ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకివ్వరు?
సర్కార్‌ను నిలదీసిన కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయి
ముంబై: ఎన్నికలకు ముందు మరాఠాలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్-ఎన్సీపీలు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చిన నేపథ్యంలో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో మరాఠాలకు 20 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాణే కమిటీ చేసిన సిఫారసులపై నిర్ణయం తీసుకోనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కేవలం మరాఠాలకు మాత్రమే రిజర్వేషన్లు ఎందుకు అమలు చేస్తారు? ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు? అని కాంగ్రెస్ ఎంపీ హుస్సేన్ దల్వాయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఆయన ఆదివారం పత్రికాప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. కేవలం మరాఠాలకు మాత్రమే రిజర్వేషన్లను ఎందుకు వర్తింపజేస్తారు? ముస్లింలను ఎందుకు విస్మరిస్తారు? వారికి ఎందుకు ఇవ్వకూడదు? రాష్ట్రంలో ముస్లిం లు ఎంత దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నారో తెలుసా? బాల కార్మికుల్లో 78 శాతం మంది ముస్లిం చిన్నారులే ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ముస్లింలు ఎందరు? పోలీసులు ముస్లింలను ఎందు కు వేధిస్తున్నారు? అని ప్రశ్నల వర్షం కురి పించారు. ‘రాజకీయ, ఉపాధి, ఆర్థిక రం గాలన్నీ 80-90 శాతం మరాఠాల అధీనంలోనే ఉంటున్నాయి. మరాఠాల్లో నిజంగా దుర్భర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వ పథకాలేవీ లబ్ధి చేకూర్చడంలేదు. రైతులు, భూమిలేని నిరుపేదలు, అసంఘటిత రంగంలోని కార్మికులు మరాఠాలైనా సరే వారికి ఎటువంటి ప్రయోజనం కలగడంలేదు. రిజ ర్వేషన్ల విషయంలో పేదరికాన్ని చూడాలి. ముస్లింలకు న్యాయం జరగాలంటే మరాఠాలతోపాటు వారికి కూడా రిజర్వేషన్లు అమలు చేయండ’ని దల్వాయి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మరాఠాలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్లపై రాణే కమిటీ అధ్యయనం చేసింది. ప్రస్తుతం మండలి ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున 20వ తేదీ తర్వా త రిజర్వేషన్ల విషయమై కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, నిర్ణయం తీసుకుంటామని రాణే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముస్లింల నుంచి ఇప్పటిదాకా రిజర్వేషన్ల విషయమై ఎటువంటి డిమాండ్ రాలేదని రాణే సభలో చెప్పడంతో దల్వాయి వాదన ప్రాధాన్యత సంతరించుకుంది.