‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా? | Sakshi Guest Column On Maharashtra Assembly Elections | Sakshi
Sakshi News home page

‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా?

Published Wed, Oct 16 2024 1:20 AM | Last Updated on Wed, Oct 16 2024 7:15 AM

Sakshi Guest Column On Maharashtra Assembly Elections

సందర్భం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారానికి తెర పడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. 

మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్‌లో ఇప్పుడిప్పుడే కద లిక ప్రారంభమయ్యింది. కాంగ్రెస్‌ సన్నద్ధతపై ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీఏకు సవాల్‌ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్‌ మంచి చెడుల పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రవర్తన మీద!

మహారాష్ట్ర, రెండు కూటములకూ ఎంతో కీలకమైన రాష్ట్రం. ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్య మైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌)లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీఏ శిబిరంలో ఉంది.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్‌ థాక్రే), ఎన్సీపీ (శరద్‌ పవార్‌)ల ‘మహా వికాస్‌ ఆఘాడి’ (ఎమ్‌వీఏ) ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. 

2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణా మాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ– శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ–కాంగ్రెస్‌ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్‌వీఏ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్‌వీఏ ప్రభుత్వం కొంత కాలానికే కుప్ప కూలింది. 

రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్‌ పవార్‌ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలికలు మహా  రాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్‌సభ స్థానాలకుగాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, ఎమ్‌వీఏ 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.

ఇదివరకటిలా కాకుండా, రాహుల్‌గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్‌ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్‌
మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్‌ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కోల్పోయారనే భావన అత్య ధికుల్లో ఉంది. 243 స్థానాల్లో మ్యాజిక్‌ నంబర్‌ 122 అయితే ‘మహా ఘట్‌ బందన్‌’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. 

ఏ మాత్రం తేడా వచ్చినా ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్‌ ఎన్నికల్లో ఒమర్‌ ఫరూక్‌ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్‌ నెగ్గింది. హరియాణాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సీట్ల తేడా 11 మాత్రమే! కానీ, ఆప్‌కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.

క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్‌ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు... సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్ధపడింది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీఏను గద్దె దించడానికి ప్రతి యుద్ధం ప్రకటించాలి. ప్రతి పోరూ సాగించాలి. ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి’ అని బెంగళూర్‌ (2001)లో జరిగిన ప్లీనరీలో నిర్ణ యించారు. 

ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్‌ అబూలో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య మంత్రుల కాంక్లేవ్‌లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘ఛాందసవాదుల్ని గద్దె దించ డానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి... మన లక్ష్యం సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్ధంగా ఉండాలి’ అని ఆమె ఉద్బోధించారు. 

నేను స్వయంగా విని, రిపోర్ట్‌ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం... ‘ఇది సంకీర్ణాల శకం అనుకోన వసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్ప రిచే సత్తా మనకుంది...’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ కొత్త పాఠాలు నేర్చు కోవడమే కారణం. 

వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్‌ వ్యతిరేక ధోరణి’ తారస్థాయికి చేరి, అప్పుడు తేలిగ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘పొత్తు లతో మాత్రమే కాంగ్రెస్‌ గెలువగలదు...’ అని ప్రణబ్‌ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియా శీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలు పరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్‌ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. 

రాజీవ్‌గాంధీ హత్యలో డీఎమ్‌కేకు భాగముందని కాంగ్రెస్‌ స్వయంగా విమర్శించినా... తమిళనాడులో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారామె. ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్‌ను చీల్చిన శరద్‌పవార్‌ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్ధమయ్యారు. సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీఏను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్‌లో ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపి గెలి చారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్‌కు శరణ్యం.

2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్‌ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమా చల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,పంజాబ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. అయితే వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్ధమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడ వదు, రాజకీయ ఫలం సిద్ధించదు!


దిలీప్‌ రెడ్డి 
వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్,‘పీపుల్స్‌ పల్స్‌’ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement