
వాషింగ్టన్: ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సిన సమయం వచ్చేసిందని టెక్ దిగ్గజం, డోజ్ సారథి ఎలన్ మస్క్ గురువారం స్పష్టం చేశారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా పునర్ వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్య తప్పదన్నారు. దుబాయ్‌లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్‌లో ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘టెక్ సపోర్ట్’అని ముద్రించిన నల్ల టీషర్టు ధరించి కన్పించారు. ‘‘ప్రజాపాలన స్థానంలో ఉద్యోగస్వామ్యం (బ్యూరోక్రసీ) పాలన నడుస్తోంది.
ఈ వ్యవస్థ ప్రజాస్వామ్యాన్నే మించిపోయింది’’అంటూ ఆక్షేపించారు. ఫెడరల్ ఏజెన్సీలు సాధారణంగా నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలు. అంతరిక్ష సంస్థ నాసాతో పాటు న్యాయ శాఖ వంటివి కూడా ఇలా ఏర్పాటు చేసినవే కావడం విశేషం! వృథా ఖర్చుల తగ్గింపు, సామర్థ్య పెంపు కోసం ఏజెన్సీల సామూహిక మూసివేతలు తప్పవని మస్క్ తాజా ప్రసంగంలో స్పష్టం చేశారు.
‘‘పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడిక ఈ ఏజెన్సీల్లో చాలావాటిని పక్కన పెట్టినా పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదు. మెరుగైన ఫలితాలు కనిపించాలంటే వాటిని మొత్తంగా తొలగించాల్సిందే. ఎందుకంటే కలుపును కూకటివేళ్లతో సహా తొలగించకపోతే మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉంటుంది’’అని వ్యాఖ్యానించారు. అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో మితిమీరి జోక్యం చేసుకోకుండా సొంత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని మస్క్ వాదిస్తున్నారు. ఆ దిశగా మొత్తంగా అమెరికా విదేశాంగ విధానంలోనే భారీగా మార్పుచేర్పులు తెచ్చేందుకు మస్క్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
డోజ్ దూకుడు
మస్క్ నేతృత్వంలో ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (డోజ్) ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగుల్లో వీలైనంత మందిని తొలగించే పనిలో పడింది. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోంది. అనేక విభాగాలకు బడ్జెట్లను ఇప్పటికే తగ్గించింది. చాలాకాలంగా విదేశాలకు సాయమందిస్తున్న యూఎస్ ఎయిడ్ వంటి పలు ఏజెన్సీలను మూసేసింది.
విద్యార్థుల ప్రతిభను ఎప్పటికప్పుడు బేరీజు వేసే స్వతంత్ర పరిశోధన సంస్థ అయిన విద్యా శాఖ కాంట్రాక్టుల విభాగానికి నిధులను ఏకంగా 100 కోట్ల డాలర్ల మేర తగ్గించే దిశగా మస్క్ తాజాగా చర్యలు చేపట్టారు. ఇది కార్యరూపం దాలిస్తే ఆ విభాగం దాదాపుగా మూతపడ్డట్టే. ఏజెన్సీల ఉద్యోగుల సామూహిక తొలగింపును వేగవంతం చేయడానికి మస్క్ వివాదాస్పద విధానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని చట్టపరంగా సవాలు చేసిన పలు ఉద్యోగ సంఘాలకు తాజాగా కోర్టులోనూ చుక్కెదురైంది. ఆ విధానాన్ని సవాలు చేసే హక్కు వారికి లేదని డి్రస్టిక్ట్ కోర్టు జడ్జి జార్జ్ ఓ టూల్ జూనియర్ బుధవారం తీర్పు వెలువరించారు. దానిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ హర్షం వెలిబుచ్చారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment