అభిప్రాయం
రెండు బలమైన కూటములు తలపడుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పోటీ సూచనలే కనిపిస్తున్నాయి. మిత్ర విభేదాలు, పార్టీ చీలికలు, కొత్త కలయికలు, మారే సమీకరణాలు, ఒకరిపై ఒకరి పోటీ ప్రభుత్వాల ఏర్పాటు... వెరసి గడచిన అయిదేళ్లలో మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి రాజ్యమేలింది. గట్టి సంఖ్యాబలంతో ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదల అటు ‘మహాయుతి’, ఇటు ‘మహా వికాస్ అఘాడీ’ (ఎమ్‌వీఏ) కూటముల్లో స్పష్టంగా కనిపి స్తోంది. అందుకే, ఎవరూ ఏ అవకాశాన్నీ వదలకూడదనే తలంపుతో పావులు కదుపుతున్నారు.
ప్రధాన స్రవంతి ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌కు తోడు ప్రాంతీయంగా ప్రాబల్యమున్న శివసేన, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లూ ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. రెండు కూటముల్లో క్రియాశీలక పాత్ర పోషించే శివసేన, ఎన్సీపీలు ఈసారి ప్రత్యేకంగా నాలుగు పార్టీలుగా తలపడుతున్నాయి. 2022–23లో చోటుచేసు కున్న ‘పవర్ పాలిట్రిక్స్’లో ఒక్కో పార్టీ రెండుగా చీలిన విషయం తెలిసిందే!
ఏక్‌నాథ్ షిందే నేతృత్వంలోని శివసేన బీజేపీతో చేతులు కలిపి ‘మహాయుతి’లో భాగమైతే, ఉద్ధవ్ థాక్రే నాయకత్వం వహిస్తున్న శివసేన కాంగ్రెస్‌తో కూడి ‘మహా వికాస్ అఘాడీ’ భాగస్వామి అయింది. అలాగే అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ మహాయుతిలో ఉంటే, శరద్‌పవార్ నేతృత్వపు ఎన్సీపీ... ఎమ్‌వీఏలో భాగంగా ఉంది. ఇప్పుడీ రెండు కూటములూ, రాష్ట్రంలో 12 శాతంగా ఉన్న ముస్లిం ఓట్లపై దృష్టి కేంద్రీకరించాయి.
వాటి చుట్టూ ముగ్గుపోసి వ్యూహాలు అల్లుతున్నాయి. మైనా రిటీలుగా ఉండి కూడా మెజారిటీ వారిని ఓడించడమనే ఎత్తుగడతో ముస్లింలు ‘వోట్ జిహాద్’కు పాల్పడుతున్నారని బీజేపీ విమర్శిస్తోంది. అవన్నీ తప్పుడు లెక్కలనీ, ముస్లింల ఉనికిని, త్యాగాలను కించపరిచేలా మాట్లాడుతున్న బీజేపీ నాయకత్వం, వారికి క్షమాపణలు చెప్పి ఎన్నికల బరిలో దిగాలనీ ప్రత్యర్థులు అంటున్నారు.
‘తాము బహుళ సంఖ్యాకులుగా ఉన్న ఒక నియో జకవర్గంలో ముస్లిం మైనారిటీలు మూకుమ్మడిగా బీజేపీ ప్రత్యర్థులకు ఓటువేసి మెజారిటీ వర్గమైన హిందువులను ఓడిస్తున్నారు’ అన్నది బీజేపీ నాయకుల వాదన. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ‘ధూలే’ స్థానం పరిధి అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి బీజేపీ అభ్యర్థికి 1.9 లక్షల ఓట్ల ఆధిక్యత లభించినా, ముస్లిం ఆధిక్యత ఉన్న ఒక్క ‘మాలెగావ్ సెంటర్’ అసెంబ్లీ స్థానంలో ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి లభించిన ఏకపక్ష ఆధిక్యత వల్ల బీజేపీ అభ్యర్థి నాలుగువేల ఓట్లతో ఓడిపోయినట్టు, ఉదాహరణతో పీపీపీ ప్రదర్శన ఇచ్చి ప్రచారం చేశారు. ఇదే కారణంగా మహాయుతి కూటమి 14 స్థానాలు కోల్పోయిందన్నది వారి వాదన.
హిందువులు జాగృతం కావాలని బహిరంగంగానే చెప్తు న్నారు. కానీ ఎమ్‌వీఏ కూటమి నాయకులు దీన్ని ఖండి స్తున్నారు. అదంతా బీజేపీ చేస్తున్న ఓ ‘సానుకూల అన్వయ వాదన’ తప్ప వాస్తవాలు వేరంటున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న 38 అసెంబ్లీ స్థానాల్లో, 2019తో పోల్చి చూస్తే 20 (సగానికి ఎక్కువ) స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు 2024 ఎన్నికల్లో తమ ఓటు శాతాన్ని పెంచుకున్నట్టు జాబితా వెల్లడించారు. కిందటిసారి అసెంబ్లీకి ఎన్నికైన పదిమంది ముస్లింలలో 8 మంది ఆ స్థానాల నుంచే వచ్చారు.
ప్రస్తుత సభలోని మొత్తం పదిమంది ముస్లిం ఎమ్మెల్యేలలో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీల నుంచి ఇద్దరేసి ఉండగా మజ్లిస్, ఎన్సీపీ నుంచి ఒక్కొక్కరి చొప్పున ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. అధిక ముస్లిం జనాభా స్థానాలు కూడా ఏకపక్షంగా ఏం లేవనీ, ఆ 38లో కాంగ్రెస్ 11, బీజేపీ 11, అవిభక్త శివసేన 9, అవిభక్త ఎన్సీపీ 3, మజ్లిస్ 2, ఎస్పీ 2 స్థానాలు గత అసెంబ్లీ ఎన్ని కల్లో గెలుచుకున్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ (ఎఐఎంఐఎం) మహారాష్ట్ర ఎన్నికల్లో దశాబ్ద కాలంగా పాత్ర పోషిస్తోంది. 2014 ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసి, ఔరంగాబాద్ సెంట్రల్, బైసుల్లా–2 అసెంబ్లీ స్థానాలు గెలిచి చరిత్ర సృష్టించింది. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ (వీబీయే)తో అప్పుడు ఏర్పడ్డ పొత్తు, 2019 ఎన్నికలప్పుడు సీట్ల పంచాయితీలో వికటించి ఆ రెండు స్థానాలు నిలబెట్టుకో లేకపోయింది.
కానీ మాలెగావ్ సెంట్రల్, ధూలే –2 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక పార్లమెంట్ స్థానం (ఔరంగాబాద్ సెంట్రల్) గెలిచి మజ్లిస్ మరోమారు వార్తలకెక్కింది. మరో నాలుగు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. అంతే కాకుండా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మజ్లిస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం, అక్కడి గెలుపు మార్జిన్ కంటే అధికం. 2014 లో 22 చోట్ల పోటీ చేసి 0.9 శాతం ఓట్లు సాధిస్తే, 2019లో 44 చోట్ల పోటీచేసి 1.34 శాతం ఓటువాటా పొందింది.
పరిమిత ప్రభావమే అయినా... తక్కువ ఓటు వ్యత్యాసాలతో గెలుపోటములు నిర్ణయమయ్యే తీవ్ర పోటీలో మజ్లిస్ అభ్య ర్థులు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలు న్నాయి. ముస్లిం ఓట్లను చీల్చి పరోక్షంగా బీజేపీకి సహకరించేందుకే పోటీ చేస్తోందనే ఆరోపణలు బీజేపీ వ్యతిరేకపార్టీల నుంచి మజ్లిస్ ఎదుర్కోవాల్సి వస్తోంది. గణాంకాలు మాత్రం ఆ వాదనను ధృవపరచడం లేదు.
ఉదాహరణకు విజేతల మార్జిన్ కన్నా మజ్లిస్ ఎక్కువ ఓట్లు పొందిన 13 నియో జకవర్గాల్లో, 7 చోట్ల బీజేపీ దాని భాగస్వాములు గెలిస్తే... 6 చోట్ల కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి నెగ్గింది. ‘హరియాణా, జమ్మూ–కశ్మీర్‌లో మేం పోటీ చేయలేదు కదా, ముస్లిం ఓట్లు చీల్చలేదు కదా, మరి కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు?’ అన్న అసద్ ప్రశ్న హేతుబద్ధమే అంటారు పరిశీలకులు.
5 చోట్ల అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన మజ్లిస్ ఈసారి కూడా ఎక్కువ స్థానాల్లో పోటీచేసే అవకాశాలున్నాయి. పొత్తులకు కలిసి రావాలంటే 28 స్థానాలు ఇవ్వాలన్న ఆ పార్టీ ప్రతి పాదనకు ఎమ్‌వీఏ అంగీకరించక పోవడం వల్ల ఇంకా పొత్తు కుదరలేదు. పొత్తు లేకుంటేనే బెటర్ అని ఎమ్‌వీఏ భావిస్తున్నట్టుంది.
పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్ సరళి తమ అభ్యర్థుల గెలుపోటముల్ని కచ్చితంగా ప్రభావితం చేస్తుందనేది ప్రధాన పార్టీల ఆలోచన. బీజేపీ పక్షాలు ఆందోళన చెందితే, వ్యతిరేక పక్షాలు కొంత ఆశా వహంగా ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 2 శాతం కన్నా తక్కువ ఓట్ల తేడాతో 27 చోట్ల, 2–3 శాతాల మధ్య ఓట్ల వ్యత్యాసంతో 14 చోట్ల, 3–4 శాతాల మధ్య ఓట్ల తేడాతో 11 చోట్ల, 4–5 శాతాల ఓట్ల మధ్య తేడాతో 19 చోట్ల అభ్యర్థులు గెలుపొందారు.
అంటే 5 శాతం లోప ఓట్ల వ్యత్యాసంతో మొత్తం 71 మంది అభ్యర్థులు గెలుపొందారన్నమాట. ఇలా తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన వారిలో బీజేపీ (29), కాంగ్రెస్ (12), శివసేన (5)తో పాటు ఇండిపెండెంట్లూ (5) ఉన్నారు. ఇక ముస్లిం జనాభా 15 శాతానికి మించి ఉన్నవి 51 నిజయోజక వర్గాలు కాగా 10–15 శాతాల మధ్య ముస్లిం జనాభా ఉన్న నియోజక వర్గాలు 54 ఉన్నాయి.
5–10 శాతాల మధ్య జనాభా ఉన్నవి 91, ఐదు కన్నా తక్కువ ముస్లిం జనాభా ఉన్నవి 92 నియో జకవర్గాలు ఉన్నాయి. బీజేపీ, వారి మిత్రపక్ష అభ్యర్థులను ఎక్కడెక్కడ ఎవరు ఓడించగలుగుతారో... ఆ నమ్మకాన్ని బట్టే ముస్లిం ఓటర్లు అటువైపు మొగ్గవచ్చనే అభిప్రాయం ఉంది. ఏ అంశం ఏ మేరకు అభ్యర్థుల జాతకాలను మారు స్తుందో నవంబరు 23 వరకు వేచి చూడాల్సిందే!
దిలీప్ రెడ్డి
వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చి సంస్థ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment