‘‘నువ్వొక్కర్నే ప్రేమించవు.’’ ‘‘సో?’’ ‘‘నిన్నొక్కరూ ప్రేమించరు.’’ ∙∙ దుఃఖపడుతున్నాడు జోషిత్. హిమ ఎందుకలా అంది! ‘నిన్నొక్కరూ ప్రేమించరు’ అన్నందుక్కాదు దుఃఖం. ‘నువ్వొక్కర్నే ప్రేమించవు’ అన్నందుక్కూడా కాదు. అసలు హిమ ఏమన్నా పట్టించుకోడు జోషిత్. కానీ ఇప్పుడు పట్టించుకున్నాడు. ‘నాతో పాటు అందర్నీ ప్రేమిస్తుంటావ్. ఇక నేనేమిటి నీకు ప్రత్యేకంగా..’ అంటోంది హిమ. హిమ తనకెంత ప్రత్యేకమో హిమకు తెలియదా అని దుఃఖిస్తున్నాడతను. అందర్నీ ప్రేమించేవాళ్లను ఎవరూ ప్రేమించరు కాబట్టి.. ఆ ప్రేమించని వాళ్లలో నేనూ ఉన్నాను అని చెప్తోంది హిమ. అందుకూ అతడు దుఃఖిస్తున్నాడు. ఈ బంధమిక తెగిపోయినట్లేనా? తెగిపోయినట్లేం కాదు. ప్రపంచంతో బంధం తెంపుకుంటేనే హిమతో ప్రేమ మిగిలి ఉంటుంది. అదే అతడికి అర్థమైంది. ఫోన్ చేశాడు జోషిత్. ‘‘ఏంటీ?’’ అంది హిమ. ఆ మాటలో ఎప్పుడూ ఉండే ప్రేమ లేదు. ఎప్పుడూ లేని ద్వేషం ఉంది. ‘ఏంటీ’ అన్నట్లు లేదు ఆ మాట. ‘హేట్యూ’ అన్నట్లుంది. ఒక్కక్షణం ఫోన్ పెట్టేద్దాం అనుకున్నాడు. హిమ హర్ట్ అవుతుందేమోనని ఆగిపోయాడు.
‘‘నిన్ను ప్రేమించినట్లే అందర్నీ ప్రేమిస్తూ కూర్చుంటానని ఎందుకనుకుంటావ్ హిమా’’ అన్నాడు. సర్రున లేచింది హిమ. ఫోన్‌లోనే అతడి గూబ పగిలిపోయింది. ‘‘ఏంటి నువ్వనేది జోషీ! నన్ను ప్రేమిస్తూ కూర్చున్నావా! నేనడిగానా? నేనడిగానా.. నన్ను ప్రేమిస్తూ కూర్చోమని?!’’ కోపంలో హిమకు మాటలు తిప్పడం అలవాటు. ‘‘ప్రేమించడం, ప్రేమిస్తూ కూర్చోవడం రెండు వేర్వేరు విషయాలు హిమా. నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ప్రేమిస్తూ కూర్చోవడం అనే మాట అన్నాను’’ అన్నాడు జోషిత్. ‘‘అర్థం కాలేదు’’ అంది హిమ. బాగా అర్థమైనవాటిని అసలేమీ అర్థం కాలేదన్నట్లు మాట్లాడ్డం హిమకు ఉన్న మరో అలవాటు. ‘‘కనిపించిన అమ్మాయినల్లా నేను అదే పనిగా ప్రేమిస్తూ కూర్చున్నానని నువ్వనుకుంటున్నా.. నేను కోరుకునేది మాత్రం నీ ఒక్క ప్రేమనే హిమా’’ అన్నాడు. అటువైపు నిశ్శబ్దం! ‘‘హలో హిమా.. వింటున్నావా?’’ ‘‘వినడానికేం లేదు జోషీ’’. ‘‘మరి నేను మాట్లాడుతున్నదంతా ఏంటి హిమా!’’ ‘‘అందరితోనూ నువ్విలాగే మాట్లాడతావ్. అందుకే నాతో ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నదేమీ లేదు. అందుకే నేను వినడానికేమీ లేదు.’’ ‘అయిపోయింది’ అనుకున్నాడు జోషిత్.
‘అయిపోయింది’ అనుకున్నాక ‘అయిపోకపోతే బాగుండు’ అని చాలాసార్లు అనుకున్నాడు జోషిత్. హిమకు ఫోన్ చేసే ధైర్యం చేయలేకపోయాడు. ఒక రోజు గడిచింది. రెండు రోజులు గడిచాయి. మూడోరోజూ గడవబోతుండగా హిమ నుంచి ఫోన్ వచ్చింది! వెంటనే లిఫ్ట్ చేసి.. ‘‘హాయ్.. హిమా’’ అన్నాడు. ‘‘సిగ్గు లేదు నీకు’’ అంది. ‘‘ఏమైంది హిమా!’’ అన్నాడు. ‘‘సిగ్గు లేకపోతే పోయింది, నా మీద ప్రేమ కూడా లేకపోయిందా జోషీ..’’ పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టింది! షాక్ తిన్నాడు జోషిత్. ‘‘హిమా.. ప్లీజ్ ఆపు. నువ్వనుకున్నట్లుగా, ఇప్పుడూ నువ్వు అనుకుంటున్నట్లుగా.. నీ మీద నా ప్రేమ ఎక్కడికీ పోలేదు’’ అన్నాడు. ‘‘నిజమే. ఎక్కడికీ పోలేదు. నా దగ్గరికీ రాలేదు. పావనితో మాట్లాడుతున్నావ్. భావనతో మాట్లాడుతున్నావ్. దీప్తితో మాట్లాడుతున్నావ్. ఇంకా ఎవరెవరితోనో మాట్లాడుతున్నావ్. వాళ్లందరి దగ్గరికి తప్ప ఇంకెక్కడికీ పోవడం లేదు పాపం.. నీ ప్రేమ!’’ ‘‘నాకర్థం కావట్లేదు హిమా! వాళ్లతో నేనెందుకు మాట్లాడకుండా ఉండాలి! మాట్లాడితే అది ప్రేమే ఎందుక్కావాలి? నీతో మాట్లాడకపోతే అది ప్రేమ లేకపోవడం ఎందుకవ్వాలి?.. ’’ అడిగాడు జోషిత్.
హిమ వైపు నుంచి నిశ్శబ్దం.
‘‘హిమా.. విను! ఎవరికో దగ్గరవుతున్నానని నన్ను దూరంగా ఉంచావ్. ఇప్పుడూ అదే జరుగుతోంది. నీ దగ్గరికి వచ్చే దారి లేక, కనిపించిన ప్రతి దారిలోనూ నిన్నే వెతుక్కుంటున్నాను. నువ్వన్నావ్ కదా.. పావని, భావన, దీప్తి.. అని. వాళ్లలో కూడా నిన్నే చూసుకుంటున్నా..’’ అన్నాడు జోషిత్. ఆ మాటకు పెద్దగా అరిచేసింది హిమ.
ఉలిక్కిపడ్డాడు జోషిత్. అది హిమ అరిచినట్లుగా లేదు. ఇంకెవరో.. మనుషులు కానివారెవరో అరిచినట్లుగా ఉంది! ఆమె ఏమని అరిచిందో కూడా అతడు రీకాల్ చేసుకోలేకపోతున్నాడు. అంతగా షాక్‌లోకి వెళ్లిపోయాడు. తేరుకుని చూసే సరికి హిమ కాల్ కట్ అయి ఉంది. టైమ్ చూసుకున్నాడు. రాత్రి ఒంటిగంట దాటుతోంది. ఆ టైమ్‌లో హిమ కాల్ చెయ్యడం అతడికి కొత్తేం కాదు. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ కాల్ వచ్చింది! వెంటనే లిఫ్ట్ చేసి చెప్పాడు.. ‘‘.. అవును హిమా.. అందరిలో నిన్నే చూసుకుంటున్నా. నన్ను నమ్ము’’ అన్నాడు. ‘‘అదే అంటున్నా జోషీ.. ఇక నుంచీ అందరిలో నన్ను చూసుకునే శ్రమ నీకుండదు’’ అంది హిమ. అప్పుడు గుర్తొచ్చింది.. హిమ అంతక్రితం పెద్దగా అరుస్తూ అన్నది ఈ మాటేనని! ‘‘ఏమంటున్నావ్ హిమా..’’ అన్నాడు.
‘‘అందరిలో నువ్వు నన్ను చూసుకోనక్కర్లేదు జోషీ. అందర్లో నేనే నీకు కనిపిస్తాను’’ అంది హిమ. ఆ మాటా అర్థం కాలేదు జోషిత్‌కి. తర్వాత మరోసారి ఫోన్ మోగింది. ‘‘నువ్వు చూసుకోనక్కర్లేదు. నేనే నీకు కనిపిస్తాను..’’ చెప్పిన మాటే మళ్లీ చెప్పి ఫోన్ కట్ చేసింది హిమ. ఉదయం లేవగానే ఫోన్ లాగ్స్‌లో హిమ పేరు చూసుకోవడం జోషిత్‌కి ఇష్టం. లాగ్స్‌లోకి వెళ్లాడు. ఆశ్చర్యం! హిమ పేరు కనిపించలేదు. హిమ మూడుసార్లు ఫోన్ చేసినట్లు అతడికి గుర్తు. హిమ పేరుకు బదులుగా ఇన్‌కమింగ్ కాల్స్‌లో అదే టైమ్‌కి పావని, భావన, దీప్తిల పేర్లు ఉన్నాయి!! ‘‘అందరిలో నువ్వు నన్ను చూసుకోనక్కర్లేదు జోషీ. అందర్లో నేనే నీకు కనిపిస్తాను’’ అని హిమ అన్న మాటలు గుర్తొచ్చాయి! హిమకు.. హిమకు ఏమైంది?! మంచం మీద నుంచి దిగ్గున లేచి హిమకు ఫోన్ చేశాడు జోషిత్. రింగ్ అవుతోంది. హిమే లిఫ్ట్ చేస్తుందా? ‘దేవుడా.. హిమే లిఫ్ట్ చెయ్యాలి’ అనుకున్నాడు జోషిత్.
- మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment