కేంద్ర ప్రభుత్వం కత్తినీ, కలాన్నీ సమంగా శత్రువుగా భావిస్తోందా? ఉగ్రవాదులనూ, సమాజాన్ని చైతన్యపరిచే రచయితలనూ ఒకటిగానే చూస్తోందా? అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నవారిని నిర్బంధించడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో అధికారం మొత్తాన్నీ తన చేతుల్లోకి తీసుకోవడానికీ వెరవడం లేదు. దీంతో దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు రోజులు మూడాయన్న భావన దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. దీనికితోడుగా రాజ్యాంగ పరిధుల్ని కాలదన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, 2024 సంవత్సరానికి ముందే దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని పలువురు అనుమానిస్తున్నారు.
‘‘దేశంలో శాంతి భద్రతలకు ఏర్పడుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, భద్రతా సంస్థలు సిద్ధంగా ఉండాలి. శాంతి, భద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్రాలకు ఉన్నదని రాజ్యాంగం నిర్దేశించినా... దేశ సమైక్యతతో ఈ సమస్య ముడిపడి ఉంది కాబట్టే మా ఆవేదనంతా. మనది ఒకే దేశం కాబట్టి దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకే రకం యూని ఫామ్ ఉండాలి. దేశ యువకుల ఉద్రేక స్వభావాల్ని ఆసరా చేసుకొని కొందరు తమ కలాల ద్వారా ఉగ్రవాద ప్రచారానికి తోడ్పడుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి రూపొందిన ‘ఉపా’ చట్టం ప్రభుత్వానికి ఎంతో వెన్నుదన్నుగా ఉపయోగపడుతోంది. అయినా ‘ఉపా’ చట్టాన్ని, దాని సామంజస్యాన్ని ప్రశ్నించే కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చాయి.’’
– అక్టోబర్ 28–29 తేదీల్లో ప్రధాని మోదీ ప్రసంగాల సారాంశం.
‘‘ప్రతీ రాష్ట్రమూ శాంతి భద్రతల రక్షణకు దేశవ్యాప్తంగా ఒకే ఒక విధానం రూపొందించి తీరాలి. ఇది 2024 లోగానే రూపొంది తీరాలి.’’
– హోంమంత్రి అమిత్ షా (27 అక్టోబర్ 2022)
దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు ‘రోజులు మూడాయన్న’ భావన క్రమంగా దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. ఇటీవలనే పదవీ కాలం ముగిసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణతో ప్రారంభమైన కొన్ని అభ్యుదయకర తీర్పుల ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానం మీద కొంత విశ్వాసం బలపడింది. అయితే భారతదేశ చైతన్యవంతులైన, పాలక శక్తుల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ యువతరంపై దారుణమైన నిర్బంధ విధానానికి బీజేపీ ప్రభుత్వం పాల్పడింది. చివరికి నిలువెల్లా వికలాంగుడైన అభ్యుదయవాది, భావ విప్లవ స్ఫూర్తికి దోహదం చేస్తూ అనేక సంవత్సరాలుగా దేశ పాలక వర్గాల అధికార దుర్వినియోగాన్ని సహిస్తూ వచ్చిన సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఒక రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దాన్ని రద్దు చేయించడానికి పాలకవర్గం సాహసించి, తిరిగి జైలుకు పంపించింది. అంత బలహీన స్థితికి దేశ బీజేపీ నాయకత్వ పాలనా పద్ధతులు దిగజారిపోయాయని ప్రజలు నిర్ణయానికి వచ్చే అవకాశాన్ని పాలకులు కల్పించకూడదు.
సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ స్వయంగా తన తండ్రి జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పును కూడా తిరగదోడారు. ఆయన బిడ్డగా ఎదిగివచ్చినా తన తనాన్ని, తన స్వతంత్ర ప్రతిపత్తిని సదా ఈ క్షణం దాకా కాపాడుకుంటూ వచ్చిన ఉద్దండుడు నేటి సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి. తన సొంత తండ్రిగారిచ్చిన తీర్పునే కొట్టి పారేయడానికి రక్త సంబంధం ఏమాత్రం ఆయనకు అడ్డు నిలువక పోవడం అత్యంత ప్రశంసనీయం. ఈ పరిణామం గమనించి ఉన్న బీజేపీ పాలకులు నవంబర్ 9న నూతన ప్రధాన న్యాయమూర్తిగా డి.వై.చంద్రచూడ్ పదవీ స్వీకారం చేయకుండా నిరోధించేందుకు ఎవరి చేతనో ఒక అడ్డుపుల్ల పిటిషన్ వేయించారు. కానీ తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఆ ‘కొంటి’ పిటిషన్‌ను ‘సరుకులేని కాగితం’గా కొట్టి పారవేశారు. ఇలా బీజేపీ హయాంలో ఒకటిగాదు, ఎన్నో పిటిషన్లు!
‘ది వైర్’ లాంటి ప్రముఖ దేశీయ వార్తా సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై నిష్పాక్షిక విచారణ జరిపి తీరాలని ఢిల్లీ పోలీసుల్ని దేశ ప్రఖ్యాత ‘ఎడిటర్స్ గిల్డ్’ పోలీసులను కోరింది. ఇంత కన్నా బీజేపీ పాలకుల అసమర్థ దుర్జనత్వానికి నిదర్శనం మరొక టుంది. ‘జాతీయ భద్రతా ప్రయోజనాల’ పేరిట ఇతరులు తెరచి చూడటానికి వీలు లేదన్న మిషపైన పాలకులు కొత్తగా ‘సీల్డ్ కవర్’ ఎత్తుగడలు పాటిస్తూ వచ్చారు. కానీ, ఆ ఎత్తుగడలను బహిర్గతం చేస్తూ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల సుప్రీం బెంచ్ ‘మీడియా వన్ ఛానల్’ టెలికాస్ట్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్‌ను పక్కకి తోసేసింది. ఎందుకంటే, ఆ ఛానల్‌కు ఎప్పటి నుంచో ఉన్న సెక్యూరిటీ అనుమతిని కూడా అకస్మాత్తుగా పాలకులు రద్దు చేశారు. ఎవరు ఫిర్యాదు చేసినా, అసలు ఫైల్‌లో ఉన్నదేమిటో, బయటికి పొక్కకుండా రహస్యంగా దాచిన విషయం జాతీయ భద్రతకు ఏ విధంగా విఘాతం కల్గిస్తుందో కోర్టు వారికి విధిగా బహిరంగపరచాల్సిందేననీ, ‘సీల్డ్ కవర్’ల తతంగం ఇక మీదట కొనసాగరాదనీ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది.
ఈ భాగోతం ఇలా ఉండగానే, రాజ్యాంగ పరిధుల్ని కాల దన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీం గమనిస్తూనే ఉంది. గతంలో బొమ్మై (కర్ణాటక) ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని దించేయడానికి జరిగిన ప్రయత్నంలో శాసనసభ చర్చకు, దాని అనుమతికి బద్ధమై మాత్రమే నిర్ణయాలు జరగాలన్న జస్టిస్ జయచంద్రారెడ్డి హెచ్చరికను ఆనాటి ప్రతిపక్షం పాటించక తప్పలేదు. అటు కేరళ బీజేపీ గవర్నర్, ఇటు తమిళనాడు గవర్నర్, మరికొన్ని ఇతర రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంపై దేశవ్యాప్తంగా నేడు పెద్ద అలజడి విద్వత్ వర్గాలలో ప్రారంభమైంది.
బహుశా 2024వ ఏడాదికి ముందే అర్ధంతరంగా దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు నిజమే అవుతాయేమో అన్నంతగా ప్రజా బాహుళ్యంలో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకంటే – భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ పని, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలకు బద్ధమై ఉండవలసిందేగానీ, వ్యతిరేకించ కూడదు. రాజ్యాంగం తనను అనుమతించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలలో 163(2) అధికరణ గవర్నర్ల జోక్యానికి అనుమతిస్తుంది. అంతేగానీ, ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించి ‘సొంత దుకాణం’ తెరచుకునే అధికారం నామినేటెడ్ గవర్నర్లకు లేదు.
సుప్రసిద్ధ సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్... షంషేర్ సింగ్ కేసులో చెప్పిన తీర్పులో ఇలా పేర్కొ న్నారు: ‘‘శాసనసభ (లెజిస్లేచర్)కు ఆయా శాఖల మంత్రులు జరూరుగా సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. వీరు ఆశువుగా చెప్పే పద్ధతికి ప్రజలూ అలవాటు పడ్డారు. ఎవరో ఒకే ఒక నాయకుడి ఆత్మకు దాసోహమని కూర్చోకుండా ప్రజలు ఈ రకపు ప్రజాస్వా మ్యానికి కూడా అలవాటుపడ్డారనుకోవాలి. కాకపోతే, భారతదేశపు సంక్లిష్ట రాజకీయ నిర్మాణ సూత్రాలకు ఒదిగి ఉండక తప్పదేమో’’! కాబట్టి ఈ పరిస్థితుల్లో కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ల అనవసర జోక్యానికి చోటివ్వకుండా చూడాలని ప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది కాళేశ్వరం రాజ్ అభిప్రాయం.
చివరికి, త్వరలో దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాల గురించి పలువురి అనుమానాలకు తగి నట్టుగానే గుజరాత్ విద్యాపీఠ్‌కు 12వ అధ్యక్షుడిగా గుజరాత్ గవర్నర్, బీజేపీ అనుయాయి అయిన దేవవ్రత్‌ను నియమించాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విద్యాపీఠ్‌ను స్వతంత్ర సంస్థగా 1920లో గాంధీజీ నెలకొల్పారని మరవరాదు. నిజమైన గాంధేయవాది మాత్రమే ఈ విద్యాపీఠ్‌ను అలంకరించాలని నాడు నిర్ణయమయింది. కానీ, ఆ ఆశయానికి విరుద్ధంగా దేవవ్రత్‌ను (రాజ కీయ గవర్నర్) నియమించినందుకు నిరసనగా విద్యాపీఠ్ ట్రస్టీల బోర్డునుంచి గత నెల 18న తొమ్మిదిమంది సభ్యులు రాజీనామాలు చేశారు. ఏతావాత మన పాలకులు కూడా కలాన్నీ, కత్తినీ సమ పాళ్లలోనే ఒకే బాటలో నిలబెట్టడానికి అంగీకరిస్తున్నందువల్ల గాంధీ విద్యాపీఠ్ నెత్తిపైన కూడా ఈ రెండు రకాల ఆయుధాలను – సమంగా మోపడానికి వెనుదీయలేదన్నమాట!
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment