US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి | US midterm elections 2022: Republicans win US House majority | Sakshi
Sakshi News home page

US midterm elections 2022: ప్రతినిధుల సభలో రిపబ్లికన్లదే పైచేయి

Published Fri, Nov 18 2022 5:23 AM | Last Updated on Fri, Nov 18 2022 5:23 AM

US midterm elections 2022: Republicans win US House majority - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో తుది ఫలితాలపై స్పష్టత వచ్చింది. 435 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ పైచేయి సాధించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. రిపబ్లికన్లు 218 సీట్లు, అధికార డెమొక్రాట్లు 211 సీట్లు గెలుచుకున్నారు. మరో 6 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

అమెరికా పార్లమెంట్‌(కాంగ్రెస్‌)లో కీలకమైన ప్రతినిధుల సభలో ప్రతిపక్షం మెజారిటీ సాధించడం అధ్యక్షుడు జో బైడెన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. ఆయన పదవీ కాలం మరో రెండేళ్లు ఉంది. బైడెన్‌ నిర్ణయాలు, చర్యలను ప్రతిపక్షం నిలువరించే అవకాశం కనిపిస్తోంది. చట్టసభలో రిపబ్లికన్‌ పార్టీ బలం పుంజుకోవడంతో అధ్యక్షుడి దూకుడుకి అడ్డుకట్ట పడనుంది.

ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు మెజారిటీ సాధించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ప్రతినిధుల సభ స్పీకర్‌గా రిపబ్లికన్లు తమ నాయకుడు కెవిన్‌ మెక్‌కర్తీని ఎన్నుకున్నారు.  ఇప్పటివరకు ఈ పదవిలో డెమొక్రటిక్‌ పార్టీ నేత నాన్సీ పెలోసీ ఉన్నారు. కొత్త దిశ కోసం అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని, రిపబ్లికన్లు వారిని ముందుకు నడిపించబోతున్నారని మెక్‌కర్తీ ట్వీట్‌ చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన మెక్‌కర్తీకి ప్రతిపక్ష నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలియజేశారు. ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లతో కలిసి పనిచేస్తానని ఉద్ఘాటించారు. రా బోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తానని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  

సెనేట్‌పై డెమొక్రాట్ల పట్టు   
మధ్యంతర ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. అమెరికా ప్రజలు వారి ఆకాంక్షలను వ్యక్తం చేశారని చెప్పారు. ధరలు, జీవన వ్యయం తగ్గాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎవరితోనైనా కలిసి పని చేస్తానని పేర్కొన్నారు. జనం ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా కాంగ్రెస్‌లోని మరో సభ అయిన సెనేట్‌లో అధికార డెమొక్రాట్లు పట్టు నిలుపుకొనే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 100 స్థానాలకు గాను, వారు ఇప్పటిదాకా 50 స్థానాలు దక్కించుకున్నారు. జార్జియా రాష్ట్రం కూడా వారి ఖాతాలో పడనుంది. దీంతో  సెనేట్‌లో మెజారిటీ సాధించబోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement