federal government
-
పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?
వాషింగ్టన్: అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వానికి కొత్త ఆర్ధిక సంవత్సరం ముందు షాక్ తగిలింది. అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించగా 232-198 తేడాతో ఆమోదానికి నోచుకోలేదు. దీనివలన వచ్చేనెల ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోనున్నాయి. మొదట్లో బెట్టు చేసినా చివరి నిమిషంలో రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదంటున్నాయి అమెరికా కాంగ్రెస్ వర్గాలు. షట్ డౌన్? ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికాలో ఆర్ధిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈనెలలో చివరి రోజైన శనివారం ఈ బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీనివలన 18 లక్షల మంది ఉద్యోగులున్న ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులు, ఆయా పథకాలకు నిధులతో పాటు సైనికుల జీతాలు కూడా స్తంభించిపోయే ప్రమాదముంది. ఎందుకు ఆగింది? సరిహద్దు భద్రత ఏజెన్సీ తోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనిని రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్‌కు నిధులివ్వాలనే బిల్లును తిరస్కరించనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదం కష్టసాధ్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్ కెవిన్ మెక్ కార్తీ బిల్లును ఆమోదింపజేసి షట్ డౌన్ నివారించేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేశారు. చివరి రోజున కూడా ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని అంటున్నాయి యూఎస్ కాంగ్రెస్ వర్గాలు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే బిల్లులో నుంచి ఉక్రెయిన్ అంశాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని అంటున్నారు సెనేటర్ రాండ్ పాల్. Like Sen. McConnell said, nobody benefits from a government shutdown—it hurts our services, economy, and neighbors…and it doesn’t save money. It's our job to pass a budget. House Republicans need to put their partisan games aside & work with us to avoid a disastrous shutdown. pic.twitter.com/uhgtecLDpx — Rep. Morgan McGarvey (@RepMcGarvey) September 29, 2023 ఇది కూడా చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. -
ఫెడరల్ వ్యవస్థకు రోజులు మూడాయా?
కేంద్ర ప్రభుత్వం కత్తినీ, కలాన్నీ సమంగా శత్రువుగా భావిస్తోందా? ఉగ్రవాదులనూ, సమాజాన్ని చైతన్యపరిచే రచయితలనూ ఒకటిగానే చూస్తోందా? అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నవారిని నిర్బంధించడానికి వెనుకాడటం లేదు. ఈ క్రమంలో అధికారం మొత్తాన్నీ తన చేతుల్లోకి తీసుకోవడానికీ వెరవడం లేదు. దీంతో దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు రోజులు మూడాయన్న భావన దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. దీనికితోడుగా రాజ్యాంగ పరిధుల్ని కాలదన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీంకోర్టు గమనిస్తూనే ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, 2024 సంవత్సరానికి ముందే దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయని పలువురు అనుమానిస్తున్నారు. ‘‘దేశంలో శాంతి భద్రతలకు ఏర్పడుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అన్ని ప్రభుత్వ శాఖలు, భద్రతా సంస్థలు సిద్ధంగా ఉండాలి. శాంతి, భద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్రాలకు ఉన్నదని రాజ్యాంగం నిర్దేశించినా... దేశ సమైక్యతతో ఈ సమస్య ముడిపడి ఉంది కాబట్టే మా ఆవేదనంతా. మనది ఒకే దేశం కాబట్టి దేశవ్యాప్తంగా పోలీసులకు ఒకే రకం యూని ఫామ్ ఉండాలి. దేశ యువకుల ఉద్రేక స్వభావాల్ని ఆసరా చేసుకొని కొందరు తమ కలాల ద్వారా ఉగ్రవాద ప్రచారానికి తోడ్పడుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధానికి రూపొందిన ‘ఉపా’ చట్టం ప్రభుత్వానికి ఎంతో వెన్నుదన్నుగా ఉపయోగపడుతోంది. అయినా ‘ఉపా’ చట్టాన్ని, దాని సామంజస్యాన్ని ప్రశ్నించే కొన్ని పిటిషన్లు సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చాయి.’’ – అక్టోబర్ 28–29 తేదీల్లో ప్రధాని మోదీ ప్రసంగాల సారాంశం. ‘‘ప్రతీ రాష్ట్రమూ శాంతి భద్రతల రక్షణకు దేశవ్యాప్తంగా ఒకే ఒక విధానం రూపొందించి తీరాలి. ఇది 2024 లోగానే రూపొంది తీరాలి.’’ – హోంమంత్రి అమిత్ షా (27 అక్టోబర్ 2022) దేశ ఫెడరల్ వ్యవస్థ మనుగడకు ‘రోజులు మూడాయన్న’ భావన క్రమంగా దేశ ప్రజల మనసుల్లో పాదుకుపోతున్నది. ఇటీవలనే పదవీ కాలం ముగిసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రమణతో ప్రారంభమైన కొన్ని అభ్యుదయకర తీర్పుల ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానం మీద కొంత విశ్వాసం బలపడింది. అయితే భారతదేశ చైతన్యవంతులైన, పాలక శక్తుల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశ యువతరంపై దారుణమైన నిర్బంధ విధానానికి బీజేపీ ప్రభుత్వం పాల్పడింది. చివరికి నిలువెల్లా వికలాంగుడైన అభ్యుదయవాది, భావ విప్లవ స్ఫూర్తికి దోహదం చేస్తూ అనేక సంవత్సరాలుగా దేశ పాలక వర్గాల అధికార దుర్వినియోగాన్ని సహిస్తూ వచ్చిన సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని ఒక రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దాన్ని రద్దు చేయించడానికి పాలకవర్గం సాహసించి, తిరిగి జైలుకు పంపించింది. అంత బలహీన స్థితికి దేశ బీజేపీ నాయకత్వ పాలనా పద్ధతులు దిగజారిపోయాయని ప్రజలు నిర్ణయానికి వచ్చే అవకాశాన్ని పాలకులు కల్పించకూడదు. సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ స్వయంగా తన తండ్రి జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పును కూడా తిరగదోడారు. ఆయన బిడ్డగా ఎదిగివచ్చినా తన తనాన్ని, తన స్వతంత్ర ప్రతిపత్తిని సదా ఈ క్షణం దాకా కాపాడుకుంటూ వచ్చిన ఉద్దండుడు నేటి సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి. తన సొంత తండ్రిగారిచ్చిన తీర్పునే కొట్టి పారేయడానికి రక్త సంబంధం ఏమాత్రం ఆయనకు అడ్డు నిలువక పోవడం అత్యంత ప్రశంసనీయం. ఈ పరిణామం గమనించి ఉన్న బీజేపీ పాలకులు నవంబర్ 9న నూతన ప్రధాన న్యాయమూర్తిగా డి.వై.చంద్రచూడ్ పదవీ స్వీకారం చేయకుండా నిరోధించేందుకు ఎవరి చేతనో ఒక అడ్డుపుల్ల పిటిషన్ వేయించారు. కానీ తాజా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు. లలిత్ ఆ ‘కొంటి’ పిటిషన్‌ను ‘సరుకులేని కాగితం’గా కొట్టి పారవేశారు. ఇలా బీజేపీ హయాంలో ఒకటిగాదు, ఎన్నో పిటిషన్లు! ‘ది వైర్’ లాంటి ప్రముఖ దేశీయ వార్తా సంస్థకు వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులపై నిష్పాక్షిక విచారణ జరిపి తీరాలని ఢిల్లీ పోలీసుల్ని దేశ ప్రఖ్యాత ‘ఎడిటర్స్ గిల్డ్’ పోలీసులను కోరింది. ఇంత కన్నా బీజేపీ పాలకుల అసమర్థ దుర్జనత్వానికి నిదర్శనం మరొక టుంది. ‘జాతీయ భద్రతా ప్రయోజనాల’ పేరిట ఇతరులు తెరచి చూడటానికి వీలు లేదన్న మిషపైన పాలకులు కొత్తగా ‘సీల్డ్ కవర్’ ఎత్తుగడలు పాటిస్తూ వచ్చారు. కానీ, ఆ ఎత్తుగడలను బహిర్గతం చేస్తూ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల సుప్రీం బెంచ్ ‘మీడియా వన్ ఛానల్’ టెలికాస్ట్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్‌ను పక్కకి తోసేసింది. ఎందుకంటే, ఆ ఛానల్‌కు ఎప్పటి నుంచో ఉన్న సెక్యూరిటీ అనుమతిని కూడా అకస్మాత్తుగా పాలకులు రద్దు చేశారు. ఎవరు ఫిర్యాదు చేసినా, అసలు ఫైల్లో ఉన్నదేమిటో, బయటికి పొక్కకుండా రహస్యంగా దాచిన విషయం జాతీయ భద్రతకు ఏ విధంగా విఘాతం కల్గిస్తుందో కోర్టు వారికి విధిగా బహిరంగపరచాల్సిందేననీ, ‘సీల్డ్ కవర్’ల తతంగం ఇక మీదట కొనసాగరాదనీ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. ఈ భాగోతం ఇలా ఉండగానే, రాజ్యాంగ పరిధుల్ని కాల దన్నుతూ తాజాగా కేరళ, తమిళనాడు గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలను ప్రశ్నించే దశకు దిగజారడాన్ని సుప్రీం గమనిస్తూనే ఉంది. గతంలో బొమ్మై (కర్ణాటక) ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వాన్ని దించేయడానికి జరిగిన ప్రయత్నంలో శాసనసభ చర్చకు, దాని అనుమతికి బద్ధమై మాత్రమే నిర్ణయాలు జరగాలన్న జస్టిస్ జయచంద్రారెడ్డి హెచ్చరికను ఆనాటి ప్రతిపక్షం పాటించక తప్పలేదు. అటు కేరళ బీజేపీ గవర్నర్, ఇటు తమిళనాడు గవర్నర్, మరికొన్ని ఇతర రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగ బాధ్యతలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడంపై దేశవ్యాప్తంగా నేడు పెద్ద అలజడి విద్వత్ వర్గాలలో ప్రారంభమైంది. బహుశా 2024వ ఏడాదికి ముందే అర్ధంతరంగా దేశవ్యాప్తంగా రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాలు నిజమే అవుతాయేమో అన్నంతగా ప్రజా బాహుళ్యంలో ఆందోళన ప్రారంభమైంది. ఎందుకంటే – భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ పని, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానాలకు బద్ధమై ఉండవలసిందేగానీ, వ్యతిరేకించ కూడదు. రాజ్యాంగం తనను అనుమతించిన మేరకే రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలలో 163(2) అధికరణ గవర్నర్ల జోక్యానికి అనుమతిస్తుంది. అంతేగానీ, ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకొన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించి ‘సొంత దుకాణం’ తెరచుకునే అధికారం నామినేటెడ్ గవర్నర్లకు లేదు. సుప్రసిద్ధ సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్... షంషేర్ సింగ్ కేసులో చెప్పిన తీర్పులో ఇలా పేర్కొ న్నారు: ‘‘శాసనసభ (లెజిస్లేచర్)కు ఆయా శాఖల మంత్రులు జరూరుగా సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. వీరు ఆశువుగా చెప్పే పద్ధతికి ప్రజలూ అలవాటు పడ్డారు. ఎవరో ఒకే ఒక నాయకుడి ఆత్మకు దాసోహమని కూర్చోకుండా ప్రజలు ఈ రకపు ప్రజాస్వా మ్యానికి కూడా అలవాటుపడ్డారనుకోవాలి. కాకపోతే, భారతదేశపు సంక్లిష్ట రాజకీయ నిర్మాణ సూత్రాలకు ఒదిగి ఉండక తప్పదేమో’’! కాబట్టి ఈ పరిస్థితుల్లో కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గవర్నర్ల అనవసర జోక్యానికి చోటివ్వకుండా చూడాలని ప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది కాళేశ్వరం రాజ్ అభిప్రాయం. చివరికి, త్వరలో దేశమంతటా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాల గురించి పలువురి అనుమానాలకు తగి నట్టుగానే గుజరాత్ విద్యాపీఠ్‌కు 12వ అధ్యక్షుడిగా గుజరాత్ గవర్నర్, బీజేపీ అనుయాయి అయిన దేవవ్రత్‌ను నియమించాలని కేంద్రం నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ విద్యాపీఠ్‌ను స్వతంత్ర సంస్థగా 1920లో గాంధీజీ నెలకొల్పారని మరవరాదు. నిజమైన గాంధేయవాది మాత్రమే ఈ విద్యాపీఠ్‌ను అలంకరించాలని నాడు నిర్ణయమయింది. కానీ, ఆ ఆశయానికి విరుద్ధంగా దేవవ్రత్‌ను (రాజ కీయ గవర్నర్) నియమించినందుకు నిరసనగా విద్యాపీఠ్ ట్రస్టీల బోర్డునుంచి గత నెల 18న తొమ్మిదిమంది సభ్యులు రాజీనామాలు చేశారు. ఏతావాత మన పాలకులు కూడా కలాన్నీ, కత్తినీ సమ పాళ్లలోనే ఒకే బాటలో నిలబెట్టడానికి అంగీకరిస్తున్నందువల్ల గాంధీ విద్యాపీఠ్ నెత్తిపైన కూడా ఈ రెండు రకాల ఆయుధాలను – సమంగా మోపడానికి వెనుదీయలేదన్నమాట! ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
రాజకీయాలకు సమాఖ్య బలి కాకూడదు!
తెలంగాణ రైతాంగం పండిం చిన ధాన్యం మొత్తాన్ని కొను గోలు చేయడానికి కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో తెలం గాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావుకూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ నడుమ మొదలైన మాటల యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై చర్చ మరో సారి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్య మంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, స్టాలిన్; బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారు రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ‘‘దేశ ఫెడరల్ వ్యవస్థను కేంద్రం దౌర్జన్యం నుండి కాపాడాల్సిన సమయం ఇది’’ అని మమతా బెనర్జీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం నియంతృత్వ ధోరణిని ప్రతిఫలిస్తు న్నాయి. ఇదే సమయంలో సమీప భవిష్యత్తులో దేశంలో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాల్ని సైతం ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. గత కొంతకాలంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించకుండా కొన్ని అంశాల్లో ఏకపక్షంగా తీసు కొంటున్న నిర్ణయాల నేపథ్యంలో మమతా బెనర్జీ ‘ఫెడ రల్ వ్యవస్థకు రక్షణ’ అని అనడంలో విస్తృతార్థాలు ఇమిడి ఉన్నాయని పిస్తోంది. దేశ పాలనా వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు తమతమ అధికార పరిధులకు లోబడి ఉమ్మడి లక్ష్యాలతో సమన్వ యంతో పని చేయాలని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ... కేంద్రంలో ఇటీవల వరకూ ఎవరు అధికారంలోకి వచ్చినా ఏకపక్ష పోకడలు పోవడం ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు... రాష్ట్రాలను చిన్న చూపు చూసే ధోరణి మొలకెత్తింది. రాజ్యాంగం నీడలోనే ప్రజామోదం గలిగిన రాష్ట్ర ప్రభుత్వాలను లెక్కలేనన్ని సార్లు కూల్చేసింది కాంగ్రెస్. రాజకీయ ఫిరాయింపులను ప్రోత్స హించింది. దీంతో దానికి వ్యతిరేకంగా దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ అనే అంశాల ఆధారంగానే అవి ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి రాగలిగాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకాలను ఎండగడుతూ వచ్చిన బీజేపీ సైతం నేడు తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. ఇందుకు 2014లో ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన అనంతరం... విభజిత ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకపోవడం తాజా ఉదాహరణ. ఏడున్నరేళ్ల నరేంద్రమోదీ నేతృత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయక పోగా, ‘పునర్వ్యస్థీకరణ చట్టం–2014’లో పేర్కొన్న రెవెన్యూలోటు భర్తీ, వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వేజోన్ తదితర కీలకమైన అంశాలను; పార్లమెంట్ సాక్షిగా ఇస్తామని వాగ్దానం చేసిన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అంశాన్ని పక్కన పెట్టేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం–2014 ప్రకారం 9వ షెడ్యూల్లో 91 సంస్థలు, 10వ షెడ్యూల్లో 142 సంస్థలు ఉన్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన; ఉద్యోగుల విభజన; ఆస్తులు, అప్పులు, ఆదాయ విభజన వంటి అంశాలు ఇంకా పూర్తికాని నేపథ్యంలో... వాటిని పరిష్కరించడానికిగాను 9 అంశా లతో ఎజెండాను రూపొందించి... కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్‌కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉపకమిటీని ఏర్పాటు చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే 9 అంశాలలో ప్రధానమైన 1) ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 2) పన్ను రాయితీలు 3) ఉత్తరాంధ్ర, రాయల సీమలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు 4) రెవెన్యూ లోటు అంశాలను ఎత్తివేశారు. అజెండాలో కేవలం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలను మాత్రమే ఉంచి అజెండాను సవరించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ; ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నిం చిన తెలుగుదేశం పార్టీలు లోపాయికారీగా కుట్రపన్ని త్రిసభ్య కమిటీ అజెండాను కుదించారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్ని ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తే ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కు తుందన్న దుగ్ధ తెలుగుదేశం అధినేతకు ఉండొచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాల్సిందేనని విభజన బిల్లు ఆమోదం పొందే సంద ర్భంలో రాజ్యసభలో పట్టుబట్టి, గొంతెత్తి పోరాడిన బీజేపీ నేతలు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదనీ, అది ముగిసిన అధ్యాయం అనీ ప్రచారం చేయడం ఏపాటి ప్రజా స్వామ్యం? కానీ, ఇటీవల బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు బీజేపీ చెప్ప డంతో... రాజకీయ కారణాల వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రజలకు అర్థమైంది. విభజన హామీలను నెరవేర్చే విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌తోపాటు తెలంగాణకూ న్యాయం జరగలేదు. ఇందుకు కూడా రాజకీయాలే కారణం. విభజన బిల్లులో పేర్కొన్న ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా; నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ. 24,000 కోట్ల ఆర్ధిక సాయం వంటివి అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలకు దిగారు. వివిధ రాష్ట్రాలలో ఉన్న బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి రాజకీయ ఫ్రంట్లను ఏర్పాటుచేసి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడంవల్ల తక్షణం నెరవేరాల్సిన సమస్యలు పరిష్కారమవుతాయా అనేది ఆలోచించవలసిన అంశం. ఇదే సమయంలో రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం ఆర్థికంగా పటిష్ట మవుతుందని కేంద్రం గ్రహించాలి. రాష్ట్రాలను బలహీన పర్చడం వలన సాధించేదేమీ ఉండదని, ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించి ఇప్పటికైనా ఆ దిశగా నిర్మాణాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రాలకు లభించాల్సిన నిధులు, హక్కులు బదలాయించి సమాఖ్య స్ఫూర్తిని చాటాలి, ఫెడరల్ వ్యవస్థను పటిష్ట పర్చాలి. వ్యాసకర్త: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏపీ శాసన మండలి సభ్యులు -
కొత్త దిక్సూచి ‘నీతి ఆయోగ్’
ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కేంద్ర, రాష్ట్రాల విధానాలకు ఇకపై రూపకర్త కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన కేబినెట్ తీర్మానంలో విధివిధానాలు, లక్ష్యాల వెల్లడి న్యూఢిల్లీ: ఆరున్నర దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన ప్రణాళికా సంఘం స్థానంలో ‘నీతి ఆయోగ్’ను కేంద్రం తీసుకొచ్చింది. ‘నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా(ఎన్ఐటీఐ)’ పేరుతో ఏర్పాటైన ఈ కొత్త వ్యవస్థ ఇకపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల విధానాలను రూపొందించే మేధో సంస్థగా సేవలందించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ దీనికి చైర్‌పర్సన్‌గా వ్యవ హరిస్తారు. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నీతి ఆయోగ్ పాలక మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. సహకార సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ కేంద్ర, రాష్ట్రాలకు ఒకే జాతీయ ఎజెండాను ఖరారు చేయడమే ఈ మండలి లక్ష్యం. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ‘గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం వల్ల రాష్ట్రాలను సంప్రదించడం ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ఇప్పుడు ‘నీతి ఆయోగ్’ అదే పని చేస్తుంది. ఈ సంస్థ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి అభివృద్ధి ఫలాలను పొందాలి. మెరుగైన జీవితాన్ని అనుభవించాలి. సాధికారత, సమానత్వమే లక్ష్యంగా ప్రజానుకూల, గతిశీల, సమ్మిళిత అభివృద్ధి ఎజెండాను అమలు చేసేందుకే నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేశాం. అన్నిటికీ ఒకే మంత్రం పటించే మూస ధోరణికి ఇక వీడ్కోలు పలుకుదాం. దేశ భిన్నత్వం, బహుళత్వాన్ని ఈ కొత్త సంస్థ ప్రతిబింబిస్తుంది. దేశాభివృద్ధి పథంలో నీతి ఆయోగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. మారిన ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త వ్యవస్థ అవసరమని గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మోదీ పేర్కొనడం తెలిసిందే. ప్రధాని నిర్ణయం మేరకే రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకుని కేబినెట్ తీర్మానం ద్వారా ‘నీతి ఆయోగ్’ను కేంద్రం ఏర్పాటు చేసింది. తొలి వైస్‌చైర్మన్‌గా అరవింద్ పనగారియా! ‘నీతి ఆయోగ్’కు సీఈవో, వైస్ చైర్పర్సన్లను ప్రధాని నియమిస్తారు. సంస్థ తొలి వైస్‌చైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగారియా నియమితులు కానున్నట్లు సమాచారం. కాగా, ఈ సంస్థలో ఐదుగురు శాశ్వత సభ్యులతో పాటు ప్రముఖ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలకు చెందిన ఇద్దరు తాత్కాలిక సభ్యులు కూడా నియమితులవుతారు. నలుగురు కేంద్ర మంత్రులు ఎక్స్అఫీషియో సభ్యులుగా సేవలందిస్తారు. పలు రంగాలకు చెందిన మేధావులు, నిపుణులను కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రధాని నామినేట్ చేస్తారు. అలాగే నీతి ఆయోగ్‌కు అనుబంధంగా ప్రత్యేక ప్రాంతీయ మండళ్లను ఆ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇవి పలు రాష్ట్రాలు లేదా ప్రాంతాలపై దృష్టి సారిస్తాయి. వీటిలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాంతీయ మండళ్లకు నీతి ఆయోగ్ చైర్‌పర్సనే నేతృత్వం వహిస్తారు. కేంద్ర, రాష్ట్రాలకు దిశానిర్దేశం ఆర్థిక సమస్యలతో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న విషయాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు ‘నీతి ఆయోగ్’ సహకరిస్తుందని కేంద్రం తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఎప్పటికప్పుడు తగిన వ్యూహాత్మక, సాంకేతిక సలహాలను ఇస్తుందని వెల్లడించింది. ఈ సంస్థ విధివిధానాలు, లక్ష్యాలను కూడా కేబినెట్ తీర్మానంలో పొందుపరిచింది. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, స్వామీ వివేకానంద, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వంటి మహానేతల స్ఫూర్తిదాయక మాటలను ప్రస్తావిస్తూ ఈ తీర్మానాన్ని కేంద్రం రూపొందించింది. మారిన ఆర్థిక పరిస్థితులు, ఆహార భద్రతావసరాలు, గ్లోబలైజేషన్, కొత్త టెక్నాలజీలు, పారదర్శకత, మేధో సంపత్తి వినియోగం వంటి అనేక శక్తుల ప్రభావంతో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అందులో వివరించింది. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, ప్రభుత్వాలకు వ్యూహాత్మక సూచనలు చేయడం వంటి బాధ్యతలను ఈ సంస్థ నిర్వర్తిస్తుందని తెలిపింది. రాష్ట్రాలకు చురుకైన పాత్ర కల్పిస్తూ జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలను గుర్తించడం, గ్రామ స్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తూ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో అభివృద్ధికి బాటలు వేయడం, పేదల అభ్యున్నతికి దీర్ఘకాలిక విధానాలను రూపొందించడం వంటివి కొత్త వ్యవస్థ విధులుగా పేర్కొంది. అభివృద్ధి ఎజెండా అమలులో భాగంగా తలెత్తే సమస్యలను పరిష్కరించే వేదికగా కూడా ఇది పనిచేయనుంది. సుపరిపాలనా విధానాలపై అధ్యయనం చేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తీరును పరిశీలిస్తూ జాతీయ అభివృద్ధి ఎజెండాను ‘నీతి ఆయోగ్’ అమలు చేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇతర జాతీయ, అంతర్జాతీయ మేథో సంస్థలతోనూ నిరంతర సంప్రదింపులు జరుపుతుందని పేర్కొంది. -
బాల్యానికి భరోసా ఉన్నట్టేనా?!
బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకోవడాన్ని మన రాజ్యాంగం 24వ అధికరణం ద్వారా నిషేధించి దశాబ్దాలు గడుస్తున్నా, అందుకనుగుణంగా రకరకాల చట్టాలొచ్చినా... తదనంతరకాలంలో వాటికి సవరణలు తెచ్చినా అమలులో మాత్రం వరస వైఫల్యాలే ఎదురవుతున్నాయి. పదేళ్లలో బాల కార్మిక వ్యవస్థను రూపుమాపాలని 1978లో తీర్మానించారు. 1988లో దాన్నే మరోసారి పునరుద్ఘాటించారు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త గడువు విధించుకోవడం తప్ప సమస్య పరిష్కారం మాత్రం సాధ్యపడటంలేదు. అందువల్లే ప్రస్తుత పార్లమెంటు సమావేశాల ముందుకు మరింత పకడ్బందీగా బాల కార్మిక వ్యవస్థ(నిషేధం, నియంత్రణ) సవరణ బిల్లు తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. చేసిన చట్టాలు ఎందుకు చట్టుబండలయ్యాయో, లోపం ఎక్కడున్నదో గమనించుకుని అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ, ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచిస్తున్నదా అనే అనుమానం అందరికీ కలుగుతున్నది. వాస్తవానికి ఈ సవరణ బిల్లును రూపొందించి రెండేళ్లు దాటుతోంది. ఇన్నాళ్లకు ఇప్పుడు పార్లమెంటు ముందుకు వస్తున్నది. బాల కార్మికులు గనుల్లో లేదా పరిశ్రమల్లో ఉండరాదని భారతీయ కర్మాగారాల చట్టం (1948), గనుల చట్టం (1952) నిషేధించాయి. ఆ తర్వాత చాన్నాళ్లకు బాలకార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం (1986) వచ్చింది. దానికి కొనసాగింపుగా జాతీయ బాలకార్మిక విధానం (1987) వచ్చింది. వీటన్నిటివల్లా తగిన ఫలితాలు రాలేదన్న ఉద్దేశంతో 1986 నాటి చట్టానికి 2006లో మరోసారి సవరణలు తీసుకొచ్చారు. ఇవిగాక బాలలందరూ తప్పనిసరిగా బడికెళ్లేలా చూడాలని 2010లో అమల్లోకొచ్చిన విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తున్నది. ఇంత చేసినా బాల కార్మికులు అడుగడుగునా తారసపడుతూనే ఉన్నారు. మన వ్యవస్థ చేతగానితనాన్ని వెక్కిరిస్తూనే ఉన్నారు. కార్పెట్ పరిశ్రమల్లో, బీడీల తయారీలో, మరమగ్గాల పనుల్లో, క్వారీల్లో, ఇటుక బట్టీల్లో, రోడ్డు పక్కన కనబడే టీ దుకాణాల్లో, మెకానిక్ షెడ్లలో...ఎక్కడ చూసినా బాల కార్మికులే కనిపిస్తారు. వీరంతా 5-14 ఏళ్ల మధ్య వయసున్నవారే. కేవలం పేదరికం కారణంగానే బాల్యం చాకిరీలో మగ్గవలసి వస్తున్నదన్నది పాక్షిక సత్యమేనని... పిల్లలు చదువుకు దూరమై పనుల్లో ఉండటంవల్ల నిరుపేదలు ఎప్పటికీ అదే స్థితిలో కొనసాగవలసి వస్తున్నదని ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి అన్నదాంట్లో నిజముంది. పిల్లలకైతే తక్కువ వేతనాలివ్వొచ్చునని, లెక్కకు మిక్కిలి సమయం పని చేయించుకున్నా నోరెత్తర ని యజమానులు భావిస్తున్నారు. కనుకనే నిరుపేద వర్గాలకు సాయం చేసే వంకన పిల్లలతో చాకిరీ చేయిస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) లెక్కల ప్రకారం ఆఫ్రికన్ దేశాల తర్వాత అత్యధిక బాల కార్మికులున్న దేశం మనదే. ఇన్ని చట్టాలున్నా, ఇన్నేళ్లు గడుస్తున్నా దేశంలో బాల కార్మిక వ్యవస్థ అదృశ్యం కాకపోవడానికి కారణాలేమిటి? సమస్య మూలాల్లోకి వెళ్లి అందుకు అనుగుణమైన చట్టాలను తయారుచేయకపోవడంవల్లనా లేక వాటిని అమలు చేస్తున్న అధికార యంత్రాంగంలో అలసత్వమా అనే విషయంలో ఎంత వరకూ సమీక్ష జరిగిందో తెలియదు గానీ 1986 చట్టానికి మరిన్ని సవరణలు తీసుకురావడంతోపాటు దాన్ని బాలలు, కౌమార కార్మికుల నిషేధ చట్టంగా మార్చాలని రెండేళ్లక్రితం యూపీఏ సర్కారు సంకల్పించింది. ఆ బిల్లును పార్లమెంటు స్థాయీ సంఘానికి పంపడం, ఆ సంఘం దాన్ని కూలంకషంగా పరిశీలించి కొన్ని సవరణలు సూచించడం పూర్తయింది. వాస్తవానికి నరక కూపంలో మగ్గుతున్న లక్షలాదిమంది పిల్లలకు విముక్తి కలిగించడానికి ఉద్దేశించిన ఈ బిల్లు విషయంలో పార్లమెంటు ఇంకాస్త చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. కనీసం ఇన్నాళ్లకైనా ఈ బిల్లు సభ ముందుకు రాబోతుండటం మెచ్చదగిందే. 1986 నాటి చట్టప్రకారం వ్యవసాయంవంటి ప్రమాదరహిత రంగాల్లో బాల కార్మికులను పనిలో ఉంచుకోవడం శిక్షార్హమైన నేరం కాదు. తాజా సవరణల ప్రకారం ఇకపై ఏ రంగంలో బాల కార్మికులతో పని చేయించినా నేరమే అవుతుంది. అలాగే, ప్రమాదకర పనుల్లో బాల కార్మికులను ఉంచితే ప్రస్తుత చట్టం ఏడాది జైలు, రూ. 20,000 జరిమానా నిర్దేశిస్తుండగా... వారిని ఏ పనులకు వినియోగించుకున్నా రెండేళ్ల జైలు, రూ. 50,000 జరిమానా విధించాలని ప్రస్తుత సవరణ చెబుతున్నది. అయితే, ఇవన్నీ పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన టాస్క్ఫోర్స్లుండాలి. వాటికి లక్ష్య నిర్దేశం జరగాలి. మన దేశంలో అసలు చట్టాల రూపకల్పనలోనే లోపమున్నది. ఏ చట్టం రూపొందించినప్పుడైనా అందుకు సంబంధించి అప్పటికే అమల్లో ఉన్న ఇతర చట్టాలేమిటో పరిశీలించడం కనీస ధర్మం. కానీ, దాన్ని సరిగా పాటించడం లేదని పదే పదే రుజువవుతున్నది. ఉదాహరణకు విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి. కానీ, అమలులో ఉన్న బాల కార్మికుల నిషేధం, నియంత్రణ చట్టం ప్రకారం కొన్ని రంగాల్లో పిల్లలతో పనిచేయించుకోవడం నేరం కాదు. అలాగే, 2000నాటి జువెనైల్ చట్టం ప్రకారం 18 ఏళ్ల వయసు లోపువారిని బాలలుగానే పరిగణిస్తారు. చట్టాలు ఇలా పరస్పర వైరుధ్యాలతో ఉన్నప్పుడు ఆచరణలో అనేక సమస్యలు ఎదురవుతాయి. అమలు చేసేవారిలో అయోమయం ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకొస్తున్న సవరణ బిల్లుకు అనుగుణంగా ఇతర చట్టాల్లో నిబంధనలను కూడా సవరిస్తే ఈ లోపాన్ని కొంతవరకూ సరిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు...పిల్లలను బడికి పంపించే నిరుపేద కుటుంబాలకు నగదు రూపేణా సాయం చేస్తామని చెప్పడం వల్లా, వారి జీవనప్రమాణాలను పెంచేందుకు అవసరమైన ఇతర చర్యలు తీసుకోవడం వల్లా కాస్తయినా ఫలితం లభిస్తుంది.