మాధవ్ శింగరాజు
ఉదయ్ సామంత్, భరత్ గొగావాలే, రవి పాఠక్, సంజయ్ శిర్సాత్, నేను.. కూర్చొని ఉన్నాం. మాతో రాబిన్ శర్మ కూడా ఉన్నారు. రాబిన్ శర్మ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. మిగతా నలుగురు... పార్టీలోని పొలిటికల్ స్ట్రాటజిస్టు లీడర్‌లు. ఉప ముఖ్యమంత్రి పదవిని నేను నిరాకరించాలా, లేక అంగీకరించాలా అనే పది రోజుల సుదీర్ఘ సంశయ స్థితి ముగియటానికి ముందు రోజు జరిగిన సమావేశంలో రాబిన్ శర్మ లేరు. నేను, ఆ నలుగురు లీడర్లు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు – ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక జరుగుతున్న ఈ ఆంతరంగిక సమావేశానికి రాబిన్ శర్మ కూడా వచ్చి జాయిన్ అయ్యారు.
‘‘ఏమైనా మీరు తొందరపడ్డారు శిందేజీ...’’ అన్నారు శర్మ – కొంత సంభాషణ తర్వాత!
నేను ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించటాన్నే ఆయన తొందరపాటు అంటున్నారని సమావేశంలో ఉన్న నలుగురికీ అర్థం అయింది. అసలు ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేలా నన్ను మోటివేట్ చేసింది ఆ
నలుగురే!
‘‘ముఖ్యమంత్రిగా తప్ప, ఉప ముఖ్యమంత్రిగా ఉండనని మీరు గట్టిగా చెప్పాల్సింది శిందేజీ. అప్పుడు ప్రధానిలో ఒక అస్థిమితం ఉండేది. ప్రధాని సహపాత్రధారి అమిత్ షాలో ఒక జాగ్రత్త ఉండేది. మొత్తంగా బీజేపీనే... శివసేన అంటే ఒక రెస్పెక్ట్ తో ఉండేది...’’ అన్నారు రాబిన్ శర్మ.
‘‘అలా అని మేము అనుకోవటం లేదు...’’ అన్నారు రవి పాఠక్, సంజయ్ శిర్సాత్.
‘‘అవును అనుకోవటం లేదు...’’ అన్నారు ఉదయ్ సామంత్, భరత్ గొగావాలే.
‘‘ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించి ఉంటే కూటమిలో శిందేజీకి వచ్చే రెస్పెక్ట్
గురించి నేను మాట్లాడుతున్నాను. ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరిస్తే కేబినెట్‌లో శిందేజీ వర్గానికి వచ్చే పోర్టుఫోలియోల గురించి మీరు మాట్లాడుతున్నారు...’’ అన్నారు రాబిన్ శర్మ.
‘‘అవకాశాన్ని కాలదన్నుకొని రెస్పెక్ట్‌ని రాబట్టుకోవటం ఏం పని శర్మాజీ?! వచ్చిన
అవకాశాన్నే నిచ్చెనగా వేసుకుని రెస్పెక్ట్‌ని కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి కానీ...’’ అన్నారు ఆ నలుగురూ ఒకే మాటగా!
‘‘ఇక నేను వెళతాను...’’ అంటూ లేచారు రాబిన్ శర్మ.
‘‘కూర్చోండి శర్మాజీ, ఎన్నికల్లో కూటమిని గెలిపించారు. మీ ప్రచార వ్యూహమే కదా కూటమిని నిలబెట్టింది...’’ అన్నాన్నేను.
‘‘అదే అంటున్నాను శిందేజీ. ప్రజలు శివసేన పై అభిమానంతో బీజేపీని గెలిపిస్తే, బీజేపీ ఏం చేయాలి?! శివసేన నాయకుడిని కదా ముఖ్యమంత్రిని చేయాలి?’’ అన్నారు రాబిన్ శర్మ.
‘‘శర్మాజీ మీకు తెలియట్లేదు. ఎన్నికల ప్రచార వ్యూహం వేరు, ఎన్నికయ్యాక అధికారం కోసం వేయవలసిన ఎత్తుగడలు వేరు...’’ అన్నారు రవి పాఠక్ నవ్వుతూ. ఆ నవ్వుకు దెబ్బతిన్నట్లు చూశారు రాబిన్ శర్మ.
‘‘ఎత్తుగడ అంటే ఫడ్నవిస్‌ది పాఠక్‌జీ. ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన వెనుక ఉన్న ఒక్కరూ అనలేదు. శిందేజీ వెనుక ఉన్నవాళ్లు మాత్రం శిందేజీ ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించకూడదని పట్టుపట్టారు...’’ అన్నారు రాబిన్ శర్మ.
ఆ మాట నిజమే అనిపిస్తోంది!
ఈ నలుగురు పట్టిపట్టి ఉండకపోతే నా రెస్పెక్ట్ నాకుండేది. ఎప్పుడేం జరుగుతుందోనని మహారాష్ట్ర రాజకీయం అంతా నా చుట్టూ తిరుగుతుండేది.
ఒకటి మాత్రం వాస్తవం.
ఎవరైనా అయినవాళ్లు కానీ, కానివాళ్లు కానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మనల్ని ఏదైనా చెయ్యమని పట్టు పట్టినప్పుడు మనం వాళ్లకు తలొగ్గితే, ఆ తప్పు.. ‘పట్టుపట్టిన’ వాళ్లది అవదు. ‘పట్టుబడిన’ వాళ్లదే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment