ఫోన్ బ్లింక్ అయింది. వాతావరణ సూచన. ఉష్ణస్థితి ఇరవై మూడు. తేమ డెబ్బై తొమ్మిది. తుంపర ఎనభై. గాలులు గంటకు పది కిలో మీటర్ల వేగం. ఆదివారం నాటి మనాలీ. ఉరుములు మెరుపులు కూడా ఉంటాయట! నాకన్నా ఉరుము, మెరుపు ఎవరో మనాలీలో!
‘‘అమ్మా నేను ముంబై వెళుతున్నా...’’ అన్నాను.
‘‘ఉండొచ్చు కదమ్మా...’’ అంది అమ్మ.
అమ్మకు ముంబైలో జరుగుతున్నవేమీ తెలీదు. తెలిస్తే... ‘ఉండిపోవచ్చు కదమ్మా’ అంటూ గట్టిగా చెయ్యి పట్టుకుంటుంది.
నా గది అద్దాల్లోంచి మనాలీ కనిపిస్తోంది. ముంబై నుంచి మనాలీకి వచ్చేవారు ఎక్కువ. మనాలీని చూశాక తిరిగి మనస్ఫూర్తిగా ముంబై వెళ్లగలిగేవారు తక్కువ.
మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ నన్ను ముంబై రావద్దంటున్నాడు! శివసేన ఎంపీ ‘ఎలా వస్తుందో చూస్తాను’ అంటున్నాడు! మూవీ మాఫియా కన్నా, ముంబై పోలీసులు ఎక్కువ డేంజర్ అన్నందుకు హోమ్ మినిస్టర్‌కి కోపం వచ్చింది. ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా ఉంది అన్నందుకు శివసేన ఎంపీకి కోపం వచ్చింది.
నిజం మాట్లాడితే కోపం రాకూడని వాళ్లకు కూడా కోపం వస్తుంది. జర్నలిస్టులు కోపానికొచ్చినా నాకు ఇదే అనిపిస్తుంది! వాళ్లేమీ జడ్జీలు కాదు. ఆర్డర్ ఆర్డర్ అంటారు. పోలీసులు కాదు. లాఠీ పైకెత్తుతారు. లాయర్‌లు కాదు. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వాళ్లెవరూ కానివాళ్లు వాళ్లలా అవతారం ఎత్తుతారు. భగవంతుడి అవతారం ఒక్కటే తక్కువ. అతడెవరో అంటాడు... ‘ఈ నగరం ఆమెకు అన్నీ ఇచ్చింది’ అని! అతడొచ్చి చూశాడు ఇవ్వడం, నేను తీసుకోవడం.
సుశాంత్ సింగ్‌కి ఈ నగరం ఏమి ఇవ్వలేదో తెలుసుకుని అది రాయడానికి ధైర్యం ఉండదు మళ్లీ ఈ జర్నలిస్టులకు. చెత్త వాగుడు. ఏమీ తీసుకోకుండానే ముంబై నగరం ఎవరికైనా ఏమైనా ఇచ్చిందా! సుశాంత్ ప్రాణమే తీసుకుంది. దాని గురించి ఏం మాట్లాడతారు?
అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది.
బాగుంటుంది... ఇలా ఎవరైనా మనల్ని అడక్కుండానే, మనం అడక్కుండానే ఏదైనా తినడానికో, తాగడానికో తెచ్చిపెట్టడం. ఇదీ ఇవ్వడం అంటే. ముంబైలా... ‘నీక్కావలసింది ఇస్తాను కానీ, ముందు నాక్కావలసింది ఇవ్వాలి’ అని తీసుకోవడం... ఇవ్వడం కాదు.
ముంబై ఒక్కటే. కానీ ఎవరి ముంబై వాళ్లకు ఉంటుంది. ముగ్గురు ఖాన్‌లది ఒక ముంబై. కరణ్ జోహర్‌ది ఒక ముంబై. ‘రాకేశ్ రోషన్ అండ్ సన్’ది ఒక ముంబై. ‘జావెద్ అఖ్తర్ అండ్ పార్టీ’ది ఒక ముంబై. భట్‌లది ఒక ముంబై. పోలీసులది ఒక ముంబై. పొలిటికల్ లీడర్స్‌ది ఒక ముంబై. అండర్ వరల్డ్ మీడియాది ఒక ముంబై.
రేణుకా సహానే అంటోంది ముంబై అద్భుతమైన నగరం అని! నేను ఆ నగరాన్ని కృతజ్ఞతాభారంతో కుంగిపోయి చూడవలసింది పోయి, తలెత్తి, తలెగరేసి చూస్తున్నానట. ‘బాలీవుడ్ స్టార్‌వి కావాలన్న నీ స్వప్నాన్ని ముంబై నిజం చేసింది కదా. మర్చిపోయావా’ అని నవ్వుతూ అడుగుతోంది. అద్భుతమైన నగరమే. నగరంగా అద్భుతం. లోపల ఉన్న వాళ్ల వల్ల అది నరకం.
వీళ్లంతా ఎందుకని ఎప్పుడూ ఒక శక్తిమంతమైన ముఠా వైపు మాత్రమే నిలబడి శక్తిహీనులై మాట్లాడతారు. ఒంటరి పోరాటం చేస్తున్న వాళ్ల వైపు కదా ఉండాల్సింది. సుశాంత్ వైపు కదా. ముంబైకి బలైపోయిన ఒక యువ నటుడి వైపు కదా!
నగరాలెప్పుడూ అందంగానే ఉంటాయి. ముఖానికి రంగు రంగుల నవ్వుల్ని పూసుకుని తిరిగేవాళ్ల వల్లనే అవి అంద వికారంగా మారతాయి. నాలాంటి వాళ్లొకరు మనాలి నుంచి బక్కెట్ నీళ్లను మోసుకెళ్లి ఆ రంగుల ముఖాలపై కొడితే కానీ, ముంబై నగరం మళ్లీ మెరవదు. వెళ్తున్నా.
కంగనా రనౌత్ (బాలీవుడ్ స్టార్).. రాయని డైరీ
Published Sun, Sep 6 2020 12:38 AM | Last Updated on Sun, Sep 6 2020 12:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment