పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్? | Republicansc Reject Funding Bill US Government Shutdown | Sakshi

US Government Shutdown: పట్టు వదలని రిపబ్లికన్లు.. అమెరికా షట్ డౌన్?

Published Sat, Sep 30 2023 1:16 PM | Last Updated on Sat, Sep 30 2023 1:35 PM

Republicansc Reject Funding Bill US Government Shutdown - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో జో బైడెన్ నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వానికి కొత్త ఆర్ధిక సంవత్సరం ముందు షాక్ తగిలింది. అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించగా 232-198 తేడాతో ఆమోదానికి నోచుకోలేదు. దీనివలన వచ్చేనెల ప్రారంభం కానున్న ఆర్ధిక సంవత్సరం చెల్లింపులన్నీ నిలిచిపోనున్నాయి. మొదట్లో బెట్టు చేసినా చివరి నిమిషంలో రిపబ్లికన్లు ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిల్లు ఆమోదం పొందకపోతే షట్ డౌన్ తప్పదంటున్నాయి అమెరికా కాంగ్రెస్ వర్గాలు.  

షట్ డౌన్?
ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో వార్షిక ద్రవ్య బిల్లును రిపబ్లికన్లు వ్యతిరేకించారు. అమెరికాలో ఆర్ధిక చెల్లింపులు జరగాలంటే వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం తప్పనిసరి. ఈనెలలో చివరి రోజైన శనివారం ఈ బిల్లు ఆమోదం పొందకపోతే అమెరికా అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోనుంది. దీనివలన 18 లక్షల మంది ఉద్యోగులున్న ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులు, ఆయా పథకాలకు నిధులతో పాటు సైనికుల జీతాలు కూడా స్తంభించిపోయే ప్రమాదముంది. 

ఎందుకు ఆగింది? 
సరిహద్దు భద్రత ఏజెన్సీ తోపాటు మరికొన్ని ఏజెన్సీల చెల్లింపుల్లో ఫెడరల్ ప్రభుత్వం 30 శాతం కోత విధించింది. దీనిని రిపబ్లికన్లు తప్పుబడుతున్నారు. అలాగే ఉక్రెయిన్‌కు నిధులివ్వాలనే బిల్లును తిరస్కరించనున్నారు. అమెరికా కాంగ్రెస్‌లోని ప్రజాప్రతినిధుల సభలో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున బిల్లు ఆమోదం కష్టసాధ్యంగా మారింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన స్పీకర్‌ కెవిన్‌ మెక్ కార్తీ బిల్లును ఆమోదింపజేసి షట్ డౌన్ నివారించేందుకు అన్నివిధాలా ప్రయత్నం చేశారు. చివరి రోజున కూడా ఆయన ప్రయత్నాలు ఫలించకపోతే మాత్రం అమెరికా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని అంటున్నాయి యూఎస్ కాంగ్రెస్ వర్గాలు. ఈ సంక్షోభాన్ని నివారించాలంటే బిల్లులో నుంచి ఉక్రెయిన్ అంశాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని అంటున్నారు సెనేటర్ రాండ్ పాల్.

ఇది కూడా చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement