యు.ఎస్. నుంచి తిరుగు ప్రయాణం.
సీటు బెల్టులింకా పెట్టుకోలేదు. నాతో పాటు జైశంకర్, శ్రింగ్లా, అజిత్ డోభాల్ ఉన్నారు.
శ్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శి. అతడిని చూస్తుంటే ఎందుకో నాకు పన్నెండేళ్ల తర్వాత అతడు యోషిహిడేలా ఉంటాడేమో అనిపించి నవ్వొచ్చింది. యోషిహిడే జపాన్ ప్రధాని. శ్రింగ్లాకు అరవై. యోషిహిడేకు డెబ్బై రెండు.
‘‘ఏంట్సార్ నవ్వుతున్నారు?’’ అన్నాడు జైశంకర్. అతడు విదేశీ వ్యవహారాల మంత్రి.
‘‘నవ్వుతున్నానా, నవ్వుకుంటున్నానా జైశంకర్?’’ అన్నాను.
‘‘నవ్వుకుంటున్నా నవ్వినట్లే కదా సర్ కనిపిస్తుంది..’’ అని నవ్వాడు జైశంకర్.
అతడి నవ్వు చూస్తుంటే ఐదేళ్ల క్రితం నా నవ్వు అతడి నవ్వులా ఉండేదేమో అనిపించింది. అతడికి అరవై ఆరు. నాకు డెబ్బై ఒకటి.
‘అవును సర్, మీరు నవ్వుకోవడం నేనూ చూశాను’ అని శ్రింగ్లా గానీ, అజిత్ డోభాల్ గానీ అంటారేమోనని చూశాను. అనలేదు!
శ్రింగ్లా ఏవో ఫైల్స్ సర్దుకుంటున్నాడు. అజిత్ డోభాల్ తన విండో పైభాగాన్ని చేతి వేళ్లతో కొట్టి చూస్తున్నాడు. విమానంలో కాకుండా విధి నిర్వహణలో ఉన్నట్లున్నారు వాళ్లిద్దరూ!!
‘‘ఏమైంది అజిత్‌జీ? విమానాన్ని అలా వేళ్లతో ఎందుకు కొట్టి చూస్తున్నారు అని అడిగాను.
‘‘కొట్టలేదు మోదీజీ, కొట్టినట్లు ఉన్నాను..’’ అన్నారు అజిత్ తన వేళ్లను చూసుకుంటూ!
అజిత్ జాతీయ భద్రత సలహాదారు. డెబ్బై ఆరేళ్ల మనిషి. ఇంకో రెండేళ్లు పోతే బైడెన్ వయసుకు వచ్చేస్తారు ఆయన.
జైశంకర్ ఇంకా నావైపే చూస్తూ ఉన్నాడు. నేనెందుకు నవ్వుకున్నానో తెలుసుకోవడం కోసం కావచ్చు. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని, అందుకే నవ్వొచ్చిందనీ చెబితే బాగుంటుందా?
‘క్వాడ్’లోని మా నలుగురిలో బైడెన్ కన్నా, యోషిహిడే కన్నా, పద్దెనిమిదేళ్లు నా కన్నా కూడా యంగెస్ట్.. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. ఒకవేళ ఆ యంగ్ మ్యాన్‌తో కనుక శ్రింగ్లా తనని తను పోల్చుకుని ఉంటే.. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని జైశంకర్‌తో నేను అనడం శ్రింగ్లాను హర్ట్ చేయడమేగా!!
అందుకే.. ‘‘ఏం లేదు జైశంకర్’’ అన్నాను.
జైశంకర్, శ్రింగ్లా, అజిత్ సీటు బెల్టులు పెట్టుకుంటూ కనిపించారు.
‘‘అజిత్‌జీ ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇంకా ఈ సీటు బెల్టులు పెట్టుకోవడం ఏంటి?!’’ అన్నాను నేనూ సీటు బెల్టు పెట్టుకుంటూ.
అజిత్ సగం ఆశ్చర్యంతో చూశారు. మిగతా సగం అది ఏ భావమో అర్థం కాలేదు. బహుశా.. ఇండియాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రాని సందేహం అమెరికాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రావడం ఏంటీ అని అలా చూసి ఉండొచ్చు.
ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా చేతి నిండా ఫైల్సే ఉన్నాయి. విమానం ఎప్పుడు ఎక్కానో, సీటు బెల్టు ఎప్పుడు పెట్టుకున్నానో గుర్తే లేదు!
‘‘మోదీజీ.. సీటు బెల్టు అన్నది టెక్నాలజీకి ఏమాత్రం సంబంధం లేని ఒక భద్రతా ఏర్పాటు. అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో కూడా సీటు బెల్టులు ఉంటాయి. మన బెల్టులు అంతకన్నా బలమైనవి..’’ అని నవ్వారు అజిత్.
ఇండియాకు పదిహేను గంటల ప్రయాణం. విమానంలో చేయడానికి పనేమీ లేదు.
యు.ఎస్. వచ్చేటప్పుడు ‘వర్క్ ఫ్రమ్ ఫ్లయిట్’ అంటూ నా ఫొటో ఒకటి ట్వీట్ చేసినందుకు ప్రతీకారంగా కాంగ్రెస్ వాళ్లు ఫ్లయిట్‌లో వర్క్ చేస్తున్న రాజీవ్ గాంధీ పాత ఫొటోను పోస్ట్ చేశారు!
దేశం లోపలే కలిసిరాని వారుంటే దేశం బయట ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడూ ఎవరో ఒకరు కశ్మీర్ పేరు ఎత్తడంలో వింతేముంది?!
-మాధవ్ శింగరాజు
Comments
Please login to add a commentAdd a comment