ప్రస్తుతం అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లకూ వర్తింపు
అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తాం
అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన
మాదిగలకు ద్రోహం చేసిందేకాంగ్రెస్: హరీశ్‌రావు
వర్గీకరణ వెంటనే చేయాలని 2014లోనే తీర్మానం చేశాం
కేసీఆర్ స్వయంగా తీర్మానం కాపీని ప్రధానికి అందజేశారు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును దేశంలోనే అందరికన్నా ముందు భాగాన నిలబడి అమలు చేసే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అమల్లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణ అమలుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
దీనికోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏళ్లుగా పోరాటం చేశారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గురువారం రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.
వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
‘వర్గీకరణ కోసం గతంలో ఇదే శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ఆ సందర్భంగా అప్పటి ప్రభుత్వం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, సంపత్‌కుమార్‌నూ సభ నుంచి బహిష్కరించింది. వర్గీకరణపై గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈ అంశంపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయకుండా మాదిగ సోదరులను మోసం చేసింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో శాసనసభ్యులు, అడ్వొకేట్ జనరల్‌ను ఢిల్లీకి పంపాం.
న్యాయ కోవిదులతో చర్చించి వర్గీకరణపై సుప్రీంకోర్టులో బలమైన వాదన విని్పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. ఈ నేపథ్యంలో మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం..’అని సీఎం పేర్కొన్నారు. మాదిగ, మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించాలని అన్ని పక్షాలను కోరారు. రాజ్యాంగ ధర్మాసనానికి సభా ముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ప్రకటన నేపథ్యంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
50 ఏళ్ల కల నెలవేరింది: రాజనర్సింహ
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో హర్షం వ్యక్తం చేశారు. యాభై ఏళ్ల కల నెరవేరిందని, ఇది చారిత్రక దినమని అన్నారు. వర్గీకరణ అంటే మరో వర్గానికి వ్యతిరేకం కాదని చెప్పారు.
వర్గీకరణకు వైఎస్సార్ మద్దతిచ్చారు
కాంగ్రెస్ సభ్యుడు వేముల వీరేశం మాట్లాడుతూ.. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. మంద కృష్ణమాదిగను జైల్లో పెట్టించింది కేసీఆరే అన్నారు. బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ.. మాదిగ బిడ్డ స్పీకర్ అవడంతో కేసీఆర్ సభకు రావడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ తరపున అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మందుల సామ్యూల్ కూడా మాట్లాడారు. సుప్రీం తీర్పును బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ స్వాగతించారు. ఈ దిశగా ప్రధాని నరేంద్రమోదీ కృషి చేశారని తెలిపారు.
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కూడా తీర్పును స్వాగతించారు. కంభంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సీఎల్పీ నాయకుడిగా గతంలో భట్టి విక్రమార్కను నియమిస్తే, ఆయన నాయకత్వంలో పనిచేయలేక సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారని అన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులకు సుప్రీంకోర్టు తీర్పు పట్ల వ్యతిరేకత ఉన్నట్లుగా భావించాల్సి వస్తోందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా దళిత జాతులకు సమన్యాయం చేసే చక్కటి అవకాశం లభించిందన్నారు. ‘తీర్పునకు అనుగుణంగా రాబోయే నోటిఫికేషన్లలో వర్గీకరణను అమలు చేస్తామని, ఆర్డినెన్స్ తెస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినందుకు దళిత జాతుల పక్షాన ధన్యవాదాలు’ అని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన సీఎం రేవంత్‌రెడ్డిని కలసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్‌ఎస్ మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తోంది: హరీశ్‌రావు
అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని, ఏది ఏమైనా అంతిమ విజయం పాండవులదేనని బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారని అడిగి అవకాశం ఇచ్చే సాంప్రదాయం సభలో ఉందని.. అయితే అధికార పక్షం సభా సాంప్రదాయాలను తుంగలో తొక్కడంపై తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్ పారీ్టకి సరైన బుద్ధి చెబుతారని అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామంటూ.. మాదిగలకు ద్రోహం చేసింది కాంగ్రెస్సేనని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆనాటి సీఎం కేసీఆర్ 2014 నవంబర్ 29న వర్గీకరణ వెంటనే చేయాలని సభలో తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆనాటి ఉప ముఖ్యమంత్రులు, దళిత నాయకులతో కలిసి వెళ్లి కేసీఆర్ స్వయంగా తీర్మానం కాపీని ప్రధానికి అందజేశారని గుర్తుచేశారు.
అంతేకాకుండా వర్గీకరణ ప్రాధాన్యతను ప్రధానికి కేసీఆర్ వివరించారని.. ప్రధాని కూడా చాలా స్పష్టంగా ఇది న్యాయమైన డిమాండ్ అని, దీన్ని తప్పకుండా పరిష్కరిస్తామంటూ సానుకూలంగా స్పందించారని చెప్పారు. వర్గీకరణ పోరాటం సుదీర్ఘమైనదని, ఎన్నో త్యాగాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణాలు అరి్పంచిన సంగతి మన కు తెలుసని అన్నారు. అమరులైన కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వమే ఆదుకున్నదని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ద్రోహం చేసిందని చెప్పా రు.
గాంధీభవన్ దగ్గర పెట్రోల్ పోసుకుని కొందరు మాదిగలు ఆత్మాహుతికి పాల్పడితే.. అప్పటి ప్రభుత్వం కనీసం వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఏదిఏమైనా ఇది చాలా సంతోషకరమైన సందర్భమని, దశాబ్దాల కల నెరవేరిన రోజని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టు తీర్పును మనఃస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లుకు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment