Myanmar army
-
మయన్మార్ ఆర్మీ సంచలన నిర్ణయం: ప్రజలకు న్యూఇయర్ గిఫ్ట్
యాంగూన్: మయన్మార్‌లో సంప్రదాయ తింగ్యాన్ కొత్త సంవత్సర సెలవు సందర్భంగా జైళ్లలో ఉన్న 23 వేల మందికి పైగా నిరసన కారుల క్షమాభిక్ష పెట్టి, వారిని విడుదల చేసినట్లు మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. అయితే ఫిబ్రవరిలో అధికారాన్ని చేజిక్కించు కున్న నాటి నుంచి అరెస్టయిన వారిని అందరినీ విడుదల చేసిందో లేదో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. ఆర్మీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ లైంగ్ మొత్తం 23,047 మందికి క్షమాభిక్ష పెట్టారని, అందులో 137 మంది విదేశీయులు కూడా ఉన్నారని అక్కడి ప్రభుత్వ మీడియా ఎమ్ఆర్టీవీ తెలిపింది. విడుదలైన విదేశీయులను అక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. యాంగూన్‌లోని ఇన్సేన్ కారాగారం నుంచి వీరంతా విడుదలవుతున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో పెట్టిన పోస్టులకు సైతం పలువురుని ఆర్మీ అరెస్టు చేసింది. అయితే ఇప్పుడు విడుదలైన వారిలో వారున్నారో లేదో ఇంకా తెలియలేదు. ఆర్మీ దేశాధికారం అందుకున్న నాటి నుంచి ఇలా ఖైదీలను విడుదల చేయడం ఇది రెండోసారి. -
మయన్మార్‌లో సైన్యం ఆగడం
అరకొరగానైనా ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తున్నట్టు నటించటం మొదలుబెట్టి నిండా ఆరేళ్లు కాకుం డానే మయన్మార్ సైన్యం అప్పుడే తన ప్రతాపం చూపింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కీలక నేత ఆంగ్‌సాన్ సూకీ మార్గదర్శకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వాన్ని సోమవారం కూల్చి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు ప్రకటించింది. మయన్మార్‌లో గత నవంబర్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సూకీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ (ఎన్ఎల్డీ) ఘన విజయం సాధించినప్పుడే మయన్మార్ సైన్యం ఎలాంటి అడుగులు వేస్తుందోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో సైన్యం ప్రాభవం పూర్తిగా అడుగం టింది. ప్రజలు ఎన్నుకోవటానికి కేటాయించిన 476 స్థానాల్లో సూకీ పార్టీ 396 (83 శాతం) గెల్చుకుని ఘన విజయం సాధించింది. సైన్యం కనుసన్నల్లో నడిచే యూనియన్ సాలిడారిటీ అండ్ డెవెలప్మెంట్ పార్టీ (యూఎస్డీపీ) కేవలం 33 స్థానాలకే (7శాతం) పరిమితమైంది. సైన్యానికి తోకలావుండే మరికొన్ని చిన్న పార్టీలు అంతకన్నా చాలా తక్కువ స్థానాలకు పరిమితమయ్యాయి. పార్లమెంటులో సైన్యం ముందుజాగ్రత్త చర్యగా తనకు తాను కేటాయించుకున్న 166 సీట్ల(25శాతం) కోటా వుండనే వుంది. ఇంతచేసినా పార్లమెంటులో సైన్యం కోసం గొంతెత్తే వారు 32 శాతం మించిలేరు. 2015లో చాన్నాళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించినప్పుడు పరిస్థితి వేరు. ఎన్ఎల్డీ అప్పుడు కూడా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నా సైన్యం పలుకుబడి తగ్గలేదు. తనను కాదని చట్టాలు చేసే పరిస్థితి ఎన్ఎల్డీ ప్రభుత్వానికి లేదు. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పైగా సైన్యం అధికారాలను కత్తిరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతున్న దన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఇదంతా మింగుడు పడని సైన్యం పథక రచన చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. సైనిక కుట్ర జరగొచ్చునన్న కథనాల్లో నిజం లేదని, తాము ఆ మాదిరి చర్యకు పాల్పడబోమని సైన్యం చెబుతూ వచ్చింది. కానీ అందుకు భిన్నంగా ప్రవర్తించి తన నైజాన్ని వెల్లడించుకుంది. ఇంచుమించు మనతోపాటే బ్రిటిష్ వలసపాలకులపై పోరాడి మయన్మార్ స్వాతంత్య్రాన్ని సాధించుకోగా స్వల్పకాలంలోనే అది సైనిక నియంతల ఏలుబడిలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి అడపా దడపా సైనిక నియంతలు ఎన్నికల తతంగాన్ని నడిపిస్తూనే వున్నారు. 1990లో జరిగిన ఎన్నికల్లో ఎన్ఎల్డీ 80 శాతం స్థానాలు గెల్చుకోగా అప్పుడు కూడా సైన్యానికి మింగుడుపడక వాటిని రద్దు చేసింది. యధాప్రకారం మరికొన్నాళ్లు సైనిక పాలన కొనసాగింది. ఈలోగా అంతర్జాతీ యంగా ఒత్తిళ్లు పెరగటంతో 2010లో మరోసారి తప్పనిసరై ఎన్నికలు నిర్వహించారు. అందులో 80 శాతం ప్రజానీకం సైన్యం ప్రాపకం వున్న పార్టీలకే అధికారం కట్టబెట్టారని ప్రపంచాన్ని నమ్మించే యత్నం చేశారు. కానీ ఎవరూ ఆ కపట నాటకాన్ని ఆమోదించడానికి సిద్ధపడలేదు. దాంతో 2015లో ఎన్నికల నిర్వహణ తప్పలేదు. చాన్నాళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ పర్యవేక్షణలో ఆ ఎన్నికలు జరగటం, అందులో ఎన్ఎల్డీ ఘన విజయం సాధించటంతో ఇష్టం లేకున్నా సైనిక పాలకులు ఆ పార్టీకి అధికారం అప్పగించారు. అప్పట్లో ఇలా అధికారం అప్పగించటానికి రెండు కారణాలు న్నాయి. అందులో మొదటిది–పాలనపై తమ పట్టు పూర్తిగా సడలకపోవటం. రెండోది ఆంగ్ సాన్ సూకీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ సైనిక నియంతలు రాజ్యాంగం రాసుకున్నారు. సూకీకి అధికార యోగం లేకుండా చేశామని సంబరపడ్డారు. ఆ సమయంలోనే పార్లమెంటునుంచి అట్టడుగు ప్రజాస్వామ్య వ్యవస్థలవరకూ అన్నిచోట్లా తమ కోసం 25 శాతం సీట్లు దఖలు పరచుకున్నారు. తమకు ఇష్టమైనవారిని చట్టసభల్లో కూర్చోబెట్టుకుని, ఎన్నికైన ప్రభుత్వం హద్దుమీరకుండా చూశారు. ఎందుకైనా మంచిదని వీటో అధికారాలు సైతం పెట్టుకున్నారు. అందుకే గత అయిదేళ్లుగా ఎన్ఎల్డీ ప్రభుత్వం సైన్యం నిర్దేశించిన హద్దుల్లోనే పాలించింది. మైనారిటీ వర్గమైన రోహింగ్యా ముస్లింలను సైనిక దళాలు కళ్లముందే ఊచకోత కోసినా సూకీ పట్టనట్టే వ్యవహరించారు. పైగా సైన్యాన్నే సమర్థించారు. అందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొ న్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సైనికుల ఆగడాలను సమర్థించటం దారుణమని అనేకులు దుమ్మెత్తిపోశారు. కానీ సూకీని విశ్వసించటానికి సైన్యం సిద్ధంగా లేదని తాజా పరిణా మాలు తేటతెల్లం చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకోవచ్చునన్న రాజ్యాంగ నిబంధనకు అను గుణంగానే ఈ పని చేశామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ చెల్లదు. అలాగే ఏడాదిపాటు మాత్రమే పాలిస్తామని, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ ప్రజా పాలకులకు అధికారం కట్టబెడతామని చెబుతున్న మాట కూడా బూటకమే. నవంబర్ ఎన్నికల్లో తాము సమర్థించినవారు చిత్తుగా ఓడారన్న దుగ్ధతో, తమకు సర్వాధికారాలు కట్టబెడుతున్న రాజ్యాంగాన్ని ఇప్పుడొచ్చిన మెజారిటీతో ఎన్ఎల్డీ సర్కారు మారుస్తుందనే భయంతో సైన్యం ఈ దారుణానికి తెగించిందని ప్రపంచానికి అర్థమైంది. ఇప్పుడు ఆంగ్ సాన్ సూకీ, అధ్యక్షుడు విన్ మియింత్ల ఆచూకీ తెలియకుండా పోయింది. వారిని ఎక్కడ నిర్బంధించారో, జరుగుతున్నదేమిటో వెల్లడించాల్సిన బాధ్యత సైనిక పాలకులది. ఈ కుట్రలో చైనా పాత్ర ఏమేరకుందో ఆ దేశం జవాబివ్వాలి. ఒకటైతే నిజం... ఇతర దేశాల మాదిరి సైనిక తిరుగుబా టును ఆ దేశం ఖండించలేదు. విభేదాలను రాజ్యాంగం పరిధిలో అన్ని పక్షాలూ పరిష్కరించు కోవాలని సలహా ఇచ్చింది. ఇది సరికాదు. ప్రపంచ దేశాలన్నీ సైన్యంపై ఒత్తిడి తెస్తేనే... అక్కడి ప్రజ లకు నైతిక మద్దతునిస్తేనే ప్రజాస్వామ్యం మళ్లీ చివురిస్తుంది. అందుకోసం అందరూ కృషి చేయాలి. -
ప్రజలు ఎన్నుకున్నా పవర్లో లేరెందుకు!
జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తికి ఎంతటి ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల్లో ఘన విజయం సాధించినా మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. ఆ పవర్ లేనందు వల్లనే మయన్మార్ సైన్యం తాజాగా మరొకసారి దేశంలోని ‘ప్రజా పాలన’ను∙చేజిక్కించుకుంది. సూకీని నిర్బంధించింది. సూకీకి అప్పుడు 43 ఏళ్లు 8–8–88. ఆగస్టు 8, 1988. రంగూన్లో ప్రజలు ఎక్కడికక్కడ గుమికూడుతున్నారు. పిడికిళ్లు ఎక్కడివక్కడ బిగుసుకుంటున్నాయి. నలు దిక్కులా ప్రజాస్వామ్యం కోసం నినాదాలు! విశ్వవిద్యాలయాల విద్యార్థులు, బౌద్ధ భిక్షువులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు, యువకులు, గృహిణులు, చిన్నపిల్లలు... ‘విప్లవం వర్థిల్లాలి’ అంటూ ఇళ్ల నుంచి, మఠాల నుంచి, పాఠశాలల నుంచి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి పరుగులు తీస్తూ బయటికి వస్తున్నారు. ఉద్యమ ప్రకంపనలు దేశంలో ప్రతిచోటా ప్రతిధ్వనించడం మొదలైంది. వక్తలు ఆవేశంగా ప్రసంగిస్తున్నారు. బుద్ధుడిని, మార్క్స్‌ని కలిపి బర్మాను సోవియెట్ యూనియన్‌లా మార్చేందుకు ‘కమ్యూనిస్టు నియంత’ నెవిన్ చేసిన ప్రయోగాలు వికటించి బర్మాకు తిండి కరువైంది. చివరికి తిరుగుబాటు ఒక్కటే ప్రజలకు మిగిలిన తిండీబట్టా అయింది. ఆ తిరుగుబాటు కు నాయకత్వం వహించడానికి సూకీ బయటికి వచ్చారు. ఆ తర్వాత బర్మా సైనిక పాలకులు ఆమెను దాదాపు పదిహేనేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. ఆరేళ్ల వయసులో (1951) సూకీ సూకీ వయసిప్పుడు 75 ఏళ్లు 2020 నవంబర్ 8. మయన్మార్ పార్లమెంటు ఎన్నికల్లో సూకీ పార్టీ ‘నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ’ (ఎన్.ఎల్.డి.) ఘన విజయం సాధించింది. సూకీ అధ్యక్షురాలు అవ్వాలి. కానీ కాలేరు! అయ్యేపనైతే అంతకుముందు 2015లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించినప్పుడే కావలసింది. ఆంగ్‌సాన్ సూకీ ఎప్పటికీ అధ్యక్షురాలు కాకుండా ఉండడం కోసం 2008లో మయన్మార్ మిలటరీ ప్రభుత్వం ఒక రాజ్యాంగ సవరణ చేసింది. దాని ప్రకారం.. జీవిత భాగస్వామి గానీ, పిల్లలు గానీ విదేశీ పౌరులై ఉంటే ఆ వ్యక్తి మయన్మార్ అధ్యక్షులు అయ్యేందుకు లేదు. సూకీ ఇప్పుడు అధ్యక్షురాలు అవాలంటే ఆ క్లాజును రద్దు చేస్తూ రాజ్యాంగ సవరణ తేవాలి. అందుకు మిలటరీ ఒప్పుకోవాలి. మిలటరీ ఒప్పుకునే పనైతే మొన్న సోమవారం సూకీని, మయన్మార్ దేశ అధ్యక్షుడిని, మరికొంతమంది ఎన్.ఎల్.డి. నేతల్ని సైన్యం నిర్బంధించి, దేశాన్ని తన అధీనంలోకి తీసుకునే వరకు పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మొన్నటి నవంబర్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కనుక, ఏడాది ఆగి సక్రమ ఎన్నికలు జరిపిస్తామని సైన్యం అంటోంది. అంతవరకు సూకీ నిర్బంధంలోనే ఉండే అవకాశం అయితే ఉంది. 88కి ముందు సూకీ ఎక్కడున్నారు? పెద్ద చదువులు చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ దాదాపు నలభై ఏళ్ల పాటు విదేశాల్లో గడిపి, 1988లో మయన్మార్ వచ్చిన ఏడాదే ఉద్యమ శక్తిగా అవతరించారు సూకీ. ‘ఆ శక్తి నాకు నా తండ్రి, బర్మా ప్రజలు ఇచ్చిన శక్తి’ అని చెప్తారు సూకీ. ఆమె తండ్రి దేశభక్త విప్లవకాý‡ుడు. అసలు ఆంగ్ సాన్ సూ కీ అన్న పేరులోనే మూడు తరాల శక్తి ఉంది. ‘ఆంగ్ సాన్’ అన్నది ఆమె తండ్రి పేరు. ‘సూ’ అన్నది తాతగారి (నాన్న నాన్న) పేరు. ‘కీ’ అన్నది అమ్మ పేరు. సూకీ రంగూన్లో జన్మించారు. పాలిటిక్స్, ఫిలాసఫీ చదివారు. బ్రిటిష్ పౌరుడు మైఖేల్ ఆరిస్ ను వివాహం చేసుకున్నారు. ఇద్దరు కొడుకులు. తర్వాత మయన్మార్ వచ్చి ఉద్యమం బాట పట్టారు. ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఫలితంగా గృహ నిర్బంధానికి గురయ్యారు. సొంత రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2015 పార్లమెంటు ఎన్నికల్లో, తిరిగి మొన్నటి 2020 ఎన్నికల్లో భారీ మెజారిటీతో నెగ్గారు. తొలి ఎన్నికలు (2015) ఆమె సాధించిన నోబెల్ శాంతి బహుమతి కంటే గొప్ప విజయంగా చెబుతారు అక్కడి ప్రజలు. ఇక ఏం జరగబోతోంది? కుట్రపూరితంగా తిరుగుబాటు చేసి ఈ సోమవారం (ఫిబ్రవరి 1) మయన్మార్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్న సైన్యం ఏడాది లోపే తిరిగి పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతవరకు సూకీ సహా ముఖ్య నేతలందరూ నిర్బంధంలోనే ఉండొచ్చు. అయితే సూకీ ఆరోగ్య పరిస్థితి కొంతకాలంగా బాగుండటం లేదని వార్తలు అందుతున్నాయి. 2003 లోనే.. గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు.. ఆమెకు స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సమస్యకు అత్యవసర శస్త్ర చికిత్స జరిగింది. తర్వాత 2013లో పాదానికి, 2016 లో కంటికి శస్త్ర చికిత్సలు జరిగాయి. సూకీని నిరంతరం పర్యవేక్షిస్తుండే డాక్టర్ టిన్ మియో విన్ ఆమె మరీ 48 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, రక్త పీడనం కూడా బాగా తక్కువగా ఉంది కనుక తేలికగా ఆమె బలహీనం అయ్యే అవకాశాలు ఉన్నాయని అప్పట్లోనే జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతానికి సూకీ ఆరోగ్యంగానే ఉన్నారు. సూకీ భర్త 1999 లో 53 ఏళ్ల వయసులో మరణించారు. కొడుకులిద్దరూ బ్రిటన్ నుంచి వచ్చి పోతుంటారు. -
మిలటరీ గుప్పెట్లో మయన్మార్
నేపిదా: స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే బర్మాలో ప్రజాస్వామ్యం కనిపించింది. అధిక కాలం మిలటరీ గుప్పెట్లోనే బర్మా గడిపింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మయన్మార్‌లో జరిగిన కీలక సంఘటనల సమాహారం పరిశీలిస్తే.. 1948, జనవరి 4: బర్మాకు బ్రిటీష్ వారినుంచి స్వాతంత్రం లభించింది. 1962: మిలటరీ నేత నీ విన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి పాలనా పగ్గాలు చేపట్టారు. 1988: ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఆంగ్‌సాన్ సూకీ విదేశీ ప్రవాసం నుంచి స్వదేశానికి వచ్చారు. దేశంలో జుంటా(మిలటరీ సమూహం)పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో జరిగిన నిరసనలపై మిలటరీ కాల్పులు జరపగా వందలాది మంది మరణించారు. 1989, జూలై: జుంటాపై తీవ్ర విమర్శలు చేస్తున్న సూకీని హౌస్ అరెస్టు చేశారు. 1990, మే 27: ఎన్నికల్లో సూకీ పార్టీ ద నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ బంపర్ మెజార్టీ సాధించింది. కానీ పాలనా పగ్గాలు అందించేందుకు జుంటా నిరాకరించింది. 1991, అక్టోబర్: సూకీకి శాంతియుత పోరాటానికిగాను నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 2010, నవంబర్ 7: ఇరవై సంవత్సరాల తర్వాత జరిపిన ఎన్నికల్లో జుంటా అనుకూల పార్టీకి అత్యధిక సీట్లు దక్కాయి. 2010, నవంబర్ 13: దశాబ్దాల హౌస్ అరెస్టు అనంతరం సూకీ విడుదలయ్యారు. 2012: పార్లమెంట్ బైఎలక్షన్లో సూకీ విజయం సాధించారు. 2015, నవంబర్ 8: సూకీ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. కీలక పదవులను జుంటా తన చేతిలో ఉంచుకొని సూకీకి స్టేట్ కౌన్సిలర్ పదవి కట్టబెట్టింది. 2017, ఆగస్టు 25: రోహింగ్యాలపై మిలటరీ విరుచుకుపడింది. దీంతో వేలాదిమంది బంగ్లాదేశ్‌కు పారిపోయారు. 2019, డిసెంబర్ 11: జుంటాపై అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న విచారణలో సూకీ తమ మిలటరీకి మద్దతుగా నిలిచారు. 2020, నవంబర్ 8: ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్ఎల్డీకి మరోమారు మెజార్టీ దక్కింది. 2021, జనవరి 29: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న జుంటా ఆరోపణలను బర్మా ఎన్నికల కమీషన్ తోసిపుచ్చింది. ఇందుకు సరైన ఆధారాల్లేవని తెలిపింది. 2021, ఫిబ్రవరి 1: దేశాన్ని ఒక సంవత్సరం పాటు ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు మిలటరీ ప్రకటించింది. ఓటింగ్ అక్రమాలపై సూకీ ప్రభుత్వ స్పందన పేలవంగా ఉందని, కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని సూకీ పట్టించుకోలేదని ఆరోపించింది. మరోమారు సూకీని హౌస్ అరెస్టు చేస్తున్నట్లు తెలిపింది. -
‘రోహింగ్యాలపై హత్యాకాండ ఆపండి’
ది హేగ్: మయన్మార్ సైన్యం దాడులతో బంగ్లాదేశ్ వెళ్లి తలదాచుకుంటున్న లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలకు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకాండను ఆపేందుకు మయన్మార్ ప్రభుత్వం వెంటనే అన్ని రకాల చర్యలనూ తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నదీ ముందుగా నాలుగు నెలలకు, ఆ తర్వాత ఆరు నెలలకోసారి నివేదిక అందించాలని ఐసీజే ప్రెసిడెంట్ అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ కోరారు. మయన్మార్ సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలు, హత్యలు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడుతోందని ముస్లిం దేశాల తరఫున ఐసీజేలో గాంబియా వాదించింది. -
కట్టుబట్టలు.. కాలే కడుపులు
మాది వ్యవసాయ కుటుంబం. గతనెలలో మా గ్రామంపై మయన్మార్ సైన్యం దాడి చేసింది. ఇళ్లు వదలి పరుగెత్తాం. నేను, చెల్లి ముందు పరుగెత్తుతున్నాం. మా వెనక అమ్మానాన్న. ఇంతలోనే కాల్పుల శబ్దం వినిపించింది. మేం చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కున్నాం. కాసేపటి తర్వాత వెళ్లి చూస్తే అమ్మానాన్న ఇద్దరు కాల్పుల్లో చనిపోయి ఉన్నారు. ఇంకొందరితో కలసి కాలినడకన అడవి బాట పట్టాం. భారత్‌లోకి ప్రవేశించి ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ మాకెవరూ లేరు. ఎవరైనా వచ్చి అన్నం ఇస్తే తింటున్నాం. లేదా పస్తులుంటున్నాం. ... బర్మా సైన్యం దాష్టీకంలో కన్నవారిని కోల్పోయి హైదరాబాద్‌లోని బాలాపూర్ క్యాంపులో తలదాచుకుంటున్న నసీమ్ సుల్తానా కన్నీటి గాథ ఇదీ! ఇలా ఒక్కరే కాదు.. అక్కడ ఎవరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయి! కన్నవారికి దూరమై కొందరు.. కన్నబిడ్డల్ని కోల్పోయి మరికొందరు దుర్భర పరిస్థితుల మధ్య అర్ధాకలితో అలమటిస్తూ బిక్కుబిక్కుమంటున్నారు. తిండి లేక.. బట్ట లేక రోహింగ్యాల దుర్భర జీవితం సాక్షి, హైదరాబాద్: చావుబతుకుల మధ్య మయన్మార్ నుంచి వచ్చిన ఇలాంటి రోహింగ్యా ముస్లింలు నగర శివారుల్లోని బాలాపూర్ తదితర ప్రాంతంలో దాదాపు 4 వేల మంది దాకా తలదాచుకుంటున్నారు. పూరి గుడిసెల్లో ఉంటూ అడ్డా కూలీలుగా పనిచేస్తూ పొట్టబోసుకుంటు న్నారు. వీరికి స్థానిక పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజెస్(యూఎన్‌హెచ్‌సీఆర్) ద్వారా కార్డులు ఇప్పించాయి. కానీ అక్రమంగా వచ్చిన రోహింగ్యాలతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోహింగ్యాలను గుర్తించి వెనక్కి పంపించే చర్యలు తీసుకోవాలని ఇటీవల అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఐదేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చింది ఒక్కడు రఖైన్లో హింసను తట్టుకోలేక రోహింగ్యా ముస్లిం తెగకు చెందిన అల్తాఫ్ అనే యువకుడు సరిగ్గా ఐదేళ్ల కిందట కాలినడకన సరిహద్దు దాటి బంగ్లాదేశ్ మీదుగా కోల్‌కతాకు అక్కడ్నుంచి రైలు మార్గాన హైదరాబాద్‌కు చేరుకున్నాడు. బాలాపూర్ దర్గా వద్ద కూలీగా జీవనం ప్రారంభించాడు. అతను తమ కుటుంబీకులతోపాటు సమీప బంధువులకు కూడా కబురు పెట్టడంతో 15 మంది ఇక్కడికి వచ్చారు. 2013 నుంచి ముస్లింలపై ఊచకోత ప్రారంభం కావడంతో అక్కడ్నుంచి రోహింగ్యాలు హైదరాబాద్‌కు వలస కట్టారు. ఈ వలస ఇప్పటికీ కొనసాగుతోంది. నగరంలో వీరు సుమారు పది ప్రాంతాల్లో నివాసాలను ఏర్పర్చుకున్నారు. తల్లిదండ్రులు, కొడుకు ఆహుతయ్యారు.. సైనిక దుస్తులు ధరించిన దుండగులు మా ఇళ్లపై దాడి చేశారు. వారి వద్ద ఆయుధాలు, పెట్రోల్ ఉన్నాయి. మా ఇళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. గర్భవతిగా ఉన్న నా భార్య నేను ఇంటి వెనక నుంచి బయటపడ్డాం. ఇంట్లో మా అమ్మానాన్న, నా కొడుకు మంటల్లో కాలిపోయారు. నేను, నా భార్య అడవి మార్గం గుండా భారత్‌లోకి వచ్చాం. మా పిన్ని, ఇతర గ్రామస్తుల సాయంతో హైదరాబాద్ వచ్చాం. – అబ్దుల్ గఫూర్ తిండి గింజల కోసం తండ్లాట రోహింగ్యా ముస్లింలకు కూలీ తప్ప వేరే పని తెలియదు. దీంతో పని దొరకని రోజు పస్తులతో కాలం గడుపుతున్నారు. పెద్దవాళ్లు అర్ధాకలికి అలవాటు పడినా చిన్నారులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. భాష కూడా సమస్యగా మారింది. బర్మా మినహా వేరే భాష రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బర్మాతో హిందీ కలిపి మాట్లాడుతున్న కొందరు కూలీలుగా పనిచేస్తున్నారు. ఎవరీ రోహింగ్యాలు? ఆంగ్లేయుల పాలన హయాంలో వందల ఏళ్ల కిందట బంగ్లాదేశ్‌లోని చిట్టాగ్యాంగ్ ప్రాంతం నుంచి వాయువ్య బర్మా (మయన్మార్)లోని రఖైన్ రాష్ట్రానికి ముస్లింలు పెద్దఎత్తున వలస వెళ్లారు. వీరే రోహింగ్యా ముస్లింలు. అక్రమంగా వచ్చారంటూ వీరిని మయన్మార్ స్వీకరించలేదు. అక్రమ వలసదార్లుగానే పరిగణిస్తోంది. మయన్మార్‌లో మొత్తంగా 90 శాతం మంది బౌద్ధులు, 10 శాతం రోహింగ్యా ముస్లింలు ఉన్నారు. ఆంగ్లేయుల పాలన అనంతరం రఖైన్ రాష్ట్రాన్ని తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో కలుపుకోవాలని డిమాండ్ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు 1982లో మయన్మార్ ప్రభుత్వం రోహింగ్యాల పౌరసత్వం రద్దు చేసి ఓటు హక్కు తొలగించింది. దీంతో కొందరు మిలిటెంట్ బాట పట్టారు. 2012లో రోహింగ్యా ముస్లింలపై దాడులు జరగడంతో వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఇటీవల మయన్మార్ సైన్యం మళ్లీ వారిపై పెద్దఎత్తున దాడులు చేస్తోంది.