బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు–నిధులు–నియామకాల గురించి పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘పదేళ్లుగా అమరుల ఆత్మ క్షోభిస్తూనే ఉంది. ఉద్యమ ఆకాంక్షలు సాకారం కాలేదనే అశాంతి, ఆగ్రహం ఉద్యమకారులను కలచి వేస్తూనే ఉంది’అని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే.. కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడ్డట్లయిందని రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు.
‘గతపదేళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. బీఆర్‌ఎస్ పాలకులను గద్దె దించి పదేళ్ల పీడ విరగడైందని సంతోషిద్దామంటే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోంది’అని సంజయ్ మండిపడ్డారు.
‘కాంగ్రెస్ 6 నెలల పాలనలోనే 6 గ్యారంటీలుసహా ఇతర ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది. వేల కోట్ల అవినీతికి పాల్పడుతోంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుంది. తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది’అని ధ్వజమెత్తారు. అందుకే ప్రజల పక్షాన, అమరుల ఆశయాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment