
బ్యాంకాక్: మయన్మార్ సైన్యం సోమవారం ఓ పాఠశాల భవనంపై జరిపిన వైమానిక దాడిలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులకు సమీపంలోని సగయింగ్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. డెపాయిన్ పట్టణ సమీపంలోని గ్రామంపై జరిగిన ఈ దాడిలో 50 మంది విద్యార్థులు గాయపడినట్లు ప్రైవేట్ మీడియా సంస్థలు తెలిపాయి.
ప్రజాస్వామ్య అనుకూల వాదులు ఈ స్కూలును నడుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం, ప్రభుత్వ మీడియా ఈ దారుణంపై స్పందించలేదు. 2021లో అంగ్‌సాన్ సుకీ సారథ్యంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సాయుధ గ్రూపులకు వ్యతిరేకంగా సైనిక జుంటా భారీ వైమానిక దాడులు కొనసాగిస్తోంది. ఆర్మీ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 6,600 మంది పౌరులు చనిపోయినట్లు అంచనా.