రేవంత్ ఎందుకు తాత్సారం చేస్తున్నారు?
పార్లమెంటరీ బోర్డుసభ్యుడు లక్ష్మణ్
ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ నిరసన
సాక్షి, హైదరాబాద్. కవాడిగూడ: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసులో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ తాత్సారం చేస్తోందని ఆరోపించింది. ఈ కుంభకోణంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ఇందుకోసం న్యాయ పోరాటానికి సైతం సిద్ధంగా ఉందని ప్రకటించింది.
కేసులో సూత్రధారులు, పాత్రధారులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రలో సీఎం రేవంత్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్ ఇప్పుడెందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు.
కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం ఉందా?
ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుందా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వాళ్లు వాంగ్మూలం ఇచ్చినా కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తామన్నారని గుర్తుచేశారు. తీరా అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి తన కుమార్తె కవితను తప్పించడంకోసమే బీజేపీ నేతలపై కేసీఆర్ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు.
బీఆర్‌ఎస్ రద్దు కోరుతూ లేఖ రాస్తా: కొండా
2017కంటే ముందు నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీఆర్‌ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల వ్యవహారాలతో పాటు రక్షణ పరమైన ఒప్పందాల్లో నూ కేసీఆర్ వేలు పెట్టాడని తెలుస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో నయీం తరహా పాలన సాగిందని, సొంత కుటుంబం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు.
రేవంత్‌ను సోనియా బెదిరించారు: బూర
‘బీఆర్‌ఎస్‌పై కేసులు పెడితే నీపని అవుతుంది అని సోనియా గాంధీ బెదిరించారు. అందుకే రేవంత్ రెడ్డి మొహం చిన్నగా చేసుకుని వచ్చాడు’ అని బూ ర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యానించారు. ధర్నాలో ఎంపీ బీబీపాటిల్, మాజీ మంత్రులు జి.విజయ రామా రావు, ఇ.పెద్దిరెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్. రామ చంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మా రావు, ప్రేంసింగ్ రాథోడ్, భేతి సుభాష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment