ఢిల్లీని ఆవరించిన వాయు కాలుష్యం
విశ్లేషణ
‘కాలుష్యం రేపటి తరాలకు శాపం’ అన్నది ఒకప్పటి మాట. నేటి పరిణామాలు గమనిస్తే రేపు కాదు, నేడే ప్రాణాంతకంగా మారింది. అందుకు ఉదాహ రణ దేశ రాజధాని న్యూఢిల్లీ. ఒకప్పుడు ప్రపంచంలోనే అందమైన, ఆహ్లాదకర నగరాలలో ఒకటి. దశాబ్ద కాలం పైబడి మానవ తప్పిదాలు, ప్రభుత్వాల ఉదాసీనత కారణంగా కాలుష్య కాసారంలో పడి మానవ మనుగడ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నిజానికి దేశంలోని అన్ని పెద్ద నగరాలూ ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. వాయుకాలుష్యాన్ని పర్యావరణ సమస్యగానే పరిగణించకుండా, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశంగా చూసి, దాన్నుంచి బయటపడిన కొన్ని దేశాల అనుభవాలు మనకు ఆచరణీయం. కావాల్సిందల్లా తక్షణ నివారణ చర్యల్ని అమలు చేయగలిగే చిత్తశుద్ధి.
ఎక్కడైనా గాలి నాణ్యత స్థాయి (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్– ఏక్యూఐ) 50 నుంచి 100 వరకు ఉంటేనే ఆరోగ్యకరంగా ఉన్నట్టు! దేశంలోని అనేక పట్టణాలు, నగరాలలో ఇది 150 దాటుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులలో ఏక్యూఐ ప్రమాద ఘంటిక లను మోగిస్తోంది. హైదరాబాద్‌లో ప్రస్తుత ఏక్యూఐ సగుటన 130గా నమోదవుతోంది.
ఊపిరాడేనా?
ఢిల్లీలో నవంబర్ రెండో వారం నాటికి ఏక్యూఐ 467 పాయింట్లకు చేరింది. అక్కడి జహంగీర్‌పూర్‌లో అయితే ఏకంగా 567 పాయింట్లు నమోదైంది. ఊపిరాడని కాలుష్య తీవ్రతకు తోడుగా శీతకాలంలో వచ్చే పొగమంచు ఢిల్లీ ప్రజానీకానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఢిల్లీ రన్‌వేపై 400 మీటర్ల తర్వాత ఏముందో కనిపించనంతగా దృశ్య గోచరత (విజిబిలిటీ) తగ్గిపోవడంతో, పలు విమానాల సర్వీసుల్ని రద్దు చేశారు. ఢిల్లీకి వెళ్లే, ఢిల్లీ నుంచే బయలుదేరే రైళ్ల రాక పోకలకు సైతం అంతరాయం ఏర్పడింది.
చిన్న పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలోని అన్ని స్కూళ్ల ప్రైమరీ క్లాసుల్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. రోడ్ల మీద పెట్రోల్, డీజిల్ వాహనాల రాకపోకలను నిలిపివేసి, కేవలం విద్యుత్, సీఎన్‌జీలతో నడిచే వాహనాలనే అనుమ తిస్తున్నారు. ప్రజారవాణా తప్ప సొంత వాహనాలలో బయటకు వెళ్లే అవకాశం లేని దయనీయ దుఃస్థితి ఏర్పడింది.
ఒక్క సమస్య పలు ఇతర సమస్యలకు పుట్లిల్లు అవుతుందని ఓ సామెత. దశాబ్దకాలంగా ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలను వేధిస్తూ వస్తున్న వాయు, నీటి కాలుష్యాలు అనేక అనర్థాలకు దారితీశాయి. వాటిని పరిష్కరించక పోవడం వల్లనే నేడు కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం, భవితవ్యం ప్రశ్నార్థకంగా మారాయి.
ఇప్పటికే వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్థిర నివాసం ఉంటున్న ప్రజలలో చాలామందికి శ్వాసకోశ సమస్యలు మొదలుకొని క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురవుతున్నారు. నిజానికి, ఢిల్లీ వాయుకాలుష్యంపై అనేక సందర్భాలలో సర్వోన్నత న్యాయస్ధానం జోక్యం చేసుకోవడంతోనే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలనైనా చేపట్టాయి. ఈ అరకొర చర్యలు ప్రజానీకాన్ని రక్షించగలవా?
విదేశాల అనుభవాలు
ప్రపంచంలోని అనేక నగరాలు ఏదో ఒక సమయంలో కాలుష్యం బారిన పడినవే. పరిశ్రమల ఏర్పాటు, భవన నిర్మాణాలు ముమ్మరం కావడం, పట్టణీకరణ పెరగడం తదితర అంశాల వల్ల వాయు, నీటి కాలుష్యాలు అన్నిచోట్లా తీవ్రస్థాయికి చేరాయి. 1952లో లండన్ నగరాన్ని కాలుష్య భూతం కాటేసింది. ‘గ్రేట్ స్మాగ్’ అని పిలిచే ఆ ఉత్పా తానికి 1,200 మంది బలయ్యారు. దాంతో, 1956లో బ్రిటిష్ ప్రభుత్వం ‘క్లీన్ ఎయిర్ యాక్ట్ 1956’ తెచ్చి కఠినంగా అమలు చేసింది. లండన్ నగరంలోని అన్ని పరిశ్రమలనూ సుదూర ప్రాంతా లకు తరలించింది. నగరంలోని ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరిచి పచ్చదనం పెంచింది.
అలాగే, 2008లో ‘బీజింగ్ ఒలింపిక్స్’ నిర్వహించిన చైనా ప్రభు త్వానికి కూడా వాయుకాలుష్యం సవాలు విసిరింది. భారీ నిర్మాణాలు చేపట్టిన ఆ సందర్భంలో, గాలి నాణ్యత తగ్గకుండా చైనా ప్రభుత్వం అన్ని రకాల పరిశ్రమలనూ దూర ప్రాంతాలకు తరలించింది. వాహ నాలను క్రమబద్ధీకరించడమేకాక, ప్రజా రవాణాను ఉపయోగించుకొనేలా ప్రజలను సమాయత్తం చేసింది. బీజింగ్‌లో వాయు కాలుష్యం తగ్గాక, అక్కడి ప్రజల ఆయుర్దాయం సగటున నాలుగేళ్లు పెరిగిందని చైనా ప్రభుత్వం వెల్లడించింది.
పారిశ్రామికంగా ఎంతో ముందంజ వేసిన అమెరికా, మెక్సికో, జపాన్‌లు ఒకప్పుడు వాయుకాలుష్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, వేగంగా ఆ సమస్య నుండి బయటపడ్డాయి. ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడిగా ఆ సమస్యను ఎదుర్కొన్న తీరు అనన్య సామాన్యం. వాయు కాలుష్యాన్ని ఆ ప్రభుత్వాలు కేవలం పర్యావరణ సమస్యగానే పరిగ ణించలేదు, ప్రజారోగ్యానికి సబంధించిన అంశంగా చూశాయి. ప్రభు త్వంలోని అన్ని శాఖలు సమీకృతంగా సమస్యను ఎదుర్కోవడానికి కృషి చేశాయి.
అటువంటి రోడ్ మ్యాప్ మన దేశంలో లేకపోవడంతోనే ‘ఇంతింతై వటుడింతౖయె...’ అన్నట్లు కాలుష్య సమస్య పెనుభూతంగా మారింది. పారిశ్రామిక వ్యర్థాలు, వాహనాలు వెలజల్లే కార్బన్ డయాక్సైడ్, భవన నిర్మాణాల కారణంగా గాలిలో కలిసే ధూళి;ఎండిన చెట్లు, చెత్తా, చెదారాలన్నింటినీ తగల బెట్టడం ద్వారా వచ్చే పొగ... ఇవన్నీ వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి.
ఢిల్లీకి పక్కనే ఉన్న యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థాలను విచ్చలవిడిగా వదలడంతో ఆ ప్రాంతం పూర్తిగా కలుషితమైంది. ఢిల్లీకి సమీపంలో ఉన్న హరియాణా, పంజాబ్ రాష్ట్రాలలో ప్రతి వ్యవసాయ సీజన్ ముగి శాక పంట వ్యర్థాలను కాల్చడంతో... దట్టమైన పొగలు కమ్మేస్తు న్నాయి. వీటికితోడు దీపావళి, కొన్ని వివాహ వేడుకల సందర్భంగా వినోదం కోసం టపాసుల్ని పేల్చడం ఆనవాయితీగా వస్తోంది. ఇవి కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి.
ప్రభుత్వాల ముందున్న కర్తవ్యం
ఢిల్లీని పీడిస్తున్న వాయుకాలుష్యం చాలావరకు స్వయం కృతమే. ఢిల్లీ పరిధిలో 9,000 హోటళ్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున బొగ్గు ఉపయో గిస్తున్నట్లు తేలింది. తందూరీ వంటకాలు చేసే హోటళ్లు బొగ్గును వాడుతున్నాయి. వంటకు గ్యాస్ బదులు కట్టెలు, వ్యవసాయ వ్యర్థాలు, పిడకలు వాడుతున్నవారి సంఖ్య ఢిల్లీలో దాదాపు 20 లక్షలు ఉన్నట్లు చెబుతున్నారు.
ఢిల్లీలో రోజుకు సగటున 500 టన్నుల మునిసిపల్ సాలిడ్ వేస్ట్ (ఇళ్ల నుంచి సేకరించే వ్యర్థాల)ను కాలు స్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. భవన నిర్మాణాలు జరిగేటప్పుడు, నిర్మాణ స్థలాల్ని పూర్తిగా కవర్ చేయడం; సిమెంట్, ఫ్లయ్ యాష్
వంటి నిర్మాణరంగ మెటీరియల్స్‌ను కప్పి ఉంచడం తప్పనిసరిగా చేయాల్సి ఉన్నప్పటికీ... ఆ నిబంధనల్ని చాలావరకు పాటించడం లేదు.
చమురు శుద్ధి ప్లాంట్ల నుంచి ప్రాణాంతకమైన సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ వెలువడుతుంటాయి. వీటిని నిరోధించే టెక్నాలజీని అమెరికా, చైనా ఉపయోగిస్తుండగా మనకు అందుబాటులోకి రాలేదు. కాలుష్యాన్ని ఎక్కువ వెదజల్లే పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్యను అభివృద్ధి చెందిన దేశాలు 30 శాతానికి తగ్గించాయి. అధునాతన ఫిల్టర్లను ఉపయోగిస్తూ వాయు కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించాయి.
చాలా దేశాలలో పంట వ్యర్థాలను తగులబెట్టకుండా వాటిని బయోగ్యాస్ ఉత్పత్తికి, పశువుల దాణాకు వాడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నింపేటప్పుడూ(అన్‌లోడింగ్), వాహనాల్లో ఇంధనం పోసేటప్పుడూ గాలిలో ప్రమాదకర ఆర్గానిక్ వ్యర్థాలు కలుస్తాయి. చాలా దేశాలలో ఇంధనం లోడింగ్, అన్‌లోడింగ్ సమ యాలలో ‘వేపర్ రికవరీ సిస్టవ్‌ు’ టెక్నాలజీని ఉపయోగిస్తూ దీన్ని నివారించగలుగుతున్నారు.
ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్య భూతం మాటేసిన మృత్యు వులా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజల భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన తక్షణ నివారణ చర్యల్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. లేకుంటే, దేశ రాజధాని ఆరోగ్య భద్రతను కాపాడు కోలేకపోతోందనే అపప్ర«థ ప్రభుత్వంపై పడుతుంది. అంతర్జాతీయ సమాజంలో తలదించుకోవాల్సి వస్తుంది.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసనమండలి సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment