కట్టుబట్టలు.. కాలే కడుపులు
కట్టుబట్టలు.. కాలే కడుపులు
Published Wed, Sep 20 2017 3:09 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM
మాది వ్యవసాయ కుటుంబం. గతనెలలో మా గ్రామంపై మయన్మార్ సైన్యం దాడి చేసింది. ఇళ్లు వదలి పరుగెత్తాం. నేను, చెల్లి ముందు పరుగెత్తుతున్నాం. మా వెనక అమ్మానాన్న. ఇంతలోనే కాల్పుల శబ్దం వినిపించింది. మేం చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కున్నాం. కాసేపటి తర్వాత వెళ్లి చూస్తే అమ్మానాన్న ఇద్దరు కాల్పుల్లో చనిపోయి ఉన్నారు. ఇంకొందరితో కలసి కాలినడకన అడవి బాట పట్టాం. భారత్‌లోకి ప్రవేశించి ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ మాకెవరూ లేరు. ఎవరైనా వచ్చి అన్నం ఇస్తే తింటున్నాం. లేదా పస్తులుంటున్నాం.
... బర్మా సైన్యం దాష్టీకంలో కన్నవారిని కోల్పోయి హైదరాబాద్‌లోని బాలాపూర్ క్యాంపులో తలదాచుకుంటున్న నసీమ్ సుల్తానా కన్నీటి గాథ ఇదీ! ఇలా ఒక్కరే కాదు.. అక్కడ ఎవరిని కదిపినా ఇలాంటి దీనగాథలే వినిపిస్తున్నాయి! కన్నవారికి దూరమై కొందరు.. కన్నబిడ్డల్ని కోల్పోయి మరికొందరు దుర్భర పరిస్థితుల మధ్య అర్ధాకలితో అలమటిస్తూ బిక్కుబిక్కుమంటున్నారు.
తిండి లేక.. బట్ట లేక రోహింగ్యాల దుర్భర జీవితం
సాక్షి, హైదరాబాద్: చావుబతుకుల మధ్య మయన్మార్ నుంచి వచ్చిన ఇలాంటి రోహింగ్యా ముస్లింలు నగర శివారుల్లోని బాలాపూర్ తదితర ప్రాంతంలో దాదాపు 4 వేల మంది దాకా తలదాచుకుంటున్నారు. పూరి గుడిసెల్లో ఉంటూ అడ్డా కూలీలుగా పనిచేస్తూ పొట్టబోసుకుంటు న్నారు. వీరికి స్థానిక పోలీసుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా స్వచ్చంద సంస్థలు ముందుకొచ్చి యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజెస్(యూఎన్‌హెచ్‌సీఆర్) ద్వారా కార్డులు ఇప్పించాయి. కానీ అక్రమంగా వచ్చిన రోహింగ్యాలతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రోహింగ్యాలను గుర్తించి వెనక్కి పంపించే చర్యలు తీసుకోవాలని ఇటీవల అన్ని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఐదేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చింది ఒక్కడు
రఖైన్‌లో హింసను తట్టుకోలేక రోహింగ్యా ముస్లిం తెగకు చెందిన అల్తాఫ్ అనే యువకుడు సరిగ్గా ఐదేళ్ల కిందట కాలినడకన సరిహద్దు దాటి బంగ్లాదేశ్ మీదుగా కోల్‌కతాకు అక్కడ్నుంచి రైలు మార్గాన హైదరాబాద్‌కు చేరుకున్నాడు. బాలాపూర్ దర్గా వద్ద కూలీగా జీవనం ప్రారంభించాడు. అతను తమ కుటుంబీకులతోపాటు సమీప బంధువులకు కూడా కబురు పెట్టడంతో 15 మంది ఇక్కడికి వచ్చారు. 2013 నుంచి ముస్లింలపై ఊచకోత ప్రారంభం కావడంతో అక్కడ్నుంచి రోహింగ్యాలు హైదరాబాద్‌కు వలస కట్టారు. ఈ వలస ఇప్పటికీ కొనసాగుతోంది. నగరంలో వీరు సుమారు పది ప్రాంతాల్లో నివాసాలను ఏర్పర్చుకున్నారు.
తల్లిదండ్రులు, కొడుకు ఆహుతయ్యారు..
సైనిక దుస్తులు ధరించిన దుండగులు మా ఇళ్లపై దాడి చేశారు. వారి వద్ద ఆయుధాలు, పెట్రోల్ ఉన్నాయి. మా ఇళ్లపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. గర్భవతిగా ఉన్న నా భార్య నేను ఇంటి వెనక నుంచి బయటపడ్డాం. ఇంట్లో మా అమ్మానాన్న, నా కొడుకు మంటల్లో కాలిపోయారు. నేను, నా భార్య అడవి మార్గం గుండా భారత్‌లోకి వచ్చాం. మా పిన్ని, ఇతర గ్రామస్తుల సాయంతో హైదరాబాద్ వచ్చాం. – అబ్దుల్ గఫూర్
తిండి గింజల కోసం తండ్లాట
రోహింగ్యా ముస్లింలకు కూలీ తప్ప వేరే పని తెలియదు. దీంతో పని దొరకని రోజు పస్తులతో కాలం గడుపుతున్నారు. పెద్దవాళ్లు అర్ధాకలికి అలవాటు పడినా చిన్నారులు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. భాష కూడా సమస్యగా మారింది. బర్మా మినహా వేరే భాష రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బర్మాతో హిందీ కలిపి మాట్లాడుతున్న కొందరు కూలీలుగా పనిచేస్తున్నారు.
ఎవరీ రోహింగ్యాలు?
ఆంగ్లేయుల పాలన హయాంలో వందల ఏళ్ల కిందట బంగ్లాదేశ్‌లోని చిట్టాగ్యాంగ్ ప్రాంతం నుంచి వాయువ్య బర్మా (మయన్మార్)లోని రఖైన్ రాష్ట్రానికి ముస్లింలు పెద్దఎత్తున వలస వెళ్లారు. వీరే రోహింగ్యా ముస్లింలు. అక్రమంగా వచ్చారంటూ వీరిని మయన్మార్ స్వీకరించలేదు. అక్రమ వలసదార్లుగానే పరిగణిస్తోంది. మయన్మార్‌లో మొత్తంగా 90 శాతం మంది బౌద్ధులు, 10 శాతం రోహింగ్యా ముస్లింలు ఉన్నారు. ఆంగ్లేయుల పాలన అనంతరం రఖైన్ రాష్ట్రాన్ని తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో కలుపుకోవాలని డిమాండ్ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు 1982లో మయన్మార్ ప్రభుత్వం రోహింగ్యాల పౌరసత్వం రద్దు చేసి ఓటు హక్కు తొలగించింది. దీంతో కొందరు మిలిటెంట్ బాట పట్టారు. 2012లో రోహింగ్యా ముస్లింలపై దాడులు జరగడంతో వందలాది మంది మృత్యువాతపడ్డారు. ఇటీవల మయన్మార్ సైన్యం మళ్లీ వారిపై పెద్దఎత్తున దాడులు చేస్తోంది.
Advertisement
Advertisement