తెలంగాణ రైతాంగం పండిం చిన ధాన్యం మొత్తాన్ని కొను గోలు చేయడానికి కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో తెలం గాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావుకూ, కేంద్ర ప్రభుత్వ పెద్దలకూ నడుమ మొదలైన మాటల యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర – రాష్ట్ర సంబంధాలపై చర్చ మరో సారి మొదలైంది. దక్షిణాది రాష్ట్రాల ముఖ్య మంత్రులు కేసీఆర్, పినరయి విజయన్, స్టాలిన్; బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటివారు రాష్ట్రాలపై కేంద్ర పెత్తనాన్ని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ‘‘దేశ ఫెడరల్ వ్యవస్థను కేంద్రం దౌర్జన్యం నుండి కాపాడాల్సిన సమయం ఇది’’ అని మమతా బెనర్జీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు కేంద్రం నియంతృత్వ ధోరణిని ప్రతిఫలిస్తు న్నాయి. ఇదే సమయంలో సమీప భవిష్యత్తులో దేశంలో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాల్ని సైతం ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
గత కొంతకాలంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలతో సంప్రదించకుండా కొన్ని అంశాల్లో ఏకపక్షంగా తీసు కొంటున్న నిర్ణయాల నేపథ్యంలో మమతా బెనర్జీ ‘ఫెడ రల్ వ్యవస్థకు రక్షణ’ అని అనడంలో విస్తృతార్థాలు ఇమిడి ఉన్నాయని పిస్తోంది.
దేశ పాలనా వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రాలు తమతమ అధికార పరిధులకు లోబడి ఉమ్మడి లక్ష్యాలతో సమన్వ యంతో పని చేయాలని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ... కేంద్రంలో ఇటీవల వరకూ ఎవరు అధికారంలోకి వచ్చినా ఏకపక్ష పోకడలు పోవడం ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్రంలో సుదీర్ఘ కాలం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు... రాష్ట్రాలను చిన్న చూపు చూసే ధోరణి మొలకెత్తింది. రాజ్యాంగం నీడలోనే ప్రజామోదం గలిగిన రాష్ట్ర ప్రభుత్వాలను లెక్కలేనన్ని సార్లు కూల్చేసింది కాంగ్రెస్. రాజకీయ ఫిరాయింపులను ప్రోత్స హించింది. దీంతో దానికి వ్యతిరేకంగా దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. ప్రాంతీయ అస్తిత్వం, ఆత్మగౌరవం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ అనే అంశాల ఆధారంగానే అవి ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి రాగలిగాయి.
కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకాలను ఎండగడుతూ వచ్చిన బీజేపీ సైతం నేడు తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. ఇందుకు 2014లో ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన అనంతరం... విభజిత ఆంధ్ర ప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని పట్టించుకోకపోవడం తాజా ఉదాహరణ. ఏడున్నరేళ్ల నరేంద్రమోదీ నేతృత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయక పోగా, ‘పునర్వ్యస్థీకరణ చట్టం–2014’లో పేర్కొన్న రెవెన్యూలోటు భర్తీ, వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, విశాఖకు రైల్వేజోన్ తదితర కీలకమైన అంశాలను; పార్లమెంట్ సాక్షిగా ఇస్తామని వాగ్దానం చేసిన ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’ అంశాన్ని పక్కన పెట్టేసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం–2014 ప్రకారం 9వ షెడ్యూల్‌లో 91 సంస్థలు, 10వ షెడ్యూల్‌లో 142 సంస్థలు ఉన్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన; ఉద్యోగుల విభజన; ఆస్తులు, అప్పులు, ఆదాయ విభజన వంటి అంశాలు ఇంకా పూర్తికాని నేపథ్యంలో... వాటిని పరిష్కరించడానికిగాను 9 అంశా లతో ఎజెండాను రూపొందించి... కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశీష్‌కుమార్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ ఉపకమిటీని ఏర్పాటు చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే 9 అంశాలలో ప్రధానమైన 1) ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 2) పన్ను రాయితీలు 3) ఉత్తరాంధ్ర, రాయల సీమలో వెనుకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు 4) రెవెన్యూ లోటు అంశాలను ఎత్తివేశారు. అజెండాలో కేవలం రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాలను మాత్రమే ఉంచి అజెండాను సవరించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ; ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నిం చిన తెలుగుదేశం పార్టీలు లోపాయికారీగా కుట్రపన్ని త్రిసభ్య కమిటీ అజెండాను కుదించారని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల్ని ఎవ్వరూ కొట్టిపారేయలేరు. ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తే ఆ ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కు తుందన్న దుగ్ధ తెలుగుదేశం అధినేతకు ఉండొచ్చు. కానీ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాల్సిందేనని విభజన బిల్లు ఆమోదం పొందే సంద ర్భంలో రాజ్యసభలో పట్టుబట్టి, గొంతెత్తి పోరాడిన బీజేపీ నేతలు ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదనీ, అది ముగిసిన అధ్యాయం అనీ ప్రచారం చేయడం ఏపాటి ప్రజా స్వామ్యం? కానీ, ఇటీవల బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నట్లు బీజేపీ చెప్ప డంతో... రాజకీయ కారణాల వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ప్రజలకు అర్థమైంది.
విభజన హామీలను నెరవేర్చే విషయంలో ఆంధ్ర ప్రదేశ్‌తోపాటు తెలంగాణకూ న్యాయం జరగలేదు. ఇందుకు కూడా రాజకీయాలే కారణం. విభజన బిల్లులో పేర్కొన్న ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా; నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు రూ. 24,000 కోట్ల ఆర్ధిక సాయం వంటివి అనేకం పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర విమర్శలకు దిగారు.
వివిధ రాష్ట్రాలలో ఉన్న బీజేపీయేతర ప్రాంతీయ పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చి రాజకీయ ఫ్రంట్లను ఏర్పాటుచేసి బీజేపీని రాజకీయంగా ఎదుర్కోవడంవల్ల తక్షణం నెరవేరాల్సిన సమస్యలు పరిష్కారమవుతాయా అనేది ఆలోచించవలసిన అంశం. ఇదే సమయంలో రాష్ట్రాలు బలోపేతం అయితేనే దేశం ఆర్థికంగా పటిష్ట మవుతుందని కేంద్రం గ్రహించాలి. రాష్ట్రాలను బలహీన పర్చడం వలన సాధించేదేమీ ఉండదని, ప్రధాని నరేంద్ర మోదీ గ్రహించి ఇప్పటికైనా ఆ దిశగా నిర్మాణాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ బద్ధంగా రాష్ట్రాలకు లభించాల్సిన నిధులు, హక్కులు బదలాయించి సమాఖ్య స్ఫూర్తిని చాటాలి, ఫెడరల్ వ్యవస్థను పటిష్ట పర్చాలి.
వ్యాసకర్త: డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
ఏపీ శాసన మండలి సభ్యులు
రాజకీయాలకు సమాఖ్య బలి కాకూడదు!
Published Sat, Mar 5 2022 2:28 AM | Last Updated on Sat, Mar 5 2022 2:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment