‘‘గురూ.. నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిసొస్తే బాగుంటుందా..!’’ అని భూపేష్ బఘేల్ ఉదయాన్నే ఫోన్ చేశాడు.
బఘేల్ నన్నెప్పుడూ ‘గురూ’ అన్నది లేదు. ఇప్పుడు అంటున్నాడు!
గురూ అనే అవసరం లేకున్నా ఎవరైనా ఇంకొకర్ని ‘గురూ’ అన్నారంటే ఆ ఇంకొకరితో తమని ఈక్వల్ చేసుకుంటున్నారని. లేదంటే, ఆ ఇంకొకరిని తమకు ఈక్వల్ చేస్తున్నారని.
‘‘నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను.
బఘేల్ ఒక్క క్షణం మాట్లాడలేదు.
‘‘అశోక్‌జీ.. నేను మిమ్మల్ని ‘గురూ’ అన్నందుకు మీరు చిన్నబుచ్చుకున్నట్లున్నారు. నేను కూడా మీలా ఒక రాష్ట్రానికి సీఎంని కనుక మీతో సమస్థాయినో, సమస్థానాన్నో ఆశించి మిమ్మల్ని ‘గురూ’ అనలేదు. ఇద్దరం కాంగ్రెస్ సీఎంలమే కనుక మిమ్మల్ని ‘గురూ’ అని చొరవగా అనగలిగాను’’ అన్నాడు.
‘‘మనిద్దరం కాంగ్రెస్ సీఎంలమే అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను నవ్వుతూ.
కొంచెం తేలిక పడినట్లున్నాడు.
‘‘అందుకే మిమ్మల్ని గురూ అన్నాను అశోక్‌జీ. నేను కూడా మీలా బాగున్న ఒక కాంగ్రెస్ సీఎంగా ఉండాలని ఆశ పడుతున్నాను..’’ అన్నాడు బఘేల్.
ఆ మాటతో అతడిలో నాకు గురుస్వరూపం గోచరించింది!
అలాగని అతడిని నేను గురూ అంటే అతడింకేదో స్వరూపాన్ని నాకు చూపించవచ్చు. కాంగ్రెస్‌లో స్వరూపాలను ఊహించలేం. సాక్షాత్కారం జరిగినప్పుడు చూసి ఆశ్చర్యపోవడమే.
అందుకే, ‘‘చెప్పు బఘేల్’’ అని మాత్రం అన్నాను.
‘‘చెప్పడానికి కాదు అశోక్‌జీ, నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిస్తే బాగుంటుందా అని అడగడానికి ఫోన్ చేశాను’’ అన్నాడు.
కాంగ్రెస్‌కు ఉన్నదే ముగ్గురు సీఎంలు. రాజస్తాన్‌లో నేను, ఛత్తీస్‌గఢ్‌లో బఘేల్, పంజాబ్‌లో కొత్తగా వచ్చిన చరణ్‌జిత్ చన్నీ. కొత్తగా వచ్చాడు కాబట్టి చన్నీ కర్టెసీగా వెళ్లి మోదీజీని కలిసుంటాడు. చన్నీకైతే సాకుగా రైతు చట్టాల రద్దు డిమాండ్‌లు ఉన్నాయి. మరి బఘేల్‌కి ఏమున్నాయి?
‘‘ఇష్యూ ఏంటి బఘేల్..’’ అన్నాను.
‘‘ఇష్యూ కాకూడదనే అశోక్‌జీ’’ అన్నాడు!
బఘేల్ మళ్లీ నాకు గురుస్వరూపాన్ని అనుగ్రహించాడు.
‘‘అశోక్‌జీ! కాంగ్రెస్‌లో సీఎం అనే ప్రతి రూపానికీ ఎప్పుడూ ఒక ప్రతిరూపం ఉంటుంది. పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌కి నవజోత్ సింగ్ సిద్ధూ, రాజస్తాన్‌లో అశోక్ గెహ్లోత్ అనే మీకు సచిన్ పైలట్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్ అనే నాకు టి.ఎస్. సింగ్ దేవ్ ఆ ప్రతిరూపాలు’’ అన్నాడు బఘేల్.
బఘేల్ గురుస్వరూపం క్రమంగా ఎత్తుకు పెరుగుతోంది.
‘‘నేనైతే అమరీందర్ సింగ్‌ని కావాలనుకోవడం లేదు అశోక్‌జీ! అమరీందర్ కూడా ముందు నుంచే మోదీజీని కలుస్తూ ఉంటే ఇప్పుడు అమరీందర్ అయి ఉండేవారు కాదు. మొన్న చన్నీ కూడా అమరీందర్ కాకుండా ఉండేందుకే కదా మోదీజీని కలిశారు. మీకైతే మోదీజీని కలిసే అవసరమే రాలేదు. ఆయనే మిమ్మల్ని కలుపుకొన్నారు. ‘అడిగే సీఎంలు ఉంటే పెట్టే పీఎంలు ఉంటారు’ అని ఆయన మిమ్మల్ని పొగిడారు కాబట్టి మీరూ అమరీందర్ అయ్యే ప్రమాదం లేదు..’’ అంటున్నాడు బఘేల్!
‘‘మోదీజీకి టచ్‌లో ఉంటే కాంగ్రెస్ మనల్ని టచ్ చెయ్యదు అనుకోవడంలో లాజిక్ కనిపించడం లేదు బఘేల్..’’ అన్నాను.
‘‘నిజమే అశోక్‌జీ! లాజిక్ లేదు. లాజిక్‌తో అసలు మన పార్టీకి ఏం పనుంది కనుక?! రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాకుండానే, అధ్యక్షుడిగా నిర్ణయాలన్నీ తీసుకోవడంలో మాత్రం లాజిక్ ఉందా?..’’ అన్నాడు అశోక్!!
మళ్లొకసారి గురు సాక్షాత్కారం!!
గురుబ్రహ్మ.. గురుర్విష్ణుః గురు బఘేల్!!
-మాధవ్ శింగరాజు
రాయని డైరీ: అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్ సీఎం)
Published Sun, Oct 3 2021 12:32 AM | Last Updated on Sun, Oct 3 2021 12:32 AM
Comments
Please login to add a commentAdd a comment