రాయని డైరీ.. విక్రమాదిత్య సింగ్‌ (కంగన ప్రత్యర్థి) | Rayani Dairy By Madhav Singaraju On Congress Leader Vikramaditya Singh | Sakshi
Sakshi News home page

రాయని డైరీ.. విక్రమాదిత్య సింగ్‌ (కంగన ప్రత్యర్థి)

Published Wed, May 29 2024 1:26 PM | Last Updated on Wed, May 29 2024 1:25 PM

Rayani Dairy By Madhav Singaraju On Congress Leader Vikramaditya Singh

ఓటమే కాదు, కొన్నిసార్లు గెలుపు కూడా గుణపాఠాలు నేర్పుతుంది. జూన్‌ 1న జరిగే ‘మండీ’ లోక్‌ సభా స్థానం ఎన్నికల్లో ఒకవేళ నేను గెలిస్తే... ‘గెలుపు కోసం ప్రత్యర్థి గురించి తప్పుగా మాట్లాడటం ఓటమి కన్నా తక్కువేం కాదు’... అన్నదే బహుశా నేను నేర్చుకునే మొదటి గుణపాఠం అవుతుంది!

రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు. అవి రాజకీయంగానే ఉండాలి. వ్యక్తిగత స్థాయికి దిగకూడదు. దిగజార కూడదు. కంగనకు, నాకు మధ్య ఏం లేదు. ఆమె బీజేపీ, నేను కాంగ్రెస్‌. సినిమాల్లో ఆమె ‘క్వీన్‌’, సిమ్లా వాళ్లకు నేను ‘కింగ్‌. ఇద్దరం ఒకింట్లో పుట్టుంటే ఆమె అక్క, నేను తమ్ముడు. కానీ ప్రచారంలో ఆమెను ఎన్నిమాటలన్నాను! అన్నానా? అనవలసి వచ్చిందా? అనవలసి వచ్చినా అది అన్నట్లే!

కంగనకు, నాకు మధ్య ఏం లేకుండానూ లేదు. మంచి నటిగా ఆమెను నేను అభిమానిస్తాను. కనుక నేను ఆమె అభిమానిని అన్నట్లే! మా మధ్య సినీతారకు–సినీ అభిమానికి మధ్య ఉండే అనుబంధం ఉన్నట్లే!  
      ‘క్వీన్‌’ సినిమాలో చూడాలి కంగనను. ‘క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమా కాదు, ‘క్వీన్‌’ సినిమా. అమాయకురాలైన అమ్మాయి. ఆత్మాభిమానం కల అమ్మాయి. ప్రతికూల పరిస్థితుల్ని చేతుల్లోకి తీసుకుని రాణిలా ఏలిన అమ్మాయి. మధురం, సున్నితం, ఆహ్లాదకరం... ‘క్వీన్‌’ లో కంగన నటన. అందులో అనే ఏముందీ! ప్రతి చిత్రంలోనూ!

రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘గ్యాంగ్‌స్టర్‌’ తో మొదలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు కంగన. ఇక్కడ ఆమె తొలి చిత్రం ‘మండీ’. దర్శకత్వం బీజేపీ. అందులో విలన్‌... 
ఇంకెవరు? నేనే. 
      బీజేపీ నుంచి కంగన, కాంగ్రెస్‌ నుండి నేను మండీ నుంచి పోటీ పడుతున్నాం. మాటలూ పడుతున్నాం!
ఎన్నెన్ని మాటలు! ఎంతెంత మాటలు! అర్థం లేనివి, అనవసరమైనవీ, అసహ్యకరమైనవి, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి! ఆమె బీఫ్‌ తిన్నారని అన్నాను. ఆమె దర్శించిన దేవాలయాలను శుద్ధి చేయాలని అన్నాను. తిరిగి ఆమె నన్ను ‘మహా చోర్‌’ అన్నారు. ‘ఛోటా పప్పు’ అన్నారు. కానీ స్త్రీ... పురుషుడిని అనడం వేరు. పురుషుడు స్త్రీని అనడం వేరు.

అమ్మ స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌. ‘మండీ’ సిటింగ్‌ ఎంపీ. అమ్మ కాంగ్రెస్‌లో ఉండి కూడా... రామాలయం నిర్మించినందుకు మోదీజీని ధైర్యంగా ప్రశంసించగలిగారు! అయోధ్యలో ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయించిన తర్వాత కూడా మోదీని అమ్మ బహిరంగంగా అభినందించారు.

అందుకు ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ... ‘‘ప్రతిభాసింగ్‌జీ! మీరు పార్టీ నియమాలను ఉల్లంఘించారు...’’ అని అమ్మను బహిష్కరించి, ‘‘ప్రతిభాసింగ్‌ జీ! మీరు మా పార్టీలోకి వచ్చేయండి...’’ అని  బీజేపీ అమ్మను ఆహ్వానించి, అమ్మ బీజేపీలో చేరి, ఇప్పుడు ఇదే ‘మండీ’ నుంచి నాకు పోటీగా నిలబడి ఉంటే అమ్మను కూడా కంగనను అన్నట్లే అన్నేసి మాటలు అనవలసి వచ్చేదా? మాటలు అనవలసి వస్తే అసలు అమ్మకు పోటీగా నిలబడేవాడినా?

‘‘కంగనకు బుద్ధి ప్రసాదించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నాను’’ అని కూడా నేను కంగన గురించి అన్నాను. అందుకు కంగన – ‘‘వీరభద్రసింగ్‌జీ ఈరోజు జీవించి ఉంటే కనుక నా గురించి అగౌరవంగా మాట్లాడినందుకు తన కొడుకు విక్రమాదిత్యను మందలించి, ‘వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పు’ అని ఉండేవారు...’’ అన్నారు.

ఆ మాట నిజమే కావచ్చు. కానీ, కొన్నిసార్లు క్షమాపణ కోరటం కూడా అభిమానాన్ని ప్రదర్శించుకోవటమే అవుతుంది. అభిమానం అన్నది గుండెల్లో ఉంటేనే మనల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. 
అయినా అందరికీ అమ్మకు ఉన్నంత ధైర్యం ఉంటుందా?! రాజకీయ ప్రత్యర్థిని అభినందించేంత ధైర్యం! – మాధవ్‌ శింగరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement