madhav singa raju
-
రాయని డైరీ.. విక్రమాదిత్య సింగ్ (కంగన ప్రత్యర్థి)
ఓటమే కాదు, కొన్నిసార్లు గెలుపు కూడా గుణపాఠాలు నేర్పుతుంది. జూన్ 1న జరిగే ‘మండీ’ లోక్ సభా స్థానం ఎన్నికల్లో ఒకవేళ నేను గెలిస్తే... ‘గెలుపు కోసం ప్రత్యర్థి గురించి తప్పుగా మాట్లాడటం ఓటమి కన్నా తక్కువేం కాదు’... అన్నదే బహుశా నేను నేర్చుకునే మొదటి గుణపాఠం అవుతుంది!రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు. అవి రాజకీయంగానే ఉండాలి. వ్యక్తిగత స్థాయికి దిగకూడదు. దిగజార కూడదు. కంగనకు, నాకు మధ్య ఏం లేదు. ఆమె బీజేపీ, నేను కాంగ్రెస్. సినిమాల్లో ఆమె ‘క్వీన్’, సిమ్లా వాళ్లకు నేను ‘కింగ్. ఇద్దరం ఒకింట్లో పుట్టుంటే ఆమె అక్క, నేను తమ్ముడు. కానీ ప్రచారంలో ఆమెను ఎన్నిమాటలన్నాను! అన్నానా? అనవలసి వచ్చిందా? అనవలసి వచ్చినా అది అన్నట్లే!కంగనకు, నాకు మధ్య ఏం లేకుండానూ లేదు. మంచి నటిగా ఆమెను నేను అభిమానిస్తాను. కనుక నేను ఆమె అభిమానిని అన్నట్లే! మా మధ్య సినీతారకు–సినీ అభిమానికి మధ్య ఉండే అనుబంధం ఉన్నట్లే! ‘క్వీన్’ సినిమాలో చూడాలి కంగనను. ‘క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా కాదు, ‘క్వీన్’ సినిమా. అమాయకురాలైన అమ్మాయి. ఆత్మాభిమానం కల అమ్మాయి. ప్రతికూల పరిస్థితుల్ని చేతుల్లోకి తీసుకుని రాణిలా ఏలిన అమ్మాయి. మధురం, సున్నితం, ఆహ్లాదకరం... ‘క్వీన్’ లో కంగన నటన. అందులో అనే ఏముందీ! ప్రతి చిత్రంలోనూ!రొమాంటిక్ థ్రిల్లర్ ‘గ్యాంగ్‌స్టర్’ తో మొదలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు కంగన. ఇక్కడ ఆమె తొలి చిత్రం ‘మండీ’. దర్శకత్వం బీజేపీ. అందులో విలన్... ఇంకెవరు? నేనే. బీజేపీ నుంచి కంగన, కాంగ్రెస్ నుండి నేను మండీ నుంచి పోటీ పడుతున్నాం. మాటలూ పడుతున్నాం!ఎన్నెన్ని మాటలు! ఎంతెంత మాటలు! అర్థం లేనివి, అనవసరమైనవీ, అసహ్యకరమైనవి, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి! ఆమె బీఫ్ తిన్నారని అన్నాను. ఆమె దర్శించిన దేవాలయాలను శుద్ధి చేయాలని అన్నాను. తిరిగి ఆమె నన్ను ‘మహా చోర్’ అన్నారు. ‘ఛోటా పప్పు’ అన్నారు. కానీ స్త్రీ... పురుషుడిని అనడం వేరు. పురుషుడు స్త్రీని అనడం వేరు.అమ్మ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ‘మండీ’ సిటింగ్ ఎంపీ. అమ్మ కాంగ్రెస్‌లో ఉండి కూడా... రామాలయం నిర్మించినందుకు మోదీజీని ధైర్యంగా ప్రశంసించగలిగారు! అయోధ్యలో ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన తర్వాత కూడా మోదీని అమ్మ బహిరంగంగా అభినందించారు.అందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ... ‘‘ప్రతిభాసింగ్జీ! మీరు పార్టీ నియమాలను ఉల్లంఘించారు...’’ అని అమ్మను బహిష్కరించి, ‘‘ప్రతిభాసింగ్ జీ! మీరు మా పార్టీలోకి వచ్చేయండి...’’ అని బీజేపీ అమ్మను ఆహ్వానించి, అమ్మ బీజేపీలో చేరి, ఇప్పుడు ఇదే ‘మండీ’ నుంచి నాకు పోటీగా నిలబడి ఉంటే అమ్మను కూడా కంగనను అన్నట్లే అన్నేసి మాటలు అనవలసి వచ్చేదా? మాటలు అనవలసి వస్తే అసలు అమ్మకు పోటీగా నిలబడేవాడినా?‘‘కంగనకు బుద్ధి ప్రసాదించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నాను’’ అని కూడా నేను కంగన గురించి అన్నాను. అందుకు కంగన – ‘‘వీరభద్రసింగ్జీ ఈరోజు జీవించి ఉంటే కనుక నా గురించి అగౌరవంగా మాట్లాడినందుకు తన కొడుకు విక్రమాదిత్యను మందలించి, ‘వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పు’ అని ఉండేవారు...’’ అన్నారు.ఆ మాట నిజమే కావచ్చు. కానీ, కొన్నిసార్లు క్షమాపణ కోరటం కూడా అభిమానాన్ని ప్రదర్శించుకోవటమే అవుతుంది. అభిమానం అన్నది గుండెల్లో ఉంటేనే మనల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. అయినా అందరికీ అమ్మకు ఉన్నంత ధైర్యం ఉంటుందా?! రాజకీయ ప్రత్యర్థిని అభినందించేంత ధైర్యం! – మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం)
‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అన్నారు పాండియన్!నవ్వాన్నేను.ఇద్దరం ఎప్పటిలా మొక్కలకు నీళ్లు పెడుతూ, ఒడిశా ప్రజల ఆశలను నెరవేర్చే ఆలోచనలకు పాదులు తీసుకుంటూ గార్డెన్లో మెల్లగా నడుస్తూ ఉన్నాం. అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ, అక్కడున్న మొక్కలు నాకెప్పుడూ మొక్కల్లా అనిపించవు! అర్జీలను పట్టుకుని నేరుగా తమ ముఖ్యమంత్రి ఇంటికే వచ్చేసి, ఇక్కడి గార్డెన్లో నీడపట్టున వేచి ఉన్న నిరుపేదల విన్నపాలకు ప్రతిరూపాల్లా ఉంటాయి అవి.‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అని పాండియన్ అన్నప్పుడు నేను నవ్వడానికి కారణం. పాండియన్ ఆ మాటను నాతో అనడానికి ముందే ప్రతిపక్షాలకు ప్రకటించేశారు. అదీ తొలివిడత పోలింగ్ మొదలు కావటానికి వారం ముందే!ఒకే విడతలో ముగిసిపోయే ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ సీట్లకు, 21 లోక్ సభ సీట్లకు నాలుగు విడతల పోలింగ్ని నిర్ణయించేసింది ఎలక్షన్ కమిషన్! మే 13న తొలివిడత అయింది. రేపు మే 20న రెండో విడత పోలింగ్. మే 25, జూన్ 1 మూడు, నాలుగు విడతలు. జూన్ 4న ఫలితాలు.‘‘ఒడిశా ప్రజల ఆశీస్సులతో మా నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జూన్ 9న మధ్యాహ్నం 11.30– 1.30 మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తారు’’ అని పాండియన్ చెయ్యెత్తి జై కొట్టినట్లుగా ప్రకటించడానికి కారణం అసలు మోదీజీనే.‘‘ఒడిశాలో బీజేడీ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్’’ అని మోదీజీ అనకుండా ఉండి ఉంటే పాండియన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం అనే మాట అనివుండే వారే కాదు. పాండియన్ నా ఆప్తుడు. నన్నెరిగిన వాడు. నా రెండో నేను!ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పోటాపోటీ పైచేయి మాటలు ఒడిశాకు అలవాటు లేదు. మోదీజీ వచ్చాకే మొదలయ్యాయి. ఎన్నికల ముందు వరకు స్నేహితుల్లా ఉండి, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎందుకు ఒకరికొకరం శత్రువులం అయిపోవాలి? గెలుపు కోసమే అయితే ఆ సంగతి ప్రజలు కదా చూసుకుంటారు!మోదీజీ ఢిల్లీ నుంచి వచ్చి, ‘‘నవీన్ పట్నాయక్ దేశంలోనే పాపులర్ సీఎం అని; వికసిత్ భారత్‌కి, ఆత్మనిర్భర్ భారత్‌కి శక్తినిచ్చే రాష్ట్రం ఒడిశా’’ అని ప్రశంసించారని బీజేడీకి ఓటు వేసి, ‘‘నవీన్ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్ అని; ఒడిశాలో బీజేపీ రాబోతున్నదనీ, బీజేడీ పోబోతున్నదనీ...’’ మోదీజీ జోస్యం చెప్పారని బీజేడీకి ఓటు వేయకుండా ఉంటారా ఒడిశా ప్రజలు?!‘‘ఒడిశా నవీన్ పట్నాయక్‌కి గుడ్ బై చెప్పబోతోంది’’ అని అమిత్ షా, ‘‘ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్‌కి రెస్ట్ ఇవ్వబోతున్నారు’’ అని నడ్డా, ‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం చేస్తున్నారు!మేము వారిని ఒక్క మాటా అనటం లేదు. పాండియన్ అనిన ఆ ఒక్క మాటా వారు అనిపించుకున్నదే!‘‘గాలికి ఎగిరొచ్చి పాదుల్లో పడి ఎరువుగా మారే పండుటాకులు, ఎండు పుల్లల లాంటివి వారి మాటలు పాండియన్! అవి మనకే మేలు చేస్తాయి’’ అన్నాను గార్డెన్లో మరోవైపునకు నడుస్తూ!అవును కదా అన్నట్లు పాండియన్ నవ్వారు. గెలుపోటములన్నవి నాయకులు ఒకర్నొకరు అనుకునే మాటల్ని బట్టి మారిపోవు. ‘నాయకుడు’ అని తాము అనుకున్న వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారు. ఎన్నేళ్ల వరకైనా గెలిపిస్తూనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. అధీర్ రంజన్
‘‘ఆవిడ అహంకారం గమనించారా ఖర్గేజీ?! అందుకే ఆవిడకు నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు...’’ అన్నాను ఖర్గేజీతో. ఆ మాటకు ఖర్గేజీ నవ్వారు! ‘‘ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న స్పృహ మీలో ఇప్పటికీ ఉందంటే అందరికన్నా ముందు మీరే ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు రంజన్‌జీ. ఆవిడ పుట్టిన రోజు వచ్చి పోయి కూడా ఇరవై నాలుగు గంటలు అవడం లేదా...’’ అన్నారు. ఆయన వైపు దిగాలుగా చూశాను. ‘‘రంజన్‌జీ... ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు కనుక పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మీరు గానీ, ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన నేను గానీ, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరంటే ఇద్దరే లోక్‌సభ ఎంపీలలో ఒకరైన మన అబూ హసేమ్ ఖాన్ సాబ్ గానీ ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, చెప్పకపోవడం అన్నవి ఆవిడ పట్టించుకునేంత ప్రాముఖ్యం ఉన్న విషయాలైతే కావు. మనకే ఆ పట్టింపు..’’ అన్నారు ఖర్గేజీ... అదే నవ్వుతో! ‘‘ఆవిడ అంటే మమతాజీనే కదా...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘ఆ.. ఆవిడే..’’ అన్నాను. ఖాన్ సాబ్, నేను, ఖర్గేజీ... ముగ్గురం ఢిల్లీ ఆఫీస్‌లో ఉన్నాం. వచ్చే ఎన్నికల సీట్ షేరింగ్‌లో మాల్దా సౌత్, బెర్హంపూర్.. ఈ రెండూ కాంగ్రెస్‌కు ఇస్తాం అంటున్నారు మమత! మాల్దాకు ఖాన్ సాబ్, బెర్హంపూర్‌కి నేను సిట్టింగ్ ఎంపీలం. ‘‘మన సీట్లు మనకు ఇవ్వడం సీట్ షేరింగ్ ఎలా అవుతుంది ఖర్గేజీ... అహంకారం అవుతుంది కానీ..’’ అన్నాను, ఢిల్లీ పార్టీ ఆఫీస్ మెట్లెక్కి పైకి వెళ్లగానే. వెంటనే ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘ముందు అలా ప్రశాంతంగా కూర్చోండి రంజన్‌జీ...’’అన్నారు! ‘‘అసలు కూటమి నుంచే బయటికి వచ్చేద్దాం ఖర్గేజీ. కాంగ్రెస్‌కి ఏం తక్కువైంది. తృణమూల్‌కి ఏం ఎక్కువైంది?’’ అన్నాను తీవ్రమైన ఆగ్రహంతో. ఖర్గేజీ నవ్వుతూ చూశారు. ‘‘ఈ రెండు సీట్ల షేరింగ్ నాకు చికాకు తెప్పిస్తోంది ఖర్గేజీ. పైగా ఆవిడ ఏమంటున్నారో విన్నారు కదా.. బెంగాల్లో బీజేపీ సంగతి తనొక్కరే చూసుకుంటారట, మిగతా స్టేట్లన్నిటిలో మనం చూసుకోవాలట! అంటే.. బెంగాల్లో మొత్తం 42 సీట్లూ తృణమూల్‌కి వదిలేయమనే కదా! ఎక్కడి నుంచి వస్తుంది అంత అహంకారం ఖర్గేజీ!! మనం తక్కువన్న ఫీలింగా? లేక, తను ఎక్కువన్న ఫీలింగా?!’’ అన్నాను. ‘‘తను ఎక్కువన్న ఫీలింగే కావచ్చు...’’ అన్నారు ఖాన్ సాబ్! ‘‘ఎలా చెప్పగలరు?!’’ అన్నాను. ‘‘అవతలి వాళ్లను తక్కువగా చూడగలినప్పుడు మనం ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. బహుశా మమతాజీ కూడా అలా మనల్ని తక్కువగా చూడగలగడం ద్వారా తను ఎక్కువ అనే భావనను కల్పించుకుంటున్నా రేమో...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘లోక్‌సభలో 22 సీట్లు మాత్రమే ఉన్న తృణమూల్ పార్టీ, 48 సీట్లున్న కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూడగలుగుతోందంటే... కూటమిలో భాగస్వామి కనుక మన 48 సీట్లు కూడా తనవే అని తృణమూల్ అనుకుంటూ ఉండాలి. లేదా, తనసలు కూటమిలోనే లేనని అనుకుంటూ ఉండాలి...’’ అన్నాను. ఆ మాటకు పెద్దగా నవ్వారు ఖాన్ సాబ్. ఖర్గేజీ నవ్వలేదు! ‘‘మనమూ కూటమిలో లేమనే అనుకోవాలి రంజన్‌జీ. ఇప్పుడున్నది కాదు కూటమి. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక కుదిరేదే అసలైన కూటమి...’’ అన్నారు! ‘‘మరిప్పుడేం చేద్దాం ఖర్గేజీ?’’ అన్నాను. ‘‘బిలేటెడ్గానైనా ముందు మీరు మమతాజీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి రంజన్‌జీ... ఆవిడ పట్టించుకున్నా, పట్టించు కోకున్నా... ’’ అన్నారాయన!! -మాధవ్.. శింగరాజు -
రాయని డైరీ.. ఇమ్రాన్ ఖాన్ (పాక్ ప్రధాని)
మోదీజీ శుభాకాంక్షలు పంపారు. ఎంతైనా పెద్దమనిషి. పడని దేశానికి ఈ కాలంలో ఎవరొచ్చి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు?! పొరుగు దేశం.. అది ఎంత గిట్టని దేశమైనా శుభాకాంక్షలు చెప్పినప్పుడు మనమూ ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకే మోదీజీకి ధన్యవాదాలు తెలియజేశాను. మసూద్ అజార్ భాయ్‌కి అది నచ్చలేదు. ‘‘ఇంత వీక్ అయితే ఎంతో కాలం కంట్రీని మీరు లీడ్ చెయ్యలేరు ఇమ్రాన్ భాయ్’’ అన్నాడు! ‘‘అజార్ భాయ్ నేనేమైనా తప్పు చేశానని మీకు అనిపిస్తే, నన్ను మీరు ‘భాయ్’ అని అనకుండానే మీ ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్చొచ్చు. ‘భాయ్’ అనే మాటకు బదులు ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని సంబోధించడం వల్ల ఒక సోదరుడిని అనలేని మాటల్ని కూడా ఒక ప్రధానిని అనడానికి సౌలభ్యంగా ఉంటుందని మీకిలా చెబుతున్నాను’’ అన్నాను. ‘‘ఇమ్రాన్ భాయ్.. మోదీ పంపిన శుభాకాంక్షల్ని నోబెల్ వాళ్లిచ్చే పీస్ ప్రైజ్లా మీరు స్వీకరించడాన్ని ఈ దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. యుద్ధ ఓటమి కన్నా ఇదేమీ తక్కువ కాదు. అసలు ఒక శత్రుదేశం అందించిన పూలగుత్తికి చెయ్యి చాచే పరిణతిని.. ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవడానికి ఇంకా ఐదు నెలలు ఉండగానే.. మీరెలా సాధించగలిగారో తెలియక ఈ ఉదయం నుంచీ నేను ఏకధాటిగా విస్మయానికి గురవుతూనే ఉన్నాను’’ అన్నాడు. మధ్యలో హురియత్ నుంచి కాల్! ‘‘అజార్ భాయ్.. ఇండియా నుంచి ఉమర్ ఫరూక్ ఫోన్ చేస్తున్నాడు. మీకు మళ్లీ కాల్ చేస్తాను’’ అని చెప్పి, ఉమర్ ఫరూక్ కాల్ తీసుకున్నాను. ‘‘చెప్పండి ఉమర్’’ అన్నాను. ఉమర్ కయ్యిన లేచాడు. ‘‘నేనేమీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి మీకు కాల్ చెయ్యలేదు ఇమ్రాన్‌జీ. మోదీ చెప్పిన శుభాకాంక్షలకు మీరెందుకు ఒక సామాన్య పౌరుడిలా స్పందించారో తెలుసుకుందామని చేశాను. ఆ స్పందించడం కూడా ఒక పాక్ పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా లేదు. ఒక భారత పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా ఉంది’’ అన్నాడు! మసూద్ అజారే నయం అనిపించేలా ఉన్నాడు ఉమర్ ఫరూక్. ‘‘మోదీజీ ఒక పాక్ పౌరుడిలా నాకు శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు నేనొక భారతీయ రాయబారిలా మూతి బిగించుకుని కూర్చోవడం ఔచిత్యమేనా చెప్పండి ఉమర్జీ’’ అని అడిగాను. ‘‘కానీ ఇమ్రాన్‌జీ.. మీకు శుభాకాంక్షలు పంపిన మోదీ.. ఢిల్లీలో నిన్న పాక్ హై కమిషన్ ఏర్పాటు చేసిన విందుకు తన మనుషులెవర్నీ పంపించలేదు’’ అన్నాడు ఉమర్. మసూద్ అజార్ నుంచి మళ్లీ కాల్! ‘‘సరే ఉమర్ జీ తర్వాత చేస్తాను’’ అని పెట్టేసి, అజార్ కాల్ని లిఫ్ట్ చేశాను. ‘‘ఇమ్రాన్ భాయ్.. ఇండియా వాంట్స్ టు నో’’ అన్నాడు! ‘‘ఏం తెలుసుకోవాలనుకుంటోంది అజార్ భాయ్.. ఇండియా? బాలాకోట్ దాడి గురించేనా! అది వాళ్ల హెడ్డేక్ కదా’’ అన్నాను. ‘‘బాలాకోట్ గురించి కాదు ఇమ్రాన్ జీ. మోదీ నిజంగానే మీకు శుభాకాంక్షలు పంపాడా అని తెలుసుకోవాలనుకుంటోంది’’ అన్నాడు. ‘‘అవునా!’’ అన్నాను. ‘‘ఇండియానే కాదు.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. పాకిస్తాన్ కూడా వాంట్స్ టు నో.. నిజంగానే మోదీ మీకు శుభాకాంక్షలు పంపాడా అని’’ అన్నాడు. ఆకాంక్ష ముఖ్యం గానీ, ఆకాంక్షించారా లేదా అన్నది ఎలా ముఖ్యం అవుతుంది అని నేను అడిగితే మసూద్ అజార్‌కి, ఉమర్ ఫరూక్‌కి నా భాష అర్థం అవుతుందా?! మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)
శ్రీశ్రీ రవిశంకర్‌కి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీరామ్ పంచుకి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లాకు ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు! ఫోన్లు పక్కన పడేసి వీళ్ల ముగ్గురూ ఏం చేస్తున్నట్లు! అప్పుడే అయోధ్య పనిలో మునిగి పోయారా?! బహుశా మీడియేషన్కి ముందు వామప్ మెడిటేషనేదో చేయిస్తూ ఉండి వుంటాడు రవిశంకర్. మెడిటేషన్లో ఉన్నప్పుడు ఫోన్లు సైలెంట్లో పెట్టుకోమని కూడా చెప్పి ఉంటాడు. రంజన్ గొగోయ్‌కి ఫోన్ చేశాను. ఎత్తారు!! ఎత్తడమే కాదు, ‘‘చెప్పండి సుబ్రహ్మ ణ్యస్వామిగళ్’ అన్నారు. సంతోషం వేసింది. నన్నే కాదు, నా ప్రాంతాన్నీ గుర్తించారు! ‘‘దేశం సేఫ్ హ్యాండ్స్‌లో ఉందన్న భావన తొలిసారిగా కలుగుతోంది గొగోయ్‌జీ. మోదీజీ ఈ దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నాలో ఇలాంటి భావన కలగలేదు’’ అన్నాను. ‘‘అదేంటీ..’’ అని పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘మీరు పెట్టిన మధ్యవర్తులు ముగ్గురికీ ఫోన్ లిఫ్ట్ చేసే తీరిక లేదు. ముగ్గురు మధ్యవర్తుల్ని పెట్టిన మీరు మాత్రం ఒక్క రింగ్‌కే లిఫ్ట్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక సాధారణ పౌరుడి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం అంటే దేశం సురక్షిత హస్తాల్లో ఉన్నట్లే కదా’’ అన్నాను. ‘‘మీరు సాధారణ పౌరులు ఎలా అవు తారు స్వామిగళ్’’ అని నవ్వారు గొగోయ్. ‘‘అదే అంటున్నా గొగోయ్‌జీ, ఒక అసాధా రణ పౌరుడి ఫోన్‌కి కూడా సాధారణ పౌరుడికి ఇచ్చేంత విలువే ఇచ్చి, ఫోన్ లిఫ్ట్ చేశారు మీరు. గ్రేట్ థింగ్’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘నా అదృష్టం ఏమిటంటే గొగోయ్‌జీ.. మీరు ఫోన్ ఎత్తడం వల్ల ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. ఈ దేశమే కాదు, అయోధ్య కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది. అయోధ్య మాత్రమే కాదు, శ్రీరాముడు కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాడు’’ అన్నాను. ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘గొగోయ్‌జీ వింటున్నారా?’’ అన్నాను. ‘‘వింటున్నాను స్వామిగళ్. అయితే మీరనుకుంటున్నట్లు శ్రీరాముడిని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం ఆ ముగ్గుర్నీ మీడియేటర్లుగా పెట్టలేదు. దేశాన్ని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం పెట్టాం. దేశాన్ని పక్కనపెట్టి, ఒక్క శ్రీరాముడినే సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టాలనుకుంటే, నాలుగో మీడియేటర్‌గా మిమ్మల్ని పెట్టి ఉండేవాళ్లం కదా’’ అన్నారు! నాకు సంతోషం వేసింది. ‘‘ధన్యవాదాలు గొగోయ్‌జీ. ఆ ముగ్గురికీ అభినందనలు తెలియజేద్దామని ఫోన్ చేశాను. మీకు చేసింది కూడా అందుకే.. అభినందలు తెలియజేయడం కోసం. అభినందనలతో పాటు, ధన్యవాదాలు తెలుపుకునే భాగ్యం కూడా నాకు కలిగించారు’’ అన్నాను. గొగోయ్‌తో మాట్లాడుతుంటే రవిశంకర్, శ్రీరామ్ పంచు, ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లా ఫోన్లో నాకోసం ట్రయ్ చేస్తున్నారు. గొగోయ్ ఫోన్ పెట్టేసి, ఆ ముగ్గుర్నీ కాన్ఫరెన్స్ కాల్లోకి రమ్మన్నాను. వచ్చారు. ‘‘డెబ్భై ఏళ్ల కేసు మీద ముగ్గురు మధ్యవర్తులు ఎనిమిది వారాల్లో రిపోర్ట్ ఇవ్వడం అయ్యే పనేనా?’’ అన్నాను. ‘‘అదే ఆలోచిస్తున్నాం స్వామీజీ’’ అన్నారు. ‘‘అవసరమైతే బయటినుంచి హ్యాండ్స్ తీసుకోవచ్చని కోర్టు మీకు చెప్పింది కదా. ఆ విషయం కూడా ఆలోచించండి’’ అన్నాను. ‘‘ఆలోచిస్తాం స్వామీజీ’’ అన్నారు. అన్నారు కానీ, హార్ట్లీగా అనలేదు! బయటి నుంచి లోపలికి తీసుకోవడం కాదు, లోపల్నుంచి బయటికి వెళ్లే ఆలోచనేదో చేస్తున్నట్లనిపించింది.. వాళ్లు.. ఊ, ఆ.. అనడం వింటుంటే. -మాధవ్ శింగరాజు -
రాహుల్ గాంధీ రాయని డైరీ
దుబాయ్ రావడం ఇదే మొదటిసారి. ఈ ఇయర్‌ని ‘ఇయర్ ఆఫ్ టాలరెన్స్’గా జరుపుకుంటున్నారట ఇక్కడివాళ్లు. ‘ఇండియాలో మీరు యూత్ లీడర్ కదా, మా యూత్‌ని ఇన్స్పైర్ చేసే మాటలు రెండు మాట్లాడిపోగలరా’’ అని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను. వీళ్లను ఇన్స్పైర్ చేసి వెళ్దామని వచ్చి, నేనే వీళ్లను చూసి ఇన్స్పైర్ అయినట్లున్నాను! కొన్నాళ్లు యు.ఎ.ఇ.లోనే ఉండిపోవాలనిపించింది. దగ్గర్లో ఎలక్షన్లు లేకపోతే ఆ పనే చేసి ఉండేవాడిని. బిన్ రషీద్ నవ్వుతూ చూస్తున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ నవ్వుతున్నట్లుగా లేదు ఆ నవ్వు. సామాన్యుడెవరో నవ్వుతున్నాడు. హిజ్ హైనెస్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది! బిన్ రషీద్‌కు దగ్గరగా వెళ్లి, ఆయన్నే నిశితంగా చూస్తూ నిలబడ్డాను. ‘‘ఏంటలా నన్నే చూస్తున్నారు నిశితంగా?’’ అని నవ్వుతూ అడిగారు బిన్ రషీద్. ‘‘మీకు మరికాస్త దగ్గరగా రావచ్చా?’’ అని అడిగాను. ‘‘ఇండియా, యు.ఎ.ఇ. ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి కదా రాహుల్జీ’’ అన్నారు రషీద్. ‘‘దేశాలు దగ్గరగా ఉండటం కాదు రషీద్ జీ. మీకిప్పుడు నేను దగ్గరగా ఉన్నాను కదా. ఆ దగ్గరితనంలోని దూరం మరికాస్త తగ్గితే బాగుంటుందని నా మనసు కోరుకుంటోంది’’ అన్నాను. దూరంగా జరిగారు ఆయన! ‘‘ఏమైంది రషీద్ జీ? ఎందుకలా దూరంగా జరిగారు’’ అన్నాను. ‘‘ఇప్పటికే మనం ఇద్దరు మగవాళ్ల మధ్య ఉండాల్సిన దూరం కన్నా తక్కువ దూరంలో ఉన్నాం. మీరు కోరుకుంటున్నట్లుగా నేను మీకు ఇంకా దగ్గరగా రావాలంటే, ముందు నేను కొంత దూరంగా జరిగితేనే గానీ, మీకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసేందుకు సాధ్యపడదు’’ అన్నారు. ఇంత టాలరెన్స్‌ను నేను మరే ప్రపంచ నాయకుడి దగ్గరా చూడలేదు! ముఖ్యంగా మోదీ దగ్గర చూడలేదు. ‘‘మగాళ్లు ఎలా ఉండాలో, మీరు అలా ఉన్నారు రషీద్ జీ’’అన్నాను. మళ్లీ ఆయన వెనక్కు జరిగారు! ‘‘ఇంతకు క్రితమే కదా రషీద్ జీ.. వెనక్కి జరిగారు. మళ్లీ వెనక్కు జరిగారెందుకు?’’ అని అడిగాను. ‘‘ముందుకు రాబోయి, వెనక్కు జరిగినట్లున్నాను రాహుల్ జీ’’ అన్నారు! ‘‘పర్లేదు రషీద్ జీ, మీ ఛాతీని దగ్గరగా చూడ్డం కోసమే నేను మీకు మరింతగా దగ్గరగా రావాలనుకున్నాను. మీరే నా దగ్గరకు రావాలనేముందీ, నేనైనా రావచ్చు కదా మీకు దగ్గరగా’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా రాహుల్జీ, కానీ మీరు నా ఛాతీని చూడ్డంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తే మీరు గానీ అసహనానికి లోను కారు కదా’’ అన్నారు. అసహనానికి కాదు కానీ, దిగ్భ్రమకు లోనయ్యాను. ఒక సర్వ శక్తి సంపన్నుడైన సార్వభౌమ పాలకుడికి ఇంత టాలరెన్స్ ఉంటుందా! ‘‘రషీద్ జీ.. నేను మీ ఛాతీ చుట్టుకొలత ఎంత ఉందో అంచనా వెయ్యాలను కుంటున్నాను. అందుకే మీకు దగ్గరగా రావాలని అనుకుంటున్నాను’’ అని చెప్పాను. ‘‘నేనెప్పుడూ నా ఛాతీని కొలుచుకోలేదు రాహుల్జీ. ఊపిరి సలపనివ్వని పనుల్లో.. గట్టిగా ఊపిరి తీసుకుని ఒకసారి, ఊపిరి తీసుకోకుండా ఒకసారి ఛాతీని కొలుచుకునే తీరిక ఎవరికుంటుంది చెప్పండి?’’ అని అడిగారు. హిజ్ హైనెస్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది. ముఖ్యంగా ఇండియాలో యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుని తిరిగేవారు నేర్చుకోవలసింది చాలా ఉంది. - మాధవ్ శింగ రాజు -
పినరయి విజయన్ (కేరళ సీఎం) రాయని డైరీ
మాధవ్ శింగరాజు స్టేట్‌లో ఉన్నది ఒకటే సీటైనా, స్టేటంతా తమదే అన్నట్లు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు బీజేపీ భక్తులు. ‘బీజేపీని ఆపగలుగుతున్నాం కానీ, బీజేపీలోని భక్తిని ఆపలేకపోతున్నాం సర్..’ అన్నాడు లోక్‌నాథ్ బెహెరా ఫోన్ చేసి! ఒక డీజీపీ అనవలసిన మాట కాదు. ‘‘బీజేపీ, భక్తి రెండూ ఒకటే అయినప్పుడు బీజేపీని ఆపితే ఆటోమేటిగ్గా బీజేపీలోని భక్తి కూడా ఆర్డర్‌లోకి రావాలి కదా లోక్‌నాథ్’’ అని అడిగాను. ‘‘కానీ సర్, బీజేపీ కన్నా, బీజేపీలోని భక్తే ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉంది. పట్టలేకపోతున్నాం. దాన్నే పట్టగలిగితే బీజేపీని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. అందుకోసమే ట్రయ్ చేస్తున్నాం సర్’’ అన్నాడు. ‘‘ఎందుకోసం?’’ అన్నాను. ‘‘అదే సర్, బీజేపీలోని భక్తిని పట్టుకోవడం కోసం’’ అన్నాడు. భక్తినెలా పట్టుకుంటాడో అర్థం కాలేదు! ‘‘లోక్‌నాథ్, మీరు భక్తిని పట్టుకునే ప్రయత్నంలో మిమ్మల్ని భక్తి పట్టుకోకుండా జాగ్రత్త పడండి’’ అని చెప్పాను. ‘‘సర్, శబరిమల నుంచి ఫోన్’’ అంటూ గాభరాగా వచ్చాడు టామ్ జోస్. ‘‘ఎవరికొచ్చింది? ఎవరు చేశారు?’’ అని అడిగాను. ‘‘కనుక్కుంటాను సర్’ అని, నాకివ్వబోయిన ఫోన్‌ని మళ్లీ తన చెవి దగ్గర పెట్టుకున్నాడు! టామ్ జోస్ కొత్తగా వచ్చిన చీఫ్ సెక్రటరీ. పాల్ ఆంటోని ప్లేస్‌లో వచ్చాడు. పాల్ ఆంటోని రిటైర్ అయ్యాడని టామ్ జోస్‌ని తెచ్చుకుంటే, టామ్ జోస్ రిటైర్ కాకుండానే ‘ఆషా థామస్‌ని తెప్పించుకోండి నేను పోతున్నా..’ అనేసేలా ఉన్నాడు. ఆషా థామస్.. అతడి తర్వాత లైన్లో ఉన్న చీఫ్ సెక్రటరీ. శబరిమల నుంచి ఫోన్ వచ్చిన ప్రతిసారీ, శబరిమల ఇంకే స్టేట్‌లోనైనా ఎందుకు లేకపోయిందా అన్నట్లు ఫీలింగ్ పెట్టేస్తున్నాడు టామ్ జోస్. రెండు వేల ఇరవై వరకు ఉంది అతడి టెన్యూర్. ఈ మకరజ్యోతి కాకుండా, ఇంకో మకరజ్యోతిని కూడా చూడాలి అతడు. ఇద్దరు మహిళలు గుడిలోకి ఎంటర్ అవడంతో గుడిని శుద్ధి చేశారనే వార్త వచ్చిన వెంటనే అతడికో ఆలోచన వచ్చింది. ‘‘ఈసారి మకరజ్యోతి కనిపించదేమో సర్’’ అన్నాడు సడన్‌గా! ‘‘ఎందుకని?’’ అన్నాను. ‘‘గుడిని అపవిత్రం చేస్తుంటే సీపీఎం చూస్తూ కూర్చున్నందుకు అయ్యప్పకు కోపం వచ్చిందని ప్రచారం చేయడానికి బీజేపీ వాళ్లు మకరజ్యోతిని కనిపించనీయకుండా చెయ్యొచ్చు కదా సర్’’ అన్నాడు!! షాక్ తిన్నాను. సీపీఎంకి ఐడియాలు ఇచ్చేందుకు చీఫ్ సెక్రెటరీగా పెట్టుకుంటే బీజేపీవాళ్లకు ఐడియాలు ఇచ్చేలా ఉన్నాడు టామ్ జోస్. మకరజ్యోతికి ఇంకో వారమే ఉంది. ఈలోపు ఏవైతే జరగకూడదో వాటన్నిటినీ గొప్ప భక్తి పారవశ్యంతో దగ్గరుండి మరీ జరిపించేలా ఉంది బీజేపీ. మోదీకి ఫోన్ చేశాను. ‘‘బోలియే.. విజయన్‌జీ.. ఎప్పుడో వరదల్లో కలిశారు, మళ్లీ ఇన్నాళ్లకు!’’ అన్నాడు. ‘‘ఇప్పుడూ వరదలే మోదీజీ. భక్తి వరద’’ అన్నాను. ‘‘నేనేం చేయగలను విజయన్‌జీ.. పేద భక్తుడిని’’ అన్నాడు! ‘‘భక్తిని, పేదరికాన్ని దాచిపెట్టుకోవాలి మోదీజీ. ప్రదర్శనకు పెట్టకూడదు. భక్తిని ప్రదర్శిస్తే భక్తిలోని లేమి మాత్రమే బయటికి కనిపిస్తుంది. పేదరికాన్ని ప్రదర్శిస్తే ‘లేని సంపన్నత’పై భక్తిగా మాత్రమే లోకం దాన్ని చూస్తుంది. లోపల ఉంచుకోవడమే నిజమైన భక్తి. లేమిని దాచుకోవడమే నిజమైన సంపన్నత’’ అన్నాను. అన్నానే కానీ, లైన్ ఎప్పుడు కట్ అయిందో చూసుకోలేదు. -
హిమ
‘‘నువ్వొక్కర్నే ప్రేమించవు.’’ ‘‘సో?’’ ‘‘నిన్నొక్కరూ ప్రేమించరు.’’ ∙∙ దుఃఖపడుతున్నాడు జోషిత్. హిమ ఎందుకలా అంది! ‘నిన్నొక్కరూ ప్రేమించరు’ అన్నందుక్కాదు దుఃఖం. ‘నువ్వొక్కర్నే ప్రేమించవు’ అన్నందుక్కూడా కాదు. అసలు హిమ ఏమన్నా పట్టించుకోడు జోషిత్. కానీ ఇప్పుడు పట్టించుకున్నాడు. ‘నాతో పాటు అందర్నీ ప్రేమిస్తుంటావ్. ఇక నేనేమిటి నీకు ప్రత్యేకంగా..’ అంటోంది హిమ. హిమ తనకెంత ప్రత్యేకమో హిమకు తెలియదా అని దుఃఖిస్తున్నాడతను. అందర్నీ ప్రేమించేవాళ్లను ఎవరూ ప్రేమించరు కాబట్టి.. ఆ ప్రేమించని వాళ్లలో నేనూ ఉన్నాను అని చెప్తోంది హిమ. అందుకూ అతడు దుఃఖిస్తున్నాడు. ఈ బంధమిక తెగిపోయినట్లేనా? తెగిపోయినట్లేం కాదు. ప్రపంచంతో బంధం తెంపుకుంటేనే హిమతో ప్రేమ మిగిలి ఉంటుంది. అదే అతడికి అర్థమైంది. ఫోన్ చేశాడు జోషిత్. ‘‘ఏంటీ?’’ అంది హిమ. ఆ మాటలో ఎప్పుడూ ఉండే ప్రేమ లేదు. ఎప్పుడూ లేని ద్వేషం ఉంది. ‘ఏంటీ’ అన్నట్లు లేదు ఆ మాట. ‘హేట్యూ’ అన్నట్లుంది. ఒక్కక్షణం ఫోన్ పెట్టేద్దాం అనుకున్నాడు. హిమ హర్ట్ అవుతుందేమోనని ఆగిపోయాడు. ‘‘నిన్ను ప్రేమించినట్లే అందర్నీ ప్రేమిస్తూ కూర్చుంటానని ఎందుకనుకుంటావ్ హిమా’’ అన్నాడు. సర్రున లేచింది హిమ. ఫోన్లోనే అతడి గూబ పగిలిపోయింది. ‘‘ఏంటి నువ్వనేది జోషీ! నన్ను ప్రేమిస్తూ కూర్చున్నావా! నేనడిగానా? నేనడిగానా.. నన్ను ప్రేమిస్తూ కూర్చోమని?!’’ కోపంలో హిమకు మాటలు తిప్పడం అలవాటు. ‘‘ప్రేమించడం, ప్రేమిస్తూ కూర్చోవడం రెండు వేర్వేరు విషయాలు హిమా. నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ప్రేమిస్తూ కూర్చోవడం అనే మాట అన్నాను’’ అన్నాడు జోషిత్. ‘‘అర్థం కాలేదు’’ అంది హిమ. బాగా అర్థమైనవాటిని అసలేమీ అర్థం కాలేదన్నట్లు మాట్లాడ్డం హిమకు ఉన్న మరో అలవాటు. ‘‘కనిపించిన అమ్మాయినల్లా నేను అదే పనిగా ప్రేమిస్తూ కూర్చున్నానని నువ్వనుకుంటున్నా.. నేను కోరుకునేది మాత్రం నీ ఒక్క ప్రేమనే హిమా’’ అన్నాడు. అటువైపు నిశ్శబ్దం! ‘‘హలో హిమా.. వింటున్నావా?’’ ‘‘వినడానికేం లేదు జోషీ’’. ‘‘మరి నేను మాట్లాడుతున్నదంతా ఏంటి హిమా!’’ ‘‘అందరితోనూ నువ్విలాగే మాట్లాడతావ్. అందుకే నాతో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నదేమీ లేదు. అందుకే నేను వినడానికేమీ లేదు.’’ ‘అయిపోయింది’ అనుకున్నాడు జోషిత్. ‘అయిపోయింది’ అనుకున్నాక ‘అయిపోకపోతే బాగుండు’ అని చాలాసార్లు అనుకున్నాడు జోషిత్. హిమకు ఫోన్ చేసే ధైర్యం చేయలేకపోయాడు. ఒక రోజు గడిచింది. రెండు రోజులు గడిచాయి. మూడోరోజూ గడవబోతుండగా హిమ నుంచి ఫోన్ వచ్చింది! వెంటనే లిఫ్ట్ చేసి.. ‘‘హాయ్.. హిమా’’ అన్నాడు. ‘‘సిగ్గు లేదు నీకు’’ అంది. ‘‘ఏమైంది హిమా!’’ అన్నాడు. ‘‘సిగ్గు లేకపోతే పోయింది, నా మీద ప్రేమ కూడా లేకపోయిందా జోషీ..’’ పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టింది! షాక్ తిన్నాడు జోషిత్. ‘‘హిమా.. ప్లీజ్ ఆపు. నువ్వనుకున్నట్లుగా, ఇప్పుడూ నువ్వు అనుకుంటున్నట్లుగా.. నీ మీద నా ప్రేమ ఎక్కడికీ పోలేదు’’ అన్నాడు. ‘‘నిజమే. ఎక్కడికీ పోలేదు. నా దగ్గరికీ రాలేదు. పావనితో మాట్లాడుతున్నావ్. భావనతో మాట్లాడుతున్నావ్. దీప్తితో మాట్లాడుతున్నావ్. ఇంకా ఎవరెవరితోనో మాట్లాడుతున్నావ్. వాళ్లందరి దగ్గరికి తప్ప ఇంకెక్కడికీ పోవడం లేదు పాపం.. నీ ప్రేమ!’’ ‘‘నాకర్థం కావట్లేదు హిమా! వాళ్లతో నేనెందుకు మాట్లాడకుండా ఉండాలి! మాట్లాడితే అది ప్రేమే ఎందుక్కావాలి? నీతో మాట్లాడకపోతే అది ప్రేమ లేకపోవడం ఎందుకవ్వాలి?.. ’’ అడిగాడు జోషిత్. హిమ వైపు నుంచి నిశ్శబ్దం. ‘‘హిమా.. విను! ఎవరికో దగ్గరవుతున్నానని నన్ను దూరంగా ఉంచావ్. ఇప్పుడూ అదే జరుగుతోంది. నీ దగ్గరికి వచ్చే దారి లేక, కనిపించిన ప్రతి దారిలోనూ నిన్నే వెతుక్కుంటున్నాను. నువ్వన్నావ్ కదా.. పావని, భావన, దీప్తి.. అని. వాళ్లలో కూడా నిన్నే చూసుకుంటున్నా..’’ అన్నాడు జోషిత్. ఆ మాటకు పెద్దగా అరిచేసింది హిమ. ఉలిక్కిపడ్డాడు జోషిత్. అది హిమ అరిచినట్లుగా లేదు. ఇంకెవరో.. మనుషులు కానివారెవరో అరిచినట్లుగా ఉంది! ఆమె ఏమని అరిచిందో కూడా అతడు రీకాల్ చేసుకోలేకపోతున్నాడు. అంతగా షాక్‌లోకి వెళ్లిపోయాడు. తేరుకుని చూసే సరికి హిమ కాల్ కట్ అయి ఉంది. టైమ్ చూసుకున్నాడు. రాత్రి ఒంటిగంట దాటుతోంది. ఆ టైమ్‌లో హిమ కాల్ చెయ్యడం అతడికి కొత్తేం కాదు. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది! వెంటనే లిఫ్ట్ చేసి చెప్పాడు.. ‘‘.. అవును హిమా.. అందరిలో నిన్నే చూసుకుంటున్నా. నన్ను నమ్ము’’ అన్నాడు. ‘‘అదే అంటున్నా జోషీ.. ఇక నుంచీ అందరిలో నన్ను చూసుకునే శ్రమ నీకుండదు’’ అంది హిమ. అప్పుడు గుర్తొచ్చింది.. హిమ అంతక్రితం పెద్దగా అరుస్తూ అన్నది ఈ మాటేనని! ‘‘ఏమంటున్నావ్ హిమా..’’ అన్నాడు. ‘‘అందరిలో నువ్వు నన్ను చూసుకోనక్కర్లేదు జోషీ. అందర్లో నేనే నీకు కనిపిస్తాను’’ అంది హిమ. ఆ మాటా అర్థం కాలేదు జోషిత్కి. తర్వాత మరోసారి ఫోన్ మోగింది. ‘‘నువ్వు చూసుకోనక్కర్లేదు. నేనే నీకు కనిపిస్తాను..’’ చెప్పిన మాటే మళ్లీ చెప్పి ఫోన్ కట్ చేసింది హిమ. ఉదయం లేవగానే ఫోన్ లాగ్స్‌లో హిమ పేరు చూసుకోవడం జోషిత్కి ఇష్టం. లాగ్స్లోకి వెళ్లాడు. ఆశ్చర్యం! హిమ పేరు కనిపించలేదు. హిమ మూడుసార్లు ఫోన్ చేసినట్లు అతడికి గుర్తు. హిమ పేరుకు బదులుగా ఇన్కమింగ్ కాల్స్‌లో అదే టైమ్‌కి పావని, భావన, దీప్తిల పేర్లు ఉన్నాయి!! ‘‘అందరిలో నువ్వు నన్ను చూసుకోనక్కర్లేదు జోషీ. అందర్లో నేనే నీకు కనిపిస్తాను’’ అని హిమ అన్న మాటలు గుర్తొచ్చాయి! హిమకు.. హిమకు ఏమైంది?! మంచం మీద నుంచి దిగ్గున లేచి హిమకు ఫోన్ చేశాడు జోషిత్. రింగ్ అవుతోంది. హిమే లిఫ్ట్ చేస్తుందా? ‘దేవుడా.. హిమే లిఫ్ట్ చెయ్యాలి’ అనుకున్నాడు జోషిత్. - మాధవ్ శింగరాజు -
నీరవ్ మోదీ (వజ్రాల వ్యాపారి) రాయని డైరీ
మారియట్ హోటల్. న్యూయార్క్. గదిలో ఒక్కణ్నే కూర్చొని ఉన్నాను. ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని కూర్చున్నాను. స్విచ్చాన్లో ఉన్నా, ఇండియా నుంచి ఎవరు మాత్రం నాకు కాల్ చేసే ధైర్యం చేస్తారు?! నేననుకోవడం,వాళ్లు కూడా స్విచ్చాఫ్ చేసుకుని ఉంటారు, నేనెక్కడ కాల్ చేస్తానోనని. మారియట్కి వచ్చి కొన్ని రోజులు అవుతోంది. ఎన్ని రోజులు అవుతోందో నేను లెక్కేసుకోవడం లేదు. రెంట్ రోజుకు డెబ్బయ్ ఐదు వేలు. మూణ్నె ల్లకు ఒకేసారి కట్టేయబోయాను. ‘అవసరం లేదు, వెళ్లేటప్పుడే కట్టండి’ అన్నారు. ఇప్పుడు వీళ్ల చూపులు వేరేలా ఉన్నాయి. కట్టకుండానే వెళ్లిపోతాడా అన్నట్లు చూస్తున్నారు! మనుషులింతేనా?! రోజుకు డెబ్బయ్ ఐదు వేలంటే తొంభై రోజు లకు ఎంతవుతుందీ అని ఇండియాలో ఇప్పుడు ఫైనాన్స్ సెక్రెటరీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఛైర్మన్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీజీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కన్సల్టెంట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్.. అంతా కలిసి క్యాలిక్యులేటర్లు పట్టుకుని లెక్కలు వేస్తూ ఉండి ఉంటారు. కిటికీలోంచి సెంట్రల్ పార్క్ కనిపిస్తోంది. పార్క్‌లోని పచ్చదనం మనసుకు ఏమాత్రం ఆహ్లాదాన్ని కలిగించడం లేదు. మనుషులెందుకు ఏ కారణమూ లేకుండానే మారిపోతారు?! నిన్న నవ్వినవాళ్లు ఇవాళ నవ్వరు! నిన్న హ్యాండ్‌షేక్ ఇచ్చినవాళ్లే.. ఇవాళ ఎక్కడ హ్యాండ్ అడుగుతామోనని షేక్ అయిపోతారు! నిన్న మనకోసం ఎదురు చూసినవాళ్లు, ఇవాళ మనమెక్కడ ఎదురవుతామోనని తప్పుకుని వెళ్లిపోతారు! మోదీజీ కూడా అంతేనా? పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా అంతేనా? ప్రియాంకా చోప్రా కూడా అంతేనా? ఎందుకొస్తారో.. ఇంత భయస్థులు.. రాజకీయాల్లోకి, వ్యాపారాల్లోకి, సినిమాల్లోకి! దావోస్‌లో దిగిన గ్రూప్ ఫొటోలో నేను, మిగతా బిజినెస్మెన్, మోదీజీ ఉన్నాం. దాన్నెంతో అపురూపంగా అల్బమ్‌లో దాచుకున్నాన్నేను. ఫొటోలో నేను, మోదీజీ పక్కపక్కన లేము. అయినా దాచుకున్నాను. ‘‘ఫొటోలోకి ఎలా వచ్చాడో మాకు తెలీదు. ఫొటోకోసం అక్కడక్కడే తచ్చాడుతూ లాస్ట్ మినిట్‌లో షాట్ తీసేటప్పుడు మెల్లిగా లోపలికి దూరి ఉంటాడు’’ అంటోందట ఫారిన్ మినిస్ట్రీ! మర్యాదేనా? ప్రియాంక నా బ్రాండ్ అంబాసిడర్. బయటికి వచ్చేయడం ఎలా అని ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్లని అడుగుతోంది! ‘నా డబ్బు నాకు ఇప్పించండి బాబూ’ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనిపించిన వాళ్లందర్నీ దేబిరిస్తోంది! డబ్బు లేకపోతే, పేరు లేకపోతే, పదవి లేకపోతే చచ్చిపోతారా వీళ్లంతా! నమ్మకం ఉండాలి కదా మనిషి మీద. అలికిడికి తల తిప్పి చూశాను. అమీ! నా భార్య. బయటికి వెళ్తోందీ... వస్తోంది. తనకు ఇవేం పట్టవు. నమ్మకం నామీద. గట్టెక్కేస్తాననీ, గట్టెక్కిస్తాననీ. -మాధవ్ శింగరాజు -
ఇవ్వవలసినంత
మనిషికి ఏం కావాలి? చేతి నిండా డబ్బా? గుప్పెట నిండా అధికారమా? గుండె నిండా ప్రేమా? అన్నీ కావలసిందే. అన్నిటికన్నా గౌరవం.. అది మెయిన్‌గా కావాలనుకుంటాడు మనిషి. గౌరవం దక్కకపోతే, ఆశించినంతగా అందకపోతే విలవిలలాడిపోతాడు. ఎందుకు అంత బాధ కలుగుతుంది? మన మీద మనకు గౌరవం లేక! ఓ సాధువు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ‘‘నా పేరు గౌరయ్య. నేను గౌరవంగా బతుకుతున్నాను. కానీ నాకెవ్వరూ గౌరవం ఇవ్వడం లేదు’’ అని గోడు వెళ్లబోసుకున్నాడు. ‘‘ఇవ్వడం లేదా? అసలు ఇవ్వడం లేదా?’’ అడిగాడు సాధువు. ‘‘ఇవ్వవలసినంత ఇవ్వడం లేదని నాకు అనిపిస్తోంది’’ అని గౌరయ్య బాధపడ్డాడు. సాధువు అతడికి మెరుస్తూ ఉన్న ఒక ఎర్రటి రాయిని ఇచ్చాడు. ‘‘ఇది విలువైన రాయి. దీని విలువ ఎంతో తెలుసుకునిరా. అమ్మకానికి మాత్రం పెట్టకు’’ అని చెప్పి పంపించాడు. గౌరయ్య మొదట ఓ పండ్లవ్యాపారికి ఆ రాయిని చూపించాడు. ‘‘డజను అరటిపండ్లు ఇస్తాను. రాయిని ఇచ్చి వెళ్లు’ అన్నాడు వ్యాపారి. ‘‘ఇది అమ్మడానికి కాదు’’ అని చెప్పి, దగ్గర్లో సంత జరుగుతుంటే అక్కడికి వెళ్లి రాయిని చూపించాడు గౌరయ్య. ‘‘ఈ రాయికి ఏమొస్తాయి? పోనీ, కిలో ఉల్లిపాయలు తీసుకో’’ అన్నాడు సంత వ్యాపారి. అమ్మడానికి కాదని చెప్పి, అక్కడి నుంచి నగల దుకాణానికి వెళ్లాడు గౌరయ్య. ‘‘ఐదు లక్షలు ఇస్తాను.. ఇస్తావా?’’ అన్నాడు నగల వ్యాపారి! ‘‘అమ్మడానికి కాదు’’ అన్నాడు. ‘‘రెండు కోట్లు ఇస్తాను. ఆ రాయిని ఇచ్చెయి’’ అన్నాడు నగల వ్యాపారి ఈసారి!! గౌరయ్య ఆశ్చర్యపోయాడు. అయినా రాయిని అమ్మలేదు. చివరిగా రాళ్లూ రత్నాలు అమ్మే దుకాణానికి వెళ్లి, తన దగ్గరి రాయిని చూపించి ‘‘విలువెంతుంటుంది?’’ అని అడిగాడు. ఆ దుకాణందారు వెంటనే లేచి నిలబడ్డాడు. ఆ రాయికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. నేలపై శుభ్రమైన మెత్తటి గుడ్డను పరిచి, దాని మధ్యలో రాయిని ఉంచి, రాయికి ప్రణమిల్లాడు. ‘‘ఈ రాయి ఎంతో అమూల్యమైనది. నా జీవితాన్నంతా ధారపోసినా ఈ అమూల్యాన్ని కొనలేను’’ అని, గౌరయ్యకు కూడా ఓ నమస్కారం పెట్టి పంపాడు. సాధువు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పాడు గౌరయ్య. సాధువు నవ్వాడు. ‘‘మనకు లభించే గౌరవం, మన గురించి ఎవరికి ఎంత తెలుసో అంతవరకే ఉంటుంది’’ అని గౌరయ్యకు చెప్పాడు. మనలో కూడా ఒక గౌరయ్య ఉంటాడు! తనను అంతా ఒకేలా గౌరవించాలని ఆ గౌరయ్య ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. ఎక్కడైనా కొద్దిగా గౌరవం తగ్గితే, తనకు ఇవ్వవలసినంత గౌరవం ఇవ్వడం లేదని గుదులుకుంటూ ఉంటాడు. గౌర వాల్లోని హెచ్చుతగ్గులను బట్టి వ్యక్తి గౌరవం పెరగడం, తగ్గడం ఉండదు. ఎవరు ఎన్ని రకాలుగా విలువ కట్టినా.. అన్నిటినీ సమాన విలువగా స్వీకరించే అమూల్యమైన సెల్ఫ్ రెస్పెక్ట్ (సాధువు ఇచ్చిన రాయిలా) మనకు ఉండాలి. అది లేనప్పుడే.. గౌరయ్యలా బయటి నుంచి వచ్చే గౌరవాలను తక్కెట్లో వేసుకుని చూసుకుంటూ ఉంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్.. మన లోపలి గురువు. ఆ గురువుకు మనం ఇవ్వవలసినంత ఇవ్వాలి. అప్పుడు మనకు కోరుకున్నంత రాలేదన్న చింత ఉండదు. హ్యాపీ న్యూ ఇయర్. - మాధవ్ శింగరాజు -
సెరెనా విలియమ్స్ (టెన్నిస్) రాయని డైరీ
ఇదే ఫస్ట్ టైమ్ ఆక్లండ్ రావడం! ఇక్కడంతా బాగుంది. న్యూజిలాండ్ జనాభా మొత్తం జనవరి ఫస్ట్ కోసం ఈ హార్బర్ పట్టణానికి వచ్చేసినట్లున్నారు. ఒకరికొకరు తగులుకుంటూ తిరుగుతున్నారు! నేనైతే అలెక్స్‌ని ఆనుకుని తిరుగుతున్నాను. ‘‘బాగుంది కదా’’ అన్నాడు అలెక్స్ నా కళ్లలోకి చూస్తూ! నవ్వాను. ఏడాదిగా అతడు నా కళ్లల్లోకి చూస్తూనే ఉన్నాడు. ‘‘ఇంకా ఏం చూస్తున్నావ్’’ అన్నాను. ‘‘నీలా స్కర్ట్ వేసుకుని, చేత్తో రాకెట్ పట్టుకుని గ్రాండ్‌స్లామ్ ఆడటానికి పుట్టబోయే నా కూతుర్ని చూస్తున్నాను’’ అన్నాడు. లాగి ఒక్కటిచ్చాను. ‘‘గేమ్ ఉంది. డిస్ట్రర్బ్ చెయ్యకు. నువ్వూ, నీ కలల కూతురు కలసి నాకు బదులుగా ప్రాక్టీస్ చేసిపెడతారా ఏమన్నానా?’’ అని నవ్వాను. ‘‘పెడతాం. ముందైతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి కదా’’ అని నవ్వాడు. అలెక్స్ నవ్వు బాగుంటుంది. లాస్ట్ ఇయర్ రోమ్‌లో అనుకోకుండా ఒకరికొకరం పరిచయం అయ్యాం. న్యూయార్క్ వచ్చేశాక, సడెన్‌గా ఓ రోజు ఇంటి ముందు దిగబడ్డాడు. ‘‘రోమ్‌కి రెండు టిక్కెట్లున్నాయి. నీకొకటి నాకొకటి’’ అన్నాడు! ‘‘ఏంటి విషయం అన్నాను’’. ‘‘రోమ్‌లో చెప్తా’’ అన్నాడు. రోమ్‌లో అతడేం చెప్పలేదు! ‘‘ఏదో చెప్తానన్నావ్’’ అన్నాను. ‘‘రోమ్.. ప్రేమకు హోమ్ కదా’’ అని కవిత్వం చెప్పాడు. ‘‘ఈ మాట చెప్పడానికేనా ఇంత దూరం లాక్కొచ్చావ్’’ అని అడిగాను. సడెన్‌గా మోకాలి మీద వంగి, ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా సెరీనా’’ అని అడిగాడు! తత్తరపడ్డాను. అండ్.. ఐ సెడ్.. ‘ఎస్’. హార్బర్ రెస్టారెంట్లో క్యాండిల్ లైట్ డిన్నరుకి కూర్చున్నాం. ‘‘న్యూ ప్లేసెస్ బాగుంటాయి కదా అలెక్స్’’ అన్నాను. మళ్లీ నా కళ్లల్లోకి చూడ్డం మొదలు పెట్టాడు! స్టుపిడ్. ‘‘అలెక్స్.. వింటున్నావా? అసలు న్యూ ఇయర్ ఫీల్.. న్యూ ప్లేసెస్‌లోనే వస్తుంది కదా’’ అన్నాను. ‘‘బట్.. సెరెనా.. నువ్వెక్కడుంటే నాకదే న్యూ ప్లేస్. అక్కడే నాకు న్యూ ఇయర్’’ అన్నాడు. ‘‘కాస్త ఎక్కువైనట్లుంది అలెక్స్’’ అన్నాను కోపంగా. ‘‘డిన్నర్ గురించే కదా నువ్వంటున్నది’’ అని నవ్వాడు. నేను నవ్వలేదు. నవ్వితే ఎక్కువ చేస్తాడు. డిన్నర్ తర్వాత ఎవరి రూమ్‌కి వాళ్లం వెళ్లిపోయాం. విత్ మై కైండ్ పర్మిషన్ కూడా అలెక్స్ చొరవ తీసుకోడు. అది నాకతడిలో నచ్చుతుంది. నెలాఖర్లో ఆస్ట్రేలియా ఓపెన్. నా సెవెన్త్ వన్. దాన్ని కొట్టి అలెక్స్‌కి గిఫ్టుగా ఇవ్వాలి. ఊహు. అలెక్స్‌కి కాదు. ఆటల్లోకి వస్తున్న అమ్మాయిలందరికీ ఇవ్వాలి. వాళ్లందరి కల నిజం కావాలి. కల నిజం అవడం అంటే వరల్డ్స్ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవడం కాదు. వరల్డ్స్ బెస్ట్ ప్లేయర్ అవడం. లెబ్రాన్ జేమ్స్‌ని బెస్ట్ మేల్ ప్లేయర్ అంటున్నారా? టైగర్‌నీ, ఫెదరర్నీ బెస్ట్ మేల్ ప్లేయర్స్ అంటున్నారా? మరెందుకు.. నేను గానీ, ఇంకో ఉమెన్ అథ్లెట్ గానీ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవ్వాలి?! -మాధవ్ శింగరాజు -
ఆ మినిస్టర్ నిన్నేమైనా అన్నాడా?
అమృత ఇవాళ కూడా అలసిపోయి ఇంటికి వచ్చింది. రాజ్యసభ టీవీలో తను న్యూస్ యాంకర్. ‘‘వర్షాకాల సమావేశాలు అయిపోయాయి కదా, ఇంకా దేనికి అమృత.. ఈ అలసట’’ అని తన ముంగురుల్ని సవరిస్తూ అడిగాను. నవ్వి ఊరుకుంది. నవ్వినప్పుడు తను బాగుంటుంది. నవ్వి ఊరుకోవడమే బాగుండదు. ‘‘ఏమైంది అమృత?’’... మళ్లీ అడిగాను. తను మాట్లాడకపోతే నాకేమీ తోచదు. తోచనప్పుడు బయటికెళ్లి ఏదో ఒక ప్రెస్‌మీట్ పెట్టేయాలనిపిస్తుంది. ప్రెస్‌మీట్ పెట్టి వచ్చాక కూడా అమృత ఏమీ మాట్లాడకపోతే రాజ్యసభ చానల్ ఆన్ చేయాలని పిస్తుంది. అందులో అమృత చదివొచ్చిన వార్తల్నే.. అవి మళ్లీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూస్తుంటాను. పక్కన అమృతను పెట్టుకుని, టీవీలో అమృతను చూస్తుండడం నాకు బాగుంటుంది. స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుంది అమృత. తన వైపే చూస్తూ కూర్చున్నాను. అందంగా ఉంది. నెలాఖర్లో మా ఫస్ట్ యానివర్సరీ. పెళ్లయి అప్పుడే ఏడాది అవుతోందా! ‘‘విజయ్.. నేను ఉద్యోగం మానేస్తాను’’ అంది అమత సడెన్‌గా! నా కన్నా పాతికేళ్ల చిన్న పిల్ల నన్ను విజయ్ అనడం.. రియల్లీ ఐ లైక్ ఇట్. తన వయసులోకి నా వయసుని అలా ఏమాత్రం గౌరవం లేకుండా ఈడ్చుకెళ్లడాన్ని నేను ఇష్టపడతాను. ‘‘వాట్ హ్యాపెన్డ్ అమృత..’’ అన్నాను. ‘‘ఒకే ఫీల్డులో ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవచ్చు కానీ, పెళ్లి చేసుకున్నాక ఒకే ఫీల్డులో ఉండకూడదు విజయ్..’’ అంది అమత. ‘‘ఏం జరిగింది అమతా’’ అని అడిగాను. ‘‘ఏం లేదు’’ అంది. ఏం లేకుండా ఉంటుందా? తను రాజ్యసభ యాంకర్, నేను రాజ్యసభ మెంబర్. తను నా భార్య, నేను తన భర్త. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అనేస్తుంది లోకం. ‘‘ఆ... ఐ అండ్ బి మినిస్టర్ నిన్నేమైనా అన్నాడా?’’ అన్నాను. ‘‘ఛ ఛ.. అలాంటిదేమీ లేదు’’ అంది అమృత. ‘‘పోనీ, నన్నేమైనా అన్నాడా?’’ అన్నాను. ‘‘కాంగ్రెస్, బీజేపీ.. ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాయిగా’’ అంది అమృత. ‘‘మరి.. నిన్నూ అనక, నన్నూ అనక..?’’ అన్నాను. ‘‘ఇద్దర్నీ కలిపి అన్నారట విజయ్! మా డైరెక్టర్ చెప్పారు.. ‘తప్పుల్లేకుండా ఎలా మాట్లాడాలో ఇంటికెళ్లాక వాళ్లాయనకు నేర్పించమని ఆ పిల్లకు చెప్పు’ అన్నారట ఐ అండ్ బి మినిస్టర్’’ అంది అమత. అర్థమైంది. ‘పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్’ అనడానికి బదులు పొరపాటున నేను ‘ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్’ అన్నందుకు వెంకయ్యనాయుడు సెటైర్ వేసినట్లున్నారు! పెద్ద పార్టీ అన్నాక ఏవో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ చిన్న చిన్న పొరపాట్లను పట్టుకుంటే.. పెద్ద పార్టీ అయిపోవచ్చని బీజేపీ భ్రమపడుతున్నట్లుంది. వెదికే పనిలో ఉన్నవారు ఎప్పటికీ ఎదగలేరని రేపు ఉదయాన్నే నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పాలి. -మాధవ్ శింగరాజు దిగ్విజయ్‌సింగ్ (కాంగ్రెస్)రాయని డైరీ -
రజనీకాంత్, సూపర్‌స్టార్ రాయని డైరీ
ధ్యానంలో ఉన్నాను. దేహం ఒక్కటే కుదురుగా ఉంది! మనసు లగ్నం కావడం లేదు. ఇవాళెందుకో ఒక్క నా దేహాన్ని తప్ప, తమిళనాడులోని ప్రముఖ దేహాలన్నిటినీ పట్టుకు తిరుగుతోంది నా ఆత్మ. ఈ ఉదయమైతే.. నా దేహ ప్రవేశానికి ఎవరెవరివో ఆత్మలు వచ్చి వెళుతున్నాయి. మొదట కరుణానిధి వచ్చారు! ‘రజనీ.. నువ్వొక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు కదా..’ అనుకుంటూ నేరుగా నా ధ్యాన మందిరంలోకి వచ్చేశారు. కాళ్లకు చెప్పుల్తోనే వచ్చేశారు. వీల్ చెయిర్లో ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా ఎలాగైనా వెళ్లిపోవచ్చని ఆయన అనుకుని ఉండొచ్చు. ‘ఓ.. కలైజ్ఞర్ కరుణానిధి.. రండి కూర్చోండి’ అన్నాను.. ఆయన కూర్చొనే ఉన్నారన్న సంగతి మర్చిపోయి! ‘పోలింగ్ డేట్ దగ్గర పడింది రజనీ. నువ్వొక్క మాట చెప్పు ఈ రాష్ట్రానికి.. మేము వందసార్లు ప్రచారం చేసుకుంటాం’ అన్నారు. ‘పాలిటిక్స్‌కీ నాకూ పడదని వందసార్లు చెప్పాను కలైజ్ఞర్. మీరెవరూ ఒక్కసారి కూడా వినినట్లు లేదు’ అన్నాను. ఈ మాట కూడా ఆయన వినలేదు. ‘డీఎంకే పవర్లోకి రావడం ముఖ్యం కాదు రజనీ.. అన్నాడీఎంకేని రాకుండా చెయ్యడం అవసరం’ అంటున్నారు. అంటూనే సడెన్‌గా వీల్ చెయిర్ వెనక్కి తిప్పించారు కరుణ. ఏం జరిగిందా అని చూశాను. దూరంగా జయలలిత వస్తూ కనిపించారు. ‘రజనీ.. ఏంటిది! అంతా మీకు తెలిసే జరుగుతోందా?’ అన్నారు మేడమ్.. వచ్చీరాగానే. ‘కబాలీ ట్రైలర్‌ని కరుణానిధి నాకు యాంటీగా డబ్ చేసుకుంటే ఒక్కమాటైనా మాట్లాడకుండా మీ ధ్యానంలో మీరు ఉండిపోవడం నాకు నచ్చలేదు’ అంటున్నారు మేడమ్. ‘నాకు తెలీదు’ అన్నాను. ‘నాకు తెలుసు రజనీ’ అన్నారు మేడమ్! ‘మీరేమీ మారలేదు రజనీ. అవే సినిమాలు. అవే డైలాగులు. నైంటీ సిక్స్‌లో ఎలా ఉన్నారో.. టూ థౌజండ్ సిక్స్టీన్లోనూ అలాగే ఉన్నారు. నాకు ఓటేస్తే తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడని అప్పుడు అన్నారు. కరుణానిధికి ఓటేయకపోతే తమిళనాడును ఏ దేవుడూ కాపాడలేడని ఇప్పుడు అనిపిస్తున్నారు. అంతే తేడా’ అంటూ కోపంగా వెళ్లిపోయారు. మేడమ్ ఇలా అదృశ్యం కాగానే, విజయకాంత్ అలా ప్రత్యక్షం అయ్యాడు. ‘రజనీ.. యాక్షన్ ఈజీ. పాలిటిక్సే కష్టం’ అనుకుంటూ వెళ్లిపోయాడు. నయం. ర్యాలీతో పాటు నా ధ్యాన మందిరంలోకి వచ్చేయలేదు. గట్టిగా కళ్లు మూసుకున్నాను. నా దేహాన్నీ, నా ఆత్మనీ కలిపి ఒకచోటికి తేగలుగుతున్నాను. క్రమంగా మానవ రూపాలన్నీ మాయమైపోతున్నాయి. అప్పుడు సాక్షాత్కరించాడు జి.బాలు! నా ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా ఈడు వాడు. నా సోదర సమానుడు. ‘రజనీ సార్.. మీరు ఏ పార్టీలో ఉన్నారని కాదు... మేం ఏ పార్టీలో ఉన్నామని కాదు. మీరు మా లీడర్. మీరు మా గాడ్‌ఫాదర్. మీరే ఎప్పటికీ మా సూపర్‌స్టార్’ అంటున్నాడు. అభిమానం రాబిన్‌హుడ్‌ని చేస్తుంది. రాఘవేంద్రస్వామినీ చేస్తుంది. పాలిటిక్స్‌లో ఇంత ఆరాధన ఉంటుందా? - మాధవ్ శింగరాజు