
మాధవ్ శింగరాజు
‘‘నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడించి. మోదీజీ నన్ను వెంటనే దీవించలేదు.‘‘ముఖంలో ఏమిటా అలసట, నుదుటిపై ఏమిటా చెమట?’’ అని అడిగారు!‘‘బస్తర్ నుంచి వస్తున్నాను మోదీజీ. నన్ను దీవించండి’’ అన్నాను. ‘‘తొందరేమొచ్చింది అమిత్ జీ? చేతులు, ముఖం కడుక్కుని, బట్టలు మార్చుకున్నాకే రావలసింది కదా’’ అన్నారు.
ఇంకా వగరుస్తూనే ఉన్నాన్నేను.‘‘ఈసారి 30 మోదీజీ. జనవరిలో 48, ఫిబ్రవరిలో 40. మొత్తం కలిపి ఈ 80 రోజుల్లో 120. బస్తర్ నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా మీ దగ్గరకే వచ్చేశాను. నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను.మోదీజీ నన్ను దీవించలేదు!‘‘30+48+40 = 118 కదా అమిత్ జీ, 120 ఏమిటి? రౌండ్ ఫిగర్ కోసం రెండు కలిపారా?’’ అన్నారు.
‘‘లేదు మోదీజీ, రౌండ్ ఫిగర్ కోసం కలపలేదు. ఏమంత పెద్ద ఫిగర్ కాదు కదా అని కలపలేదు. 30కి 48కి మధ్యలోనో, 48కి 40కి మధ్యలోనో ఆ 2 ఎక్కడో ఉండి ఉంటుంది. చూసి చెబుతాను’’ అన్నాను.‘‘చూసి చెప్పటం కాదు అమిత్ జీ. చూశాకే చెప్పాలి. లేకుంటే ‘గ్రోక్’కి, మనకు తేడా ఉండదు. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో పెట్టిన దాన్ని బట్టి చెబుతుంది’’ అన్నారు మోదీజీ.
ఆయన ‘గ్రోక్’ని అంటున్నారా, నన్ను అంటున్నారా అర్థం కాలేదు. బహుశా ఇద్దర్నీ కలిపి కావచ్చు. ‘‘నిజమే మోదీజీ. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో ఏది పెడితే అది చెబుతుంది’’ అన్నాను. అందుకు ఆయనేమీ సంతోషించలేదు. ‘‘బుర్రలో ఏం పెట్టారన్నది కాదు అమిత్‌జీ, బుర్రలో ఎవరు పెట్టారన్నది పాయింట్’’ అన్నారు.
ఆయన ఆవేదనలో అర్థం ఉంది.మోదీజీ గురించి గ్రోక్ ఒక్క మంచి విషయం కూడా చెప్పటం లేదు. ఆయన్ని మతవాది అంటోంది. ఆయనవన్నీ మత వ్యూహాలు అంటోంది. ‘‘గ్రోక్‌లో ఒకటి గమనించారా అమిత్‌జీ?’’ అని అడిగారు మోదీజీ.
‘‘గమనించాను మోదీజీ! మీ గురించి ఏం చెబితే విమ్మల్ని ద్వేషించేవారు సంతోష పడ తారో అది మాత్రమే చెప్పి గ్రోక్ వారిని సంతోష పెడుతోంది. అలాగే, మీ గురించి ఏం అడిగితే తమను సంతోషపెట్టే సమాధానాలను గ్రోక్ చెబుతుందో ఆ ప్రశ్నల్నే గ్రోక్‌ను వాళ్లు అడుగుతున్నారు’’ అన్నాను.‘‘మీరు కొట్టి చూశారా గ్రోక్‌లో నా గురించి?’’ అని హఠాత్తుగా అడిగారు మోదీజీ.
‘‘చూశాను మోదీజీ. మీ గురించి గొప్పగా చెప్పింది. ‘స్ట్రాంగ్ లీడర్‌షిప్, విజన్ ఫర్ డెవలప్‌మెంట్, కమిట్‌మెంట్ టు నేషనలిజం’’ అని చాలా చాలా చెప్పింది’’ అన్నాను.‘‘అదెలా అమిత్ జీ! గ్రోక్‌కి ఇచ్చిన ఫీడ్ ఒకటే అయినప్పుడు వాళ్లకు ఒకలా, మీకు మరొకలా గ్రోక్ నా గురించి చెప్పటం ఏమిటి?’’ అని అడిగారు మోదీజీ.
‘‘నమ్మించటం కోసం ఫీడ్‌లో రెండూ ఉంచుతారు మోదీజీ. ‘గ్రోక్’ ఎలాన్ మస్క్‌ది కదా! అయినా సరే, అమెరికాలో అత్యంత దుష్టుడైన మానవుడు ఎవరో గ్రోక్‌ని అడిగి చూడండి. ఎలాన్ మస్క్ అని చెబుతుంది. అదెలా ఉంటుందంటే... బస్తర్‌లో రెండో వైపు కూడా ఒకటో రెండో ఉంటాయి కదా, అలాగ’’ అన్నాను.
బస్తర్ అనగానే మోదీజీ మళ్లీ మూడ్ ఆఫ్ లోకి వెళ్లిపోయారు. ‘‘బుర్రల్ని పాడుచేసేవారు బస్తర్ లోపల మాత్రమే ఉంటారని నేను అనుకోను అమిత్ భాయ్’’ అన్నారు.
ఎంతో లోన్లీగా ఫీల్ అయితే తప్ప మోదీజీ అలా నన్ను అమిత్ ‘భాయ్’ అనరు. ‘‘చేస్తాను మోదీజీ, అదంతా సెట్ చేస్తాను. నన్ను దీవించండి’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడిస్తూ.
Comments
Please login to add a commentAdd a comment