ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం  | Sakshi
Sakshi News home page

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం 

Published Sun, Apr 28 2024 4:14 AM

We will abolish Muslim reservations says laxman

వేరే రిజర్వేషన్ల జోలికి పోం.. రాజ్యాంగాన్ని మార్చం 

రాహుల్, రేవంత్‌ చరిత్ర తెలుసుకోవాలి 

కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దన్నదే రాజీవ్‌గాందీ: డాక్టర్‌ లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ మళ్లీ అధికారంలోకి రాగానే ఇప్పటికే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలులో ఉన్న ముస్లిం రిజర్వేషన్లను తప్పకుండా రద్దు చేస్తామని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు తప్ప.. మరే రిజర్వేషన్లు రద్దు చేయబోమని, అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చేది లేదని ఆయన వెల్లడించారు. 

ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు మినహా.. కుల, మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.  కులాల ప్రతిపాదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దన్నదే రాజీవ్‌గాంధీ అని గుర్తు చేశారు. రంగనాథన్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయని కాంగ్రెస్‌.. మండల్‌ కమిషన్‌ను కూడా రాజీవ్‌గాంధీ వ్యతిరేకించారన్న విషయాన్ని రాహుల్‌గాం«దీ, రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని డాక్టర్‌ లక్ష్మణ్‌ సూచించారు. 

ముస్లిం సంతుష్టీకరణ పేరిట హిందూ సమాజంపై విషం చిమ్ముతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో లక్ష్మణ్‌ పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, సుభాష్‌ రవి కిషోర్‌తో కలిసి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లింలను సంతృప్తిపర్చేందుకు కాంగ్రెస్‌ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని, బీసీల రిజర్వేషన్లును తగ్గించి ముస్లింలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

బీజేపీ దేవుళ్లను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తోందంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడకు వెళ్తే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతూ.. అదే దేవుళ్లను రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని ఆయన ప్రశ్నించారు. 

కులగణనకు మేం వ్యతిరేకం కాదు కానీ..  
కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, అయితే అది శాస్త్రీయంగా, పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉందని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తే.. ఈ కూటమి తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ తెస్తామంటున్నారని, సీఏఏపై కూడా దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

మళ్లీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సీఏఏను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము వికసిత్‌ భారత్‌ అంటుంటే.. కాంగ్రెస్‌ విభజించు భారత్‌ అంటూ విచ్చిన్నకర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. అక్షింతలు, కాషాయంతో తిండి లభిస్తుందా అన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై లక్ష్మణ్‌ స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ చర్మాన్ని ప్రజలు వొలిచిన విషయం గుర్తుంచుకోవాలని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు.   

Advertisement
Advertisement