపెట్టుకోవలసిన దుస్థితిలోకి ప్రభుత్వం తమను నెట్టిందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్కో ఏడాదికి పరిమితి పెంపు.. గరిష్ట వయోపరిమితిని 2014లో 34 ఏళ్లనుంచి 40 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం తరువాత దాన్ని 42 ఏళ్లకు పెంచింది. ఈ గరిష్ట వయోపరిమితి పెంపును కేవలం ఒక్కో ఏడాదికి మాత్రమే పరిమితం చేస్తూ ఏటా ఉత్తర్వులు ఇస్తోంది. 2016లో 42 ఏళ్లకు పెంచిన సమయానికే వేలాది మంది వయోపరిమితి మించిపోయి అవకాశం కోల్పోయారు. ఆతరువాత నుంచి నోటిఫికేషన్లు లేక మరిన్ని వేలమంది వయోపరిమితి గండంలో చిక్కుకున్నారు. పొరుగునే ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లు పెంచడమే కాకుండా దాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఫలితంగా అక్కడి నిరుద్యోగులకు కనీసం దరఖాస్తు చేసుకొనేందుకైనా అవకాశం దక్కుతోంది. ఏపీలో మాత్రం 42 ఏళ్లకే పరిమితం చేయడం.. మూడేళ్లుగా నోటిఫికేషన్లు లేకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారు. డీఎస్సీ, యూనిఫాం పోస్టులకు రెండేళ్లు పెంచి.. ప్రభుత్వం ఆమోదించిన 18,450 పోస్టుల్లో డీఎస్సీ ద్వారా భర్తీ చేసే టీచర్ పోస్టులకు, ఎస్ఐ తదితర యూనిఫాం పోస్టులకు పెంచిన గరిష్ట వయోపరిమితికి అదనంగా మరో రెండేళ్లు పెంచారు. దీని ప్రకారం డీఎస్సీ పోస్టులకు 44 ఏళ్లు, యూనిఫాం పోస్టులకు ప్రస్తుతమున్న గరిష్ట వయోపరిమితికి అదనంగా రెండేళ్లు అవకాశం కల్పించారు. అయితే ఏపీపీఎస్సీ పరిధిలో భర్తీచేయాల్సిన పోస్టుల విషయంలో మాత్రం ప్రభుత్వం నిరుద్యోగులకు ఇలాంటి అవకాశం ఇవ్వడం లేదు. మూడేళ్ల నుంచి నోటిఫికేషన్లు లేవు కనుక గరిష్ట వయోపరిమితిని కనీసం మరో రెండేళ్లు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతమున్న వయోపరిమితి ప్రకారమే అయితే లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడానికీ అవకాశం కోల్పోతామని నిరుద్యోగులు చెబుతున్నారు. పోస్టులకు ఆమోదం తెలిపి నెలలు గడిచినా.. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడానికి మంత్రివర్గంలో ఆమోదం తెలిపామని నాలుగు నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఆతరువాత దానిపై జీవో ఇవ్వడానికి నెలన్నర సమయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్లను మాత్రం ప్రభుత్వం విడుదల చేయించడం లేదు. ఈ పోస్టుల్లో గ్రూప్1–182, గ్రూప్2–337, గ్రూప్3–1,670, హోంశాఖ 3,000, మెడికల్ 1,604, లెక్చరర్లు 725, ఇతర పోస్టులు 1,657, టీచింగ్ 9,275, మొత్తం 18,450 పోస్టులను ప్రకటించి డీఎస్సీ, పోలీసు రిక్రూట్మెంటు బోర్డు వరకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. కీలకమైన ఏపీపీఎస్సీ పోస్టుల నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు. -
కేడీ భార్యభర్తలు.. కోట్లు వసూళు చేసి..
సాక్షి, విశాఖపట్నం : ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇద్దరు భార్యభర్తలు నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టారు. నిరుద్యోగులనుంచి కోట్లరూపాయలు వసూళు చేసి ఉడాయించారు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. కొప్పశెట్టి గోపాల్, భారతి లక్ష్మీ అనే ఇద్దరు భార్యాభర్తలు వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ, టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి కోట్లరూపాయలు వసూళు చేశారు. రాజముద్రతో కూడిన నకిలీ నియామకపత్రాలను వారికి అందజేశారు. విషయం బయటపడుతుందనే భయంతో ఊరునుంచి పరారయ్యారు. తమకిచ్చినవి నకిలీ నియామకపత్రాలని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. భార్యభర్తలపై ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ సైతం నమోదైంది. కాగా గత నెల 21న ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకు పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. -
కేంద్ర ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలు ఖాళీ
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 5 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని 2016–17 ఆర్థిక సర్వేలో తేలింది.వీటిలో గుమాస్తా, ఆఫీసు అసిస్టెంట్ తరహా ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథకాల అమలు సంతృప్తికరంగా సాగడం లేదని ఏడవ కేంద్ర వేతన సంఘం తన నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు లక్షల ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉంటే మరోవైపు ఉన్న సిబ్బంది వేతనాల కోసం ప్రభుత్వం భారీగా సొమ్ము వెచ్చిస్తోంది. 2006–07 నుంచి 2016–17 వరకు అంటే పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతన ఖర్చు మూడు రెట్లు పెరిగిందని ఆర్థిక సర్వే పేర్కొంది.2006–07 సంవత్సరంలో వేతనాల కోసం కేంద్రం దాదాపు 40వేల కోట్లు వెచ్చించగా,2016–17 సంవత్సరానికది రెండు లక్షల కోట్లకు పెరిగింది.ఈ పదేళ్లలో కేంద్ర సిబ్బంది వేతనాలు మూడు సార్లు పెరిగాయి. గ్రూప్సి ఉద్యోగాలే ఎక్కువ అమెరికాలో ప్రతి లక్ష మంది ప్రజలకు 668 మంది ఉద్యోగులు ఉండగా, మన దేశంలో లక్ష మందికి 139 మంది ఉద్యోగులే ఉన్నారు. కేంద్ర సంస్థల్లో 2006లో 35 లక్షల ఉద్యోగాలు మంజూరు కాగా, 31 లక్షలు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. 4లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండిపోయాయి. అదే 2016 వచ్చే సరికి 36 లక్షల ఉద్యోగాలకు గాను 32 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యాయి.ఖాళీ పోస్టుల్లో ఎక్కువ గ్రూప్సి ఉద్యోగాలే(గుమాస్తా,ఆఫీసు అసిస్టెంట్) ఉన్నాయి. 2016–17లో 32 లక్షల గ్రూప్ సి ఉద్యోగాలు మంజూరు కాగా28 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారు. మిగతా విభాగాలతో పోలిస్తే శాస్త్ర, సాంకేతిక విభాగంలో సిబ్బంది కొరత 50 శాతానికిపైగా ఉంది. 2014లో ఈ విభాగంలో 37శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉండగా2016 నాటికది 55శాతానికి చేరింది. పౌర విమానయాన శాఖలో 49శాతం,కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో 44శాతం ఉద్యోగాలు భర్తీ కావలసి ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా 31శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖల్లో సగటున 25 నుంచి 35 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆర్థిక సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. వేతనాలు పెరిగాయి ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ప్రజలను ఆకర్షించడం కోసం వారికి ప్రైవేటు సంస్థలతో దీటుగా వేతనాలు ఇవ్వాలని ఏడవ వేతన సంఘం సిఫారసు చేసింది.వేతన సంఘం నివేదికకు అనుగుణంగా సిబ్బంది కనీస వేతనం ఏడు వేల రూపాయల నుంచి 18వేలకు పెరిగింది. ఆ మేరకు మిగతా ఉద్యోగులకు కూడా 157 శాతం వరకు జీతాలు పెరిగాయి.2015–16 వరకు ఉద్యోగి వేతనంలో మూల వేతనం 36 శాతం ఉంటేl, కరువు భత్యం 42శాతం వరకు ఉండేది.ఏడో వేతన సంఘం సూచన మేరకు 2016–17 నుంచి మూల వేతనం 66శాతం, కరువు భత్యం 16శాతం అయింది. -
ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్‌ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలువురు సీనియర్ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మరో సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. -
క్రీమీలేయర్‌ను వర్తింప చేయలేం
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్‌ను వర్తింపజేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల్లో చాలా మంది ఇంకా వెనుకబాటుతనంలోనే ఉన్నారనీ, ఆయా వర్గాల్లోని సంపన్నులు కూడా కులం పరంగా కొంత వరకు వివక్షను ఇంకా ఎదుర్కొంటున్నారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. ‘రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీ, ఎస్టీల్లో వెనుకబడిన వారికే అందేలా చూసేందుకు.. ఆయా వర్గాల్లోని సంపన్నులు, అభివృద్ధి చెందిన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు తొలగించేలా క్రీమీలేయర్‌ను వర్తింపజేయొచ్చా?’అని సుప్రీంకోర్టు వేణుగోపాల్‌ను కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లోనూ క్రీమీలేయర్‌ను వర్తింపజేయరాదంటూ 2006లో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. నాటి తీర్పును పునఃసమీక్షించాలా? వద్దా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ కురియన్, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఈ అంశాన్ని విచారిస్తోంది. 2006 తీర్పుపై పునఃసమీక్ష అవసరమనుకుంటే ఈ కేసును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి ప్రస్తుత బెంచ్ బదిలీ చేస్తుంది. వేణుగోపాల్ తన వాదనలు వినిపిస్తూ ఎస్సీ, ఎస్టీల్లోకి ఎవరిని చేర్చాలి/తొలగించాలి అనేది పూర్తిగా పార్లమెంటు, రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయమనీ, న్యాయవ్యవస్థకు దీనితో సంబంధం లేదని కోర్టుకు తెలిపారు. వివక్షాపూరిత కుల వ్యవస్థ దేశంలో ఉండటం దురదృష్టకరమని ఆయన అన్నారు. 2006 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు గత నెల 11న సుప్రీం నిరాకరించడం తెలిసిందే. -
పోటీ ప్రపంచమిది..పోరాడితే విజయం మీది..
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న ఆకాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -2, 3, 4, వీఆర్ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 13నుంచి నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 13న సోమవారం నాడు ఉదయం 9 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో, బస్‌స్టాండ్ పక్కన గల చిన్మయ హైస్కూల్లో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పించబడను. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు కుమార్ తెలిపారు. అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందింస్తారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు ఆగస్ట్13వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు ఆగస్ట్ 14వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
లక్షల్లో లాక్కున్నాడు.. వేలల్లో విదిల్చాడు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ఆకర్షించి, వారి నుంచి అందినకాడికి దండుకుని జారుకునే ముఠాలను ఇప్పటివరకు చాలా చూశాం. కానీ ఈ అంతర్రాష్ట్ర ముఠా వారికంటే నాలుగాకులు ఎక్కువే చదివింది. నిరుద్యోగుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన ఈ ముఠా నాయకుడు.. ఉద్యోగాలకు ఎంపికైనవారి పేర్లు బోగస్ వెబ్సైట్లో పొందుపరచడమే కాకుండా వారికి పొరుగు రాష్ట్రాల్లో శిక్షణ సైతం ఇప్పించాడు. అనంతరం వారికి ఉద్యోగ బాధ్యతలు అప్పగించి, నెల జీతం కూడా ఇచ్చాడు. అనంతరం కనిపించకుండా పోయాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఈ ముఠాను పట్టుకున్నారు. ఎనిమిది మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కోటాల పేరుతో బుట్టలోకి... ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన కంప్యూటర్ హార్డ్‌వేర్ ఉద్యోగి వి.గంగాధర్ కొన్నేళ్ళుగా ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. 2015లో కంచన్‌బాగ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై వచ్చిన తర్వాత పంథా మార్చా డు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పి.దస్తగిరి, ఎం.శివరెడ్డి, కె.రాజేష్, ఎ.స్వామి, ఎం.క్రాంతికుమార్, వై.వీరేశం, ఎం.శ్రీకాంత్‌లను ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు నిరుద్యోగ యువతను ఆకర్షించి గంగాధర్ దగ్గరకు తీసుకెళ్లేవారు. తమకు ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని.. స్పెషల్ డిపార్ట్ మెంట్ కోటా, మినిస్టర్స్ కోటా, డిసీస్డ్ కోటా తదితర కేటగిరీల్లో ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గంగాధర్ వారిని బుట్టలో వేసుకునేవాడు. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు రేట్లు చెప్పి, రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు అడ్వాన్స్ తీసుకుని ఏజెంట్లకు కొంత కమీషన్ ఇచ్చేవాడు. అనుమానం రాకుండా పక్కాగా... నియమాక ప్రక్రియలో ఎలాంటి అనుమానం రాకుండా గంగాధర్ పక్కాగా వ్యవహరించేవాడు. రైల్వే ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని కాప్రా ప్రాంతానికి చెందిన శ్యామ్ ద్వారా వైద్య పరీక్షల పత్రాలు ఇప్పించేవాడు. అనంతరం విజయవాడలో శంకర్ అనే వ్యక్తితో ఇంటర్వ్యూలు చేయించేవాడు. ఎంపికైనవారి వివరాలు వెబ్సైట్లో ఉంటాయని చెప్పి వారికి ఆ సైట్ అడ్రస్ ఇచ్చేవాడు. ఇందుకోసం ముందుగానే పి.పద్మారెడ్డి అనే వెబ్ డిజైనర్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) పేరుతో నకిలీ వెబ్సైట్ ఏర్పాటు చేయించాడు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) ఇలా మారిందని చెప్పి, అందరి పేర్లనూ ఎంపికైనవారి జాబితాలో ప్రదర్శించేవాడు. వారికి నమ్మకం కుదిరిన తర్వాత మిగిలిన మొత్తం తీసుకునేవాడు. అనంతరం నకిలీ నియామక పత్రాలు ఇచ్చి శిక్షణ పేరుతో ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్, దుర్గాపూర్, ఒడిశాలోని ఖురధ్వలకు తీసుకెళ్లేవాడు. ఆయా ప్రాంతాల్లో ఉన్న పాత కాలేజీ, ఐటీఐలకు చెందిన భవనాలను అప్పటికే లీజుకు తీసుకున్న గంగాధర్.. వాటిలో నకిలీ ఫ్యాకల్టీల ద్వారా 15 రోజులపాటు శిక్షణ ఇప్పించేవాడు. అనంతరం ఎక్కడ రిపోర్టు చేయాలో చెబుతానని చెప్పి స్వస్థలాలకు పంపించేవాడు. కొన్ని రోజుల తర్వాత ఫలానా సమయంలో, ఫలానా చోట రిపోర్ట్ చేయాలంటూ వారికి సంక్షిప్త సందేశాలు, ఈ–మెయిల్స్ పంపేవాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో టీసీలుగా.. ఇదే కోవలో ‘టికెట్ కలెక్టర్’ఉద్యోగాలకు ఎంపికైన కొందరు అభ్యర్థుల్ని గతేడాది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉండే ఓ అధికారికి రిపోర్ట్ చేయమని గంగాధర్ చెప్పాడు. అప్పటికే తన ముఠాకు చెందిన వ్యక్తినే టీసీ మాదిరిగా మూడో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై నిల్చోబెట్టాడు. అతడు వారి నుంచి జాయినింగ్ రిపోర్టు తీసుకుని.. నకిలీ గుర్తింపుకార్డులతో పాటు ప్యాడ్, పెన్ను, తెల్లకాగితాలు అందించి బాధ్యతలు అప్పగించాడు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌కు వచ్చే రైళ్ల పేర్లు, నంబర్లు, సమయాలు రాయించాడు. దాదాపు 25 రోజులు ఇలా పని చేసిన తర్వాత వీరికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు జీతాలు కూడా ఇచ్చి ఆపై మోసగాళ్లంతా దుకాణం సర్దేశారు. రూ.3 కోట్లకు పైగా వసూళ్లు... ఈ పంథాలో గంగాధర్ ముఠా గత రెండున్నరేళ్లుగా దాదాపు 150 మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలు చేశారు. వారందరికీ రైల్వేలో టీసీ, కమర్షియల్ క్లర్క్, పాయింట్ మెన్‌తో పాటు రెవెన్యూ, విద్యాశాఖ, సచివాలయం, హైకోర్టు, జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కోల్లో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు ఇచ్చేశాడు. ఈ ముఠా చేతిలో మోసపోయిన వారిలో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు విశాఖపట్నానికి చెందిన వారు ఉన్నారు. వీరి ఫిర్యాదుతో ఈ ముఠాపై 10 కేసులు నమోదయ్యాయి. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సెంట్రల్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పద్మారెడ్డి, శ్యామ్, శంకర్ మినహా మిగిలిన ఎనిమిది మందినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, నకిలీ పత్రాలు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని ఎస్సార్‌నగర్, సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. -
మధ్యంతర ఉత్తర్వులుండవ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల్లో ప్రమోషన్ల విషయంలో క్రీమీలేయర్ వర్తింపుపై 2006నాటి తీర్పు (ఎం.నాగరాజ్ తీర్పు అనికూడా పిలుస్తారు)కు వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టంచేసింది. ‘2006 తీర్పు’ను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ధర్మాసనం ఆదేశించింది. మధ్యంతర ఉపశమన చర్యలు ఇచ్చేందుకు కేసు విచారించబోమని, కూలంకషంగా చర్చిస్తామని స్పష్టం చేసింది. ‘ఈ విషయాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ఇందుకోసం ఎం నాగరాజు తీర్పుపై విచారించేందుకు ఏడుగురు సభ్యులతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తాం’ అని వెల్లడించింది. తదుపరి విచారణ ఆగస్టు 3న జరుగుతుందని స్పష్టం చేసింది. నియామకాలు ఆగిపోయాయ్: కేంద్రం వివిధ న్యాయపరమైన ప్రకటనల కారణంగా రైల్వేలు, ఇతర సేవా రంగాల్లో లక్షల ఉద్యోగాల నియామకాలు ఆగిపోయాయని, దీనిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదన వినిపిస్తూ.. వివిధ బెంచ్‌లు, హైకోర్టులు ఇటీవల ఇచ్చిన తీర్పుల కారణంగా రిజర్వేషన్లపై గందరగోళం నెలకొందన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో ‘స్టేటస్ కో’ నెలకొందంటూ ఓ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం పదోన్నతులకు సిద్ధమవుతున్న సమయంలో జస్టిస్ కురియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును పెండింగ్‌లో పెట్టిందన్నారు. ధావన్ వాదనలను వేణుగోపాల్ సమర్థించారు. పదోన్నతుల్లో రిజర్వేషన్‌పై గందరగోళం నెలకొందని.. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరపున వాదిస్తున్న మరో సీనియర్ న్యాయవాది శేఖర్ నాఫడే మాత్రం.. ఈ విషయంలో గందరగోళం లేదన్నారు. పలు పక్షాలు వాదిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్రీమీలేయర్ వర్తించదు: నాటి తీర్పులో సుప్రీం 2006 నాటి ‘ఎం నాగరాజ్, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం’ తీర్పును పునఃపరిశీలించాలా వద్దా? అనే అంశాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయిస్తుందని గతేడాది నవంబర్ 15న ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వోద్యోగాల పదోన్నతుల్లో క్రీమీలేయర్ వర్తించదంటూ ఎం నాగరాజు తీర్పులో 2006లో సుప్రీం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు అమ్మేశారు
-
ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఘరానా మోసం..
సాక్షి, హైదారాబాద్: నగరంలో భారీ సైబర్ మోసం బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు మంగళవారం రట్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు నకిలీ వెబ్సైట్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నకిలీ వెబ్సైట్లతో ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా అక్రమాలకు పాల్పడుటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నుంచి నగదు, సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
మా రూటు.. కార్పొ‘రేటు’
సాక్షి, హైదరాబాద్ : సర్కారు కొలువులకు స్పెషాలిటీ వైద్యులు ముఖం చాటేస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌కు స్పందనే కరువైంది. మొత్తం 1,133 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 337 దరఖాస్తులకు మించి రాలేదు. స్పెషలిస్టులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చెల్లిస్తున్న వేతనాలతో పోలిస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇస్తున్న ప్యాకేజీలు రెండు మూడు రెట్లు అదనంగా ఉండటమే ఇందుకు కారణం. జిల్లా, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో కంటే నగరంలోని ఆస్పత్రుల్లో పనిచేయడానికే స్పెషాలిటీ డాక్టర్లు ఎక్కువ ఇష్టపడుతున్నారు. 149 గైనకాలజీ పోస్టులకు 42 దరఖాస్తులు రాగా, 172 పీడియాట్రిక్స్ పోస్టులకు 31 దరఖాస్తులే వచ్చాయి. 176 అనస్థీషియా పోస్టులకు 38 దరఖాస్తులు, 107 జనరల్ సర్జన్ పోస్టులకు 32 దరఖాస్తులు అందాయి. ఇక ఆర్థోపెడిక్, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ, సైక్రియాటిక్ విభాగాల్లో 192 ఖాళీ పోస్టులకు 129 దరఖాస్తులే అందడం గమనార్హం. అధిక ప్యాకేజీల వల్లే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులతో పోలిస్తే.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇస్తున్న ప్యాకేజీలు అధికంగా ఉన్నాయి. కాస్త అనుభవం ఉండి, రోగుల్లో మంచి గుర్తింపు ఉన్న వైద్యులకు కార్పొరేట్ ఆసుపత్రులు నెలవారీ ప్యాకేజీ రూ.10 లక్షల వరకు ఇస్తున్నాయి. అదే ప్రభుత్వ ఆస్పత్రిలో ఎన్ని సర్జరీలు చేసినా.. ఎంత గుర్తింపు పొందినా వేతనంలో మాత్రం తేడా ఉండదు. నిమ్స్‌లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.20 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.60 నుంచి రూ.1.80 లక్షలు, ప్రొఫెసర్‌కు రూ.2 లక్షల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అదే ఉస్మానియా, గాంధీ, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రం బేసిక్ వేతనం రూ.40 వేలతో మొదలవుతుంది. సీనియర్ వైద్యులకు రూ.లక్ష చెల్లిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ సాధారణ వైద్యుడి వేతనంతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంతేకాదు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతోపాటు అంతర్గత రాజకీయాలు కూడా స్పెషలిస్టులు వైద్యులు కార్పొరేట్ వైపు వెళ్లడానికి మరో కారణమని సీనియర్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఎవరూ రాకపోవడంతోపాటు ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు కూడా స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఆయా ఆస్పత్రులను మెరుగుపరిచి, ఖాళీ పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం చాలా కాలంగా పట్టించుకోవడం లేదు. పనిభారం.. అవమానాలు: డాక్టర్ లాలు ప్రసాద్, కన్వీనర్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ శాతం పెరిగింది. ఆస్పత్రుల్లో రోగులు, వైద్యుల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అవసరమైన నర్సులు, పారామెడికల్ స్టాఫ్, వైద్య పరికరాలు ఉండటం లేదు. వేతనాల చెల్లింపులోనే కాదు పదోన్నతుల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని భారం పెరగడంతోపాటు తక్కువ కేడర్ ఉన్న వ్యక్తులు ఆస్పత్రులకు వచ్చి రోగుల సమక్షంలోనే వైద్యులను అవమానించడం, దాడులకు పాల్పడం వంటి ఘటనలు కూడా వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మొగ్గుచూపకపోవడానికి కారణం. -
సర్కారీ కొలువులకు పెరిగిన క్రేజ్
సాక్షి,న్యూఢిల్లీ : ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు తగ్గడం, ఉద్యోగ భద్రతపై ఆందోళనల నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ డిమాండ్ నెలకొంది. సర్కారీ కొలువులకు ఎన్నడూ లేనంతగా ప్రొఫెషనల్స్ సైతం పోటీ పడుతున్నారని రిక్రూట్మెంట్ సంస్థ వెల్లడించిన క్వార్ట్జ్ నివేదిక తెలిపింది. 2016లో నోట్ల రద్దుతో పాటు గత ఏడాది జులైలో జీఎస్టీ ప్రవేశపెట్టడంతో ఈ రెండేళ్లలో వ్యాపారాలు దెబ్బతిని ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ప్రైవేట్ ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగాల్లో ఒకటైన ఐటీ సేవల పరిశ్రమ సైతం ఈ రెండేళ్లలో భారీ కుదుపులకు లోనైంది. ప్రభుత్వ ఉద్యోగాలే భద్రం.. ప్రైవేట్ రంగంలో అభద్రత నెలకొన్న క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలే సుస్థిరమైనవన్న ఆలోచన యువతలో కలుగుతున్నదని రిక్రూట్మెంట్ సంస్థ హెడ్‌హంటర్స్ వ్యవస్థాపకులు క్రిష్ లక్ష్మీకాంత్ అన్నారు. రైల్వేలు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల్లో ప్యూన్ ఉద్యోగానికి సైతం నెలకు రూ 25,000 వేతనం లభిస్తోందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు సైతం అతను టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద కంపెనీల్లో చేరితే మినహా ఇంత వేతనం లభించడం లేదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన వేతనంతో పాటు పిల్లల విద్య, గృహవసతి వంటి పలు సౌకర్యాలు ఉంటాయన్నారు.ప్రైవేట్ రంగంలో ఇంక్రిమెంట్లు ఒకింత అధికమగా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగాలకు లేఆఫ్‌ల బెడద ఉండదన్నారు. నోటిఫికేషన్ల జోరు.. కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పెద్ద ఎత్తున నియామకాలకు దిగడంతో పలు పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రైల్వేలు 90,000 ఉద్యోగాలకు జారీ చేసిన ప్రకటనకు స్పందిస్తూ 2.3 కోట్ల దరఖాస్తులు వెల్లువెత్తాయి. టెక్నీషియన్లు, లోకోమోటివ్ డ్రైవర్ల వంటి పోస్టులకు 5 లక్షల మంది పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. రైల్వేల్లో క్లర్కులు, స్టేషన్ మాస్టర్, టీసీ, కమర్షియల్ అప్రెంటీస్, ట్రాక్‌మెన్, హెల్పర్, గన్‌మెన్, ప్యూన్ వంటి పోస్టులకు ప్రకటన వెలువడింది. ఇక తమిళనాడులో క్లరికల్ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు 992 మంది పీహెచ్డీ అభ్యర్థులు, 23,000 మంది ఎంఫిల్ చదివిన వారు, 2.5 లక్షల మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 8 లక్షల మంది గ్రాడ్యుయేట్లు పోటీపడ్డారు. కాగా మహారాష్ట్రలో ఈ నెల వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు డాక్టర్లు, ఎంబీఏలు, న్యాయవాదుల నుంచి దరఖాస్తులు రావడం గమనార్హం. ఇక ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్‌లో ప్యూన్ పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్లో అత్యధిక విద్యార్హతలు కలిగిన వారు పెద్దసంఖ్యలో పోటీపడ్డారు. సర్కారీ పోస్టులకు పెద్దఎత్తున పోటీ నెలకొనడం ప్రైవేట్ రంగం కుదేలైన తీరుకు అద్దం పడుతున్నది. -
కొలువుల్లోనూ వెనుకబాటే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో ఓబీసీలు వెనుకబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని గణాంకాలను చూస్తే ఇది స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుండేవి 69 శాఖలు. వాటిలో దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులుండగా... అందులో 27 శాతం ఉద్యోగులు ఓబీసీ వర్గాలకు చెందినవారుండాలి. కానీ ఈ సంఖ్య 17 శాతానికి మించడం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం బీసీలకు అమలు చేస్తున్నారు. 1993 నుంచి ఓబీసీ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. కానీ ఈ వర్గానికి చెందిన ఉద్యోగుల సంఖ్య ఎస్సీ ఉద్యోగుల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు నాలుగు కేటగిరీల్లో ఉన్నారు. ఉన్నతస్థాయి పోస్టులు మినహాయిస్తే మిగతా స్థాయిల్లో వీరిని.. గ్రూప్ ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. గ్రూప్–ఏ కేటగిరీలో ఎస్సీలు 11.5 శాతం ఉండగా.. ఓబీసీలు 6.9 శాతం ఉన్నారు. గ్రూప్–బీలో ఎస్సీలు 14.9 శాతం ఉండగా... ఓబీసీలు 7.3 శాతం ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగులు, వారి సామాజిక వర్గాల కోణంలో అధికారికంగా తీసుకున్న సమాచారం ఆధారంగా రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఇ.ఆంజనేయగౌడ్ ‘సామాజిక న్యాయం, భారతదేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో ఓబీసీలు’పేరుతో పుస్తకం ప్రచురించారు. అందులో ఈ గణాంకాలను పేర్కొన్నారు. నియామకాల్లో నిబంధనలకు నీళ్లు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గందరగోళంగా ఉంది. మండల్ కమిషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాల భర్తీ తరహాల్లో ఓబీసీ ఉద్యోగాల భర్తీలో మిగులు పోస్టులను క్యారీఫార్వర్డ్ చేయాలి. అలా చేస్తే ఆ పోస్టులు తిరిగి ఆయా వర్గాలకే వస్తా యి. కానీ ఓబీసీల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోంది. యూపీఎస్సీ ద్వారా జరుగుతున్న నియామకాల్లో ఓపెన్ కేటగిరీలో ఓబీసీ అభ్యర్థి ఉద్యోగం పొందినా.. ఆ పోస్టును రిజర్వేషన్ కోటాలో చూపిస్తున్నారు. దీంతో అభ్యర్థి తీవ్రంగా నష్టపోతున్నాడు. క్రీమీలేయర్ విధానంతోనూ ఓబీసీలకు నష్టం జరుగుతోంది. దాదాపు పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. పూర్తిస్థాయి పోస్టులు భర్తీ చేయకుండా సగానికిపైగా ఖాళీగా ఉం చుతున్నారు. ఎక్కువగా ప్రైవేటు, ఔట్సోర్సింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. దీంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోంది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమ లు చేస్తే ఓబీసీలకు సగం వాటా దక్కుతుంది. అలా చేయకపోవడంతో వెనుకబాటుకు గురవుతున్నారు. – ఇ.ఆంజనేయగౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు