మాధవ్ శింగరాజు
‘‘తప్పై పోయింది మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా, దించిన తల ఎత్తకుండానే. ‘‘మీరన్న మాటలో తప్పేమీ లేదు అమిత్‌జీ. కానీ, మీరసలు ‘ఆయన’ మాటే ఎత్తకుండా ఉండాల్సింది కదా...!’’ అన్నాను.
‘‘నిజమే మోదీజీ. ‘ఆయన’ మాట ఎత్తినా తప్పే, ఎత్తకపోయినా తప్పేనన్న కాలమాన పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నప్పుడు ‘ఆయన’ మాట ఎత్తి తప్పు చేయటం కంటే, ఎత్తకుండా తప్పు చేయటమే కొంతైనా నయంగా ఉండేది...’’ అన్నారు అమిత్‌షా.
పక్కనే జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్ ఉన్నారు. ‘‘అప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి, ‘ఆయనంటే’ మనకెంత గౌరవమో చెప్పాం మోదీజీ...’’ అన్నారు జేపీ నడ్డా.
‘‘అవును మోదీజీ... ‘ఆయనకు’ రెస్పెక్ట్ ఇవ్వటంలో కాంగ్రెస్ కన్నా మన పార్టీనే ఎప్పుడూ ముందుంటుందని కూడా చెప్పాం...’’ అన్నారు కిరణ్ రిజుజు.
‘‘నిజానికి కాంగ్రెస్సే ‘ఆయన’కు యాంటీ అని; ‘ఆయన’కు మాత్రమే కాదు... రాజ్యాంగానికి, రిజర్వేషన్‌లకు కూడా కాంగ్రెస్
యాంటీనే అని కూడా చెప్పాం మోదీజీ...’’ అన్నారు అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్.
మంటల్ని ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నించి వచ్చి, అలసట తీర్చుకుంటున్న ఫైర్ ఇంజన్‌లలా కనిపిస్తున్నారు మంత్రులు నలుగురూ.
‘‘మనం ‘ఆయన’ మాటెత్తటం వల్ల సడన్‌గా ఇప్పుడాయన మన పార్టీ ఇమేజ్‌కి సెంటర్ పాయింట్ అయ్యారు కనుక ఇకపై మనలో ఎవరు ఏం మాట్లాడినా ‘ఆయన్ని’ సెంటర్ పాయింట్‌గా చేసుకునే మాట్లాడాలి...’’ అన్నాను అమిత్‌షా వైపు చూస్తూ.
వెంటనే రిజుజు స్పందించారు.
‘‘నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మోదీజీ! ‘దేశంలో ‘ఆయన’ తర్వాత లా మినిస్టర్ అయిన తొలి బుద్ధిస్టును నేనే...’ అనే సంగతిని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాను...’’ అన్నారు రిజుజు.
‘‘నేనేతై, మోదీజీ పాలనలో ‘ఆయన్ని’ ఇన్‌సల్ట్ చేయడమన్నదే జరగదు...’’ అని గట్టిగానే జవాబిచ్చాను...’’ అన్నారు నడ్డా.
‘‘కాంగ్రెస్ ‘ఆయన’ విషయంలో అమిత్‌జీ మాటల్ని మెలిదిప్పి, బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ప్రజలకు చాటి చెబుతున్నాం మోదీజీ...’’ అన్నారు వైష్ణవ్, పీయుష్ గోయల్.
పార్టీలో ఒక నాయకుడిపై బయటి నుంచి విమర్శలు వచ్చినప్పుడు పార్టీలోని అందరూ ఆ విమర్శలు చేసిన వారిపై వరుసపెట్టి విరుచుకుపడటం బీజేపీలోని ఒక సత్సంప్రదాయం. ఆ సంప్రదాయం క్రమంగా బలహీనపడుతోందా? అందుకే...‘ఆయన’ మాటెత్తినందుకు అమిత్‌షాను మంత్రిగా తొలగించమని డిమాండ్ చేసేంతగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బలపడుతున్నాయా?
అమిత్ షా వైపు చూశాను. ‘‘అమిత్‌జీ... కనీసం మీరు – ‘కాంగ్రెస్ పార్టీ పదే పదే ‘ఆయన’ జపం చేస్తోంది’ – అన్నంత వరకే ఆగి పోవలసింది. మధ్యలోకి దేవుడిని తెచ్చి... ‘ఆ జపమేదో దేవుడికి చేస్తే పుణ్యమైనా దక్కేది...’’ అని అనటం వల్లనే.. ‘ఆయన వేరు, దేవుడు వేరా!’ అని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది...’’ అన్నాను.
‘‘నేనలా అనుకోవటం లేదు మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా!
‘‘మరి?!’’ అన్నాను.
‘‘ఆయన వేరు, దేవుడు వేరా – అని కాదు మోదీజీ... కాంగ్రెస్ రెచ్చకొడుతోంది, అసలు ‘ఆయన’కు వేరొకరితో పోలికేమిటని ‘ఊక’పొయ్యిని రాజేస్తోంది...’’ అన్నారు అమిత్‌షా!!
నా నోట మాట లేదు! అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం విని అప్రతిభుడై, శిలా ప్రతిమలా నిలుచుండి పోయిన వ్యాసమహర్షి నాకు – అదాటున – గుర్తొచ్చారు.
మంటలు, కాల్చి బూడిద చేస్తాయి. మాటలు బూడిద నుంచి కూడా మంటల్ని రేపుతాయి!
Comments
Please login to add a commentAdd a comment