హామీలు మరిస్తే ఉద్యమిస్తాం | Telangana decade celebrations | Sakshi
Sakshi News home page

హామీలు మరిస్తే ఉద్యమిస్తాం

Published Mon, Jun 3 2024 3:34 AM | Last Updated on Mon, Jun 3 2024 3:34 AM

Telangana decade celebrations

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ 

గత సర్కారు దురాగతాలపై చర్యలేవి 

సుష్మాస్వరాజ్‌కు బీజేపీ నేతల నివాళి  

1969 ఉద్యమకారులకు సన్మానం 

పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, పార్లమెంట్‌లో ‘చిన్నమ్మ’సుష్మా స్వరాజ్‌ చేసిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. సుష్మా స్వరాజ్‌ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచిæ పార్టీ నాయకులు నివాళులర్పించారు. 

అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలంగాణ పోరాటం తరహాలోనే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి గ్యారంటీలను అమలు చేయకపోతే ఆయన భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందని, వచ్చే ఐదేళ్లు ఆయనకు కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆమెకే భక్తుడు అయ్యాడు. మాజీ సీఎం కేసీఆర్‌ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. 

ఉచితాలు, గ్యారంటీలు ఓట్లు దండుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు. తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచు కోవడం కోసం రాజీపడుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు’అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం అనుభవి స్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

‘యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలని శ్రీకాంతాచారితో మొద లు పెడితే ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నా రు. 1,200 మంది అమరులయ్యారు. వారి బలిదానాల తోనే తెలంగాణ వచ్చింది’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, ఎంపీ బీబీపాటిల్, పార్టీనేతలు కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి, శిల్పారెడ్డి, ప్రేంసింగ్‌రాథోడ్, ఎన్విసుభాష్, పీఎల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

1969 ఉద్యమకారులకు బీజేపీ సన్మానం 
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బీజేపీ నేత డా.కె.లక్ష్మణ్‌ శాలు వాలతో సన్మానించారు. మాజీ మంత్రులు మేచినేని కిషన్‌రావు, మర్రి శశిధర్‌ రెడ్డి, అలాగే యాదగిరి గౌడ్‌ తదితరులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. 

ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించి గౌరవించాలని ఉద్యమ కారులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మోదీ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. మేచినేని కిషన్‌రావు మాట్లాడుతూ.. ‘బీజేపీ చొరవ వల్ల తెలంగాణ సిద్ధించింది. 

కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఉద్యమకారులుగా తీర్మానం చేశాం. ఈ రోజు నుంచి హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాదు. వంద ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలి’అని అన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement